“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

29, జనవరి 2016, శుక్రవారం

రాహుకేతువుల ప్రభావానికి తిరుగులేని సాక్ష్యం - జికా వైరస్

రేపు రాహుకేతువులు రాశులు మారబోతున్నారు.వారి ప్రభావాల గురించి నిన్న వ్రాశాను.ఈ రోజు వార్తల్లో అంతా ' జికా ' వైరస్ గురించే చర్చ జరుగుతున్నది.

ప్రపంచాన్ని కొత్తగా భయపెడుతున్న వైరస్ ' జికా ' రాహుకేతువులు రాశులు మారుతున్న ఇదే సమయంలో హటాత్తుగా తెరమీదకు వచ్చింది. మామూలుగా చూచేవారికి ఈ సంబంధం అర్ధం కాకపోవచ్చు.కాకతాళీయంగా అనిపించవచ్చు.కానీ మానవజీవితం పైన గ్రహప్రభావాలను నిశితంగా గమనించేవారికి మాత్రం హటాత్తుగా విజ్రుంభిస్తున్న ఈ వైరస్ వెనుక ఉన్న రాహుకేతువులు తప్పకుండా దర్శనం ఇస్తారు.

రాహుకేతువులనే వాళ్ళు భూమిచుట్టూ ఆవరించి ఉన్న అయస్కాంత శక్తులు.సూర్యుని చుట్టూ తిరిగే భూకక్ష్యా చంద్రుని కక్ష్యా పరస్పరం ఖండించుకునే ఖగోళస్థానాలనే మన ప్రాచీనులు రాహువు కేతువు అని పిలిచారు.ఇవి అయస్కాంత శక్తి గలిగిన రోదసీ బిందువులు.వీటి ప్రభావం భూమిమీద ఖచ్చితంగా ఉంటుంది.అలాగే భూమ్మీద నివసిస్తున్న మనమీద కూడా ఖచ్చితంగా ఉంటుంది.ఈ కక్ష్యలలో మార్పులు వచ్చిన ప్రతిసారీ భూమి మీద కొన్ని కొన్ని మార్పులు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి.ఇది తిరుగులేని నిజం.

ఈ ఖగోళ సత్యాలు తెలియని అజ్ఞానులు 'రాహుకేతువులు అనేవాళ్ళు ఆకాశంలో అసలు లేనే లేరు.లేనివాళ్ళు గ్రహాలెలా అవుతారు?అంతా మూఢనమ్మకాలు' అని గుడ్డిగా వాదిస్తూ మనల్ని నవ్విస్తూ ఉంటారు.వారి అజ్ఞానానికి వారిని అలా వదిలేద్దాం.

ప్రస్తుతం మానవాళిని భయపెడుతున్న ' జికా ' వైరస్ రాహుకేతువులు రాశులు మారుతున్న ఇదే తేదీలలో ఖచ్చితంగా ప్రత్యక్షం కావడం వింతగా లేదూ? అర్ధం చేసుకోనంత వరకూ వింతగానే ఉంటుంది.సరిగా అర్ధం చేసుకుంటే అందులో వింత కనిపించదు.విశ్వనాటకంలోని ఒక అంకంలో విశ్వశక్తులు ఎలా పనిచేస్తున్నాయో అప్పుడు అర్ధం అవుతుంది. 

ఈ వైరస్ బ్రెజిల్ లో ఎక్కువగా కనిపిస్తోంది.అక్కడనుంచి మిగతా దేశాలకు ప్రాకుతున్నది.లక్షలాది మంది దీని బారిన బడుతున్నారని అంచనాలు చెబుతున్నాయి.ఇది 'ఏడిస్' జాతికి చెందిన దోమద్వారా ఒకరినుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. దోమలు మొదలైన ఎగిరే కీటకాలు రాహుకేతువుల అధీనంలో ఉంటాయని జ్యోతిశ్శాస్త్రంలో ఓనమాలు వచ్చిన ప్రతివారికీ తెలిసిన విషయమే.

రాహుకేతువులు రాశిచక్రాన్ని చుట్టి రావడానికి 18 ఏళ్ళు పడుతుంది. సరిగ్గా 18 ఏళ్ళ క్రితం 1997 లో రాహుకేతువులు ఇదే స్థానాలలో ఉన్నారు.

అప్పుడేమైందో చూద్దామా?

ఆ సమయంలో హాంక్ కాంగ్ చైనాలలో 'ఏవియన్ ఫ్లూ' అనబడే బర్డ్ ఫ్లూ వ్యాధి విజ్రుంభించి లక్షలాది కోళ్ళను బలితీసుకుంది.కోళ్ళనుంచి మనుషులకు కూడా ఇది పాకింది.దీనివల్ల అప్పట్లో అంతర్జాతీయ రవాణారంగమూ, ఆర్దికరంగమూ తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.దేశాలకు దేశాలే హడలెత్తి పోయాయి.ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళుతున్న మనుషులను ఎయిర్ పోర్టులలో ఆపి మెడికల్ చెకప్స్ చేసే పరిస్థితులు అప్పుడు తలెత్తాయి.

ఎగిరే పక్షులకు కారకుడు రాహువన్న సంగతి తెలిసిన విషయమే.అలాగే ఇప్పుడు ఎగిరే దోమలు రంగంలోకి వచ్చాయి.జాగ్రత్తగా గమనిస్తే నేటి జికా వైరస్ కూ, 18 ఏళ్ళ నాటి బర్డ్ ఫ్లూ వ్యాధికీ వెనుక ఉన్న శక్తులెవరో జ్యోతిశ్శాస్త్ర విద్యార్ధులకు తేలికగా అర్ధమౌతుంది.

మానవ జీవితం మీద ఉన్న రాహుకేతువుల ప్రభావానికి ఇలాంటి సంఘటనలే తిరుగులేని సాక్ష్యాలు.స్టాటిస్టికల్ గా ఇలాంటి రుజువులు కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నా కూడా జ్యోతిశ్శాస్త్రం అబద్దం అని వాదించే వారిది అజ్ఞానం కాకపోతే ఇంకేమనుకోవాలి?