ఉగాది సందర్భంగా నిన్న నాలుగు ప్రముఖ పార్టీలూ ఎవరికి వారు పంచాంగ శ్రవణాలు పెట్టాయి. ఎవరి పురోహితులు వారికి ఉంటారు కదా? యధావిధిగా అందరూ పట్టు పంచెలు కట్టుకుని బొట్లు పెట్టుకుని ఆసీనులై పంచాంగ శ్రవణం విన్నారు. ఉగాది పచ్చళ్ళు తిన్నారు. అంతా బాగానే ఉంది.
అయితే ఇందులో ఒక విచిత్రం ఉంది.
అయితే ఇందులో ఒక విచిత్రం ఉంది.
అక్కడ చెప్పేవారికీ జ్యోతిశ్శాస్త్రం ఆమూలాగ్రం తెలీదు. వినేవారికి దానిమీద నమ్మకం లేదు. ఇంకెందుకీ ఫార్స్?
ఇది చాలదన్నట్లు, ఆ జ్యోతిష్కులలో కొందరు వీరంగాలు వేశారు. నేను చెప్పినది నిజం కాకపోతే అసలు జ్యోతిష్యం చెప్పడమే మానేస్తానని ఒకాయన, మీసం తీసేస్తానని ఒకాయన, గడ్డం పెంచుతానని ఒకాయన, ఇవన్నీ అక్కర్లేదు నేను చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది కనుక నేనేమీ ప్రతిజ్ఞలు చెయ్యను అని ఒకాయన - ఇలా రకరకాలుగా కామెడీ చేస్తూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు.
జ్యోతిష్కునికి వినయం ఉండాలని, అహంకారం ఉండకూడదని ప్రామాణిక గ్రంధాలు చెబుతున్నాయి. కానీ ఈ పంచాంగశ్రవణం చేసినవారిలో ఉండకూడని లక్షణాలే కనిపిస్తున్నాయి. వినయమే ఉంటే అలాంటి ప్రగల్భాలు ఎలా పలుకుతారు? అసలు జ్యోతిశ్శాస్త్రంలో వీరికి నిజమైన పట్టు ఉంటే, నలుగురూ నాలుగు రకాలుగా ఫలితాలు ఎందుకు చెబుతారు?
జ్యోతిష్కునికి వినయం ఉండాలని, అహంకారం ఉండకూడదని ప్రామాణిక గ్రంధాలు చెబుతున్నాయి. కానీ ఈ పంచాంగశ్రవణం చేసినవారిలో ఉండకూడని లక్షణాలే కనిపిస్తున్నాయి. వినయమే ఉంటే అలాంటి ప్రగల్భాలు ఎలా పలుకుతారు? అసలు జ్యోతిశ్శాస్త్రంలో వీరికి నిజమైన పట్టు ఉంటే, నలుగురూ నాలుగు రకాలుగా ఫలితాలు ఎందుకు చెబుతారు?
వీరిలో ప్రతివారూ, వారివారి పార్టీ లీడరే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడని జ్యోస్యాలు చెప్పారు. ఇంతకంటే ఫార్స్ ఇంకెక్కడా ఉండదు. అంటే టీడీపీ,వైఎస్సార్ పార్టీ, జనసేనా, బీజేపీ నలుగురూ ముఖ్యమంత్రులు ఎలా అవుతారో? నాలుగు సీఎం కుర్చీలు వేసుకుని నలుగురూ పక్కపక్కనే కూచుంటారేమో మరి? మనకైతే తెలీదు.
నలుగురిలో ఒకరే కరెక్ట్ అవుతారు. మిగతా ముగ్గురూ అబద్దాలు చెప్పినట్లేగా? లేకపోతే వారికి ఆ శాస్త్రం మీద సమగ్రమైన అవగాహన ఇంకా రాలేదనైనా అనుకోవాలి. అలాంటప్పుడు, ముందుగా దానిని సంపాదించి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది.
పోతే, ఆ వినేవారికి కూడా జ్యోతిష్యం అంటే నమ్మకం ఏమాత్రమూ ఉండదు. వింటే మంచి జరుగుతుందని ఒక నమ్మకమూ, వినకపోతే ఏ చెడు జరుగుతుందో ఏమో? కాసేపు కూచుని వినేస్తే పోలా? అన్న ధోరణి వల్లే వీళ్ళు అక్కడ కూచుని వింటారు గాని నిజంగా చెప్పాలంటే వీరిలో ఒక్కరికి కూడా జ్యోతిశ్శాస్త్రం మీదా మన ధర్మం మీదా విశ్వాసం ఉండదు.
ధర్మం మీద విశ్వాసం ఉంటే అధర్మపు నడతలు ఎలా ఉంటాయి వాళ్ళలో? అధర్మం చెయ్యని రాజకీయ నాయకులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అన్ని వేళ్ళూ పూర్తికావు కూడా. చాలా వేళ్ళు మిగిలిపోతాయి.
ఇక జ్యోతిష్కులను చూద్దామా అంటే, లేనిపోని అహంకారాలకు తోడు, డబ్బు మీద ఆశతో, ఎవరు డబ్బిచ్చి పిలిస్తే, వాళ్ళ బాకా ఊదుతున్నారు. ఇది చాలా పొరపాటు. అక్కడ ఉన్నదానిని ఉన్నట్లు చెప్పాలి గాని ఎవరు పిలిచి కాసిని డబ్బులిస్తే వాళ్ళే తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పడం భలే విడ్డూరంగా ఉంది !!
నిజమైన జ్యోతిష్కునికి డబ్బు మీద ఆశ ఉండకూడదని కూడా ప్రామాణిక గ్రంధాలు చెబుతున్నాయి. వీళ్ళసలు ఆయా గ్రంధాల మొదటి పేజీలన్నా సరిగ్గా చదివారో లేదో మరి !!
నిజం చెప్పనా ?
నేటి సమాజం పూర్తిగా కుళ్ళిపోయింది. ఎక్కడ చూచినా నేను, నా కులం, నా స్వార్ధం, నా డబ్బు - ఇది తప్ప విలువలు లేవు. ధర్మాచరణ లేదు. అంతా నాటకం, బూటకం. మనిషి జీవితం అంతా ఒక అసహ్యమైన డ్రామాగా తయారయ్యింది. అందుకే నేడు, నిజమైన మహనీయులు ఎవరూ ప్రజలకు సహాయం చెయ్యడానికి సిద్ధంగా లేరు. వారు సమాజాన్ని చీదరించుకుంటున్నారు. ఎందుకంటే - ప్రజలందరూ ఈ మహనీయుల దివ్యశక్తుల సహాయాన్ని మాత్రమే కోరుతున్నారు గాని, ఎలా ఉండమని వారు చెబుతున్నారో అలా ఉండటం లేదు. కనీసం ప్రయత్నం కూడా చెయ్యడం లేదు. కనుక నిజమైన దైవశక్తి సంపన్నులు నేటి సమాజానికి సాయం చెయ్యడానికి ఇష్టపడటం లేదు. నేటి సమాజానికీ మనుషులకూ సాధ్యమైనంత వరకూ దూరదూరంగా ఉండటానికే వారు మొగ్గు చూపుతున్నారు.
ధర్మాచరణ లేకుండా ఉత్త గుళ్ళూ గోపురాలూ పూజలూ వేషాలూ ప్రవచనాలూ పంచాంగశ్రవణాలూ మాత్రం నేడు ఎక్కడ చూచినా కనిపిస్తున్నాయి. వీటివల్ల ఇసుమంతైనా ఉపయోగం లేదనేది వాస్తవం. ఇవన్నీ డ్రామాలు అంతే !!
నిజమైన ధర్మం ఆచరణలో ఉంది, అంతేగాని కట్టుకునే పట్టుపంచెల్లో, పెట్టుకునే బొట్లలో, పండుగలకు వేసుకునే వేషాలలో, వండుకునే వంటల్లో లేదు. ఇది ముందు చక్కగా అర్ధం కావాలి. ఆ తర్వాత అది ఆచరణలోకి రావాలి.
జ్యోతిష్కుల్లారా ! డబ్బుకు అమ్ముడు పోకండి. ఎవరికి తోచిన ఫలితాలు వారు ఇష్టం వచ్చినట్లు చెప్పకండి. దీనివల్ల మీరూ విలువ కోల్పోతారు. జ్యోతిష్యశాస్త్రం కూడా అవహేళనకు గురవుతుంది. మీకు తెలిస్తే, నిజాన్ని నిర్భయంగా చెప్పండి. లేకుంటే మౌనం వహించండి. అది మీకూ మన ధర్మానికీ రెంటికీ మంచిది.
పంచెలు కట్టుకుని, ఉగాది పచ్చడి తిని - కుజుడు ఈ ఇంట్లో ఉన్నాడు, గురువు ఆ ఇంట్లో ఉన్నాడు, కేతువు మీ ఇంట్లో ఉన్నాడు, రాహువు మా ఇంట్లో ఉన్నాడు - అని మాయమాటలు చెప్పుకుంటూ కాసేపు ఫార్స్ చేసినంత మాత్రాన పంచాంగ శ్రవణం అవుతుందని అనుకుంటే అంతకంటే హాస్యం ఇంకోటి ఉండదు మరి !!
శ్లో|| ఫలాని గ్రహచారేణ సూచయంతు మనీషిణ:
కో వక్తా తారతమ్యస్య తమేకం వేధసం వినా ?
అంటున్నాయి ప్రామాణిక గ్రంధాలు. ఈ శ్లోకం అర్ధం ఏమిటో తెలుసా?
'మనీషులైన వారు' (అంటే డబ్బుకు, ప్రలోభాలకు ఆశపడకుండా ధర్మంగా బ్రతికే ఉత్తమ మనుష్యులు) గ్రహచారాన్ని గమనించి ఫలితాలను ఊరకే సూచనామాత్రంగా చెప్పగలరు. ఖచ్చితంగా ఏం జరుగుతుందో చెప్పాలంటే ఈ సృష్టిని చేసిన ఒక్క బ్రహ్మదేవుని వల్లే అవుతుంది. మానవమాత్రుల వల్ల కాదు.'
అని జ్యోతిష్య గ్రంధాలే చెబుతున్నాయి. జ్యోతిష్యశాస్త్రం పట్టుబడాలంటే ముందుగా మనీషులు (ఋషులు) గా మీరు రూపొందాలి. మనుషులే లేని నేటి సమాజంలో మనీషులు ఎక్కడనుంచి వస్తారో?
ఎందుకు మీకీ ఉత్తరకుమార ప్రగల్భాలు???