“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, సెప్టెంబర్ 2012, సోమవారం

పాకలపాటి గురువుగారి జాతకం - కొన్ని విశేషాలు

ఎక్కిరాల భరద్వాజగారి పుస్తకం చదివినవారికి పాకలపాటి గురువుగారు సుపరిచితులే. ఆయన జాతకాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఎందుకంటే, తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నట్లు, చూస్తే మహనీయుల జాతకాలే చూడాలి. వారున్నా సరే, లేకున్నా సరే. మామూలు మనుషుల జాతకాలు చూస్తే వాటిలో స్వార్ధం నీచత్వం తప్ప ఔన్నత్యం ఏముంటుంది?

పాకలపాటి గురువుగారి  అసలుపేరు దామరాజు వెంకట్రామయ్యగారు. పాకలపాటివారికి చాలా పేర్లున్నాయి. నర్శీపట్నం ఏజన్సీ ప్రాంతాలలోని కోయవాళ్ళు ఆయన్ను అనేక పేర్లతో  పిలిచేవారు. వాటన్నిటిలో 'రామయోగి' అనే పేరుతో ఆయన్ను పిలవడం నాకిష్టం. అందుకే ఈ వ్యాసంలో ఆయన్ను అదే పేరుతో పిలుస్తాను.

ఆయన గుంటూరుజిల్లా బ్రాహ్మణులు.శ్రీవత్స గోత్రోద్భవులు. దామరాజువారు ఇప్పటికీ గుంటూరు ఒంగోలు చుట్టుపక్కల ఉన్నారు. వారిలో ఎవరికైనా ఇటువంటి మహర్షి ఒకాయన వారివంశంలో పుట్టాడని తెలుసో లేదో మరి. రామయోగి జన్మతేదీ  11-6-1911. ఆరోజున జ్యేష్ట పౌర్ణమి. ఏలూరు దగ్గరలోని ఒక గ్రామంలో ఆయన జన్మించారు. జనన సమయం మనకు సరిగ్గా తెలియదు. కాని వారి ముఖవర్చస్సును బట్టి, ఎప్పుడూ నలగని బట్టలువేసే వారి అలవాటును బట్టి, తులా లగ్నం అయి ఉండవచ్చు అని ఊహిస్తున్నాను. అష్టమ బుధుడివల్ల కూడా ఈ ఊహ బలపడుతున్నది. ఏదేమైనా ఈ వ్యాసం ఉద్దేశ్యం వారి జననకాల సంస్కరణ కాదు గాబట్టి లగ్నాన్ని అంతగా లెక్కించపనిలేదు.

చంద్రలగ్నం వృశ్చికం అయింది. ఈరాశి చంద్రునికి నీచరాశి అని మనకు తెలుసు. ఆత్మకారకుడు సూర్యుడయ్యాడు. కనుక ఈ రెంటినుంచి స్థూలంగా జాతకాన్ని పరిశీలిద్దాం. నాడీశాస్త్ర రీత్యా చూస్తే, ఆరవనెలలో తేలుకుట్టి వీరి తల్లి మరణించడమూ, తొమ్మిదవ ఏట తండ్రి  మరణించడమూ ఖచ్చితంగా సరిపోతున్నాయి. చాలామంది వృశ్చికరాశి జాతకులకు తల్లి చిన్నతనంలోనే మరణిస్తుంది. దీనివెనుక ఒక నిగూఢమైన కర్మరహస్యం దాగిఉన్నది. కుటుంబస్థానాధిపతి గురువు వక్రించి శత్రుస్థానంలో కేతుగ్రస్తుడై ఉండటమూ, సుఖస్థానాధిపతి నీచలో రాహుగ్రస్తుడవటమూ వల్ల  వివాహం లేకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నాడు. గురువు పంచమాదిపతి కూడా అవడం వల్ల, ఇదే యోగం సంతానం లేకుండా చేసింది. 

రామయోగి జాతకంలో గురువు వక్రించి ఉండటం చూడొచ్చు. అందువల్ల వారికి ప్రత్యేకంగా శిష్యులంటూ ఎవరూ లేరు. వారి విధానం వారితోనే అంతరించిందని ఊహించవచ్చు. వారివల్ల లోకానికి, ముఖ్యంగా కొండ కోనల్లో నివసించే కోయప్రజలకు ఎంతో మేలు చేకూరినప్పటికీ ఆధ్యాత్మికంగా వారి సాధనా విధానం పరంపరగా ఇతరులకు సంక్రమించడం జరగలేదనిపిస్తుంది. దీనికి కారణం వారి జాతకంలోని గురువక్రత. 

శని నీచలో ఉండటం వీరి జాతకంలో ఇంకొక విశేషం. అందువల్ల వీరికి ఈలోకంలో కర్మానుబంధం బలంగా ఉందని సూచిస్తోంది. అందుకే జీవితమంతా అడవులలో గడిపి కొండ కోయజాతులకు మార్గదర్శకుడయ్యాడు. శేషకర్మను సూచించే రాహువు శనితో కలసి ఉండటం దీనినే సూచిస్తున్నది. వీరిద్దరూ మేషరాశిలో కలవడం వల్ల ఇంకొక కర్మ రహస్యం ప్రకటితం అయింది. మేషం కొండ కోనల్లో తిరుగుతుంది. ఎక్కడో కొండల పైకెక్కి మేత మేస్తుంది. అలాగే ఈయన కూడా ఎక్కువగా కొండకోనల్లోనే సంచరించాడు. ఈయన కర్మస్థానం కూడా కొండకోనలే అయ్యాయి.

వక్ర గురువు, కేతువుతో కలవడం వల్ల వీరిది నిగూఢమైన ఆధ్యాత్మిక సిద్ధి అని సూచన ఉన్నది. అంటే ఆ సిద్ది యొక్క ఫలితాలు మాత్రమె జనులకు దర్శనమిస్తాయిగాని ఆ సిద్ధి ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. వారి జీవితం అలాగే గడిచింది. పదమూడేళ్ళ వయసులో జ్ఞానాన్వేషణలో  ఇల్లువదలి వెళ్ళిన ఆ పిల్లవాడు ఏ గురువుల వద్ద ఏఏ విద్యలు అభ్యసించాడో, ఏఏ సాధనలు చేశాడో ఎవరికీ తెలియదు.కొన్నేళ్ళ తర్వాత ఒక సిద్ధపురుషునిగా సమాజానికి దర్శనం ఇచ్చినపుడే వారిగురించి అందరికీ తెలిసింది. దేశంలో వారు తిరగని అడవీ, ఎక్కని పర్వతమూ, దర్శించని సిద్ధపురుషులూ లేరు అంటే అతిశయోక్తి కాదు. కాని, వారి సిద్ధి వారితోనే అంతరించింది.

చంద్రుని నుంచి మంత్రస్థానంలో కుజుడు ఉండటంవల్లా, ఆయన తన అష్టమదృష్టితో గురుకేతువులను వీక్షిస్తూ ఉండటం వల్లా రామయోగి యొక్క సాధన మనకు దర్శనం ఇస్తున్నది. ఈయనకు ప్రబలమైన నిగూఢమైన మంత్రసిద్ధి ఉన్నది అన్నవిషయం దీనివల్ల తెలుస్తున్నది. అంతేగాక నీచచంద్రునివల్లా, పంచమకుజునివల్లా, నవమశుక్రునివల్లా  ఇది తీక్ష్ణమైన స్త్రీ దేవతా మంత్రసిద్ధి అన్నవిషయం తెలుస్తున్నది.

జలతత్వరాశులు సమృద్ధికి సూచన.చంద్రకుజశుక్రులు ఒకరికొకరు కోణస్తితిలో జలతత్వరాశులలో స్తితులై ఉండటం వల్ల ఈయనకు అక్షయసిద్ధి ఉన్నది అన్న విషయం సూచితం. ఈయన సంకల్పిస్తే నలుగురికి వండిన వంట నాలుగొందలమందికి సరిపోయి ఇంకా మిగిలేది. ఇదొక అద్భుతమైన సిద్ధి. గాయత్రీ దివ్యశక్తిలో గల సమృద్ధిబీజాక్షరాలు ఈయనకు సిద్ధించాయి. కారకాంశ నుంచి ద్వాదశాదిపతి రవి అవడము ఆయనకు గల గాయత్రీ సిద్ధిని సూచిస్తున్నది. సింహరాశి మీదగల రాహుశనుల దృష్టివల్ల అందులోని ప్రచండమైన బీజాక్షరాలు కొన్ని ఆయనకు సిద్ధించినట్లు సూచనప్రాయంగా తెలుస్తోంది. అవేమిటో కూడా మనం ఇంకొంత విశ్లేషణతో గ్రహించవచ్చు. కాని దానిని బహిర్గతం చెయ్యటం సబబు కాదు.ఈ సిద్ధివల్లనే  ఎక్కడెక్కడినుంచో తెలియకుండా అనుకున్న సమయానికి ఆయనకు అన్నీ సమకూడేవి.  

ఆత్మకారకుడైన సూర్యునినుంచి చూచినపుడు, పంచమాధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉండటమూ, నవమాదిపతీ యోగకారకుడూ అయిన శని నీచలో రాహువుతో కలసి ద్వాదశస్తితుడై ఉండటమూ ఇదే భావాన్ని బలపరుస్తున్నాయి. కనుక ఈయనకు కొండమంత్రాలూ కోయమంత్రాలూ మొదలైన రహస్యక్షుద్రమంత్రాలు కూడా తెలుసన్న విషయం ద్రువపడుతున్నది. అంతేగాక ఈ క్షుద్రమంత్రాలు తెలిసిన కోయవారిని ఆయన ఎదుర్కొనవలసి వస్తుంది అనికూడా సూచన ఉన్నది. చంద్రలగ్నాత్ షష్ఠమంలో శనిరాహువుల స్తితికూడా ఇదే సూచిస్తున్నది.

ఇవన్నీ ఆయన జీవితంలో జరిగాయి.'మర్లపులి' అన్న క్షుద్రవిద్యను రామయోగి తన జీవితంలో ఎదుర్కొని,దానిని ప్రయోగించిన కోయమంత్రగాళ్లను తన శక్తితో నిర్వీర్యులను చేశాడు. 'మర్లపులి' అనేది పగలు మనిషిలా అడివిలో తిరుగుతూ రాత్రిళ్ళు పులిగా మారి మనుషులను చంపుతూ ఉండే క్షుద్రశక్తి. కోయలలోని కొందరు మహామంత్రగాళ్ళు దీనిని ప్రయోగించడంలో సిద్ధహస్తులు. పంచమంలో కుజుడు శని నక్షత్రంలో ఉండటం,ఆ శని నీచలో రాహువుతో కలసి శత్రుస్థానంలో ఉండటం వల్ల ఇటువంటి క్షుద్రశక్తులతో ఆయన డీల్ చెయ్యవలసి వస్తుంది అని సూచన ఉన్నది.

నవాంశచక్రంలో శని ఉచ్ఛస్త్తితికి వచ్చి ఉన్నాడు. గురువు నీచస్తితిలోకి పోయాడు. జాతకంలో గురువు నీచస్తితిలో ఉన్న గురువులవల్ల లోకానికి ఉపదేశపరంగా ఏమీ మేలు జరగదు. వారివల్ల భౌతికమైన ఇతర ప్రయోజనాలు కలుగుతాయిగాని సాధనాపరంగా వారినుంచి శిష్యులకు ఏమీ దొరకదు. సత్యసాయి జాతకంలో కూడా గురువు నీచస్తితిలో ఉన్న విషయం గమనార్హం. అందుకే ఆయనవల్ల కూడా లోకానికి మేలు జరిగిందిగాని ఆయన సాధనా విధానం ఏమిటి అన్న విషయం గుప్తంగా ఉండిపోయింది. అది పరంపరగా ఉపదేశపూర్వకంగా తర్వాతి తరాలకు అందదు. రామయోగి జాతకంలో కూడా అదే జరిగింది.

రామయోగి వల్ల అనేక వందల కోయగూడేలకు ఎంతో మేలు జరిగింది. ఉత్త మాటలు చెప్పే నేటి నాయకులకంటే ఆయన తన మౌనమైన జీవితంద్వారా, నిస్వార్ధమైన సేవద్వారా ఎన్నో వందల కోయ, చెంచు, గూడేలకు మనం ఊహించలేనంత మేలు చేశాడు. కాని ఆయన సాధన తర్వాతితరాలకు అందలేదు. దానికి కారణం,అర్హతగల తగిన శిష్యులు ఆయనకు లభించకపోవడమే అని నా ఊహ. లోకుల బుద్ధిహీనత వల్ల చాలామంది గురువులకు ఇదే గతి పడుతూ ఉంటుంది. అందుకే ఈ నాగరికలోకంతో విసిగి ఆయన జీవితమంతా పట్నాలవాసన సోకని అడవుల్లో కోయవారితోనే ఉండిపోయాడు.చివరకి అక్కడే మరణించాడు.

పాతకాలంలోని రుష్యాశ్రమాలు అందుకే కొండకోనల్లో ఉండేవి, సిటీల మధ్యలో ఉండేవి కావు. మనుషుల మధ్యన ఉండే పెంపుడుజంతువులకు మనుషులకొచ్చే రోగాలు వచ్చేటట్లే, సమాజం మధ్యలో ఉండే ఆశ్రమవాసులకు కాలక్రమేణా వారికి తెలీకుండానే నిమ్నస్థాయి పోకడలు కలుగుతాయి.అందుకనే అడవుల్లో ఉండే సాధువులకూ సిటీలలో ఉండే సాధువులకూ చాలా తేడా ఉంటుంది. ప్రతి సాధువూ హిమాలయాలకు పోవాలని ఆశించేది కూడా మానవసమూహంలోని స్వార్ధపరత్వాన్ని భరించలేకే. అడవిప్రజలు అమాయకులు. మనంత స్వార్ధం వారికుండదు. అందుకే, కల్లాకపటం ఎరుగని ఆ అడవుల్లోని కోయవారిది 'రుషికులం' అని ఆయనన్నాడు.

'అర్హత గలవారు లభిస్తే మేము మరణం తర్వాతగూడా ఉపదేశించగలం' అన్న ఆయన మాటలు అక్షరసత్యాలు. అవెప్పుడూ నా చెవుల్లో గింగురుమంటూ ఉంటాయి. మానవుల అజ్ఞానాన్ని చూచి అటువంటివారు పడే వేదన దుర్భరంగా ఉంటుంది.కాని వారాశించే స్థాయి శిష్యులు వారికి దొరకరు.'నాదగ్గరకోచ్చిన ఇన్నివేలమందిలో ఒక్కడుగూడా శిష్యుడన్నవాడు నాకు కనిపించలేదు'అని షిర్డీసాయిబాబా కూడా అంటారు.అందుకే చాలామంది సద్గురువులు నిరాశతో మరణిస్తారు.ఇది తప్పదు. ఆధ్యాత్మిక లోకంలో అందుకే ఇద్దరే అదృష్టవంతులు ఉంటారు.సద్గురువు దొరికిన శిష్యుడూ,సచ్చిష్యుడు దొరికిన గురువూ వీరిద్దరే అదృష్టవంతులు.అదలా ఉంచి, రామయోగికున్న అద్భుతమంత్రశక్తుల కోణంలో  ఆయన జనన సమయాన్ని కొంచం పరిశీలిద్దాం.

మధ్యాన్నం ఒంటిగంటన్నర లోపుగనక ఆయన జననం జరిగి ఉంటే, కారకాంశ సింహం అవుతుంది. ఆ తర్వాత అయితే కన్య అవుతుంది. ఇటువంటి జాతకాల్లో జైమినిసూత్రాల సహాయం తీసుకోవాలి. ఒక జాతకంలో ఉండే మంత్రసిద్ధియోగాలను గురించి వివరిస్తూ జైమినిమహర్షి 'శుభేzనుగ్రాహక:' అంటారు. కారకాంశనుంచి పంచమనవమాల మీద శుభగ్రహదృష్టి గనుక ఉంటే ఆ జాతకుడు మంత్రవేత్త అవడమే గాక, తన శక్తులతో లోకానికి ఉపకారం చేస్తాడు. రామయోగి అదే చేశాడు.తన జీవితంలో ఎన్ని వేలమందికి ఆయన నిస్వార్ధంగా ఉపకారం చేశారో లెక్కే లేదు. సింహ కారకాంశ అయితే ఇది జరుగదు. కనుక కన్యా కారకాంశ మాత్రమే సరైనది. అపుడు మాత్రమే, మకరం మీద శుక్రదృష్టీ, వృషభంలోని రవిబుధులమీద పూర్ణచంద్రదృష్టీ ఉంటుంది. కనుక ఆయన కారకాంశ కన్య అనేది నిశ్చితం. అంటే ఆయన పుట్టినది మధ్యాన్నం 1.30 తర్వాత అయి ఉండాలి. అందులో కూడా 2.30 నుంచి 4.30 లోపు అయి ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలోనే తులా లగ్నం నడిచింది. ఈ విధంగా ఇంకా సూక్ష్మ గణనం చేసి ఆయన జనన సమయాన్ని రాబట్టవచ్చు. కాని ప్రస్తుతం అంతటి సూక్ష్మ పరిశీలన అవసరం లేదు. 

'సమే శుభ దృగ్యోగాద్ధర్మ నిత్యసత్యవాదీ గురుభక్తశ్చ' అన్న సూత్రం కూడా కన్యా కారకాంశకే సరిగ్గా సరిపోవడం చూడవచ్చు. పైగా కారకాంశ సింహం అయితే శునకములవల్ల భయం ఉంటుంది.రామయోగి అడవిలోని పులులూ సింహాలతో ఆటలాడుకున్న అమిత ధైర్యవంతుడు.ఆయన చెయ్యెత్తి ఆగమంటే పులి ఆగిపోయేది. ఎవరైనా గూడెం ప్రజలోచ్చి 'అయ్యా! పులొచ్చి మా పశువుల్ని ఎత్తుకుపోతున్నదయ్యా' అని మొరపెట్టుకుంటే ఆ దిక్కుకు చూచి 'ఇకరాదులే పో' అనేవాడు. ఆ గ్రామం చాయలకు మళ్లీ పులి వచ్చేది కాదు.అటువంటి శక్తి సంపన్నుడ్ని శునకములేమి చేయగలవు? కనుక ఆయనది సింహ కారకాంశ కాదు,కన్యాంశ మాత్రమే  అని తెలుస్తున్నది.

పై గణితాన్ని బట్టి ఆయన లగ్నం తులాలగ్నమని తేలింది.కనుక మొదట్లో ఆయన ముఖవర్చస్సును బట్టి మనం ఊహించిన తులాలగ్నం సరియైనదే. అప్పుడు ఆరూఢలగ్నం మకరం అవుతుంది. అక్కణ్ణించి పంచమంలో రవిబుధులు వారిపైన పూర్ణచంద్రుని దృష్టి ఉండటం చూడవచ్చు. దీనినిబట్టి   ఈయన మంత్రసిద్ధి కల్గిన మహానుభావుడని, ఆ శక్తితో లోకానికి నిస్వార్ధమైన మేలు చేసిన యోగియని తెలుస్తున్నది. ఇటువంటి మహానుభావులు ఈనాటికీ మన దేశంలో పుడుతూ ఉండటంవల్లే ఈదేశం పుణ్యభూమి అనిపించుకోగలుగుతున్నదన్నమాట వాస్తవం.


ఇకపోతే, ఆయన 6-3-1970 శివరాత్రి రోజున మహాసమాధి చెందారు. ఆ సమయానికి గురువూ శనీ జననకాల స్థానాలలోకి వచ్చి ఉన్నారు. ఎందుకంటే అప్పటికి  ఆయనకు 60 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఎవరికైనా షష్టిపూర్తికి ఈ గ్రహస్తితి వస్తుంది. అది వింత కాదు. కానీ ఆ సమయానికి గోచార గురువు 12 డిగ్రీల పైకి వచ్చి, జననకాల గురువు పైన సంచరించాడు. జననకాల గురువు కూడా 12 డిగ్రీలమీదే ఉన్నాడన్న విషయం గుర్తిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, మరణ కాలానికి మళ్లీ గురువు వక్రించి ఉన్నాడు. ఖచ్చితంగా జననకాల స్తితిలోకి వచ్చి ఉన్నాడు. ఇదొక నిగూఢ కర్మరహస్యం. ఆయన పొందిన సిద్ధికి ఇదొక సంకేతం.దాని వివరం ఏమిటో నేను బ్లాగుముఖంగా  వివరించదలచుకోలేదు.అది మనకు అప్రస్తుతం కూడా.

అతీతసిద్దులున్న మహర్షులూ, జ్ఞానసంపన్నులైన మహానుభావులూ పురాణాల కట్టుకథలని, కల్పితాలని మనం అనుకుంటాం. అలాంటి వారు అసలు పుడతారా?అనుకుంటాం.వారు పుట్టినది నిజమే.మన మధ్యన తిరిగినదీ నిజమే. వారు వస్తారు వెడతారు. మనం మాత్రం ఇలాగే ఉంటాం. అలాంటివారు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మన దేశంలో ఉంటూనే ఉంటారు. ఇదే మన దేశపు నిజమైన అదృష్టం.