“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, జనవరి 2016, మంగళవారం

త్వరలో రాబోతున్న కాలసర్పయోగం - గురుచండాల యోగాలు

అనంత కాలగమనంలో గ్రహాల పరిభ్రమణంలో అనేక గ్రహయోగాలు కలుగుతూ కొన్నాళ్ళ తర్వాత విడిపోతూ ఉంటాయి. ఆయా సమయాలలో దేశాలకూ,వ్యక్తులకూ కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి.ఇది నిజమే.భూమ్మీద జరిగే సంఘటనలకూ గ్రహయోగాలకూ గల ఈ సంబంధాన్ని అతి ప్రాచీనకాలంలోనే గుర్తించారు.

ఈ నేపధ్యంలో మనకు త్వరలో కొన్ని యోగాలు రాశిచక్రంలో కలగబోతున్నాయి.వాటిలో గురుచండాల యోగం,కాలసర్ప యోగం అనేవి ఉన్నాయని టీవీ జ్యోతిష్కులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.చాలామంది నిజంగానే భయపడుతున్నారని నా దృష్టికి వచ్చింది.కొంతమంది మహిళలు నాకు ఫోన్ చేసి ఏం చెయ్యాలని అడుగుతున్నారు. ఆ భయాలు అర్ధం లేనివనీ, టీవీలు చూచి అనవసరంగా అలా వణికిపోవద్దనీ చెప్పడమే ఈ పోస్ట్ ఉద్దేశ్యం.

జనవరి 30 న రాహుకేతువులు రాశిమారుతున్నారు.అప్పుడు రాహువు సింహరాశిలోకి ప్రవేశించి గురువుతో కలుస్తాడు. అప్పటినుంచీ ఆగస్టు 12 న గురువు కన్యారాశిలో ప్రవేశించే వరకూ ఉన్న 7 నెలల కాలం గురుచండాల యోగం పరిధిలో ఉంటుంది.

ఈ సమయంలో దొంగ గురువుల బండారాలు బయట పడతాయి.దొంగశిష్యులు దొంగ గురువుల దగ్గరకు చేరతారు. అంతేగాని నిజమైన గురువులకు మాత్రం ఏమీకాదు.వారికి మంచే జరుగుతుంది.అంతేగాక ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద స్కాములు బయటపడే సూచన ఈ సమయంలో ఉన్నది. ఈ సమయంలో ముస్లిం ఉగ్రవాదం బాగా పెచ్చుమీరి కొన్ని దేశాలమధ్యన యుద్ధవాతావరణానికి దారితీసే ప్రమాదమూ ఉన్నది.అంతేగాని వ్యక్తిగత జీవితాలలో మీరు అతిగా భయపడుతున్నంత భయంకర ఫలితాలు ఏమీ ఉండవు.

ఇప్పుడు గర్భవతులుగా ఉండి ఆ సమయంలో డెలివరీ అయ్యే కొంతమంది స్త్రీలు బాగా భయపడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది.ఇంతకు ముందు అయితే, ఈ గ్రహాలూ ఈ యోగాలూ పెద్దగా జనానికి తెలిసేవి కావు.ఇప్పుడు టీవీల పుణ్యమా అని పల్లెటూళ్ళో చదువురాని వారికి కూడా గ్రహయోగాలు తెలుస్తున్నాయి.తెలిస్తే తప్పులేదు.అనవసరంగా ప్రతిదానికీ భయపడటమే తప్పు.ఈ యోగాల బూచిని చూపించి జనాన్ని భయపెడుతున్నారు కుహనా జ్యోతిష్కులు.మంచికంటే చెడు ఎక్కువగా ప్రచారం కాబడుతున్నది.అదే అసలైన పొరపాటు.

ఒక పదిమంది జాతకాలలో గురుచండాల యోగం ఉంటే అందరికీ అది ఒకే ఫలితాన్నివ్వదు. వారి వారి పూర్వకర్మ బేలెన్స్ ను బట్టి అది ఈ జన్మలో ఈ సమయంలో ఇచ్చే ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి.యోగాలవల్ల అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఉండవు.

టీవీలు,జ్యోతిష్య బ్లాగులు బాగా చూసే కొందరు మహిళలు, రాబోతున్న ఈ రెండుయోగాల గురించి ఎక్కువగా తెలుసుకుని అనవసరంగా భయాందోళనలకు గురౌతున్నారు. కొందరైతే -ఇలాంటి సమయంలో మనం పిల్లని కనడం ఎందుకు? అబార్షన్ చేయించుకుందామని ప్లాన్ చేసుకుని - ఏం చెయ్యమంటారని నన్ను అడుగుతున్నారు.ఒకామె అయితే - ఏకంగా సూయిసైడ్ చేసుకుందామని అనుకున్నాను - అని ఫోన్లో నాకే చెప్పింది. స్త్రీలలో ఇంత అమాయకులు ఉండబట్టే నకిలీ గురువులు నకిలీ జ్యోతిష్కులు సమాజంలో విచ్చలవిడిగా చెలామణీ అవుతున్నారు.

మరీ అంత జ్యోతిష్యపిచ్చి పనికిరాదు.ఏదైనా సరే వాస్తవిక దృక్పధం ఉండాలి.

పొరపాటున కూడా అబార్షన్ జోలికి పోవద్దని స్త్రీలకు నా సూచన. ఎందుకంటే అబార్షన్ అనేది మహా ఘోరమైన పాపం. అమాయకంగా ఊపిరి పోసుకుంటున్న ఒక చిన్నిప్రాణిని,అలా చెయ్యడం ద్వారా మీ చేతులతో మీరు హత్య చేస్తున్నారు.మీకు ఘోరమైన హత్యాదోషం చుట్టుకుంటుంది.దానిని కడుక్కోవడం మీ వల్ల కాదు.ఈ లోకపు కోర్టుల దృష్టిలో అది నేరం అయినా కాకపోయినా పైవాడి దృష్టిలో అది మహా ఘోరమైన పాపం. దానివల్ల ఆ కుటుంబానికి చాలా దారుణమైన పాపఖర్మ అంటుకుని,కాలక్రమంలో ఆ కుటుంబం అనేక దురదృష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.అబార్షన్ చేయించుకున్నవారూ చేసిన డాక్టర్లూ కూడా ఆ తదుపరి చాలా చెడుకర్మను ఎదుర్కొంటారు.

కేవలం అబార్షన్లు మాత్రమె చేసే ఒక లేడీ డాక్టరు ఫేమిలీ మొత్తం మూడే మూడేళ్ళలో సర్వనాశనం అయిన సంఘటన నేను కళ్ళారా చూశాను.జాగ్రత్తగా గమనిస్తే ఆ లింకులు అర్ధమౌతాయి.ఆ తర్వాత మీరు ఏ విధమైన రెమెడీలు చేసినా ఆ పాపం పోదు.తరతరాలకు ఆ పాపం వెంటాడుతుంది. ఈ విషయాన్ని స్పష్టంగా గమనించండి.

ఇంకో విషయం ఏమంటే - ఈ విధంగా భయాందోళనకు గురవ్వడం వల్ల,మీ భయం కడుపులో ఉన్న పిండం మీద పడుతుంది.పుట్టిన తర్వాత ఆ పిల్లలకు కూడా అనవసరమైన భయాలు, చీటికీ మాటికీ ఆందోళన పడటం, చిన్నప్పుడే B.P, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. పొట్టలో ఉన్న పిల్లను కనీసం ఆ 9 నెలలైనా ప్రశాంతంగా ఉండనివ్వండి.మీ టీవీల గోలను,టీవీ జ్యోతిష్కుల ఊదరను, వారు పెడుతున్న భయాలను ఆ పొట్టలోని బిడ్డ దగ్గరకు చేరనివ్వకండి.

రాబోతున్న ఈ యోగాలకు రెమెడీలు ఏం చెయ్యాలని చాలామంది నన్ను అడుగుతున్నారు.

ముందు మీరు భయపడకుండా ప్రశాంతంగా ఉండటమే అతి ముఖ్యమైన రెమెడీ.మీరు చేస్తున్న రకరకాల నూనెల దీపారాధనలకూ,రకరకాల పిండ్లు కలిపి చేస్తున్న ఏవేవో జిమ్మిక్కులకూ,గుళ్ళూ గోపురాలూ తిరిగినంత మాత్రానా,ప్రదక్షిణాలు చేసినంత మాత్రానా - గ్రహాలు ఏమాత్రం లొంగవన్న వాస్తవాన్ని ముందుగా గమనించండి.

స్వచ్చమైన జీవితాన్ని గడపడం,చేతనైనంతలో ఇతరులకు సాయం చెయ్యడం,దైవాన్ని ప్రార్దించడాలే అత్యుత్తమైన రెమేడీలు.దైవానుగ్రహం ఉంటే గ్రహయోగాలు ఏమీ చెయ్యవు.

జీవితంలో బాగా రాణించిన వ్యక్తుల జీవితాలలో కాలసర్పయోగం ఉండటం గమనించండి.ఉదాహరణకు జవహర్ లాల్ నెహ్రూ జాతకంలో కాలసర్పయోగం లాంటిది ఉన్నది. గురుచండాల యోగం కూడా అంతే. అనేకమంది రాజకీయ నాయకుల జాతకాలలో,సమాజంలో రాణిస్తున్న అనేకమంది కుహనా గురువుల జాతకాలలో ఈ యోగం ఉంటుంది.కాబట్టి వీటి గురించి బాధపడవద్దు. భయపడవద్దు.శిశువుల డెలివరీలకు జ్యోతిష్య ముహూర్తాలు పెట్టుకునే పని చెయ్యవద్దు.ఇలాంటి పిచ్చి పనులతో మీరు కర్మను ఓడించలేరు.కర్మను మార్చలేరు.మీకు ఒకటి తెలిస్తే, కర్మకు వంద ఉపాయాలు తెలుసు. గుర్తుంచుకోండి.

మంచి జీవితాలు గడుపుతూ, దైవాన్ని నిష్కల్మషమైన హృదయంతో ప్రార్ధిస్తూ ఉంటే, ఆ బిడ్డ పుట్టిన సమయానికి జాతకంలో ఉన్న చెడు దోషాలను కూడా మంచి స్థానాలలో ఉంచేపని దైవం చూసుకుంటుంది.అది జ్యోతిష్కుల వల్ల జరిగే పని కాదు. జ్యోతిష్కులు రాశిచక్రం వరకూ మంచి ముహూర్తాలు పెట్టవచ్చు. సూక్ష్మచక్రాలలో ఏం జరుగుతుందో వారు చూడలేరు.అది వారి అధీనంలో ఉండదు.కనుక కర్మఫలం ఎలా ఉందో అలాగే జరుగుతుంది.టీవీ రెమెడీలతో అది మారదని గ్రహించండి.

ఇకపోతే కాలసర్పయోగం గురించి.

రాబోతున్నది కాలసర్పయోగం కాదు.కొంతమంది రివర్స్ కాలసర్పయోగం అని అంటూ ఉంటారు.నిజానికి అలాంటి రివర్స్ యోగం ప్రామాణిక గ్రంధాలలో ఎక్కడా చెప్పబడి లేదు.కానీ అలాంటి ఒక గ్రహస్థితి త్వరలో రాశిచక్రంలో రాబోతున్నది.దాని ఫలితాలు అసలైన కాలసర్ప యోగమంత భయంకరంగా ఏమీ ఉండవు.కొద్దో గొప్పో ఉంటే అవి దేశాల మీద ఉంటాయి.కనుక భయం లేదు.

అనవసర భయాలు పెట్టుకుని ఆరోగ్యాలూ మనసులూ పాడు చేసుకోకండి. ప్రశాంతంగా ఉండి మీమీ ఇష్టదైవాలను మనస్పూర్తిగా ధ్యానించండి.ఎవరికీ హాని చేసే పనులు చెయ్యకండి.నిజంగా ఆపదలో అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంతలో సహాయం చెయ్యండి.దీనిని మించిన రెమెడీ ఇంకేమీ లేదు.ఈ వాస్తవాన్ని గ్రహించి టీవీ జ్యోతిష్కులకు దూరంగా ఉండండి.

గ్రహాలను సృష్టించింది దైవమే.ఆ దైవాన్ని సక్రమంగా పట్టుకుంటే గ్రహాల నుంచి,గ్రహదోషాల నుంచి ఆ దైవమే మనల్ని కాపాడుతుంది. ఇది అసలైన నిజం.గమనించండి.