“Self service is the best service”

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఒమర్ ఖయ్యాం జాతకం -6 ( అంతర్వీక్షణం- ఆఖరిభాగం)

ఇంతకీ తన పద్యాలద్వారా ఖయ్యాం చెప్పదలుచుకున్నదేమిటి? రుబాయత్ ద్వారా లోకానికి ఆయన ఇచ్చిన సందేశం ఏమిటి? అన్న ప్రశ్నలు ఈ పోస్ట్ లు చదివినవారి మనసులో తలెత్తుతాయి. వాటి సంగతి ఇప్పుడు చూద్దాం.

ఖయ్యాం లోకానికి ఏ సందేశమూ ఇవ్వాలని ఆశించలేదు. లోకులకు సందేశాలు అక్కర్లేదని తెలీనంత అమాయకుడు కాదు ఖయ్యాం. ప్రతి జ్ఞానికీ తాత్వికునికీ ఇది తెలుసు. మరి ఎందుకని వారు లోకానికి ఏదో చెప్పాలని చూస్తారు? అంటే, వెయ్యి విత్తనాలు వెదజల్లితే కనీసం ఒక విత్తనం అయినా మొలకెత్తకపోతుందా అని వారు ఆలోచిస్తారు. ఆ ఒక్కరికోసమే ఇదంతా చెప్తారు.

అసలు ఖయ్యాం ఇన్ని పద్యాలలో ఏమి చెప్పాడు?

తన హృదయావేదనను ఖయ్యాం తన పద్యాలలో వెల్లడించాడు. తన అంతరంగమధనాన్ని కవితల రూపంలో ఆవిష్కరించాడు. తనను తానే ప్రశ్నించుకున్నాడు. సాకీని ప్రశ్నించాడు. సాకీ ఏమి చెప్పగలదు? తానే అయోమయంలో ఉంది. కనుక ఏమీ చెప్పలేదు. దైవాన్ని ప్రశ్నించాడు. దైవం ఉలకడు. పలకడు. కనుక ప్రశ్నించీ ప్రశ్నించీ విసిగి వేసారిపోయాడు. ఎన్నో ప్రశ్నలు అతన్ని చుట్టుముట్టాయి. కాని దేనికీ అతనికి జవాబు దొరకలేదు. చివరికి అన్నీ ప్రశ్నలే మిగిలాయి. 'అంతా మిధ్య' అని చివరకు గ్రహించాడు. 'ధూళి జనియించితి గాలి దేలిపోదు' 'మట్టిలోనుంచి వచ్చాను గాలిలో కలసిపోతాను' -- ఇంతే జీవితం అన్న నిశ్చయానికి వస్తాడు. జీవితం మొత్తం 'మట్టి - గాలి' ఇంతే అని గ్రహిస్తాడు. ఇది అందరికీ కనిపిస్త్తున్న నిత్యసత్యమే.

మనిషికి భోగానుభవం మిగిలి ఉన్నంతవరకూ సత్యజ్ఞానం కలుగదు. కర్మశేషం మిగిలి ఉన్నంతవరకూ ఈ ఊబిలోనుంచి మోక్షం దొరకదు. కనుక ఖయ్యాం సత్యాన్ని తెలుసుకోలేక నిస్పృహతోనే జీవితాన్ని చాలించాడని నా ఉద్దేశ్యం. ఎందుకంటే, ప్రపంచంతో సంబంధం పెట్టుకున్న ప్రతివాడూ అలా మరణించవలసిందే. మనుషులతో పెట్టుకున్నవాడు చివరకు నిరాశ చెందక తప్పదు. ఇదొక తిరుగులేని నియమం. దీనికి ఉల్లంఘన లేనేలేదు.

అంతా అనిత్యమే అని ఖయ్యాం తెలుసుకున్నాడు. కాని ఆధ్యాత్మికపధంలో అది మొదటిమెట్టు మాత్రమే. ఆ తర్వాతి మెట్లను అతడు ఎక్కినట్లు కనిపించదు. తనకు తెలిసిన అనిత్యంలోనే నిత్యాన్ని వెతుక్కుంటూ అతను నిష్క్రమించాడు. తర్వాతి జన్మలో మరింత ముందుకు సాగి ఉంటాడు. కాని ఆ జన్మలో మాత్రం అంతవరకే పురోగమించాడనిపిస్తుంది. లేనిదాన్ని ఉన్నట్లు అతను నటించలేదు. నిజాయితీగా ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్పాడు. తనకు మోహం ఉంటే ఉన్నది అని చెప్పాడు.అది అతనిలోని ఉత్తమ లక్షణం.

అయితే, 'అంతా అనిత్యం' అని నిజంగా తెలుసుకున్నవాడు అనిత్యాన్ని వదలి నిత్యాన్ని వెదకాలి.ఆ మార్గాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే, ఆ దారిలో నడిచినవారిని అన్వేషించాలి. వారిని సేవించి వారినుంచి ఆ వివరాలు స్వీకరించాలి. తరువాత ఆ దారిలో తానూ నడవాలి. అప్పుడు మాత్రమే తానాశిస్తున్న నిత్యాన్ని చేరుకోగలుగుతాడు. అలా కాకుండా ఊహల్లో పడి మధ్యలో ఆగిపోతే ఎన్నటికీ గమ్యాన్ని చేరలేడు. ఈలోపల జీవితం కాస్తా అయిపోతుంది. తన అనిత్యమే తనతో మిగులుతుంది. చివరికి మరణం పిలిచినప్పుడు ఈ అనిత్యం కూడా తననే వెక్కిరిస్తుంది.

అయితే అలా దారి చూపగలిగేవారు అందరికీ దొరుకుతారా? అంటే అది మన అన్వేషణలోని తీవ్రత పైన ఆధారపడి ఉంటుందని చెప్పాలి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన విషయాలను మనం వాయిదా వేస్తూ పోతున్నంతవరకూ వారు దొరకరు. మిగిలిన ఎన్నో పనులలో ఆధ్యాత్మికత కూడా ఒకపనిగా ఉన్నంతవరకూ వారు దొరకరు. మనకు ఏమీ తోచనపుడు కాలక్షేపం కోసం ఆధ్యాత్మికతను ఆశ్రయిస్తూ ఉన్నంతవరకూ ఆ మార్గంలో దారి దొరకదు. అందులో చాలా నిజాయితీ అవసరం.

తర్కాన్ని ఉపయోగించి మనిషి సృష్టి రహస్యాలన్నీ తెలుసుకోవడం జరగని పని. తర్కానికి ఆవల చాలా సీమలున్నాయి. మన తర్కాలు పనిచెయ్యని భూములున్నాయి. వాటి నియమాలు వేరుగా ఉంటాయి. ఆ ప్రదేశాల రహస్యాలు తెలియాలంటే ఆ నియమాలను పాటించాలి. మన పరిధులలో మనం ఉంటూ వాటి రహస్యాలు తెలియాలని ఆశించడం పొరపాటు అవుతుంది. మన పరిధులను దాటి మనం పోగలగాలి. అలా దాటలేకపోతే ఆ సీమలు చిక్కవు. అప్పుడు ఉన్నచోటే ఆనందాన్ని వెదుక్కోవలసి ఉంటుంది. అది అనిత్యమని తెలిసినా సరే. బహుశా ఖయ్యాం అదే చేశాడేమో?

ఖయాం జాతకంలో గురువు నీచలో ఉన్నాడు. గురువు నీచలో ఉన్నపుడు ఆ జాతకుని ప్రయాణం ఈ జన్మలో ముగింపుకు రాదు. దానికి తోడూ పంచమంలో రాహువు ఉన్నాడు. దీనివల్ల బహుముఖ ప్రజ్ఞ వస్తుంది గాని, ఆత్మజ్ఞానం కలగడం కష్టం అనే చెప్పాలి. ఇలాంటి జాతకులకు మానసికమైన చంచలత్వం చివరివరకూ సమసిపోదు. సౌందర్యతృష్ణ చల్లారదు. దీనికి తోడుగా,నవమంలోని గురుశనుల కలయికవల్ల ఈ జన్మలో పరమమైన సత్యజ్ఞానం కలుగలేదు అని తెలుస్తుంది. అందుకే ఒక ఆత్మజ్ఞాని కన్నుమూసినట్లు పరమతృప్తితో, ముఖం మీద వెలుగుతున్న నవ్వుతో  అతడు కన్నుమూయలేదు. ఇంకా వెతుకులాటలోనే, అసంతృప్తిలోనే అతడు కన్నుమూశాడు. దానికి కారణం మధ్యలోనే దారితప్పిన పయనం. వీడని చిక్కుముడి లాంటి జననమరణ రహస్యం. అంతుపట్టని అంతరిక సమస్యల వలయం.

ఒక మనిషికి పాండిత్యం ఉండవచ్చు. శాస్త్రజ్ఞానం ఉండవచ్చు. వీటి సాయంతో అతడు లోకంలో ఎంతో సాధించవచ్చు. కాని ఆధ్యాత్మికజ్ఞానం వీటివల్ల రాదు. వెలుగుదారిలో నడిస్తేనే అది వస్తుంది. ఆ దారి అందరికీ దొరికేది కాదు. దానికోసం మిగిలిన అన్నీ వదులుకోగలిగిన వాడికే అది దక్కుతుంది. కనుక అంత సాహసం చెయ్యలేని పండితులూ తాత్వికులూ కూడా చివరికి ఏమీ తెలుసుకోలేక అజ్ఞానంతోనే కన్నుమూయక తప్పదు. ఇది ఎప్పటినుంచో జరుగుతున్న చరిత్ర.

ఇకముందు జరిగే చరిత్ర కూడా ఇదే.

దైవాన్ని చేరే మార్గాలు ఖయ్యాంకు బౌద్ధికంగా తెలుసు. తాను వ్రాసిన గ్రంధాలలో ఆ మార్గాలను ఉటంకించాడు. వాటిలో, ఆత్మసంయమనం ద్వారా, అంతరికసాధన ద్వారా దైవాన్ని చేరే 'సూఫీమార్గం' శ్రేష్టమైనదని ఆయన అన్నాడు. కాని దానిని ఎంతవరకూ తాను పాటించాడు? అంటే మనకు తెలీదు. తానుకూడా ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. కొన్ని రహస్య సూఫీగ్రూపులతో ఆయనకు సంబంధాలు ఉండి ఉండవచ్చు. కాని దానిని ఎక్కడా తేటతెల్లంగా బహిర్గతం చెయ్యలేదు. తీవ్రవాదులతో ఆయనకున్న శత్రుత్వం బహుశా దీనికి అడ్డుపడి ఉండవచ్చు. అందుకేనేమో మార్మికమైన పద్యాలలో తన భావాలను అర్ధమయ్యీ కాకుండా చెప్పాడు.

'కోరికలన్నీ సుఖాన్ని మాత్రమే ఇవ్వవు' అని కూడా ఖయాంకి తెలుసు. మధువుతో చేదురుచి కలసి ఉన్నట్లే, గులాబితో ముళ్ళు కలసి ఉన్నట్లే, ప్రతి సుఖంతోనూ ఒక దుఖం కూడా కలిసి ఉంటుంది అని ఆయనకు తెలుసు. కాని అంతమాత్రాన ఆ కోరికను ఎందుకు చంపుకోవాలి? అంటాడు. "తాను అనేక చీలికలై రంపపుకోతను పడితేనే కదా ప్రేయసి యొక్క సుగంధమయమైన  ముంగురులలో జాలువారే అదృష్టానికి  దువ్వెన  నోచుకున్నది?" అని ప్రశ్నిస్తాడు. 'రంపకోతలన్ జీరికలౌట దువ్వెనయున్ జేకొను జవ్వని తావి ముంగురుల్' అని తలుస్తాడు.

భౌతిక జీవితంలో ఒక సుఖాన్ని దక్కించుకోవాలంటే ఎన్నో బాధలు పడాలి. ప్రేయసి మది గెలవాలంటే మనసుకి ఎంతో బాధ తప్పనిసరి. ఇక, ప్రేయసి అంటే భగవంతుడు అన్న అర్ధాన్ని తీసుకున్నా అంతే. ఆయనను చేరుకోవాలంటే కూడా మనిషి అంతరాంతరాలలో ఎంతో పరిపక్వత సాధించాలి. ఇదికూడా రంపపు కోతయే.ఈ విధంగా ఖయాం వ్రాసిన ఒకే పద్యం భౌతికమైన అర్ధాన్నీ ఆద్యాత్మికమైన అర్ధాన్నీ ఒకే సమయంలో ఇస్తుంది. ప్రేయసి తల దువ్వుకుంటుంటే చూచిన ఖయాంకు ఆధ్యాత్మిక రహస్యాలు అవగతం అవుతాయి.

రుబాయత్ పద్యాలకు రెండు రకాలైన అర్ధాలు కనిపిస్తాయి. ఒకటి భౌతికార్ధం ఇంకొకటి మార్మికార్ధం. మొదటి కోణంలో చూస్తే ఖయ్యాం ఒక విచారణాపరుడైన సున్నిత సౌందర్య ప్రేమికునిగా మనకు కనిపిస్తాడు. అంతా అనిత్యమే అని తెలుసుకున్నాడు. చేసేదేమీ లేదని కూడా తెలిసింది.ఇక ఇతరులను బాధించకుండా ఉన్నంతలో ఆనందాన్ని ఆస్వాదించు. దీనికంటే నీవు ఏమీ చెయ్యలేవు అంటాడు. ఈ కోణంలో ఇది సరైనదే. ఎవరైనా ఈలోకంలో ఇంతకంటే చేసేదేమీ లేదు. చేస్తున్నది కూడా లేదు. సామాన్యుడు ఇంతకంటే ఏమీ చెయ్యలేడు. ఇక్కడ సామాన్యుడు అంటే ధనం లేనివాడు అని అర్ధం కాదు.ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని అందుకోలేని ప్రతి మానవుడూ, లౌకికంగా అతడు అమిత సంపన్నుడైనప్పటికీ, నిజానికి సామాన్యుడే.

ఇక రెండవకోణంలో చూస్తే అతనిలో ఒక ద్రష్ట కనిపిస్తాడు. సాకీ అంటే మనసనీ,మధువు అంటే ధ్యానంలో కలిగే ఆనందమనీ అర్ధం తీసుకుంటే, అతనిలో ఒక మార్మికయోగి కనిపిస్తాడు. కాని అన్ని పద్యాలనూ ఈ కోణంలో గ్రహించలేము. కొన్ని పూర్తిగా భౌతికార్ధాన్ని సూచించే పద్యాలు కూడా వీటిలో ఉన్నాయి. చివరికి జననమరణరహస్యాన్ని తాను తెలుసుకోలేకపోయాననే బాధ ఆయన పద్యాలలో కనిపిస్తుంది. కనుక మార్మికకోణం నిజానికి ఆయనవద్ద లేదేమో, ఇది మన ఊహ మాత్రమేనేమో అని ఒక ఆలోచన ఒక్కొక్కసారి కలుగుతుంది.

ఈ విధంగా ఎటూ చెప్పలేని స్తితిలో మనం ఉండిపోతాము. అలాటి స్తితిలో మనల్ని ఒదిలి ఖయాం తనదారిన తాను వెళ్ళిపోతాడు. అందుకే అతను పూర్తిగా అర్ధం కాడు. అలా అర్ధంకాకపోవడం లోనే అతనియొక్క నిజమైన ఆకర్షణ ఉన్నదేమో అనిపిస్తుంది. అందుకే అతని కవితలు ఇన్ని వందల ఏళ్ళ తర్వాతకూడా ఆలోచనాపరులను వెంటాడుతూనే ఉన్నాయి.

ఎందరు లేరు జోస్యులు; మరెందరు నీవలె హేతువాదులై
మ్రందిరి? వారి పుట్టువులమాటయే లోకమెరుంగబోదు;నీ 
నందన వాటికన్ గరికపట్టుల బూబోదరిండ్ల నీడ మా 
కందరకున్ రసార్ద్ర కవితాసవమిచ్చితి వాసదీరగన్

ఆ రోజుల్లో ఖయాం మంచి శాస్త్రవేత్తయే గాక మంచి జ్యోతిష్కుడు కూడా. ఆ కాలంలో ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ రెండూ కలిసి ఒకటిగా ఉండేవి. గ్రహస్తితులనీ భూమ్మీద వాటి ప్రభావాన్నీ కూడా కలిపి గ్రహించేవారు. గ్రహాలంటే జీవం లేని మట్టిముద్దలన్న నేటి భావన ఆ రోజుల్లో లేదు. ఒకసారి మహారాజు వేటకు పోదలచి ఖయాంను ముహూర్తం పెట్టమన్నాడు. ఖయాం ఒకరోజును సూచించాడు. ఆరోజున మహారాజు వేటకు బయలుదేరుతుండగా కారుమబ్బులు కమ్మి హోరువాన వచ్చె సూచనలు కనిపించాయి. అందరూ ఖయాంను ఎగతాళి చేశారు. కాని ఖయాం 'రాజా.మీరు నమ్మకంగా బయలుదేరండి. మబ్బులు కొద్దిసేపటిలో విరిసిపోతాయి. అయిదురోజుల వరకూ ఒక్క చుక్క కూడా వర్షం పడదు.నా మాట నమ్మండి' అని చెప్పాడు. చూస్తూ ఉండగానే మబ్బులు విరిసిపోయి ఎండ వచ్చింది. రాజు వేట నిర్విఘ్నంగా సాగింది. ఖయాం చెప్పినట్లే అయిదురోజుల తర్వాతే వర్షం పడింది. ఇది రికార్డ్ చేయబడిన సంఘటన !

లోకంలో ఎంతమంది అటువంటి జ్యోతిష్కులు లేరు? ఎందరు శాస్త్రవేత్తలూ పండితులూ లేరు? కాని వారికీ నీకూ తేడా చెప్పమంటావా? వారు ధనదాసులు. నీవు ప్రేమదాసుడవు. వారు ధనానికి దాసోహం అంటారు. నిన్నో? ప్రేమతప్ప ఇంకేదీ లొంగదీయలేదు.నీవలె మమ్మల్ని నందనవనంలో పూలపోదరిండ్ల నీడన కూచుండబెట్టి  మంచి కవితలనే మధువును ఇచ్చి మధుర భావలహరిలో తేల్చినవారు వారిలో ఎవరున్నారు? కనుక నిన్ను మెచ్చుకోక తప్పదయ్యా ఖయ్యమా !

ఖయాం 'రుబాయత్' లో అతని అసలు పద్యాలతో పాటు అనేక ఇతరులు వ్రాసిన పద్యాలు కూడా కాలక్రమేణా కలిసిపోయాయని పండితుల భావన. ఇదే గతి మన పురాణాలకూ పట్టింది. చివరికి వేమన పద్యాలు, బ్రహ్మంగారి తత్వాలు కూడా కల్తీ అయ్యాయి. కొంచం పాండిత్యం ఉన్న ప్రతివాడూ కొన్ని పద్యాలు వ్రాసి వాటిని గ్రందాలలోకి జోప్పించారు.మహాభారతంలో ఈ విధంగా అనేక కట్టుకధలూ పిట్టకధలూ చేరాయనీ అసలైన పాత మహాభారతం ఇంత విస్తీర్ణమైనది కాదనీ పండితులంటారు. అలాగే రుబాయత్ కూడా అనేక ఇతర పద్యాలు కలిసి కలగూరగంపలా తయారైంది. బహుశా రుబాయత్ లో అక్కడక్కడా కనిపించే భావవైరూప్యతకు కారణం ఇలాంటి ప్రక్షిప్తపద్యాలే కావచ్చు.

రుబాయత్ మొత్తాన్నీ జల్లెడ పడితే రెండుభావాలే చివరకు తేలి కనిపిస్తాయి. జగత్తు అశాశ్వతం గనుక ఏకాంతవాటికలో దైవధ్యానంలో మునిగి యోగసమాధి ఇచ్చే దివ్యానందం ఆస్వాదిస్తూ మైమరచి ఉండు. అది చెయ్యలేకపోతే కనీసం నీ ప్రేయసి చేతిమీదుగా ఇచ్చే మధువును త్రాగి ఆమె కళ్ళలోకి చూస్తూ ఆ రసాస్వాదనలో మైమరచి ఉండు. చేతనైతే మొదటి పని చెయ్యి. లేదా రెండవది స్వీకరించు. ప్రపంచంలో ఈ రెండే ముఖ్యమైన పనులు. మిగతావన్నీ ఉత్తపనికిమాలిన వ్యవహారాలు. ధనమూ, అధికారమూ, పేరుప్రఖ్యాతులూ, ఇంకా ఏవేవో పొందాలని చేసే ప్రయత్నాలు ఎందుకూ కొరగానివాళ్ళు చేసే పనులు. వాళ్ళంతా అజ్ఞానులు. తెలీక భ్రమల్లో ఉండి ఆ పనులు చేస్తున్నారు. నిజానికి ఇవి రెండే ఈ నశ్వరలోకంలో సారభూతమైన విషయాలు. తెలివైనవాడు తన స్థాయిని బట్టి ఈ రెంటిలో ఏదో ఒకటి స్వీకరిస్తాడు. ఎవరైనా సరే ఈ రెండూ దాటి అవతలకి పోలేడు.

ఈ విషయాన్ని ఇన్ని మధురపద్యాలలో హృదయరంజకంగా చెప్పబట్టే నీవు మాకు చిరస్మరణీయుడవయ్యావు ఖయ్యమా ! నీ పాండిత్యమూ జ్ఞానమూ మాకనవసరం. రసఝరిలో మమ్ము ఓలలాడించగల నీ మధుర కవితలున్నాయి చూచావూ అవే మాకు చాలు.

పంచాంగమును సంస్కరించు గణిత ప్రావీణ్యమున్నన్ సలా
మంచున్ సంజరుశాహి ప్రీతి మెయి నీ కర్దాసనంబిచ్చి మ
న్నించగల్గియు, గ్రీకు శాస్త్రముల పాండిత్యంబు నార్జించియుం
గాంచగల్గుదే నేటి కీర్తి కవివే గాకుండినన్ ఖయ్యమా?

ఆరోజులలో పంచాంగసంస్కరణ కమిటీకి ఖయ్యాం అధ్యక్షుడయి గ్రహగణితాలను లెక్కించే విధానాలను నిబద్దీకరించాడు. స్వయానా చక్రవర్తే ఈ భారాన్ని ఆయన మీద ఉంచాడు.ఆ రోజులలో ఇరాన్ దేశాన్నేలిన  'సంజర్ షా' అనే చక్రవర్తి ఖయ్యాం యొక్క పాండిత్యానికీ జ్ఞానానికీ ముగ్దుడై తన సింహాసనంమీద తనతో కూచోబెట్టి 'అర్ధసింహాసన' గౌరవాన్నిచ్చి ఖయ్యాంను తన గురువుగా ఆదరించాడు. కానీ వీటివల్ల నీకు చరితార్ధత కలుగలేదు. నీ కవిత్వమున్నది చూచావూ దానివల్ల నీ పేరు లోకంలో చిరస్థాయిగా నిలిచింది.

నీ తత్వంబులు మాకు పూజ్యమ్బులు కానీ; కాకపోనీ; మరే
మీ;తత్వాలకు నేమిగాని; మధురస్మేరాస్యయౌ సాఖి ద్రు
క్పాతం బైహిక జీవితార్తి పరితప్త స్వాంతులౌ వారికిన్ 
జేత:ప్రీతి నొసంగు; మాకదియే యాశీర్వాద మిప్పట్టునన్

సరే ! నీ భావాలూ, తాత్వికధోరణీ మాకు నచ్చినా నచ్చకపోయినా అలా ఉంచుదాం. కానీ, లౌకిక జీవితంలోని బాధల పాలబడి తపిస్తున్నవారికి సాకి యొక్క మధురమైన చిరునవ్వుతో కూడిన కనుచూపు మాత్రం తప్పక శాంతిని ప్రసాదిస్తుంది. మాకదే చాలు. లోకానికి నీవిచ్చిన ఈ బహుమతి చాలు.

బ్రతుకనే ఎడారిలో దారిదప్పి దప్పికతో డస్సి మరణావస్తకు చేరిన ఒక నికృష్టజీవికి చల్లని సెలయేరు ఎదురుపడితే ఎలా ఉంటుందో, అలాంటి భావనను మాకందిస్తున్నది నీ సుమధుర కవితాఝరి. నీ ఇతర పాండిత్యాలు, జ్ఞానాలూ   అలా ఉంచితే, ఈ ఒక్కటి చాలునయ్యా నిన్ను లోకం ఎల్లప్పుడూ స్మరించి రుణపడి ఉండటానికి.

'కొందరు దేవకన్యకల కూటమి పండుగ యంద్రు గాని నేనందున్ మధూళిపానంబె ప్రియంబని' అని భావించే ఆయన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలని తాపత్రయం మనకెందుకు? 'నిరతము ప్రియాంగనా మధురాధరామృతమానుటో యాసవమానుటో' తప్ప వేరే పని ఏమీ తెలియని ఖయాంను తన లోకంలో వదిలేసి మన రాచకార్యాలు మనం చూచుకుందాం. ఆయన తప్పుదారిలో పోతున్నాడని మనం భ్రమిస్తే జవాబు సిద్ధంగా ఉన్నది.

గురువ, సలాము, దైవమునకున్ మము వీడుము, మీకు మౌనమే 
పరమ హితంబు; అజ్నతను బల్కక యుండినను జాలు;మేము గ్రు
మ్మరునది సత్పధంబు గనుమా; నయనార్తుండ వౌట దారి వ 
క్కరముగ దోచు; కన్నులకు కాటుక బెట్టుము చూపు మేలగున్ 

'నేను తప్పుదారిలో పోతున్నానని అనుకుంటున్నారా? అది మీ తెలివితక్కువతనం. గురువుల్లారా మౌనం వహించండి. నేను సత్పధంలో నడుస్తున్నాను. మీ దృష్టిదోషం చేత నా దారి మీకు వంకరగా తోస్తున్నది. మీ కళ్ళకు కాటుక పెట్టుకోండి. అప్పుడు మీ చూపు బాగై దారి సరిగా కనిపిస్తుంది' అని పండితులకు బోధిస్తాడు.

సాధనాబలంలేని ఉత్తపండితులకంటే, మనకు నిత్యం కనిపించే దొంగగురువులకంటే ఖయ్యాం చాలా ఉత్తముడు. 'మాయవేషముల్ భావములోని కల్మషమున్ బాపునె?' అని ప్రశ్నిస్తాడు. 'చిరిగిన బొంతలన్ దొడిగి సిద్ధుల మంచవివేకలోకమున్ మొరగి చరించు దుర్జనుల మోసము కంటెను మేలుగాదే యో గురువర, కామినీ ప్రణయగోష్టుల నాసవసేవ?' అని గురువునే ప్రశ్నిస్తాడు.

'చచ్చిన నెవ్వరికెవ్వరో? వృధాపలుకు లింకేల భూతలము స్వర్గమొనర్పుము సాఖి పాత్రికన్' అంటూ ఈ భూలోకాన్నే స్వర్గధామంగా మారుద్దాం రమ్మని ఆహ్వానిస్తాడు. ఖయాం చాలా నిజాయితీపరుడు. నిరంతరం అనేక భయాలలో, ఇతరులేమనుకుంటారో అన్న సందేహాలలో, మానసిక సంఘర్షణలలో చిక్కుకొని బయటపడలేని మనకు ఖయ్యాం అర్ధం కాడు. అందుకే ఖయాం మార్గం నిగూఢమైనది. నిశితంగా పరిశీలిస్తే అందులో తంత్రయోగమూ, పూర్ణయోగమూ మనకు కనిపిస్తాయి. వీటిని సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అతి కష్టం.
  
ఇంతకీ ఖయ్యాం ఎవరు? తెలివైన వ్యసనపరుడా? ఒక పండితుడా? ఒక జ్యోతిష్కుడా? ఒక విజ్ఞానఖనియా? ఒక సున్నితహృదయుడా? ఒక ప్రేమపిపాసియా? ఒక విరక్తయోగియా? ఒక మదిరాతపస్వియా? ఒక విలాసపురుషుడా? ఒక అవిశ్రాంత అన్వేషకుడా? ఒక భగ్నచిత్తుడా? ఒక ఉన్మత్త ప్రేమికుడా? నిరంతరం భావనా ప్రపంచంలో విహరించే తాత్వికుడా?దారి తప్పిన బాటసారియా? గమ్యం ఎరుగని పాంధుడా? లేక తన చివరి మజిలీని చేరుకున్న రహస్యయాత్రికుడా? 

ఏమో!! మనకు తెలియదు. అసలు అన్నీ మనకెందుకు తెలియాలి? అన్నీ తెలుసుకోవాలని ప్రయత్నం మనకెందుకు? కొన్నికొన్ని ఎప్పటికీ రహస్యాలు గానే ఉండాలి. అలా ఉంటేనే వాటిలోని మాధుర్యం ఎల్లకాలం అలా ఉండిపోతుంది. సృష్టిలోని విలువైనవన్నీ అలా రహస్యంగానే ఉండాలి. అలా ఉంటేనే వాటికి విలువ. ఖయ్యాం కూడా అలాంటివాడే. అందుకే అతను ఎప్పటికీ అలా అర్ధమయ్యీ కానట్టుగానే ఉండాలి. ఆయన్ని అలాగే ఉండనిద్దాం. ప్రకృతి ఒడిలో సెలయేళ్ళ ఒడ్డున తన ప్రేయసి సాకీ ఇచ్చే మధువును ఆస్వాదిస్తూ ప్రేమభారంతో వాలిపోయే ఆమె కళ్ళలోకి చూస్తూ ఈ పాడులోకాన్ని మరచిన ఖయ్యాంను అలాగే ఉండనిద్దాం.

ఆయన్ను మనం ఎలాగూ అనుసరించలేము. కనీసం ఆయన కవితలలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ రసలోకంలో విహరించగలిగితే మనకు చాలు. ఆపని చేద్దామా మరి?