“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

27, సెప్టెంబర్ 2018, గురువారం

మార్జాలోపాఖ్యానం - 'నా పిల్లి ఎక్కడుంది?' - ప్రశ్నశాస్త్రం

నిన్న మధ్యాన్నం క్యాంప్ కు వెళుతున్నాను. ట్రెయిన్ నడికూడి దగ్గర ఉండగా ఒక ఫోనొచ్చింది.

'నా పేరు ఫలానా. మా స్నేహితుడూ నేనూ మీ బ్లాగ్ రెగ్యులర్ గా చదువుతూ ఉంటాం. మా స్నేహితుడికి ఒక సమస్య వచ్చింది. మీతో మాట్లాడాలంటే భయపడుతున్నాడు. అందుకని నేను ధైర్యం చెప్పి మీకు ఫోన్ చేయిస్తున్నాను. ఇదుగోండి మా ఫ్రెండ్ మాట్లాడతాడు.' అంటూ ఒకాయన ఫోన్లో చెప్పాడు.

అతని ఫ్రెండ్ ఫోనందుకుని - 'నాకొక పెంపుడు పిల్లి ఉండేది. పద్దెనిమిది నెలల క్రితం అది ఎటో వెళ్లిపోయింది. అది ఇప్పుడు ఎక్కడుందో చెప్పగలరా? అదసలు బ్రతికుందా లేదా?' అని ప్రశ్నించాడు.

నాకు ఆశ్చర్యమూ, జాలీ రెండూ ఒకేసారి కలిగాయి.

'చెబితే ఏం చేస్తావు నాయనా?' అడిగాను.

'వెళ్లి దానిని తెచ్చుకుంటాను. అదంటే నాకు చాలా ప్రేమ' అన్నాడు.

'ఏం నీకెవరూ లేరా?' అడిగాను.

'అందరూ ఉన్నారు. అమ్మా నాన్నా అందరూ ఉన్నారు. కానీ నాదగ్గర ఎవరూ లేని సమయంలో అదే నాతో ఉండేది. అందుకే అదంటే నాకు చాలా ఇష్టం' అన్నాడు.

సమయం చూచాను. మధ్యాన్నం 12.12 గంటలయింది. శుక్రహోర నడుస్తోంది. ప్రస్తుతం మనం మహాలయ పక్షాలలో ఉన్నాం. అంటే, ఇవి పితృదేవతల రోజులు. ప్రాచీన సాంప్రదాయాలలో పిల్లి అనేది పితృదేవతలకు చిహ్నంగా భావించబడుతూ ఉండేది. ఈజిప్షియన్లు నేటికీ ఈ భావనను కొనసాగిస్తూ ఉంటారు. కనుక మహాలయ పక్షాలలో ఇలాంటి ప్రశ్న రావడం కరెక్టే.

గ్రహ పరిస్థితిని మనస్సులోనే గమనించాను. ధనుర్లగ్నం అయింది. శుక్రుడు షష్టాధిపతి అయ్యాడు. జ్యోతిష్య శాస్త్రంలో షష్ఠభావం పెంపుడు జంతువులను సూచిస్తుంది. సామాన్యంగా అయితే షష్ఠభావం శత్రు, రోగ, రుణాలను సూచిస్తుంది. కానీ ఇదే భావం పెంపుడు జంతువులను కూడా సూచిస్తుంది. అదెలాగో చెప్తా వినండి.

చతుర్ధం మన ఇంటికి సూచిక. అక్కడ నుండి తృతీయం మన సహచరులు, మన ఇంట్లో ఉండే జీవులను సూచిస్తుంది. కనుక చతుర్ధం నుంచి తృతీయం అయిన షష్ఠమస్థానం మేక, కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులను సూచిస్తుంది. ఇంకా పెద్ద సైజు జంతువులైతే ద్వాదశభావం వాటిని సూచిస్తుంది. ద్వాదశం జైలు గనుక, పెద్ద జంతువులను మన ఇంట్లో కట్టేసి ఉంచితే అది వాటికి జైలులాగే ఉంటుంది గనుక, ద్వాదశభావం పెద్దపెద్ద పెంపుడు జంతువులను సూచిస్తుంది. ఈ విధంగా జ్యోతిశ్శాస్త్రం అంతా లాజిక్ మీదే నడుస్తూ ఉంటుంది.

సరే మన ప్రశ్న చార్ట్ కి వద్దాం.

హోరాధిపతి అయిన శుక్రుడే షష్ఠభావాదిపతీ అయ్యాడు. కనుక పెంపుడు జంతువుల ప్రశ్న ఆ సమయంలో అడుగబడింది. శుక్రుడూ లగ్నాధిపతి అయిన గురువూ కలసి లాభస్థానంలో ఉన్నారు. అంటే, ఇతనికి ఆ పిల్లి అంటే చాలా ప్రేమ ఉన్నమాట నిజమే ! కానీ ధనుర్లగ్నానికి శుక్రుడు మంచిని చెయ్యడు. శత్రువైన శుక్రక్షేత్రంలో గురువున్నాడు. కనుక పిల్లి దృష్టిలో ఇతని ప్రేమకు విలువ లేదు. పిల్లికి అవసరమేగాని ప్రేమ ఉండదు.

కుక్కకు విశ్వాసం ఉంటుంది గాని, పిల్లికి ఉండదు. వీడు నా యజమాని అని కుక్క అనుకుంటుంది. వీడు నా బానిస అని పిల్లి అనుకుంటుంది. పిల్లి చాలా స్వతంత్రమైన జంతువు. దానికి ఒకచోట స్థిరంగా ఉండటం ఇష్టం ఉండదు. అందుకని మనం ఎంత బాగా చూసుకున్నప్పటికీ, దానిష్టం వచ్చిన చోటకు అది వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రేమకు కుక్క కట్టుబడినట్లు పిల్లి కట్టుబడదు. ఎందుకంటే అది పులి జాతికి చెందినది. పులీ పిల్లీ ఒకే జాతికి చెందుతాయి. కాకుంటే సైజులో తేడా అంతే ! అందుకే పులిని 'బిగ్ క్యాట్' అంటారు.

ఒకచోట స్థిరంగా ఉండలేకుండా ఎంతసేపూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండాలని అనుకునేవారు కొందరు ఉంటారు. వాళ్ళు పిల్లిజాతి మనుషులు. అదొక రోగలక్షణం. వీరికి చాలా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. కొందరిలో ఈ లక్షణం తర్వాత్తర్వాత కేన్సర్ గా కూడా రూపొందుతూ ఉంటుంది. ఎందుకంటే మానసికంగా స్థిరత్వం లేకుండా ఎప్పుడూ ఏదో ఒకదాని వెంట పరుగెత్తుతూ, ఎక్కడో బైటబైట తిరుగుతూ ఉండాలని ఎప్పుడూ అనుకునేవారికి పెద్ద వయసులో కేన్సర్ వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉంటుంది. ఈ మనస్తత్వం పోవాలంటే పిల్లిపాలతో తయారు చేసిన 'లాక్ ఫెలినినం' అనే హోమియౌ ఔషధం బ్రహ్మాండంగా పని చేస్తుంది. ముల్లును ముల్లుతోనే తియ్యాలి అనే సూత్రం మీదే హోమియో ఔషధాలు పని చేస్తాయి.

పాతకాలంలో ఆయుర్వేదంలో ఇలాంటి మందులు తయారీ ఉండేది. కేరళలో ఆయుర్వేదం ఎక్కువగా వాడతారని మనకు తెలుసు. అదే కేరళకు చెందిన అయ్యప్పస్వామి కధలో కూడా, రాణికి ఏదో తలనొప్పి అని వంకపెట్టి పులిపాలు తెమ్మని ఈయన్ను అడవిలోకి పంపిస్తారు. ఆ కధ నిజం అయినా కాకపోయినా, అలాంటి మందులు అప్పట్లో తయారు చేసేవారని మనకు తెలుస్తోంది. ఇప్పుడు ఆయుర్వేద వైద్యులకే ఆ శాస్త్రం పూర్తిగా తెలీదు. తెలిసినా కంపెనీ తయారు చేసిన మందులే అందరూ వాడిస్తున్నారు గాని, పాతకాలంలో లాగా వాళ్ళే మూలికలు తెచ్చి తయారు చెయ్యడం లేదు. అందుకే ఇప్పటి ఆయుర్వేదం పని చెయ్యడం లేదు. 

ఈ విధంగా జ్యోతిష్యశాస్త్రానికీ, హోమియోపతి వైద్యశాస్త్రానికీ, మానవ జీవితానికీ, ఆధ్యాత్మికతకూ సూక్ష్మమైన సంబంధాలు ఉంటాయి. అర్థం చేసుకోగలిగితే ఇదంతా చాలా అద్భుతమైన సైన్స్ గా కనిపిస్తుంది.

జ్యోతిశ్శాస్త్రంలో కుక్కకూ పిల్లికీ చాలా ప్రాముఖ్యత ఉంది. రాహువు పిల్లికి సూచకుడు. కేతువు కుక్కకు సూచకుడు. అందుకే కేతుదోషం ఉన్నప్పుడు కుక్కను పెంచుకోమని చెబుతూ ఉంటారు. కుక్కను పెంచుకున్నాక కలసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాహుదోషం ఉన్నప్పుడు అది పోవడానికి శనివారం నాడు నల్లపిల్లికి పాలు పొయ్యమని రెమెడీ చెబుతారు. ఎందుకంటే నల్లపిల్లి శనికీ రాహువుకూ రెంటికీ సూచిక. 'శనివత్ రాహు:' అని కదా జ్యోతిష్య సూత్రం ! రాహుకేతువుల ప్రభావం మనిషి మీద ఖచ్చితంగా ఉందనడానికి అతనితో నిత్యం కలసి ఉంటున్న కుక్కా పిల్లులే సాక్ష్యం. ఏ దేశంలోనైనా మనుషులు ఈ రెంటినీ సాకుతూ ఉండటం మనం గమనించవచ్చు.

ఎవరి సమక్షంలోనైతే కుక్కా పిల్లీ తమతమ జాతివైరాన్ని వదలిపెట్టి స్నేహంగా ఉంటాయో అలాంటి వారిమీద రాహుకేతువుల ప్రభావం ఉండదు. రాహుకేతువులు కాలస్వరూపులు గనుక అలాంటి మహనీయులు కాలానికి అతీతంగా పరిణతి చెంది ఉంటారు. జిల్లెళ్ళమూడి అమ్మగారి సమక్షంలో కుక్కలూ పిల్లులూ కలసి మెలసి ఉండేవి. రమణ మహర్షి సమక్షంలో కూడా శత్రు జంతువులు కలసి మెలసి ఉండేవి. శ్రీ రామకృష్ణుల సమక్షంలో అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. నిజమైన మహనీయుల సమక్షం అలా ఉంటుంది.

'అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధే వైరత్యాగ:' అంటాడు పతంజలి మహర్షి తన యోగసూత్రాలలో. అంటే - అహింస అనే భావంలో నిజంగా నిత్యమూ ఉండేవారి సమక్షంలో శత్రుజంతువులు కూడా మిత్రులౌతాయి. అదే వారి మహనీయతకు నిదర్శనం !- అంటాడు. అలాంటి మహనీయుల సమక్షంలో దివ్యభావనా తరంగాలు చాలా బలంగా ఉంటాయి. అందుకే, వారి దగ్గర ఉన్న కాసేపూ మన మనస్సులు మనకు తెలీకుండానే మారిపోతూ ఉంటాయి. వారి సమక్షం ఎంతో హాయిగా ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉండటానికి ఇదే కారణం.

సరే, ఈ జ్యోతిష్య-వేదాంతచర్చ ఆపేసి మన ప్రశ్నలోకి వద్దాం !

శుక్రుడు రాహువుదైన స్వాతీ నక్షత్రంలో ఉన్నాడు. అంటే, ఈ పిల్లి చాలా స్వతంత్రమైన వ్యక్తిత్వం కలిగినది. అందుకే ఇంట్లోనుంచి వెళ్ళిపోయింది. అయితే, ఇది ఎక్కడికి పోయింది? ఏమైంది?

తులారాశికి రాహుకేతువులతో అర్గలం పట్టింది. కనుక పిల్లికి టైం ఏమీ బాగాలేదు ! పైగా దాని చతుర్దంలో బలంగా ఉన్న ఉచ్ఛ కుజుడు, కేతువుతో కలసి ఉన్నాడు. కేతువు శనిని సూచిస్తునాడు. శనికుజుల కలయిక యాక్సిడెంట్ ను ఇస్తుంది. కేతువు కుక్కకు సూచకుడు. అంటే ఎరుపూ నలుపూ మచ్చలున్న ఒక బలమైన కుక్క చేతిలో ఈ పిల్లి చనిపోయింది అని అర్ధం ! పైగా, పిల్లిని సూచించే రాహువు ప్రశ్నలగ్నం నుంచి అష్టమంలో ఉంటూ మరణాన్ని సూచిస్తున్నాడు !

దశ వైపు దృష్టి సారించాను. బుధ-చంద్ర-కుజ దశ నడుస్తోంది. ఈ లగ్నానికి బుధుడు బాధకుడు. చంద్రుడు నాశనాన్ని సూచిస్తాడు. కుజుడు కేతువుతో కలసి బలమైన కుక్కను సూచిస్తున్నాడు. కనుక దశాసూచన కూడా మన డిడక్షన్ తో సరిపోయింది ! అదీగాక, పౌర్ణమి సమయంలో అడుగబడే ప్రశ్నలు చాలావరకూ నెగటివ్ రిజల్ట్ నే ఇస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం పౌర్ణమి ఛాయలోనే ఉన్నాం మరి !

ఈ విషయాన్ని ఇతనికి చెబితే బాధపడతాడని, ఇలా అడిగాను.

'పిల్లి ఎన్నాళ్ళు బ్రతుకుతుంది బాబు? ఎందుకు దానిమీద నీకింత వ్యామోహం?'

'ఏమోనండి. దాదాపు ఎనిమిది తొమ్మిదేళ్ళు బ్రతుకుతుందేమో తెలియదు. కానీ నాకదంటే చాలా ఇష్టం.' చెప్పాడతను సందేహిస్తూ.

లగ్నాధిపతికీ, షష్టాధిపతికీ సంబంధం ఉంటే వాళ్ళు పెట్ లవర్స్ అవుతారు. ఏదో ఒక జంతువును పెంచుకుంటారు. ఇది తిరుగులేని జ్యోతిష్యసూత్రం. అది జంతువా, పక్షా లేక ఇంకోటా అనే విషయం కూడా చక్రంనుంచి చెప్పవచ్చు. అమెరికాలో అయితే పాములనీ, మొసళ్ళనీ ఇంకా నానారకాల జీవుల్నీ పెంచుకునే విచిత్రమైన మనుషులు కూడా ఉంటారు. ప్రశ్నచార్ట్ లో లగ్నాదిపతీ ఆరవ అధిపతీ కలిసే ఉన్నారు.

అతన్ని ఇలా అడిగాను.

'మరి ఆ తర్వాతైనా అది చనిపోతుంది కదా ! దానిగురించి చింత వదిలేయ్. దానికి నీ మీద ప్రేమ లేదు. దానికిష్టమైన చోట అది హాయిగా ఉంది అనుకో. నీ మానాన నువ్వు హాయిగా జీవించు. అంతేగాని దానికోసం వెదుకకు'.

పాపం అతనికీ మాట నచ్చలేదు.

'సార్ సార్ ప్లీజ్. నాకోసం కాస్త ప్రశ్న చూచి చెప్పండి. ఎక్కడుందో చెబితే వెళ్లి తెచ్చుకుంటాను.' అడిగాడు.

'నీ పిచ్చిప్రేమా నువ్వూనూ? చనిపోయిన పిల్లిని ఎక్కడనుంచి తెచ్చుకుంటావ్ రా బాబూ' - అనుకుంటూ మళ్ళీ ఓపికగా అతనికి కౌన్సిల్ చేశాను.

అంతా విని అతను మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు.

ఇక నాకు విసుగొచ్చింది.

ఎలాగూ ఈ పోస్ట్ అతను చదువుతాడు. అప్పుడు నిజం గ్రహిస్తాడని తెలుసు. అందుకని - 'సరేలే చూస్తాలే బాబు. బాధపడకు.' - అని చెప్పి ఫోన్ కట్ చేసేశాను.

ఫోన్ పెట్టేశాక ఒక సామెత గుర్తొచ్చింది.

పనిలేని మంగలి, పిల్లి తల గొరిగాట్ట. మనమూ అలా తయారు అవుతున్నామా? అని నాకే అనుమానం వచ్చింది. మళ్ళీ నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. మనకు బోలెడంత పని ఉంది. ఎంత చేసినా, ఈ జన్మంతా చేస్తూనే ఉన్నాకూడా, తరగనంత పని ఉంది. ఆ పని చేసుకుంటూనే ఇలాంటి పిల్లిప్రశ్నలు కూడా ఇంత ఓపికగా చెబుతున్నందుకు నా ఓపికకు నాకే చాలా ముచ్చటేసింది.

'భేష్ రా సత్యా! వెరీ గుడ్' - అంటూ నా భుజాన్ని నేనే తట్టుకున్నాను.

సారాంశం ఏమంటే - ప్రేమ !

ప్రేమ అనేది అది మనిషి మీదైనా జంతువు మీదైనా దేనిమీదైనా ఉండొచ్చు. కానీ, మనిషి జీవితం ప్రేమతోనే పుట్టి, ప్రేమతోనే నడచి, ప్రేమతోనే అంతమౌతుందని వెనుకటికి ఎవడో వేదాంతి అన్నట్లు గుర్తు !

నిజమే కదూ !