“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, ఏప్రిల్ 2010, శనివారం

వైద్య జ్యోతిషం- ధాతువులు, గ్రహాలు

ఈ విశ్వం లో భూమి ఏకాకి గ్రహం కాదు. ఈ విశ్వంలో ప్రతి వస్తువూ ఇతర వస్తువులను ప్రభావితం చేస్తుంది. బలీయమైనగ్రహాలూ, నక్షత్ర మండలాలు తమ తమ రేడియేషన్ ద్వారా భూమిని అందలి జీవరాశులనూ ప్రభావితం చేస్తాయి అనిమన జ్యోతిష్య గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే మానవ శరీరం మీద గ్రహ ప్రభావం తప్పకుండా ఉంటుంది అని జ్యోతిష గ్రందాలు చెబుతున్నాయి. అంతే గాక ఇంకొంచం ముందుకు వెళ్లి శరీరం లోని ధాతువుల పైన గ్రహాల ప్రభావం ఉంటుందో కూడా వివరంగా చెప్పాయి. ప్రాచీన ఋషులు అంతటి సూక్ష్మ పరిశీలన చేసి మనకు ఆ పరిజ్ఞానాన్నిఅందించారు. దానిని అంగీకరించటమో తిరస్కరించటమో మన ఇష్టం.

ఆయుర్వేద గ్రందాల ప్రకారం శరీరం లోని ధాతువులు ఏడు. చరక సంహిత (సూత్ర స్థానం) ప్రకారం, ఆయా సప్త ధాతువులేమనగా- రస, రక్త, మాంస,మేద,ఆస్తి,మజ్జ,శుక్రములు.

రసమనగా-జీవ రసము అని అర్థం. నవీన వైద్య శాస్త్రం దీనిని ప్లాస్మా అని పిలుస్తోంది. మాంస మనగా కండ, మేద అనగా కొవ్వు, మజ్జ అనగా మూలుగ అని అర్థములు. మిగిలిన మూడు పదములు,రక్త,అస్తి,శుక్రములు సులభ గ్రాహ్యములే.

ప్రాచీన కాలములో వైద్యులకు జ్యోతిష విజ్ఞానము తప్పని సరిగా ఉండేది. మూలికలను సేకరించాలంటే తిధి, వార, నక్షత్ర, యోగ పరిజ్ఞానం ఉండాలి. మన ఇష్టం వచ్చిన సమయాలలో వాటిని పెకలిస్తే అవి ప్రభావ వంతంగా పని చెయ్యవు. కొన్ని కొన్ని సమయాలలో వాటి పోటేన్సీ అతి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయాలలో సేకరించిన మూలిక నూరు రెట్లు ఎక్కువ బలంగా పనిచేస్తుంది.అంతే గాక దీర్ఘరోగి యొక్క తత్వాన్ని బట్టి అతనికి కొన్ని కొన్ని సమయాలలో ఔషధ ప్రయోగం మొదలు బెడితే అది అమృతోపమానంగా పని చేసి రోగం త్వరగా మాయం అయ్యేది. వాటినే అమృత ఘడియలు అనేవారు. ఆ సమయాలలో గ్రహముల యొక్క అనుకూల తరంగాలు(రేడియేషన్) ఆ మనిషిపైనప్రసరించటం వల్ల ఔషధాలు బలీయంగా పనిచేసేవి. ఆయా సమయాలను కూడా పరిశోధన చేసి నిర్ధారించి వ్రాసి పెట్టారంటే ప్రాచీన కాలం లో ప్రకృతి మీద ఎంతటి రీసెర్చి జరిగిందో మనం ఊహించు కోవచ్చు.

అంతే కాదు. ఔషధ తయారీ సమయంలో వైద్యుడు, శిష్యులు నియమ నిష్టలను పాటిస్తూ మూలిక యొక్క అధిష్టాన దేవత అయిన నక్షత్రము యొక్క సూక్తములను, మంత్రములను జపిస్తూ ఏకాగ్ర చిత్తం తో ఔషధములను నూరేవారు, వండేవారు, కలిపేవారు. కనుక అవి అమృతము వలె పని చేసేవి. ప్రస్తుతం ఫార్మసీలలో అవే మూలికలు వాడినప్పటికీ, అదే ఫార్ములా కలిపినప్పటికీ, అదే ఫలితం రాక పోవటానికి మూలికా సంగ్రహణ విధానం మరియు తయారీలోని లోపములు ముఖ్య కారణాలని చెప్పవచ్చు.

శ్రీ విద్యోపాసకులైన చందోలు శాస్త్రి గారు ఒక మూలికను సంగ్రహిద్దామని దగ్గరలోని కొండకు వెళితే, దానిని పెకలించబోయే ముందుగా, మూడు తలలున్న ఒక బాలుడు ఆయనకు కనబడి దానిని పెకలించకుండా అడ్డుకున్నాడనీ, చివరకు దానిని సంగ్రహించటం ఆయన వల్లగాక, తరువాత ఇంటికి వచ్చి విచారించగా ఆ మూలికకు అధిపతి దత్తాత్రేయుడనీ ఆయనకు తెలిసిందని వారి జీవిత గాధలో ఉన్నది.

విషయాలు అలా ఉంచితే,శరీరం లోని సప్త ధాతువులమీద సప్త గ్రహాల ఆధిపత్యాన్ని గురించి బృహత్ పరాశర హోరా శాస్త్రం విధంగా చెబుతున్నది:

శ్లో|| ఆస్థి రక్త స్తధా మజ్జా త్వక్ మేదో వీర్య మేవచ
స్నాయు రేతే ధాతవశ్యు: సూర్యాదీనాం క్రమాద్ద్విజ ||

(చూ: బృహత్ పరాశర హోరా శాస్త్రం-మూడవ అధ్యాయం- 32 శ్లోకం)


ఎముకలు: సూర్యుని అధీనంలో ఉన్నవి
రక్తం: చంద్రుని అధీనంలో ఉన్నది.
మజ్జ: కుజుని అధీనంలో ఉన్నది.
చర్మము: బుధుని అధీనం లో ఉన్నది.
కొవ్వు: గురుని అధీనం లో ఉన్నది.
శుక్రం: శుక్రుని అధీనం లో ఉన్నది.
కండరాలు: శని అధీనం లో ఉన్నది.

కాయ కష్టం చేసి కండరాలు ఎక్కువగా వాడేవారు, కండర శక్తితో జీవనాన్ని గడిపెవారి జాతకాలలో శని ముఖ్య పాత్రవహించటాన్ని గమనించ వచ్చు. అలాగే, శుక్ర గ్రహ దోషాలు ఉన్నవారి కి సంతాన సమస్యలు, సెక్స్ పరమైన సమస్యలుకలగటం కూడా గమనించ వచ్చు. రక్త పరమైన దోషాలు రోగాలు వచ్చే వారి జాతకాలలో చంద్రుని చెడు యోగాలనుగమనించ వచ్చు. చర్మ రోగాలు వస్తున్న వారి జాతకంలో బుధుని పాత్రా, ఊబకాయులలో గురు గ్రహం యొక్క చెడుయోగాలు స్పష్టం గా కనిపిస్తాయి. ఇక ఎముకలు, కళ్ళు, హృదయ సంబంధ రోగాలలో సూర్యుని పాత్ర ను చాలా చక్కగాగమనించ వచ్చు. పొతే, జెనెటిక్ డిసార్డర్స్ అనబడే జన్యు దోషాలలో కుజ గ్రహం యొక్క పాత్ర జాతకంలో స్ఫుటం గా కనిపిస్తుంది. రాహు కేతువులవల్ల,డయాగ్నసిస్ కు, ట్రీట్ మెంట్ కు, లొంగక ముప్పు తిప్పలు పెట్టె విచిత్ర మొండి రోగాలు సూచింప బడతాయి.

గ్రహాలపరస్పర యోగాలవల్ల (అనగా పెర్ముటేషన్స్ మరియు కాంబినేషన్స్ వల్ల) అసంఖ్యాకములైన రుగ్మతలు అన్నీజాతకంలో దర్శనం ఇస్తాయి. అంతేగాక తరతరాలుగా చాలా కుటుంబాలలో వారసత్వం గా వస్తున్న రోగాలను సూచించేగ్రహ యోగాలు చక్కగా దర్శనం ఇస్తున్నాయి. తాత/నాయనమ్మ/అమ్మమ్మ, తండ్రి/తల్లి, కొడుకు/కూతురుజాతకాలు- అనగా- మూడు తరాల జాతకాలను తులనాత్మక పరిశీలన చేస్తే వంశ పారంపర్య రోగాల వివరాలు అద్దంలో చూచినట్లు కనిపిస్తాయి. గుంటూరుకు చెందిన ప్రఖ్యాత జ్యోతిష్కులు బీ. జే. రావుగారు (బుద్ధవరపు జగన్నాధ రావుగారు) ఈ వంశ పారంపర్య గ్రహ దోషాల పైన రీసెర్చి చెయ్యమని నాకు సలహా చెప్పారు. (ఆయన ప్రస్తుతం లేరు. రెండు ఏళ్ల క్రితం గతించారు). ఆయనతో నా చర్చలను, అనుభవాలను ముందు ముందు వ్రాస్తాను.


జాతకం లోని ఆయా దశలను,చెడు సమయాలను ముందుగానే గుర్తించటం ద్వారా, జాగ్రత్తలు తీసుకొని, సరియైన ఔషధాలు వాడుకొని, ఆహార విహారాదులలో సంయమనం పాటించి, ఆరోగ్యాన్ని చేజారి పోకుండా కాపాడు కోవచ్చు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్త పడటం మేలు కదా. యమ రాజు సోదరులైన నేటి ఆధునిక వైద్యుల, విలువలు లేని, మోసపూరిత వైద్యాల బారిన పడి, బాంక్ బేలన్స్ నిల్ చేసుకొని, రోగం తగ్గక బాధపడటం కంటే ముందుగా రాబోయే రోగాన్ని తెలుసుకొని నివారించుకోవటం ఉత్తమం కదూ? మెడికల్ఆస్ట్రాలజీ అనబడే వైద్య జ్యోతిషం యొక్క అద్భుతమైన ప్రాక్టికల్ కేస్ స్టడీస్ -- నా కేస్ ఫైల్స్ నుంచి-- ముందు ముందు చూద్దామా?