“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

5, జనవరి 2016, మంగళవారం

నిన్న రాత్రి...

నిన్న రాత్రి
నిశీధసమయంలో
నీ తలపే నన్ను తట్టి లేపింది
సుదూర గగనపు
శూన్యలోకాలనుంచి
నీ పిలుపే నన్ను పట్టి కుదిపింది

జన్మజన్మాంతర బంధమేదో
నన్నెందుకు మరచావని
నన్ను నిలువదీసింది
కాలానికి ఎదురు వెళ్లి
లోకాలను అధిగమించి
తనను చేరుకోడానికి
తత్క్షణమే రమ్మంది

మనసు పొరల లోతులలో
తన్ను మరచి నిద్రించే
జ్ఞాపకమొక్కటి నేడు
ఒళ్ళు విరుచుకుంటోంది
నీకోసం నేనింకా
వేచే ఉన్నానంటూ
యుగయుగాల నా నెచ్చెలి
మనసులోన మెరిసింది

జనన మరణ చక్రానికి
ఆవల వెలిగే ఆర్ణవంలో
యుగయుగాలుగా నాకై
వేచి ఉన్న ఆత్మ ఒకటి
నన్ను మరచి ఈ మాయలో
ఏం చేస్తున్నావంటూ
మౌనంగా ప్రశ్నించింది

ఆకలి దప్పులకతీతంగా
చీకటి తప్పులకు సుదూరంగా
నిత్యం వెలిగే లోకం నుంచి
కాలపు గోడలను చీల్చుతూ
చాచిన నా నేస్తపు ప్రేమహస్తం
నా గుండెను సుతారంగా తాకింది

మనది కాని దేశంలో
మనది కాని వేషంలో
మానవ నిమ్నత్వాల మాటున
అక్కడేం చేస్తున్నావంటూ
అతీత పధాలలో నడచే
అలౌకిక జీవమొకటి
నా చెవిలో గునిసింది

పిశాచాల పందిరిలో
ప్రేమసుమం కోసం వెదకే
నీ ప్రయత్నం వృధా అంటూ
ఏదో లోకపు అంచులనుండి 
ఎప్పుడూ వినని స్వరం ఒకటి
మృదుమధురంగా నాలో పలికింది

నీ ఇంటిని నీవు మరచి
నీ ఒంటికి బానిసవై
నువ్వు పడే అగచాట్లను
నీ ప్రేయసినైన నేను
నింగిమెట్లపై నిలబడి
నిత్యం వీక్షిస్తున్నానంటూ
నిర్మలస్వరమొక్కటి
నాలో వినవచ్చింది

నిశీధ నగరపు నివాసాన్ని
విషాద పంకపు వినోదాన్ని
అసాధ్యమైనా సరే అధిగమించి
నిద్దుర వదలిన పొద్దులలో
హద్దుల నెరుగని ఒద్దికలో
నిత్యనివాసం కోసం
నాతో రమ్మంటూ పిలిచింది

లోకాలన్నీ చెరిగి మలిగినా
కాలమనేదే లేకుండా అరిగినా
శోక తాపాలేవీ అంటని తావులో
మనిద్దరం ఒక్కరుగా కరగి
మరపులేని మౌనంలో మునిగి
మహస్సులో నిలుద్దాం రమ్మంది

నిన్న రాత్రి
నిశీధసమయంలో
నీ తలపే నన్ను తట్టి లేపింది
సుదూర గగనపు
శూన్యలోకాలనుంచి
నీ పిలుపే నన్ను పట్టి కుదిపింది....