“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

బాబు జగజ్జీవన్ రాం జాతకం - అధికార యోగాలు

బాబూ జగజ్జీవన్ రాం 5-4-1908  తేదీన బీహార్లో జన్మించాడు. పేదరికంలో, నిమ్న కులాలలో పుట్టినప్పటికీ జాతకంలో మంచి యోగాలు ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో ఉన్నతస్థానాలకు తప్పకుండా  ఎదుగుతాడు అన్న విషయం ఈయన జాతకంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మంచి పూర్వకర్మ లేకుంటే ఇటువంటి యోగాలు జాతకంలో ఉండవు. కనుక ఇతనికి మంచి పుణ్యబలం ఉందని అర్ధం చేసుకోవాలి. ఈయనయొక్క జనన సమయం దొరకలేదు. కనుక ముఖ్యమైన గ్రహస్తితులను బట్టి పైపైన చూద్దాం.

ఈయన చైత్రశుక్లపంచమి రోజున, శనివారంనాడు, రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. జనన సమయానికి చంద్రుడు గురువు ఉచ్ఛస్తితిలో ఉన్నారు. వారాదిపతి శని, స్వనక్షత్రంలో ఉండి, ఉచ్ఛగురువుయొక్క క్షేత్రంలో  ఉన్నాడు. రాహుకేతువులు మంచిస్తితిలో ఉన్నారు. ఈ గ్రహస్తితులవల్ల జీవితంలో మంచి అభివృద్ధి తప్పక కలుగుతుంది. అలాగే జరిగింది కూడా.

శుక్లపంచమి చాలా మంచితిధి. తిధినిబట్టి ఒక వ్యక్తి జాతకంలోని రవిచంద్రుల  బలాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. ఇది భారతీయజ్యోతిష్యంలోని ఒక గొప్పసూత్రం. పాశ్చాత్య జ్యోతిష్యంలో ఇటువంటి విధానాలు లేవు. బుధుడు ఉచ్చ గురువుయొక్క నక్షత్రంలో ఉండటం వల్ల,  మంచి విద్య కలిగింది.  ఈ యోగంవల్ల, ఆరోజులలోనే, బెనారెస్ హిందూ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీలలో చదివాడు. ఉచ్ఛగురువు యొక్క దృష్టి శని రవుల మీద ఉంది. ఈ యోగం వల్ల, సామాన్యజనానికి సంబంధించిన ధర్మపోరాటం చేస్తాడనీ, ఆ కోణంలో ఉన్నతస్థానాలకు చేరుకుంటాడనీ, అధికార ప్రాప్తి ఉంటుందనీ అర్ధం అవుతుంది. గురుగోచారంలో మూడవ ఆవృత్తిలో కుజచంద్రశుక్రులను తాకినప్పుడు,36ఏళ్ళకే, నెహ్రూమంత్రిమండలిలో అతిచిన్నవయస్కుడైన మంత్రి అయ్యాడు అంటే గురుచంద్రుల ఉచ్ఛస్తితి ఎంత బలీయంగా పనిచేసిందో చూడవచ్చు. దీనికి తోడు రాహుకేతువుల మంచిస్తితి తోడై 30 సంవత్సరాలపాటు కేబినేట్ మంత్రిగా పనిచేసే అదృష్టాన్ని ఇచ్చింది. ఇది చిన్నాచితకా యోగం కాదు.రాహుకేతువుల మంచి స్తితివల్ల ఈవిధంగా కాలం కలిసివస్తుంది.

రవి శనుల యుతి వల్ల ఆయన అలంకరించిన పదవులన్నీ, లేబర్ , రైల్వే , ఆహారం, వ్యవసాయం,రవాణా ఇత్యాదులయ్యాయి. ఒక మనిషికి వచ్చే పదవులూ,చేసే ఉద్యోగాలూ కూడా జాతకపరంగానే ముందే నిర్ణయింపబడి ఉంటాయి. దానికి భిన్నమైన ఉద్యోగాలూ వృత్తులూ చెయ్యాలని ఆశ ఉన్నా అది వీలుకాదు. ఇది ఎన్నో జాతకాలలో నిరూపితమైంది.

గురువుగారి ఏడో ఆవృత్తిలో కేతువుని తాకినప్పుడు తన  78వ ఏట ఈయన  మరణించాడు. ఒక మనిషి చదివేచదువూ,చేసే వృత్తీ, జీవితంలో ఎదుగుదలా, ముఖ్య సంఘటనలూ, చివరికి మరణం కూడా, ఎలా జరగాలో ముందే నిర్ణయింపబడి ఉంటుంది అని ఎన్నోజాతకాలలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే,జాతకాన్ని సరిగా డీకోడ్ చెయ్యడం రావాలి.

ఒక మనిషి జాతకం బాగుంటే, అతను ఏ కులంలో,ఏ సామాజిక వర్గంలో, ఎంత అట్టడుగు స్థాయిలో పుట్టినప్పటికీ ఉన్నతస్థానాలకు చేరుకోగలడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే అతని కృషి లేకుండా ఉత్తజాతకమే సరిపోతుందా, తలుపులేసుకుని ఇంట్లో కూచుంటే అన్నీ అవేవచ్చి ఒళ్లో పడతాయా అనే అనుమానం చాలామందికి వస్తుంది. ఈ అనుమానం అర్ధరహితం. జ్యోతిష్యాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవడం వల్లే ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. జాతకం బాగా ఉన్నప్పుడు అతనికి ఎదగాలని ఆకాంక్ష, తపన, పట్టుదలలు ఉంటాయి. దానికి తోడు అవకాశాలు కూడా సరైన సమయానికి కలిసి వస్తాయి. తద్వారా త్వరగా ఎదగడం జరుగుతుంది. అంతేగాని ప్రయత్నం లేకుండా ఇంట్లో కూచుంటే అదృష్టం అదే వచ్చి తలుపు తడుతుందని మాత్రం కాదు. అలాంటివారు అలా కూచోలేరు కూడా. దీనికి భిన్నమైన గ్రహస్తితులు ఉన్నప్పుడు జీవితం కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. అలాటి వారికి ఎదగాలని తపన ఉండదు. ఒకవేళ ఉన్నా కాలం కలిసిరాదు.

ఉన్నతస్థానాలకు ఎదిగిన వారి జాతకంలో, అటువంటి ఎదుగుదలను చూపే గ్రహస్తితులు తప్పకుండా ఉంటాయి. బాబూ జగజ్జీవన్ రాం జాతకం కూడా దీనికి నిదర్శనమే.