“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

30, ఏప్రిల్ 2010, శుక్రవారం

మంత్రాలయ మఠం- రేణుకాదేవి ఆగ్రహం


నిన్న సాయంత్రం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నాను. మఠమూ, ఊరూ మునిగిపోయిన తర్వాత ఇదే నేను మంత్రాలయం దర్శించడం. ఊరికి చాలా ముందుగానే దారిపొడుగునా చెట్లకు ఎండుగడ్డి వేలాడుతూ కనిపించింది. అంటే వరదకు కొట్టుకొచ్చిన గడ్డి చెట్లకు పట్టుకుని వరద తీసిన తర్వాత అలా వేలాడుతూ ఉండిపోయిందన్నమాట. నీరు మేటవేసిన మేరకు గీత గీసినట్లు, ఊరిలో కూడా చాలా ఇళ్ళకు గుర్తులు ఉండిపోయాయి.

దర్శనం అంతా బాగానే జరిగింది. గురువారం అయినా భక్తులు పెద్దగా లేరు. బుధవారం రాత్రికి కర్ణాటక భక్తులు వచ్చి చేరుకుంటారు. గురువారం తెల్లవారుఝామున దర్శనం చేసుకుని మధ్యాహ్నానికి వెనక్కు బయలు దేరి వెళతారు. ఊరు పూర్తిగా ధ్వంసం అయింది. గ్రౌండ్ ఫ్లోర్ వరకూ అన్ని ఇళ్ళూ, షాపులూ మునిగి పోయాయి. ఒండ్రు మట్టిలో ఊరు మేట వేసింది. ఒండ్రుమట్టి ఎండకు ఎండుతున్నపుడు భయంకరమైన దుర్వాసన ఊరంతా వ్యాపించిందని చెప్పారు. ఇప్పుడిప్పుడే తిరిగి షాపులూ, వ్యాపారమూ అవీ తిరిగి పుంజుకుంటున్నాయి.

ఆలయం కూడా సన్ షేడ్ లెవెల్ వరకూ మునిగింది. ఆలయం నిండా పాములు, తేళ్ళు, ఇతర కీటకాలు కుప్పలుగా కొట్టుకొచ్చాయిట. ఎన్ని రకాల పాములనో చూచామని ఆలయ పూజారులు చెప్పారు. పాము కాట్లకు కూడా కొందరు మరణించారట. మేటవేసిన ఒండ్రు మట్టిలో యాసిడ్ లక్షణాలుండి, క్లీన్ చేసిన పనివాళ్ళ కాలి వేళ్ళను చేతివేళ్ళను తినేశాయిట. మొత్తం ఆలయం శుభ్రం చెయ్యటానికి దాదాపు నెలరోజులపైగా పట్టిందిట.

తుంగభద్రానది విశ్వరూపం దాల్చి ఇంత విధ్వంసం సృష్టించడానికి కారణాలు ఏవై ఉంటాయా అని నేను రకరకాలైన కోణాల్లో ఆలోచించాను. జ్యోతిష్య పరంగా కొంత పరిశోధన కూడా చేశాను. కారణాలు అలా ఉంచితే, నిన్న నాకు ఒక విచిత్రమైన విషయం తెలిసింది. ఆలయ ప్రముఖుడొకరు విషయాన్ని నా చెవిన వేశారు.

మంత్రాలయ మఠం పక్కనే గ్రామదేవత మంచాలమ్మ ఆలయం ఉంటుంది. సందర్శకులు ముందుగా మంచాలమ్మను పూజించి తరువాత రాఘవేంద్ర స్వామిని దర్శిస్తారు. అసలీ గ్రామం పేరు మంచాల. గ్రామ దేవత మంచాలమ్మ. అంటే రేణుకాదేవి. చాలా చోట్ల ఉండే విగ్రహం లాగానే, ఒక దేవీ మూర్తి శిరస్సు మాత్రం మంటలతో ఆవరింపబడిన కిరీటం తో కూడి ఉంటుంది. ఈమె చాలా ఉగ్ర మూర్తి అని అంటారు. భారత దేశం మొత్తం మీద ఎక్కడైనా సరే, గ్రామదేవతగా పూజించబడుతున్నది రేణుకాదేవి మాత్రమే అని కొందరి భావన. ఈమెను దుర్గాదేవిగా, కాళిగా కూడా కొందరు పూజిస్తారు. ఉత్తర భారతంలో జ్వాలాముఖి అనే పేరుతో అర్చింపబడుతుంది. ఎక్కడైనా సరే, ఒక ముఖం మాత్రమే ఉన్న దేవీ విగ్రహం ఉంటే, అది రేణుకాదేవి విగ్రహమే అని నేను నమ్ముతాను.

రేణుక పరశురామ జనని. ఒక అవతార మూర్తి జనని మామూలు మనిషి అయి ఉండే అవకాశం లేదు. అందులోనూ పరశురామావతారం ఉగ్రమైనది. మహత్తరమైన వీరవిద్యలకు ఆద్యుడు పరశురాముడు. పరశురాముడు ఖండించిన శిరస్సు రూపంలో రేణుకాదేవి నేటికీ అలాగే పూజలందుకుంటూ ఉన్నది. దశమహావిద్యలలో- తన తలను తానే ఖండించుకునే రూపంలో దర్శనం ఇచ్చే, ఛిన్నమస్త ఈమే అని గణపతి ముని (నాయన) అంటారు. యోగమార్గంలో సిద్ధిదాత్రి అయిన కుండలిని శక్తి, రేణుకాదేవి ఒక్కరే అని తాంత్రికులు యోగులు చెబుతారు. రేణువుల రూపంలో భూమిని చేరుతున్న విశ్వ శక్తియే (Cosmic Energy) రేణుక అని యోగుల భావన.

రేణుకాదేవి ఆలయం ఎందువల్లనో ఒక ఏడాది క్రితం నుంచీ నిర్లక్ష్యానికి గురై, సరిగా పట్టించుకోబడకుండా పోయిందనీ, పాత ఆలయం స్థానంలో కొత్తగా ఒక ఆలయం కడుతూ, పాత విగ్రహాన్ని కదిలించి పక్కన ఉంచి, సరియైన పూజాపునస్కారాలు లేకుండా ఏడాది నుంచీ ఉంచారనీ అందువల్లనే ఆమె తన ఉగ్ర రూపాన్ని చూపిందని, అందువల్లనే తుంగభద్ర పొంగి ఆలయాన్ని ముంచిందనీ ఆయన చెప్పాడు. మరి ప్రస్తుతం ఏం చేస్తున్నారు అని అడిగాను. కారణం తెలుసుకున్న తరువాత ఇప్పుడు జాగ్రత్తగా పూజలు చేస్తున్నామని ఆయన చెప్పాడు.

ఎందరి సమస్యలనో తీరుస్తున్న రాఘవేంద్రస్వామి, తన ఆలయం మునిగిపోతుంటే ఎందుకని ఊరుకున్నారు? అని మా అమ్మాయి అడిగింది. నేను సమాధానం చెప్పలేదు. అది నాకూ తెలియదు. ఏది ఊహించినా అది మన ఊహ మాత్రమే. ఊహ కొంత నిజం కావచ్చు. కొంత కాకపోవచ్చు. అసలు కారణాలు మనకేం తెలుసు? అందుకే నేను ఏమీ చెప్పలేదు. కాని "మునిగిపోవటం కూడా ఆయన సంకల్పమే కావచ్చు" అని ఒక్కమాట మాత్రం చెప్పాను. "అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే, మరి అశుద్ధమో?" అన్న జిల్లెళ్ళమూడి అమ్మగారి మాట నాకు హఠాత్తుగా గుర్తొచ్చింది. "మంచి జరగడం మాత్రమే దేవుని కరుణ కాదు, చెడు కూడా వాడి కరుణే " అని ఆమె ఎప్పుడూ అనేవారు.

ఒకసారి దక్షిణేశ్వర్ కాళికాలయంలో దొంగలు పడి శ్రీకృష్ణుని నగలు దోచుకుని పోతారు. అప్పుడు రాణి రాసమణి అల్లుడైన మధురానాధ్ కోపంతో " నీ నగలు కాపాడుకోలేని నువ్వేం దేవుడివి" అని అంటాడు. అది విని శ్రీరామకృష్ణులు ఆతన్ని బాగా చీవాట్లు పెడతారు. " నీ దృష్టిలో నగలు గొప్పవి
కావచ్చు. కాని భగవంతుని దృష్టిలో అవి మట్టితో సమానం. సర్వ సంపదలకూ మూలం అయిన మహా లక్ష్మి ఆయన పాదాల వద్ద ఉంటుంది. అది గ్రహించి మాట్లాడితే మంచిది" అని ఆయన మధురానాధ్ కి సలహా ఇస్తారు. ఘటన నాకు గుర్తోచ్చింది.

పైగా ఇటువంటి ఘటనలకు చాలా సూక్ష్మ కారణాలుంటాయి. యాత్రా స్థలాలు క్రమేణ
పవిత్రతను కోల్పోవటం, రాజకీయ జోక్యాలు మితిమీరటం, విలాసాలు విందులు ఎక్కువ కావటం, నిర్వహణాధికారులలో నిర్లక్ష్యం, అవినీతి, ఊరిలో కూడా అపవిత్రత పెరగటం వంటి అనేక కారణాలుంటాయి. మన ఇల్లు కంపు కొడుతుంటే మనం ఏం చేస్తాం? నీళ్ళతో శుభ్రంగా కడుక్కుంటాం. అలాగే ఊరు ఊరంతా ఒక్క సారి కడగబడినట్లుగా అలా జరిగింది.

ఈ సారి నేను గమనించిన ఇంకో విచిత్రం. రాఘవేంద్ర స్వామి సమాధి పక్కనే ఇంకొక స్వామి సమాధి ఉంటుంది. మేము వెళ్ళేసరికి అక్కడ ఉన్న అర్చక స్వామి రుద్ర పారాయణ చేస్తున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. మధ్వ సాంప్రదాయులు శివ స్మరణ అస్సలు చెయ్యరు. శివ స్తోత్రాలు పఠించరు. అలాటిది ఆయన పెద్ద గొంతుతో రుద్రపారాయణ చెయ్యటం నాకు చాలా వింతగొలిపింది.

ఏది ఎమైనా, ఈ వరదల తర్వాత, అక్కడ ప్రజలలో కొంత భయ భక్తులు మళ్ళీ కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఉన్న పొగరు, నిర్లక్ష్యం, మితిమీరిన విచ్చలవిడి తనం తగ్గాయి. ప్రకృతి వైపరీత్యాలు జరగడం వల్ల మానవులలో నీతి నియమాలు పెరిగితే బహుశా వైపరీత్యాల ఉద్దేశ్యం చాలావరకు నెరవేరినట్లేనేమో? పర్యావరణ సమతుల్యం మాత్రమే గాక, మానసిక నైతిక సమతుల్యం కూడా తద్వారా సాధింపబడితే ప్రకృతి యొక్క ప్రయోజనం ఫలించినట్లేనా? ప్రకృతికి వర్తించే ఈ సూత్రం మనిషి జీవితానికి కూడా వర్తిస్తుందా? అదే నిజమైతే, మనిషి జీవితంలో చెడు సంఘటనలు జరిగితే, అవి అతన్ని ప్రక్షాళన చెయ్యడానికి భగవంతునిచే / ప్రకృతిచే జరపబడుతున్న కార్యక్రమంగా అనుకోవచ్చా?

కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు మరి.