నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

13, ఆగస్టు 2018, సోమవారం

బ్లాగు భేతాళ కధలు - 3 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి)

'స్వామి ప్రత్యంగిరానంద గురించి విన్నావా?' పొద్దున్నే ఫోన్ చేశాడు సూర్య.

'నా చిన్నప్పటినుంచీ తెలుసు ఆయన గోల. ఏంటి ఈ మధ్య ఆయన ఆశ్రమానికి వెళుతున్నావా?' అడిగాను విసుగ్గా.

'అవును.' అన్నాడు.

'ఏంటి సంగతులు? ఏమైనా కొత్త కొత్త విశేషాలు తెలిశాయా?' అడిగాను.

'చాలా తెలిసినై. చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావ్" అన్నాడు.

'ఆశ్చర్యపోతానో లేదో తర్వాతగాని ముందు సంగతులు చెప్పు. అసలాయనతో నీకు పరిచయం ఎలా కలిగింది?' అన్నా.

'మా అబ్బాయిని డిల్లీలో I.S.B లో చేర్పిస్తున్నా కదా. ఒకసారి వాడి జాతకం ఎలా ఉందొ చూపిద్దామని ప్రత్యంగిరా టెంపుల్ కి వెళ్ళా. అక్కడొక పూజారి జాతకాలు బాగా చెప్తాడని మా కొలీగ్ చెప్పాడు' అన్నాడు.

'హైదరాబాద్ లో ప్రత్యంగిరా టెంపుల్ ఉందా?' అడిగాను.

'ఉంది. ఎక్కడున్నావ్ నువ్వు? నీకు జెనరల్ నాలెడ్జి బొత్తిగా తక్కువై పోయిందీ మధ్య. నీ శిష్యురాళ్ళను తప్ప ఇంకెవరినీ పట్టించుకోవడం మానేశావ్ ' అన్నాడు సూర్య.

'త్వరగా స్వామీజీ అవతారం ఎత్తమని నువ్వేగా పోరు పెడుతున్నావ్? అందుకే ముందు శిష్యురాళ్ళను పోగేసుకుంటున్నా. మా స్వామీజీల ఆశ్రమాలకు మూలస్థంభాలు వాళ్ళేగా?' అన్నాను నవ్వుతూ.

'అబ్బో ! ఏంటి? మా స్వామీజీలం అంటున్నావ్ అప్పుడే?' అన్నాడు.

'అంతే ! నాకేం తక్కువ? కాషాయమే కదా! అదెంతసేపు కట్టుకోవడం?  అయినా నువ్విలా మాట్లాడావంటే రేపు నిన్ను నా ఆశ్రమం చాయలకు కూడా రానివ్వను.' అన్నా వార్నింగ్ ఇస్తూ.

'బాబ్బాబు. అంతపని చెయ్యకు. రేపు రిటైర్ అయ్యాక నీ ఆశ్రమంలో ఏదో ఒక పోస్ట్ లో చేరదామని అనుకుంటుంటే ఇదేంటి ఇలా అంటున్నావ్? సారీ సారీ !' అన్నాడు నవ్వుతూ.

'సరే ! ప్రస్తుతానికి క్షమిస్తున్నా ! ఇక విషయంలోకి రా. మీ అబ్బాయి జాతకం చూచి పూజారి ఏమన్నాడు?' - అన్నాను.

'జాతకం చూడలేదు. నక్షత్రం ఏంటని అడిగాడు. చెప్పాను. వెంటనే - 'మీ అబ్బాయికి గత ఆరునెలల నుంచీ పిరుడు బాలేదు' అన్నాడు.

'వీడి బొంద ఇంగ్లీషూ వీడూనూ ! పూజారిగాడికి ఇంగ్లీషు ముక్కలు ఎందుకు? పిరుడు ఏంటి వాడి బొంద ! పీరియడ్ అనాలి. ఇంకా నయం 'పురుడు పోస్తా' అనలేదు. దశ అంటే చక్కగా ఉండేది కదా?' అన్నాను.

'ఏమోలే వాడి ఇంగ్లీషు గురించి నాకెందుకు? అయినా మా అబ్బాయికి అలాంటి బ్యాడ్ పీరియడ్ ఏమీ లేదు. అంతా బాగానే ఉందని చెప్పా. ఎందుకైనా మంచిది పూజ చేయించుకోండి అన్నాడు. మావాడి పేరుమీద గుళ్ళో పూజ చేయించా. ఆ తర్వాత పూజారి ఒక సలహా ఇచ్చాడు. అక్కడే నాకు శని పట్టింది.' అన్నాడు.

'ఏంటా సలహా? రెండు లక్షలిస్తే హోమం చేస్తానన్నాడా?' అడిగా నవ్వుతూ.

'దాదాపుగా అలాంటిదే. లక్ష చాలన్నాడు. నావల్ల కాదని చెప్పాను. సరే అయితే పైన గదిలో స్వామీజీ ఉన్నారు. ఆయన్ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకోండి అన్నాడు. వెళ్లి స్వామీజీని కలిశాం.' అన్నాడు సూర్య.

'ఆయనేమన్నాడు?' అడిగా.

'మీవాడికి పిరుడు బాలేదని కింద పూజారి చెప్పాడు కదా !' - అని ఆయనడిగాడు. దాంతో మా ఆవిడ ఆయనకు ఇన్స్టంట్ భక్తురాలుగా మారిపోయింది. 'ఎందుకే అంత తొందరపడతావ్?' అనంటే - 'క్రింద పూజారి అడిగింది ఈయనకెలా తెలిసింది? ఈయనకేవో శక్తులున్నాయి' - అంటుంది. అంతా నా ఖర్మలా ఉంది' అన్నాడు సూర్య.

నాకు చచ్చేంత నవ్వొచింది.

'ఇది చాలా చీప్ ట్రిక్. అలా అడగమని పూజారికి ట్రెయినింగ్ ఇస్తారు. అదే మాటను స్వామీజీ మళ్ళీ అడుగుతాడు. అది చూచి మీ ఆవిడలాంటి వాళ్ళు పడిపోతూ ఉంటారు. మా స్వామీజీల ట్రిక్స్ ఇలాగే ఉంటాయి !' అన్నాను.

'మధ్యలో నిన్ను కలుపుకుంటావ్ ఏంటి?' అన్నాడు.

'ఎన్ని చెప్పినా మేమంతా ఒకటే. పాపం ఏదోలే పిచ్చిస్వామీజీ ఒదిలెయ్. విషయం చెప్పు.' అన్నా నవ్వుతూ.

'మా వాడికి అంతా బానే ఉందని డిల్లీలో చదువుకోడానికి వెళ్ళబోతున్నాడని చెప్పాను. సరే, ఒక యంత్రం ఇస్తాను వాడి మెడలో వెయ్యండి. రక్షణగా ఉంటుందని చెప్పి ఒక రాగిరేకు ఇచ్చాడు.' అన్నాడు.

'ఏంటి? దాన్ని మీవాడి మెడలో కట్టావా ఏంటి కొంపదీసి? మూర్చరోగి అనుకుంటారు చూసినవాళ్ళు. అసలే హై సర్కిల్స్ లోకి వెళుతున్నాడు. బాగోదు.' అన్నాను.

'నేనంత పిచ్చోడిని కాన్లే. క్రిందకొచ్చాక ఆ రాగిరేకును చెత్తకుండీలో పడేశా. కాకపోతే తన పుస్తకం ఒకటి అంటగట్టాడు స్వామీజీ. అది చదువుతున్నా ప్రస్తుతం.' అన్నాడు సూర్య.

'ఏంటి దాని పేరు?' అనడిగా.

'బుద్ధాశ్రమ కోతులు' అన్నాడు.

మళ్ళీ చచ్చే నవ్వొచ్చింది.

'అదేం పేరు? ఏముంది ఆ పుస్తకంలో?' అడిగాను.

'400 ఏళ్ళ క్రితం అదే ఆశ్రమంలో చెట్టుమీద ఒక కోతిగా ఈయన ఉండేవాడట. అదంతా అందులో వ్రాశాడు.' అన్నాడు.

నవ్వుతో నాకు పొలమారింది. నవ్వలేక పొట్ట పట్టుకుని ఇలా అడిగాను.

'ఇంతకీ ఆ ఆశ్రమం ఎక్కడుంది?'

'అది హిమాలయాల్లో ఉందిట ఇప్పటికీ. కానీ మనలాంటి పాపులకు కనిపించదట. స్వామీజీ లాంటి పుణ్యాత్ములకు మాత్రం కనిపిస్తుందట. ఆయన ప్రతిరోజూ రాత్రి అక్కడకు వెళ్లి తెల్లవారేసరికి మళ్ళీ ఆశ్రమానికి వస్తూ ఉంటాట్ట.' అన్నాడు సూర్య.

'అలాగా ! అంటే కలలోనా?' అడిగాను.

'కలలో కాదు. ఇలలోనే అని ఆయన శిష్యులు చెప్పారు.' అన్నాడు.

'వాళ్ళు కూడా డిల్లీ I.S.B లో M.B.A చదివారా ఏంటి కొంపదీసి?మార్కెటింగ్ అద్భుతంగా చేస్తున్నారు?' అడిగాను.

సూర్య కూడా నవ్వేశాడు.

'ఏమో అలాగే ఉంది వాళ్ళ వాలకాలు చూస్తుంటే. సరే మన కధలోకి వద్దాం. ఆ పుస్తకం చదువుతుంటే ఇక వేరే పోర్నోగ్రఫీ చానల్ ఏదీ చూడనక్కర్లేదు. అంత ఘోరంగా ఉంది' అన్నాడు.

నేను బిత్తరపోయాను.

'అదేంటి? స్వామీజీ అలా వ్రాశాడా?' అడిగాను.

'అవును. తను పూర్వజన్మలో ఏదో సిద్ధుడుట' అన్నాడు.

'అదేంటి? ఇప్పుడే కదా చెట్టుమీద కోతి అన్నావ్. ఇంతలోనే సిద్దుడెలా అయ్యాడు?'

'ముందుగా ఒక జన్మంతా ఆశ్రమంలో చెట్టుమీద కోతిలా  ఉండాలిట. ఆ తర్వాత జన్మలో అదే ఆశ్రమంలో సిద్దుడిగా పుట్టే అర్హత వస్తుందని ఆ పుస్తకంలో వ్రాశాడు.' అన్నాడు.

'ఏడ్చినట్టుంది ! ఆశ్రమంలో సిద్దుడిగా పుట్టడం ఏంటి? ఎవరికి పుడతాడు? అంటే ఆశ్రమంలో ఆడాళ్ళు కూడా ఉన్నారా? ఒకవేళ ఉన్నారని అనుకున్నా, ఆశ్రమంలో ఉండేవాళ్లకు గర్భం ఎలా వస్తుంది?' అడిగాను అయోమయంగా.

'భలే పాయింట్ పట్టావ్ ! నాకీ పాయింట్ తట్టలేదు. ఏంటో అలా వ్రాశాడు మరి !' అన్నాడు సూర్య కూడా అయోమయంగా.

'సర్లే ఏదో ఒకటి ! ఎలా వస్తే మనకెందుకు? ఆ తర్వాతేమైందో చెప్పు' అన్నాను.

'ఇలా ఉండగా, ఆ ఆశ్రమానికి కొంతమంది సామాన్యభక్తులు వస్తూ పోతూ ఉండేవారట. వాళ్లకి ఈయన దీక్షలు ఇచ్చాడట. వాళ్ళే తర్వాత జన్మల్లో రామకృష్ణ పరమహంస గానూ, రమణ మహర్షిగానూ పుట్టారని వ్రాశాడు.' అన్నాడు.

అరికాలి మంట నషాళానికి ఎక్కింది నాకు.

'ఇంకా నయం ! వెంకటేశ్వర స్వామి, శీశైల మల్లన్న, బెజవాడ కనకదుర్గమ్మా కూడా అదే ఆశ్రమంలో తన శిష్యులుగా ఉండేవారని చెప్పలేదు. సంతోషం!' అన్నాను.

'అలా చెప్పలేదుగాని దాదాపుగా అదే చెప్పాడు. వాళ్ళందరూ ఈనాటికీ రోజూ తనతో కబుర్లు చెబుతూ ఉంటారని వ్రాశాడు.' అన్నాడు.

'వాట్సప్ లోనా, ఇంస్టాగ్రాం లోనా? దురహంకారం మరీ తలకెక్కినట్టుంది ఈయనకు? ఈయన్ని అనుసరించే వాళ్ళు ఎలా ఉన్నారు?' అడిగాను.

'ఇంటలిజెన్స్ లెవల్స్ మరీ సబ్ స్టాండర్డ్ గా ఉన్నాయి వాళ్లకు. మళ్ళీ అందరూ చదువుకుని మంచి పొజిషన్స్  లో ఉన్నవాళ్ళే. కానీ నేలబారుగా ఆయనేది చెబితే దాన్ని నమ్మేస్తున్నారు. వాళ్ళని కూచోబెట్టి నానా అబద్దాలూ కధలూ నోటికొచ్చినట్టు చెప్పేస్తున్నాడు. వాళ్లేమో గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఐ రియల్లీ పిటీ దెం. ఎడ్యుకేటెడ్ ఫూల్స్ లా ఉన్నారు' అన్నాడు సూర్య.

'ఏం అబద్దాలు చెబుతున్నాడు?' అడిగాను.

'ఈ మధ్యనే రాక్షసులకూ వానరసైన్యానికీ ఒక యుద్ధం ఆకాశంలో జరిగిందట. ఆ యుద్ధంలో సింగరాయకొండ ఆంజనేయస్వామి కళ్ళుతిరిగి పడిపోతే కసాపురం ఆంజనేయస్వామి వచ్చి కాపాడాడని, తను పక్కనే ఉండి చూశాననీ చెప్పాడు ఒక ఉపన్యాసంలో.' అన్నాడు.

పదినిముషాలు ఆగకుండా నవ్వుతూనే ఉన్నా నేను.

'వింటున్న భక్తులేం చేశారు?' అడిగాను తేరుకుని.

'భక్తిగా తలలూపుతూ చొంగ కారుస్తున్నారు' చెప్పాడు.

'నేనింక నవ్వలేనుగాని, అసలు నీకీ స్వామీజీ గురించీ, ఆ ప్రత్యంగిరా టెంపుల్ గురించీ ఎలా తెలిసింది? ఆ కధంతా వివరించుము' అన్నాను.

చెప్పడం మొదలు పెట్టాడు సూర్య.

(ఇంకా ఉంది)