“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

సినిమా నటులా మనకు ఆదర్శం?

ఈమధ్య ఒక తెలిసినవారి ఇంటికి వెళితే అందరూ టీవీ ముందు కూచుని గుడ్ల ప్పగించి చూస్తున్నారు.ఏం ప్రోగ్రాం వస్తోందా అని చూస్తె,ఒక సినిమా నటుడికి సన్మానం జరుగుతోంది.దానికి ఇంటిల్లిపాదీ పనులు మానుకుని టీవీ ముందు కూచుని పరవశంగా చూస్తున్నారు. వాళ్ళ చీప్ టేస్ట్ ని చూచి నాకు బాధేసింది. అలాటివాళ్ళ ఇంటికి వచ్చినందుకు సిగ్గేసింది. మా ఇంట్లో టీవీని ఒక్కొక్కసారి వారంరోజుల వరకూ ఆన్  చెయ్యటం అంటూ జరుగదు.అందుకని ఆ ప్రోగ్రాం సంగతి నాకు తెలీలేదు.ఆవిషయం అలా ఉంచితే,ముఖానికి రంగేసుకుని వేషాలేసిన నటులను ఏదో చారిత్రిక పురుషులలాగా భావించడం,వాళ్ళను మహనీయులు మహానుభావులు యుగపురుషులు అని సంబోధించే వాళ్ళను,పుస్తకాలు రాసేవాళ్ళను చూస్తె,ఈ అభిమానులు  అసలేం మాట్లాడు తున్నారో వాళ్లకు తెలుస్తోందా? వాళ్ళు స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా లేదా? అని నాకు సందేహం వస్తుంటుంది. నేటి అభిమాన సంఘాలు కులసంఘలేగాని ఇంకేమీ కాదు.కులపిచ్చితో మనుషులు ఎంతలా దిగజారగలరో వీళ్ళు నిరూపిస్తూ ఉంటారు. 

కెమెరా ముందు తైతక్కలాడినంత మాత్రాన సినీనటులు మహనీయులు యుగపురుషులు ఎలా అవుతారో నాకు ఎప్పటికీ అర్ధం కాదు. ఒక  నటుడు వేసిన తాగుబోతు వేషాలవల్ల 1970  లలో ఒక తరమంతా తాగుబోతులుగా మారారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. జీవితంలో ఏ రకమైన ఆదర్శాలూ లేనివారికి సినిమానటుల వేషాలేకదా ఆదర్శం !!! అందులోనూ మన తెలుగువాళ్లకున్న సినిమా పిచ్చి అంతాఇంతా కాదు. హీరో ఏది చేస్తే అది చెయ్యడం గొప్ప అని వీడనుకుంటాడు. కనుక ఆ నటుడు వేసిన తాగుబోతు వేషాలు చూసీ, ఆ గ్లాసు పట్టుకోవడం, సిగిరెట్టు తాగడం, అర్ధనగ్న డాన్సర్లతో ఎగరడం, ఈ చండాలం అంతా చూసి డంగై పోయి, వాటిని అనుకరిస్తూ తాగుడికి తిరుగుడికి జూదానికి అలవాటుపడి తనతోబాటు తన కుటుంబసభ్యుల జీవితాలను కూడా నాశనం చేసినవాళ్ళు 1970 దశకంలో ఎందఱో ఉన్నారు. 

సమాజం ఈ రకంగా దిగజారడానికి కారణం అయిన నటుణ్ణి చూసి వీళ్ళు ఒళ్ళుమరిచిపోయి చప్పట్లు కొట్టడం, కాళ్ళమీద పడి దణ్ణాలు పెట్టడం, మహానుభావుడంటూ పొగడటం  చూచి నాకు నోటమాట రాలేదు. మానవ మనస్తత్వస్థాయి ఇంత  చండాలంగా ఉంటుందా అని నాకు బాధ కలిగింది. ఈ నటులు మానవాళికి ఏమి మేలు చేశారని వీళ్ళకు ఇంత విలువ ఇవ్వాలో నాకెప్పటికీ అర్ధం కాదు. ముఖానికి రంగేసుకుని వేషాలు వేసినంత మాత్రాన వీళ్ళకు ఏమి ఔన్నత్యం వస్తుందో, ఎలా వస్తుందో, వీళ్ళు ఆదర్శ పురుషులు ఏరకంగా అవుతారో నా మట్టి బుర్రకైతే ఎప్పటికీ అర్ధంకాదు.

పాతతరంలో అయితే పురాణగాధలు, మహనీయుల జీవితాలు, త్యాగమయుల చరిత్రలు, ధార్మికుల జీవితాలలోని సంఘటనలు, మహాభక్తులజీవితాల నుంచి, అవతారపురుషుల జీవితాలనుంచి ఉత్తేజపూరిత ఘట్టాలు, కీర్తనలు, శతకాలు, పాటలు, పద్యాలూ చిన్నప్పటినుంచే నేర్పించేవారు. దానివల్ల ఒక బాలునికి గాని బాలికకు గాని  చిన్నవయసులోనే మంచి ధార్మికమైన పునాదులు పడేవి. మాటగాని, చేతగాని, నిక్కచ్చిగా, నిజాయితీగా ఉండేది. జీవితం ధర్మపరంగా గడిపేవారు. ఇతరులకు సాయపడదామన్న తత్త్వం ఉండేది. మాటల్లో అసభ్యపదాలు దొర్లేవి కావు. పెద్దవాళ్ళను గౌరవించడం, పద్దతిగా ఉండటం, మంచీ మర్యాదా ఇత్యాదులు సహజంగా అలవడేవి.

సినిమాలు రాకముందు ఎక్కడచూచినా ఇటువంటి పరిస్తితి ఉండేది.సినిమాలు వచ్చిన తర్వాతకూడా మొదటితరం వరకూ కొంత బాగానే ఉంది. ఆ తర్వాత సినిమాలలో వెర్రిపోకడలు, వెకిలివేషాలు, ద్వంద్వార్ధపు పాటలు,డాన్సులు ఎప్పుడైతే మొదలయ్యాయో సమాజంలో మార్పురావడం మొదలైంది.నేటి సమాజం ఇలా అఘోరించడానికి సినిమారంగానిదే పూర్తిబాధ్యత అని చెప్పచ్చు. డబ్బుకోసం నానా ఛండాలపు సినిమాలు నిర్మించి జనంమీదకు వదిలి సమాజం సర్వనాశనం కావడానికి కారకులైనవారికి లోకం నీరాజనం పట్టడం చూస్తుంటే ఇదేకదా కలిమాయ అనిపిస్తుంది.

తాగుడూ డ్రగ్సూ తార్పుడు బిజినెస్ ఎంత నీచమైనదో, విలువలు లేని సినిమాలు తీసేవారి వృత్తీ అంత నీచమైనదే.కాని ఇంద్రియాలను రేగజేస్తుంది గనుక అది చాల ఆకర్షణీయంగా ఉంటుంది. లాభసాటిగా కూడా ఉంటుంది. అయితే దీనివల్ల సమాజం ఎంతగా నాశనం అవుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎవరెన్ని చెప్పినా సినిమా అనేది ఒక శక్తివంతమైన మాధ్యమం అనీ అదిఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తుంది అనీ అనడం అబద్దం కాదు.

ఇంటర్ చదువుతున్న విద్యార్ధుల ప్రేమకధ అంటూ ఒక పదిహేనేళ్ళక్రితం వచ్చిన ఒక చిత్రమైన సినిమాతో టీనేజి లవ్వులు సమాజంలో విజ్రుమ్భించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా "ప్రేమకి కొందరు-పెళ్ళికి ఒక్కరు" అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉన్నారంటే సినిమాలు టీవీలదే  పూర్తిబాధ్యత. పెళ్ళికిముందు సాధ్యమైనంత ఎక్కువమందితో తిరిగేసి తర్వాత ఎవడో ఒకడితో తాళికట్టించుకోవడం నేటి అమ్మాయిలకు ఫేషన్ అయిపోతున్నది.ఇక అబ్బాయిలకైతే విలువలు అనేవి పూర్తిగా మృగ్యమై పోతున్నాయి.ఇదీ సినిమాల ప్రభావమే. 

నేటిసమాజంలో విద్యార్ధి ని "జీవితంలో నీ ఆదర్శం ఎవరు" అనడిగితే సినిమానటుల పేర్లు చెబుతున్నాడు.అది కూడా తన కులపు హీరోపేరు చెబుతున్నాడు.సినీనటుల అభిమానసంఘాలన్నీ కులసంఘాలే అన్నది నగ్నసత్యం.అంతటి సంకుచితభావాలు నేటియువతకు ఉంటున్నాయి. భారతదేశాన్ని పరిపాలించిన మహనీయులైన ప్రాచీన చక్రవర్తుల పేర్లు కానీ,సంప్రదాయ నిర్మాతలైన మహర్షులపేర్లు కానీ,వారి చరిత్రలు కానీ నేడు ఎవరికీ తెలియవు.కనీసం నవీనకాలపు సంఘసంస్కర్తల పేర్లు, స్వాతంత్ర సమరయోధుల పేర్లు కూడా తెలియవు. నేటితరానికి తెలిసిందల్లా పక్షవాతం వచ్చిన కోతుల్లా ఎగిరే నటులపేర్లు మాత్రమే. నేటి యువతకు ఆదర్శప్రాయులు కూడా వీరే. అంతగా దిగజారిపోయింది ప్రస్తుత సమాజం.

సమాజాన్ని పూర్తిగా సర్వనాశనం చెయ్యడంలో సినిమాలు చక్కని పాత్రను పోషించాయి, ప్రస్తుతం కూడా పోషిస్తూ ఉన్నాయి అన్నది నిజం.సినిమా నటులే మనకు ఆదర్శంగా ఉన్నంతవరకూ మన మేధోస్థాయి ఎదిగే అవకాశం ఎంతమాత్రమూ లేదు అని నేను ఘంటాపధంగా చెప్పగలను. కలిపురుషునిస్థానాలుగా మన పురాణాలు కొన్ని కొన్ని ప్రదేశాలను సూచించాయి.ఆ జాబితాలో సినిమాహాళ్ళు కూడా చేర్చుకోవలసిన అవసరం ఉంది. సినిమానటులను కలిపురుషుల అవతారాలుగా భావించవచ్చు.

సినీనటులను యుగపురుషులుగా,మహానీయులుగా,మహానుభావులుగా  భావించి కీర్తించే స్థాయికి చెందిన మరుగుజ్జు మనస్తత్వాలున్న సమాజం ఔన్నత్యాన్ని పొందగలుగుతుందని ఎప్పటికైనా ఎలా ఆశించగలం?