నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

27, మార్చి 2018, మంగళవారం

ధనూరాశిలో శని కుజ సంయోగం - తస్మాత్ జాగ్రత్త

మార్చ్ 7 తేదీ నుంచి కుజుడు ధనూరాశిలోకి ప్రవేశించి అప్పటికే అక్కడ ఉన్న శనీశ్వరుడిని కలుసుకున్నాడు. ఇక అప్పటినుంచీ జనాలకు బుద్ధి చెప్పే ఒక బృహత్తర కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. అదేంటంటే , యాక్సిడెంట్లు దెబ్బలు వగైరాలతో జనాల పాత కర్మను తగ్గించడం.

మార్చ్ 24 తేదీ నుంచి, వీరిద్దరూ డిగ్రీపరంగా మరీ దగ్గరగా వస్తున్నారు. అంటే నవాంశలో కూడా ఒకే రాశిలో ఉంటారన్న మాట. కనుక ఆ తేదీనుంచి మీరు గమనిస్తే, ఎక్కడచూచినా చిన్నా పెద్దా యాక్సిడెంట్లు మొదలవడం మీరు చూడవచ్చు. టీవీలలో పేపర్లలో ఎక్కడ చూచినా యాక్సిడెంట్ వార్తలు ఉంటాయి. మీ చుట్టు పక్కలవారిని గమనిస్తే చాలు ఎన్నో సంఘటనలు మీరు ఈ సమయంలో చూస్తారు. ఇంకో వారంపాటు ఈ అత్యంత చెడుకాలం ఉంటుంది. గమనించండి.

వీటిల్లో కొన్ని ఫన్నీ సంఘటనలు కూడా ఉంటాయి. కూచున్నచోట నుంచి ఊరకే లేచి పక్కకు తిరగబోయి క్రిందపడి మోకాలి చిప్పలు పగలగొట్టుకునేవారినీ, కాలవ దాటుదామని చిన్న జంప్ చెయ్యబోయి క్రిందపడి కాలు ఫ్రాక్చర్ అయ్యే వారినీ, కుక్కనో పిల్లినో ఇంకో మనిషినో తప్పించబోయి క్రిందపడి దెబ్బలు తగిలించుకునే వారినీ ఎందరినో మీరిప్పుడు చూడవచ్చు. ఇంకా ఎన్నో ఇలాంటివి సంఘటనలు మీ చుట్టూ జరుగుతాయి గమనించండి.

ముఖ్యంగా ఈ యోగం ఇంకో నెలా పదిరోజుల పాటు ఉంటుంది. ఈ లోపల ఎక్కడ చూచినా యాక్సిడెంట్లు జరుగుతాయి. గమనించండి.

ఈ సమయంలో దూరప్రయాణాలు, ముఖ్యంగా డ్రైవింగ్ చెయ్యడాలు, సాహసకార్యాలు మంచివి కావు. ఇంటి పట్టున ఉండి గుట్టుగా కాలక్షేపం చెయ్యడం ఉత్తమోత్తమం. ముందే చెప్పలేదని తర్వాత నన్ననవద్దు.