“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

22, అక్టోబర్ 2016, శనివారం

ఆయన వయసు 90 - అయినా గట్టిగా ఉన్నాడు




కల్యాణానంద భారతీస్వామి వారి శిష్యుడైన అంగలకుదురు శర్మగారు నా పాఠకులకు సుపరిచితులే. పాత పోస్టులలో ఆయన గురించి వ్రాశాను. ఈయన తెనాలిలో స్థిరపడినప్పటికీ, అంగలకుదురు స్టేషన్ మాస్టారు గా చాలాకాలం పని చేసినందున ఈయన్ను ఇలాగే పిలుస్తాను నేను.

ఈయన అసలు పేరు వెంకట కృష్ణశర్మగారు. ఈయన దగ్గర నేను కొన్ని పాత పుస్తకాలను మూడేళ్ళ క్రితం తీసుకున్నాను. అవి ఆయన గురువైన కల్యాణానంద భారతీ స్వామివారు వ్రాసినవి. బ్రౌన్ కలర్ పేపర్ మీద పట్టుకుంటే ముక్కలై పోయేటట్లు ఉన్న పేపర్ తో ప్రస్తుతం ఆ పుస్తకాలు ఉన్నాయి.వాటిని తిరిగి ఆయనకు ఇవ్వడానికి ఇప్పటికి తీరింది మనకు !!!

తెనాలిలో పాత నటరాజ్ టాకీస్ ఎదురుగా ఉన్న పరమహంస ఆశ్రమం సందులో ఈయన నివాసం. అన్నామలై మెస్సులో భోజనం చేసి మేము వీరింటికి వెళ్లేసరికి మధ్యాన్నం రెండైంది. పై అంతస్తులో వీరి అబ్బాయి ఉంటున్నాడు.క్రింద లోపల ఏసీ గదిలో ఈయన పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.

మేము వచ్చామని చెప్పగానే మహదానంద పడిపోయాడాయన. గదిలోపలకు అడుగు పెట్టేసరికి మంచం మధ్యలో బాసింపట్టు వేసుకుని కూచుని అగుపించాడు బోసినోటితో నవ్వుతూ.

"ఎన్నాళ్ళైంది శర్మగారు మిమ్మల్ని చూచి" - అని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు.

"మూడేళ్ళు దాటింది" - అక్కడే ఉన్న చెక్కబల్ల మీద కూచుంటూ నేనన్నాను.

"అయ్యో అక్కడెందుకు? ఆ కుర్చీలో కూచోండి" అంటూ ఒక కుర్చీని చూపాడాయన.

'ఒద్దండి ఇదే సుఖంగా ఉంటుంది దానికంటే' అంటూ 'మీ ఆరోగ్యం ఎలా ఉన్నది?' అడిగాను.

'బాగున్నాను.ప్రస్తుతం నాకు తొంభై ఏళ్ళు.ఏమీ ఆరోగ్య ఇబ్బందులు లేవు.పళ్ళు మాత్రం ఊడిపోయాయి.' అన్నాడాయన బోసినోటితో నవ్వుతూ.

'ఇంతకీ మీరు భోజనం చేశారా? టైం రెండైంది?' అన్నాడాయన ప్రేమగా.

'చేశామండి.సోనోవిజన్ ఎదురుగా ఉన్న అన్నామలై మెస్సులో చేశాము. రుచిగా శుచిగా బాగుంది.' అన్నాను.

అక్కడే ఉన్న వాళ్ళబ్బాయి అందుకుని ' ఎందుకండీ ఇలా చేశారు? మీరు రావడమే ఒక అదృష్టం. కొంచం ముందు చెబితే మా ఇంట్లోనే భోజనం రెడీ చేసేవాళ్ళం కదా" అన్నాడు నొచ్చుకుంటూ.

'మీలాంటి సద్బ్రాహ్మణుల ఇళ్ళలో తినడం నాకూ ఇష్టమే.కానీ ఈసారికి ఇలా వదిలెయ్యండి.ఇంకో సారి చూద్దాం' అన్నా నేను.

"సరే ఉండండి" - అంటూ అబ్బాయి బయటకు వెళ్ళాడు.

నేను శర్మగారి వైపు తిరిగి నవ్వుతూ 'ఏంటండి పళ్ళు పోయాయా? ఇంకో పదేళ్ళాగండి మళ్ళీ వస్తాయి.' అంటూ ' మీ ఆహారం అదేగా?' అడిగాను.

'అదేనండి.పొద్దున్న ఒక గ్లాసు ఆవుపాలు త్రాగుతాను. మధ్యాన్నం ఒక గ్లాసు రాగిజావ. మళ్ళీ రాత్రికి ఒక గ్లాసు ఆవుపాలు.ఇంతే గత ఇరవై ఏళ్ళుగా నా ఆహారం.కాఫీ టీల జోలికి మొదట్నించీ పోను.టిఫిన్లు తినను.సిగిరెట్లూ తాగుడూ ఈ దేహానికి అసలే అలవాటు లేవు.ఆరోగ్యం హాయిగా ఉంది.బీపీ లేదు.సుగర్ లేదు.ఇప్పటికీ పై అంతస్తు మెట్లెక్కి చక్కగా దిగుతాను.నా పనులు హాయిగా చేసుకుంటున్నాను.

1986 లో నేను రిటైరయ్యాను. ఇప్పటికి 30 ఏళ్ళయ్యాయి. అమ్మవారి దయతో హాయిగా ఉన్నాను.' అన్నాడాయన.

'మీ ఆహారపు అలవాట్లే మిమ్మల్ని కాపాడుతున్నాయి.' అన్నాను నేను.

'అవునండి.నేను రిటైరైన కొత్తలో బెంగుళూరులో కొన్నేళ్ళు ఉన్నాను. అప్పుడు అక్కడ ఒకాయన నాకు పరిచయం అయ్యారు.ఆయనకు 86 ఏళ్ళు.నాకు అప్పట్లో మోకాళ్ళ నొప్పులు వచ్చాయి.ఆయన్ను సలహా అడిగితే, ఈ డైట్ పాటించమని చెప్పాడు. ఆరోజు నుంచీ ఇప్పటివరకూ ఇదే నా ఆహారం.ఈ డైట్ మొదలు పెట్టిన నాలుగు నెలల్లో మోకాళ్ళ నొప్పులు మాయం అయ్యాయి.75 ఏళ్ళ వయసులో తిరుపతి కొండ ఎక్కి దిగాను.' అంటూ నవ్వాడాయన.

మరి మీకు ఆవుపాలు ఎక్కడ దొరుకుతాయి? అడిగాను.

"ఇప్పుడు సంగం వారివి దొరుకుతున్నాయి.ఇంతకు ముందు మాకు నందిని పాలు అలవాటు.బెంగుళూరు లో అవే ఉండేవి.అందుకని ఇక్కడకు వచ్చాక కూడా అవే వాడేవాళ్ళం.కానీ అవి జెర్సీ ఆవుపాలని కొందరు చెప్పారు.అందుకని వాటిని మానేసి ఇప్పుడు 'సంగం పాలు' వాడుతున్నా." అన్నాడు.

'అవి స్వచ్చమైనవేనా?" అడిగాను.

'ఏమో మనకు తెలియదు.'అన్నారాయన.

'స్వచ్చమైన ఆవుపాలు కావాలంటే గోసంరక్షణ సంఘం దగ్గరకు వెళితే వాళ్ళు మన ఎదురుగా పితికి ఇస్తారు.అవి మంచివి.' అన్నాడు వింటున్న మూర్తి.

ఏదేమైనా హిమాలయ ప్రాంతాలలో సహజమైన గడ్డిని తిని పెరిగే ఆవుల పాలకున్న శక్తి ఇక్కడ మనం వేసే చెత్త తిని పెరిగే ఆవుల పాలల్లో ఉండదేమో అనిపించింది నాకు. బయటకు ఏమీ అనలేదు.

ఇంతలోకి వారి అబ్బాయి మూడు కాఫీ గ్లాసులతో లోనికి వచ్చాడు.

'ఇప్పుడే భోజనం చేసి వచ్చాము.వద్దు.' అన్నాను నేను.

'పరవాలేదు త్రాగండి. మీరు ఏమీ తీసుకోకపోతే మాకు బాగుండదు. నాన్నగారికి కూడా తెచ్చాను." అన్నాడతను ఆప్యాయంగా.

ఆప్యాయత ముందు నియమాలు నిష్టలూ అన్నీ బలాదూరే గనుక మాట్లాడకుండా ఆ కాఫీ గ్లాసు తీసుకున్నాను.

కాఫీ గ్లాసు తీసుకుంటూ శర్మగారు "నాకా? నాకెందుకురా కాఫీ?' అన్నాడు అదో రకంగా ముఖం పెట్టి.

వాళ్ళబ్బాయి నవ్వుతూ ' ఇప్పుడైనా త్రాగండి నాన్నగారు.ఎప్పుడైనా ఒకసారి పరవాలేదులెండి' అన్నాడు.

మొహమాట పడుతూ కాఫీ గ్లాసు తీసుకున్న శర్మగారు దానిని త్రాగకుండా పక్కనే ఉన్న స్టూల్ మీద ఉంచాడు.

ఇంట్లో చేసిన కాఫీ యేమో చాలా బాగుంది.

కాఫీ చప్పరిస్తూ - 'మీ అనుష్టానం బాగా సాగుతున్నదా శర్మగారు?' అడిగాను.

'ఆ అది మామూలే.' అన్నాడాయన.

'మరి మిగతా సమయాలలో ఏం చేస్తుంటారు?' అడిగాను.

'ఏముంది? సంగీతసేవ.ఇదుగో ఇది' అంటూ ఒక రేడియో లాంటి పెట్టెని చూపించాడాయన.

'ఏంటది? రేడియోనా?" అడిగాను.

'ఇది రేడియో కాదు. తంబురా బాక్సు.' అంటూ దాని స్విచ్ నొక్కాడాయన.మధురమైన తంబురా శృతి అలలు అలలుగా రూమంతా పరచుకోసాగింది.

ఇది పెట్టుకుని త్యాగరాజుల వారివీ, అన్నమయ్యవీ, రామదాసువీ, సదాశివబ్రహ్మెంద్రుల వారివీ కీర్తనలు గొంతెత్తి పాడుకుంటూ ఉంటాను.నాలాగే రిటైరైన కొందరు మిత్రులున్నారు.వారందరూ నా దగ్గరకు సాయంకాలం పూట వస్తారు.అందరం కలసి ఒక్కొక్కరం ఒక్కొక్క కీర్తన పాడుకుంటాం.ఇదే మా కాలక్షేపం.' అన్నాడాయన నవ్వుతూ.

పెద్ద వయసులో ఇలాంటి సత్కాలక్షేపం కంటే కావలసింది ఏముంది? ఆ వయసులో కూడా పేకాటలు, తాగుడు మొదలైన వ్యసనాలలో, డబ్బు యావలో ఏవేవో వ్యాపారాలని వ్యవహారాలని కాలం గడిపే చవకబారు మనుషులు గుర్తొచ్చి వారికీ వీరికీ ఎంత భేదం ఉన్నదో కనిపించి నాకు చాలా సంతోషం అనిపించింది. బ్రాహ్మణ సంస్కారం అంటే ఇదే కదా అనిపించింది.

'చాలా బాగుంది.' అన్నాను నవ్వుతూ.

అంతలో గుర్తొచ్చి - సంచిలోనుంచి పుస్తకాలు తీసి ఆయనకిస్తూ - 'ఇవిగోండి మూడేళ్ళ క్రితం మీ దగ్గర తీసుకున్న మీ గురువుగారి పుస్తకాలు.చదివాను. చాలా బాగున్నాయి.' అన్నాను.

ఆయన మహదానంద పడిపోయాడు.

'ఇవి మీకిచ్చిన గుర్తే నాకు లేదు.కావలిస్తే మీ దగ్గరే ఉంచకపోయారా? నాకెందుకు ఇవి? అన్నాడు.

'మీరు నాకు మొత్తంగా ఇచ్చేస్తే అలాగే ఉంచుకునే వాడిని.కానీ వాటిని చదివి మీకు మళ్ళీ తెచ్చిస్తానని చెప్పాను.కనుక ఆ మాట పాటించాల్సిందే.అందుకే మీ పుస్తకాలు మీకు మళ్ళీ తిరిగి ఇస్తున్నాను.ఇది నా నియమం.' అన్నాను నవ్వుతూ.

వాళ్ళబ్బాయి ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

అతనితో ఇలా అన్నాను.

'చూడండి.ఇవి కల్యాణానంద భారతీస్వామివారు వ్రాసిన చాలా విలువైన పుస్తకాలు.వీటిలో కొన్ని 1930 నాటివి ఉన్నాయి.ఇంకొన్నాళ్ళు పోతే ఇవి శిధిలమై పోతాయి.కనుక ముందు వీటిని డిజిటలైజ్ చేసి భద్రపరచండి.ఆ తర్వాత వీలువెంబడి ప్రింట్ చెయ్యవచ్చు.ఈ సంపదను కాలగర్భంలో కలసి పోనివ్వకండి.ఈ విధంగా ఎన్నో విలువైన పుస్తకాలు మన దేశంలో నశించాయి.మిగిలిన కొన్నింటిని ముస్లిం దుర్మార్గులు నాశనం చేశారు.వీటిని అలా కానివ్వకండి.' అన్నాను.

"అలాగే నండి.నాదగ్గర నికాన్ కెమెరా ఉంది.ముందు వీటిని ఏ పేజికి ఆ పేజి తీసి ఫోటోలు తీసి కంప్యూటర్ కు ఎక్కిస్తాను.అప్పుడు భయం లేదు." అన్నాడు వాళ్ళ అబ్బాయి.

"థాంక్యూ"  అన్నాను నవ్వుతూ.

ఆ తర్వాత ఆయన సర్వీసు విశేషాలు, ఎలాంటి దుర్మార్గులైన ఆఫీసర్లతో పనిచేసిందీ ఎన్ని కష్టాలు పడిందీ మధ్యమధ్యలో మంచి ఆఫీసర్లు ఎలా తగిలిందీ వారు తనకు ఎలా హెల్ప్ చేసిందీ చెప్పుకుంటూ వచ్చాడాయన.

'ఏనాడూ పైడబ్బులకు ఆశపడింది లేదు.ఎక్కడకు వేసినా జాయిన్ అయి నాపని నేను చేసుకుంటూ ఉన్నంతలో సుఖంగా బ్రతికాను.ఈ ఇల్లొకటి కొనుక్కున్నాను.చాలు.మావాడు ఉద్యోగంలో ఉన్నాడు.అమ్మవారి ధ్యానంలో కాలం వెళ్ళ బుచ్చుతున్నాను.' అన్నాడాయన.

వేల కోట్లు వెనకేసినా ఇంకా తీరని దాహంతో కొట్టుకుంటున్న నేటి లోకపు నీచమనుషులకూ ఈయనకూ తేడా స్పష్టంగా కనిపించింది.

అలా కాసేపు వారితో మాట్లాడి, కొన్ని ఫోటోలు తీసుకుని, మళ్ళీ వస్తానని చెప్పి శెలవు తీసుకున్నాను.

బయటకు వస్తూ తలతిప్పి చూస్తే - ఆయన కాఫీ గ్లాసు అలాగే స్టూల్ మీద ఉన్నది.ఆయన త్రాగనే లేదు.

నా చూపును గమనించి ఆయన నవ్వుతూ - "అది అక్కడ ఉండవలసిందే నేను మాత్రం కాఫీలు టీలు త్రాగను"  అన్నాడు.

'మీరు ఇంకో పదేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా ఉండి "శతమానం భవతి శతాయు పురుష:" అన్న వేదమంత్రాన్ని నిజం చెయ్యాలి.ఆ ఫంక్షన్ కి నేను తప్పకుండా వస్తాను' అన్నాను.

'చూద్దాం శర్మగారు.అమ్మ అనుగ్రహం ఎలా ఉందో?" అన్నాడాయన నవ్వుతూ.

నేనూ నవ్వి బయటకొచ్చేశాను.

నియమనిష్ఠలతో కూడిన జీవితం ఇచ్చే ఆత్మసంతృప్తిని ఇంకేదైనా ఎలా ఇవ్వగలదు?