“Self service is the best service”

7, జూన్ 2020, ఆదివారం

చీకటి ప్రేయసి...

ప్రతిరోజూ చీకటి పడగానే
చీకటిలో చీకటిగా మారి
చిరకాలపు విశ్వంలోకి
చివ్వుమంటూ ఎగిరిపోతాను

దీపాల వెలుగులకు దూరంగా
అస్తిత్వపు ఆరాటాలకతీతంగా
అంతులేని చీకటి సముద్రంలో
అలనై కలనై కరిగిపోతాను

చుక్కల లోకాలను మీరిపోతూ
వెలుగుల తీరాలకు దూరమౌతూ
కళ్ళు కనిపించని కటిక చీకట్లో
నేనే లేకుండా మాయమౌతాను

సడిలేని శూన్యపు అలలపైన
తడిబారిన కన్నుల నీటితో
నన్నే ధ్యానిస్తున్న నా ప్రేయసి
ఆత్మలో ఆత్మగా చేరిపోతాను

సృష్టి ఉందో లేదో ఎవరికి తెలుసు?
మేమంటూ ఉంటే కదా అసలు?
ఎంతకాలం అలా అంటారా?
కాలం ఉంటే కదా అసలు?