“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, ఏప్రిల్ 2010, బుధవారం

అపర ధన్వంతరి - శామ్యూల్ హన్నేమన్


తర తరమ్ముల నంటి తరుము వ్యాధుల
మూల మెరుగంగ తపియించే నే తపస్వి
సారూప్య సిద్ధాంత సంస్థాప నార్ధమ్ము
త్యాగాగ్ని దూకేనే ధర్మ యోద్ధ
ఆత్మ శోదిత పదార్దానుభూత
జ్ఞాన సంపద నిచ్చెనే శాస్త్ర వేత్త

హోమియో వైద్య విధాన సృష్టికర్త అయిన డా || హానెమాన్ గారి పైన పొన్నూరు వాస్తవ్యులు డా|| పీ. వీ గోపాల రావుగారు వ్రాశిన పద్యం ఇలా సాగుతుంది. మొన్న పదవ తేది డా|| శామ్యూఎల్ హాన్నేమాన్ గారి జన్మ దినం. సందర్భంగా మహనీయుని తలచుకోవటం ఒక హోమియో వైద్యునిగా, హానెమాన్ అభిమానిగా నా కర్తవ్యం కూడా.

ఒక ఆలోచన


వ్యక్తిగతంగా నా కొక ఆలోచన ఉన్నది. ప్రాచీన కాలంలో మన దేశంలో ప్రతి సబ్జెక్ట్ లోనూ విపరీతమైన రీసెర్చి జరిగింది. అయితే అదంతా కాలగర్భంలో కలిసిపోయింది. తిరిగి దాన్ని ఉద్దరించాలంటే గడచిన తరాలలో మన దేశంలో అనువైన పరిస్తితులు లేవు. అందుకని ఆయా శాస్త్రవేత్తలు, రుషులు యూరోపియన్ దేశాలలో పుట్టి ఆయా విజ్ఞానాన్ని పునరుద్ధరించారని నా అభిప్రాయం. హోమియో వైద్యం కూడా అటువంటి అద్భుత విజ్ఞానమే గనుక డా|| హాన్నెమాన్ ఒక భారతీయ ఋషిపుంగవుడే అని, ప్రాచీన ఆయుర్వేద ఋషియో విధంగా జెర్మనీలో పుట్టి ఉంటాడనీ నా నమ్మకం. హోమియో వైద్యానికి మన వేదాంతానికీ ఉన్న సంబంధమూ, వైద్యాన్ని మన దేశం గొప్పగా ఆదరించి వెంటనే అక్కున చేర్చుకోవడమూ, శ్రీ రామకృష్ణుడు, జిల్లెళ్ళమూడి అమ్మగారు వంటి మహనీయులు విధానాన్ని వాడటమూ మెచ్చుకోవడమూ, కూడా నమ్మకానికి ఆధారాలు.

హోమియో శాస్త్రానికి- యోగ సంబంధం

యోగం మానవుణ్ణి దేవునిగా చెయ్యగలదు. యాత్రా క్రమంలో మానవుని తరతరాల కర్మను ప్రక్షాళన చేసే శక్తి యోగానికి ఉన్నది. ప్రక్షాళన ఎలా జరుగుతుంది అనే విషయం ప్రస్తుతం అవుసరం లేదు గనుక దాని జోలికి పోను. హోమియో వైద్య విధానంలో కూడా కర్మ ప్రక్షాళన జరుగుతుంది. ముఖ్యంగా హయ్యర్ పొటెన్సీలు వాడినప్పుడు మానవుని శరీరంలోని అంతర్గత కల్మషాలు బయటపడి ప్రక్షాళన కాబడతాయి. ఉన్నత పొటెన్సీలు వాడినప్పుడు కర్మ ప్రక్షాళన జరుగుతుంది అని డా|| రుడాల్ఫ్ స్టీనర్ మొదలైన వారుకూడా నమ్మేవారు. క్రమంలో మానవునికి రోగం తగ్గటమే గాక, అతని మానసిక, ప్రాణిక స్థాయిలలో గొప్ప వైన మార్పులు కలుగుతాయి. అతని అలవాట్లు మారుతాయి. తరతరాలనుంచి వెంటాడుతున్న రోగాలు,అలవాట్లు,దోషాలు పోతాయి. ఇదంతా నెను కళ్ళారా చూచాను కనుక అధికారికంగా వ్రాయగలుగుతున్నాను.

యోగసాధనలో కూడా ఇదంతా జరుగుతుంది. కుండలినీ యోగాన్ని సాధించిన వ్యక్తి శరీరంలొ గొప్ప మార్పులు కలుగుతాయి. అతని జీన్ లెవెల్ లొ అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. తరతరాల నుండి వస్తున్న జన్యు దోషాలు, అలవాట్లు విసర్జింపబడతాయి. శరీరంలోనే గ్రహ పరమైన రెమెడీలు జరుగుతాయి. తద్వారా జాతకంలో ఉన్న చెడు యోగాలు సరిచేయబడతాయి. దోషాలు నివారణ అవుతాయి. ఇదంతా నిజంగానే జరుగుతుంది. నేను తమాషాకి వ్రాయడం లేదు. ఎవరికి వారు స్వానుభవంలో పరిశీలించి తెలుసుకోవచ్చు.

అయితే, యోగానికి, హొమియో వైద్యవిధానానికి కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. యోగంలో ఉన్నత స్తరాలు చేరటం కష్ట సాధ్యం. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. దానితో పోలిస్తే హోమియోలో ఉన్నత పొటెన్సీ వాడకం సులువు. మరియు అందరికీ అందుబాటులో ఉంటుంది. కాని ఇక్కడకూడా, రోగం పూర్తిగా శరీరంలోనుంచి బయటకు ప్రక్షాళన అయ్యేవరకూ వేచి చూడగలిగే వారు చాలా అరుదుగా ఉంటారు. కర్మ మనిషిని వేచి చూడనివ్వదు. ట్రీట్ మెంట్ మధ్యలో ఆపి వేరే వైద్య విధానాలకు మారటం చాలా సార్లు చేయిస్తుంది.

ఇదంతా కర్మ ఫలితం.
అనుభవించవలసిన బలీయ మైన కర్మ ఉన్నపుడు హోమియో లో తత్వ పరమైన చికిత్స (కాన్ స్టిట్యూషనల్ ట్రీట్ మెంట్ ను) తీసుకోనివ్వదు. అనేక కారణాలు చెప్పి రోగి చికిత్సను మధ్యలోనె ఆపివెయ్యటం జరుగుతుంది. లేదా అనెక అవాంతరాలు ఎదురై చికిత్స మధ్యలో ఆపడం జరుగుతుంది. ఇతర మందులు వాడడం, లేదా సర్జరీలు చేయించుకోవడం జరుగుతుంది. విచిత్రాన్ని కూడా చాలా సార్లు గమనించాను.

ఇతర వైద్య విధానాలు

ఇతర వైద్య విధానాలకు హోమియో విధానానికి ఉన్న ముఖ్యమైన భేదం ఏమనగా- హోమియోలో రోగి లోపలనుంచి బయటకు రోగం నెట్టివేయబడుతుంది. అందుకే రోగం తగ్గినతరువాత అతనికి చాలా హాయిగా తేలికగా ఉంటుంది. ఏదో పెద్ద బరువు ఒంటిలో నుంచి మాయం అయ్యినట్లు గా ఉంటుంది. మానసిక స్థాయిలో ప్రాణిక స్థాయిలో చాలా హాయిగా అనిపిస్తుంది.

ఇతర విధానాలలో అయితే -- రోగం బయటనుంచి లోపలకు అణగగోట్ట బడుతుంది. చూడటానికి రోగం తగ్గినట్లే కనిపిస్తుంది. రోగ లక్షణాలు మాయం అవవచ్చు. కాని రోగం శరీరంలోనుంచి బయటకు పోదు. అందుకే రోగ లక్షణాలు తగ్గినట్లు అనిపించినా, రోగికి హాయిగా ఉండదు. విపరీతమైన నీరసంగా ఉంటుంది. రోగం ఒక అవయవం నుంచి ఇంకొక అవయవం మీదకు నెట్టబడుతుంది. మానసికంగా చిరచిర, చికాకు, విసుగు, బీపీ ఎక్కువ అవుతాయి.

ఉదాహరణకు-నూటికి తొంభై కేసులలో- అణచబడిన ఇతర రోగాలవల్లే డయాబెటీస్ అనబడే షుగర్ వ్యాధి కలుగుతుంది. ఇది నా అనుభవంలో చాలా సార్లు గమనించాను. బహుశా శరీరంలోని గుండె, మెదడు,కిడ్నీలు మొదలైన ఇతర అంతర్గత అవయవాలతో పోలిస్తే పాంక్రియాస్ అంత ముఖ్యమైనది కాదు అని అనిపిస్తుంది. కనుక వ్యాధి అణచివేత అనివార్యం అయినప్పుడు, తత్వ పరమైన లోతైన చికిత్స జరుగకుండా బలీయమైన పూర్వకర్మ ఆడ్డుపడుతున్నపుడు ,శరీరం తన లోని
ఏదొ ఒక అంత ముఖ్యం కాని అవయవాన్ని త్యాగం చేసి మిగతా సిస్టం ను కాపాడుకుంటుంది. క్రమంలో భాగంగా, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో అంత ముఖ్యం కాని పాంక్రియాస్ ను రోగానికి అప్పజెప్పి మిగతా ప్రాణాధార అవయవాలను శరీరం కాపాడుతుంది.

అందువల్లనే నేటి సమాజంలో డయాబెటీస్ అంత ఎక్కువగా ఉన్నది. దీనికి కారణం బ్రాడ్ స్పెక్ట్రమ్ ఏంటీ బయోటిక్స్ వాడకం వల్ల జరుగుతున్న రోగ అణచివేత మాత్రమే అని నా అభిప్రాయం. శరీర శ్రమ లేక పోవడం ఒక్కటే షుగరు వ్యాధికి పూర్తి కారణం కాదు అని నేను నమ్ముతాను. ఇది నా పరిశీలనలో తేలిన నిజం.

శుద్ధ ఆయుర్వేదం

ఆయుర్వేదాన్ని శుద్ధంగా ఆచరించగలిగితే, అది కూడా చాలా ప్రభావ వంతంగా పనిచెయ్యగలదు. కాని అలా చెయ్యగల వైద్యులు నేడు చాలా అరుదుగా ఉన్నారు. ఆయుర్వేదంలో ఎమ్. డీ చేసిన అనేక మంది వైద్యులు కనీసం రోగి యొక్క నాడి పరిశీలన చెయ్యకుండా అతని శరీర తత్వం ఏమిటో తెలుసుకోకుండా
మందులివ్వటం నాకు తెలుసు.

ఔషధాన్ని సొంతంగా తయారు చేసి ఇవ్వగల ఆయుర్వేద వైద్యులు కూడా నేడు చాలా అరుదుగా ఉన్నారు. చాలా మందికి మూలికా సంగ్రహణ విధానాలు తెలియవు. జ్యోతిర్విజ్ఞానం చాలామందికి బొత్తిగా
లేదు.ఆయుర్వేద కంపెనీలు తయారు చేసిన మందులు వాడిస్తూ రోగులతో ఆటలాడటంలో ఇంగ్లీషువైద్యులతో వారు పోటీపడుతున్నారు.మరి వారు అనుసరిస్తున్న విధానం ఆయుర్వేద వైద్యం అంటారో ఇంకేమంటారో వారికే ఎరుక.

ఎవరో చెప్పినట్లు, డాక్టర్ అవటం చాలాతేలిక. ఎందుకంటే రోగం ఏమిటో రోగి చెబుతాడు. దానికి మందేమిటో మెడికల్ రిప్రజెంటేటివ్ చెబుతాడు. మేచింగ్ చెయ్యటమేగా డాక్టర్ పని అని అన్నాడట ఒకాయన. విషయం అలా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు, ఆయుర్వేదాన్ని శుద్దంగా ఆచరిస్తున్న వైద్యులు నేడు లేరు అని చెప్పవచ్చు.

మరి హోమియో వైద్యం మాటేమిటి?

హోమియో మాత్రలిచ్చిన ప్రతి వైద్యుడూ హోమియో వైద్యం చేస్తున్నట్లు కానే కాదు. డా|| హానెమన్ ప్రతిపాదించిన సూత్రాలకనుగుణంగా వైద్యాన్ని చేసినవాడే హోమియో వైద్యం చేస్తున్నట్లు లెక్క. చాలామంది అనేక మందులు ఒకేసారి కలిపి ఇస్తుంటారు. ఇంకొందరు హోమియో ఔషధాలతో పాటు, ద్వాదశ లవణాలు ఇస్తారు. ఇంకొందరు ఇంగ్లీషు మందులు హోమియో మందులూ ఒకేసారి ఇస్తారు. ఇంకొందరు పది మాత్రలు వేసుకున్నా, ఒక మాత్ర వేసుకున్నా ఒకటే-చేతికి ఎన్ని మాత్రలోస్తే అన్ని వేసుకోవచ్చు అంటారు. ఇవన్నీ తప్పులే. రకమైన వైద్యం హానెమాన్ ప్రతిపాదించిన హోమియో వైద్యం కాదు. అందుకే అటువంటి వైద్యంతో అద్భుత మైన ఫలితాలు కనిపించవు. నిజమైన హోమియో వైద్యం చేస్తున్న వైద్యులు కూడా నేడు చాలా అరుదుగా ఉన్నారు.

కుహనా గురువుల దగ్గర నిజమైన యోగ శాస్త్రం దొరకనట్లే, కుహనా వైద్యుల దగ్గర కూడా
నిజమైన వైద్యం దొరకదు. ఇక్కడ కుహనా వైద్యులు అంటే నా అభిప్రాయం-డిగ్రీలు లేని క్వాక్ లు అని కాదు. డిగ్రీలు ఉండికూడా అసలైన వైద్య సిద్ధాంతాలను అనుసరించని వారు అందరూ కుహనా వైద్యులే అని నా అభిప్రాయం. ఈనాడు హోమియో వైద్యంలో ఎమ్. డీ లు చాలామంది చేస్తున్నది హోమియో వైద్యం కాదు. వ్యాపార వైద్యం మాత్రమే. హోమియో వైద్యాన్ని పదేళ్ళపాటు పరిశోధించి నేను తెలుసుకున్న నిజం ఇది. విచిత్ర మేమిటంటే చాలామంది రోగులు కూడా కుహనా వైద్యులను నమ్మినట్లు శుద్దంగా వైద్య విధానాన్ని అనుసరించే వైద్యుల మాట నమ్మరు.

ఉన్నత మైన ఆశయాలతో, ఆలోచనలతో ఒక వినూత్న వైద్య విధానాన్ని ఆవిష్కరించిన హానెమాన్ ఆత్మ నేడు తన పేరిట జరుగుతున్న మోసపూరిత వైద్యాన్ని గమనించి ఎంతగా క్షోభిస్తున్నదో తలుచుకుంటే బాధ కలుగుతుంది. హోమియో షాపులు కూడా పచారీ కొట్ల వలె కనిపిస్తూ కంపెనీ ప్రాడక్టులతో షెల్ఫులు నిండి, హోమియో టూత్ పేష్టులు, హోమియో సబ్బులు, హోమియో హెయిర్ ఆయిల్సు, హోమియో వక్కపొడి..... ఇదంతా చూస్తుంటే కొంతకాలానికి హో్మియో కాఫీపొడి, హోమియో టీ పొడి కూడా అమ్ముతారేమో షాపులలో అని నవ్వొస్తుంది.

సత్యాన్ని గ్రహించి అనుసరించే సున్నితత్వాన్నిప్రపంచం కోల్పోతున్నదా?

ఏదేమైనప్పటికీ, ప్రపంచం డా|| హానెమాన్ కు ఇవ్వవలసిన విలువను ఇవ్వలేకపోయింది. కనీసం నేటికీ ఆయన సిధ్ధాంతాలను సరిగ్గ అర్ధం చేసుకోలేక పోయింది అని గట్టిగా చెప్పవచ్చు. బహుశా అందరు మహనీయులకు స్వార్ధపూరిత ప్రపంచం లో ఇదే గతి పట్టక తప్పదేమో? ఎవరేమి ఆవిష్కరించినా మానవ జాతికి తెలిసింది మాత్రం వ్యాపారం ఒక్కటేనేమో? ఏదో రకంగా డబ్బుని విపరీతంగా సంపాదించడమే జీవిత గమ్యం అని తలుస్తున్న నేటి ఆలోచనా ధోరణి మారనంత వరకూ ఎంతమంది హానెమాన్ లు వచ్చినా ప్రపంచానికి కొత్త వ్యాపార దారులు తెరవడం తప్ప ఉపయోగం పెద్దగా లేదు.

ఎన్ని
కొత్త యోగ విధానాలు వచ్చినా అవి చివరకు వ్యాపారంగా మారటం ఒక్కటే మనకు కనిపిస్తున్న నిజం. కర్మ క్షాళన అనేది పూర్తిగా వ్యక్తిగతమైన వ్యవహారం. అంతే గాని మొత్తం సమాజం అంతటికీ దీన్ని వర్తింపచెయ్యటం అసాధ్యం అనీ, కుదరని పని అనీ, ప్రకృతి ప్రణాలికకు ఇది పూర్తిగా విరుద్దం అనీ నా నమ్మకం. హోమియో లో తత్వ పరమైన లోతైన చికిత్స తీసుకోగలగాలంటే అతనికి కర్మ తీరే సమయం దగ్గర పడాలి. జాతకంలో మంచి దశలు రావాలి అప్పుడే అది సాధ్యపడుతుంది లేకుంటే సాధ్యం కాదు అని నా అనుభవం చెబుతోంది.