“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, సెప్టెంబర్ 2018, సోమవారం

September - 2018 పౌర్ణమి ప్రభావం

ప్రస్తుతం మనం పౌర్ణమి ఛాయలో ఉన్నాం.

నిన్న విశాఖ మన్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను నక్సల్స్ కాల్చి చంపేశారు. ఇది వింత కాదు. నక్సల్స్ ఇంతకు ముందు ఇలాంటివెన్నో చేశారు. కానీ అసలైన వింత ఆ తర్వాత జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులు అభిమానులు ఎగబడి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చెయ్యడం, పోలీస్ వాహనాలను తగలబెట్టడం, పోలీస్ స్టేషన్ను ఎటాక్ చెయ్యడమే అసలైన వింత.

అసలు దేశాన్ని నాశనం చేస్తున్నదే రాజకీయ నాయకులు. పోలీసులు ఏం చెయ్యగలరు? వాళ్ళను కూడా తమ పావులుగా వాడుకుంటున్నారు నాయకులు ! మళ్ళీ ఏదైనా జరిగినప్పుడు పోలీసులనే దోషులుగా తిడుతున్నారు ! అందరూ దొంగలే ! కాకుంటే నోరున్నవాడు నోరులేనివాడిని దొంగ అంటాడు. భలేగా ఉంది ఈ డ్రామా అంతా !

ఈ మధ్యనే ఒక రాజకీయ నాయకుడు ఒక సోకాల్డ్ జ్ఞానప్రబోధకుడిని కోట్లు అడిగాడని, ఆయన ఇవ్వనని నిరాకరిస్తే, ఆ ఆశ్రమం మీద కక్ష గట్టి హింస పెడుతున్నాడని ఆ ప్రబోధకుడు రాయలసీమలో ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలో స్వామీజీ అనుచరులే తమను వెంటాడి పైపులతో రాళ్ళతో కొట్టారని చెబుతూ ఆ రాజకీయ నాయకుడు తమను రక్షించలేని పోలీసులను అసభ్యమైన భాషతో దూషిస్తూ హిజ్రాలతో పోల్చడం, దానికి స్పందిస్తూ పోలీసు సంఘంవారు, అలా మాట్లాడేవాళ్ళను నాలుక కోస్తామనడం, ఆ నాయకుడు స్పందిస్తూ 'ఎక్కడికి రమ్మంటావో చెప్పు వస్తా. నాలుక కొయ్యి చూస్తా' అని సవాల్ విసరడం - ఇవన్నీ ఏంటో? ఏమీ అర్ధం కావడం లేదు. అధికారంలో ఉన్న పార్టీ నాయకులూ పోలీసులూ ఈ విధంగా మీడియాలో సవాళ్లు విసురుకుంటూ తిట్టుకుంటూ ఉంటే ప్రజలకు వీళ్ళమీద ఎలా నమ్మకం కుదురుతుంది? వీళ్ళందరూ కల్సి దేశాన్ని ఎలా ఉద్దరిస్తారని నమ్మాలి?

ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఇలా చట్టాన్ని ఖూనీ చేస్తూ, న్యాయాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూ పోతే చివరకు ఎక్కడకు పోతాం మనం?? ఎవరికి వారే న్యాయాధిపతుల లాగా ప్రవర్తిస్తూ ఉంటే ఇక న్యాయవ్యవస్థ ఎందుకు? 

గుంటూరులో పోలీస్ స్టేషన్ను ఒక వర్గం వారు ఎటాక్ చేసి రాళ్ళు రువ్వి, వాహనాలకు నిప్పు పెడితే, ఓట్ల కోసం వారిని బుజ్జగిస్తూ, ఏ యాక్షన్ తీసుకోకపోవడం, మళ్ళీ అమరావతిలో పది ఎకరాలలో ప్రపంచంలోనే ఇప్పటిదాకా లేని మసీదు కట్టిస్తామని ముఖ్యమంత్రి గారే ప్రకటన చెయ్యడం - ఏంటో ఇదంతా?? ఓట్ల కోసం మరీ ఇంత దిగజారాలా?? 

అసలు మనం ఒక గౌరవనీయమైన రాజ్యాంగం నడుపుతున్న దేశంలో ఉన్నామా లేక అవినీతితో కుళ్ళిపోయిన ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నామా తెలియడం లేదు. లా అండ్ ఆర్డర్ అనేది ఉందా లేదా అర్ధం కావడం లేదు.

ఇలాంటి నాయకులు? ఇలాంటి పోలీసులు? ఇలాంటి స్వామీజీలు? వీళ్ళను చూస్తుంటే -- ఛీ ఛీ ఎలాంటి దేశంలో ఉన్నాంరా దేవుడా? అని అనుకోవలసి వస్తోంది. నాయకులూ అధికారులూ దారి తప్పుతుంటే ప్రజలు బుద్ధి చెప్పాల్సి రావడం - దానికోసం బ్యాలెట్ చాలక బులెట్ ను ఎంచుకోవలసిన దుస్థితి పట్టడం - ఈ రాష్ట్రపు ఖర్మ కాకపోతే మరేంటి?

ఆంధ్రాకు దరిద్రం పట్టిందని రాష్ట్రం విడిపోయినప్పుడే నేను వ్రాశాను. తెలంగాణా నిజంగానే బంగారు తెలంగాణా అని కూడా వ్రాశాను. అది ప్రతిరోజూ నిజం అవుతోంది.

మొత్తానికి ఈ పౌర్ణమి భలే డ్రామాలను చూపిస్తోంది. చూడండి మరి !