“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, సెప్టెంబర్ 2018, శుక్రవారం

బాబాజీ మేట్రిమోనీ సర్వీసెస్

ఈ పేరుచూచి నేనేదో కొత్త మేట్రిమోనీ సర్వీస్ ప్రారంభించానని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే!  అలాంటిదేమీ లేదు. 

చదవండి !

మొన్నామధ్య ఒక పాత మిత్రుడు కలిశాడు. కాస్త నీరసంగా కనిపించాడు.

'ఏంటీ అలా ఉన్నావ్?' అడిగాను.

తన కష్టాలు చెప్పుకొచ్చాడు.

ఇద్దరు పిల్లలకూ పెళ్ళిళ్ళకోసం తెగ తిరుగుతున్నాననీ ఎక్కడా సంబంధాలు కుదరడం లేదనీ చెప్పాడు.

ఆయన కష్టాలన్నీ విని ఇలా అన్నాను.

'అంటే వివేకానందుని వేషంలో ఉన్నావన్నమాట ప్రస్తుతం?'

'అదేంటి?' అన్నాడు.

'అవును. ఆయనకూడా అమెరికాకు వెళ్లబోయే ముందు పది పన్నెండేళ్ళు ఈ దరిద్రపు దేశంలో బికారిలా కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ తిరిగాడు. ఎవరూ ఆయన్ను గుర్తించలేదు. ప్రస్తుతం నీ పరిస్థితి కూడా అంతేగా?' అన్నాను.

'ఏంటో? ఎంత తిరిగినా పని మాత్రం అవడం లేదు' అన్నాడు.

'ఈ రోజుల్లో అలా తిరగనవసరం లేదు.  మెట్రిమోనీ సైట్లలో చేరు. పనౌతుంది'.

'అదీ అయింది. ఎన్నో సైట్లలో ఉన్నాను. కానీ అక్కడా ఏమీ జరగడం లేదు. ఏడాది నుంచీ ఉన్న సంబంధాలు అలాగే ఉంటున్నాయి. ఏవీ ముందుకు కదలడం లేదు'.

నవ్వేసి ఇలా అన్నాను.

'అవన్నీ బాబాజీ మెట్రిమోనీ సర్వీసులే. అక్కడ పని జరగదు'

'అదేంటి?' అన్నాడు అయోమయంగా.

'నువ్వు బాబాజీ భక్తుడవని గతంలో విన్నట్లు గుర్తు. ఇంకా క్రియాయోగం చేస్తున్నావా?'

'ఆ చేస్తున్నా. కానీ ఈ మధ్యనీ వెదుకులాటలో పడి సాధన  కొంచం తగ్గింది'. అన్నాడు.

'నిజమే నువ్వు వెనకబడ్డావు. నీ కంటే లోకమే బాబాజీ భక్తిలో ముందుంది' - అన్నాను.

'అదేంటి?' - అన్నాడు.

'లోకం బాబాజీని నమ్ముకున్నంతవరకూ ఎవరికీ పెళ్ళిళ్ళు కావు. ఎందుకంటే ఆయన మహాయోగి కదా. పెళ్ళికి ఒప్పుకోడు' - అన్నాను.

'మొదలు పెట్టావా నీ జోకులు? విషయం ఏంటో చెప్పు' - అన్నాడు విసుగ్గా.

'ఏం లేదు. ఇప్పుడందరికీ పైచూపే. పక్కచూపు, చుట్టుపక్కల చూపు ఎవరికీ లేదు. అంతా పైచూపే. ఎక్కడో మేఘాల్లోంచి ఏదో సంబంధం ఊడి పడుతుందని అందరూ తలలు పైకెత్తి దురాశ పట్టిన చాతక పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. బాబాజీ కూడా అంతే కదా. కళ్ళు పైకెత్తి చూస్తూ ఉంటాడు. అందుకే లోకమంతా బాబాజీ భక్తులే అంటున్నాను' - అన్నాను.

'వీళ్ళకీ ఆయనకూ పోలికేంటి?' - అన్నాడు వాడు.

'నిజమే. ఆయనది శాంభవీ ముద్ర. లోకులది దాంభికీ ముద్ర. అంతే తేడా !' - అన్నా నేనూ నవ్వుతూ.

'దీనికి మార్గం లేదా?' - అన్నాడు.

'ఉంది. పైచూపు చూచే డాంబిక యోగాభ్యాసం మానేసి, పక్కచూపుతో చక్కగా నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటే అన్నీ సర్దుకుంటాయి' - అన్నాను.

'ఏంటో ఈ ప్రపంచం అంతా గోలలా ఉంది' అన్నాడు వాడు విసుగ్గా.

'ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది.  అది గోలగా లేకపోతే విచిత్రం గాని గోలైతే విచిత్రం ఏముంది? గోల చెయ్యడమే దాని నైజం. ఈ చెత్త ప్రపంచంలో నుంచి నిజంగా మనవాళ్ళేవరో వారిని ఏరుకోవడమే మనం చెయ్యవలసిన పని. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. సమయం వచ్చినప్పుడు మీ పిల్లలకు సంబంధాలు అవే కుదురుతాయి. నిరాశ పడకు.' అని చెప్పి వాడిని పంపేశాను.