“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

21, ఆగస్టు 2018, మంగళవారం

'ఉద్యోగంలో వేధింపులు ఎక్కువయ్యాయి' - ప్రశ్నశాస్త్రం

18-8-2018 సాయంత్రం 6-13 నిముషాలకు ఫోన్లో నన్నొకరు ఈ ప్రశ్న అడిగారు.

"ఈ మధ్య నా ఉద్యోగంలో చికాకులు ఎక్కువయ్యాయి. ఎంత పనిచేసినా గుర్తింపు ఉండటం లేదు. ప్రొమోషన్ రావడం లేదు. పైగా బాస్ నుంచి వేధింపులు తీవ్రస్థాయిలో ఉంటున్నాయి. ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు.  దయచేసి సలహా ఇవ్వండి."

ఆ సమయానికి వేసిన ప్రశ్నచక్రం ఇలా ఉన్నది.

సహజ దశమం అయిన మకరలగ్నం ఉదయిస్తూ వృత్తి పరమైన ప్రశ్న అని సూచిస్తున్నది. సప్తమాధిపతి మరియు మన:కారకుడు అయిన చంద్రుడు నీచరాశిలో ఉంటూ సాటి ఉద్యోగులతో భాగస్తులతో గొడవలను సూచిస్తున్నాడు. అంతేగాక ఇతని ఆందోళనాపూరిత పరిస్థితిని కూడా సూచిస్తున్నాడు.

ద్వాదశాదిపతి అయిన గురువు దశమంలో ఉంటూ పనిచేసే చోట నష్టాలను సూచిస్తున్నాడు. గురువు పై అధికారులకు సూచకుడు కనుక వారివల్ల ఇతనికి జరుగుతున్న వేధింపులను సూచిస్తున్నాడు.

దశమాధిపతి అయిన శుక్రుడు నవమంలో నీచరాశిలో ఉండటం వల్ల గతంలో ఇతను ధర్మం తప్పి చేసిన పొరపాట్లే ఇప్పటి గ్రహపాటుకు కారణం అని స్పష్టంగా తెలుస్తున్నది.

నవమాధిపతి అయిన బుధుడు సప్తమంలో రాహువుతో కలసి వక్రించి ఉండటమూ, ఆ రాహువు చంద్రుని సూచిస్తూ ఉండటమూ, వెరసి సప్తమంలో చంద్రబుధుల కలయిక కనిపిస్తూ, ఆఫీసులో గొడవలు జరుగుతున్నాయని, దానికి కారణం జాతకుని అనైతిక ప్రవర్తనే అనీ స్పష్టంగా తెలుస్తోంది.

ప్రశ్న అడుగబడిన సమయంలో శని-శని-బుధ దశ జరుగుతున్నది. శని బుధుల వక్రస్తితిని బట్టి వారిద్దరి షష్టాష్టక స్థితిని బట్టి జాతకుడు గతంలో ధర్మాన్ని తప్పడం వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తిందని, దీనివల్ల ఇతను ప్రస్తుతం డిప్రెషన్ లో ఉన్నాడనీ స్పష్టంగా తెలుస్తున్నది.

పరిస్థితిని అతనికి వివరించి, దీనిని వేరెవరో కారకులు కారనీ, గతంలో తను చేసిన తప్పులే దీనికి కారణమనీ చెప్పి, రెమెడీలు చెప్పడం జరిగింది.

ప్రశ్నశాస్త్రం ఎంత కరెక్ట్ గా పనిచేస్తుందో ఈ సింపుల్ ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు.