“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

6, ఏప్రిల్ 2010, మంగళవారం

జెన్ కథలు-పుచ్చకాయా,రాయీ

నాన్ సేన్ ఒకరోజు బయటకు వెళుతూ తకేషి అనే తన శిష్యుణ్ణి తనతో వ్యాహ్యాళికి రమ్మన్నాడు.
ఇద్దరూ మౌనంగా అడవిగుండా నడుస్తున్నారు.
అలా నడుస్తూ ఒక సెలయేటి వద్దకు చేరుకున్నారు.
అడవిలో ఒక పక్కగా ఉన్న ఒక పుచ్చకాయను తెంపి సెలయేటిలో పారవేసాడు నాన్ సేన్.
తరువాత ఒడ్డునే ఉన్న ఒక రాయిని తీసుకుని నీళ్ళలోకి విసరి వేశాడు.
వెనక్కి తిరిగి తన ఆశ్రమం దారి పట్టాడు. తకేషి మౌనంగా అనుసరించాడు.
ఆశ్రమం చేరే వరకూ ఇద్దరూ మౌనంగా ఉన్నారు.
మరుసటి రోజు తకేషి ఆశ్రమాన్ని వదలి వెళ్ళిపోయాడు.
-------------------------------------------------------

జెన్ కథలు చాలా లోతైన అర్థాలు కలిగి ఉంటాయి. పై పైన చదివితే అర్థం కావు. వాటిపైన ధ్యానం చెయ్యాలి.లోతైన చింతన చెయ్యాలి. అప్పుడే వాటిలోని అంతరార్థాలు తేటతెల్లం అవుతాయి.

తకేషి అనే శిష్యుడు నాన్ సేన్ అనే జెన్ గురువు దగ్గర చాలా కాలం పాటు ధ్యాన బౌధ్దాన్ని అభ్యాసం చేశాడు. కాని అతనికి జెన్ ఏమాత్రం అర్థం కాకపోగా,సతోరి అనబడే తాత్కాలిక సమాధి కూడా అతనికి అందలేదు. విషయమై అతను చాలా చింతాక్రాంతుడై ఉండేవాడు. సతోరి అనేది ఒక అనుభూతి. ఒక చిన్నపాటి సమాధి స్తితి వంటిది. సమాధిస్థితికి మొదటి మెట్టు అని అనుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు గురువుగారి దగ్గర ఉండి సాధన చేసిన తరువాత కూడా, కనీసం సతోరి కూడా అందుకోలేక పోయానని అతడు బాధ పడేవాడు. కాని తన బాధను గురువు దగ్గర వెళ్ళబుచ్చేవాడు కాదు.

జెన్ విధానాలు చాలా చిత్రమైనవి. మౌనబోధ కు జెన్ లో అత్యంత ప్రాధాన్యత ఉన్నది. నిజానికి, ప్రకృతిలో సమస్తమూ తెరిచిన పుస్తకం వలే ఉన్నది. కాని ప్రకృతి మర్మాలు మనకు అర్థం కావటంలేదు. మన మనస్సులు మూసుకొని పోయి ఉండటమే దానికి కారణం. లోతైన పరిశీలనా దృష్టి లేకపోవటమే దానికి కారణం. తప్పు ప్రకృతిది కాదు. మనదే.

కళ్ళతో చూస్తున్నదాన్ని అర్థం చేసుకోలేని వాడు చెప్పినా అర్థం చేసుకోలేడు. పైగా, నోటితో చెబితే ఒక అనర్థం ఉన్నది. అదేమంటే- బుద్ది పరంగా అర్థం చేసుకొని, అదే సర్వస్వం అనుకునే ప్రమాదం ఇందులో ఉన్నది. మన వేదాంతం అంతా ఇలాగే భ్రష్టు పట్టింది. వేదాంత సత్యాలను నోటితో వల్లె వేసి, మహావాక్యాలు బట్టీ పట్టి, సర్వం బోధ పడింది అనుకునే పండితమ్మన్యులు మన దేశంలో చాలామంది ఉన్నారు.

మనకు కావలసింది బట్టీ కాదు. పుస్తక జ్ఞానం కాదు. అనుభవ జ్ఞానం కావాలి. పుస్తకంలో ఉన్న జ్ఞానం మన సొంతంకాదు. అది ఎవరిదో వేరేవారి అనుభవం. దాన్ని వల్లె వేసినంత మాత్రాన అది నీ అనుభవం గా మారదు. మరి నీ అనుభవం ఏమిటి? కళ్ళు మూసుకుంటే కటిక చీకటి కనిపించటమే మన అనుభవం. అటువంటి పరిస్తితిలో ఉంటూ "అహం బ్రహ్మాస్మి" వంటి మహావాక్యాలు అర్థమైనాయని అనుకోవటం ఉత్త వెర్రితనం. వేదాంతమైనా మహావాక్యాలైనా బుద్ధిపరంగా అర్థం అయితే చాలదు. అనుభవపరంగా తెలియాలి. అప్పుడే అనుభవం నీ సొత్తు అవుతుంది. అలాగే, బౌద్ధ సూత్రాలు బట్టీ పట్టిన మాత్రాన సత్యం అనుభవంలోకి రాదు. దానికి సాధన చేయాలి.

కనుకనే జెన్ సాంప్రదాయం లో గురువులు ఉపన్యాసాలు ఇవ్వరు. బోధలు చెయ్యరు. ఒక చిన్న ఉదాహరణో, చిన్నమాటో చెప్పి ఊరకుంటారు. శిష్యుడు దాన్ని ఊతగా తీసుకోని మౌనంగా ఏళ్ళకేళ్ళు సాధన చెయ్యాలి. పరిపక్వత సాధించాలి. తన ఆంతరిక లోతుల్లోకి మునగాలి. అక్కడ పుస్తక పాండిత్యం పనికిరాదు. బట్టీపట్టిన చిలుక పలుకులు అక్కరకు రావు. అది మరణంతో ముఖాముఖి. అక్కడ అనుభవమే ప్రధానం. పరిపక్వత శిష్యునికి కలిగిననాడు గురువే దానిని గ్రహిస్తాడు. శిష్యుడు నోరుతెరిచి చెప్పనక్కరలేదు. ప్రచారం చేసుకోనక్కర లేదు. శిష్యుని చూపు, మాటతీరు, ప్రవర్తన ను బట్టి గురువుకు అతని పరిణతి తేలికగా అర్థం అవుతుంది. అతడు జ్ఞానాన్ని పొందాడా లేదా అనే విషయాన్ని గురువు తేలికగా గుర్తించగలడు.

తకేషి పడుతున్న బాధను గురువైన నాన్ సేన్ గమనించాడు. జెన్ గురువులు మాటలతో బోధించరు. చేతలద్వారా మార్మికంగా సూచిస్తారు. అది అర్థం చెసుకోలేని శిష్యుడు, నోటితో చెప్పినా గ్రహించలేడని , అలా చెప్పడం వల్ల ప్రయోజనం లేదనీ వారికి బాగా తెలుసు. అందుకే నాన్ సేన్ వ్యాహ్యాళికి పోతూ తకేషిని తనతో రమ్మన్నాడు.

సెలయేరు మనస్సుకు సూచిక. అందులో నిరంతరం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే మనస్సులో నిరంతరం ఆలోచనా తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి. పుచ్చకాయ నీటిలో మునగదు. తేలుతూ ఎంతదూరమైనా అలాగే పోతూఉంటుంది. ఏకాగ్ర ధ్యానస్థితి లేని సాధకునికి అది సూచిక. ఆలోచనా తరంగాలలో పడి కొట్టుకుపోతుంటే జ్ఞాన ప్రాప్తి ఎన్నటికీ కలుగదు. పుచ్చకాయ ఆకారంలో పెద్దది. అలాగే మనుష్యులు ధన కనక వస్తు వాహనాలలో చాలా గొప్పవారు కావచ్చు. పుచ్చకాయలో తియ్యని నీరు వలే వారివద్ద ఎంతో తెలివితేటలు, మరెన్నో విద్యలూ ఉండవచ్చు. కాని మనో భూమికలో పడి ఈదులాడుతూ బ్రతికేవారు పుచ్చకాయ వలే నీటితో పాటు కొట్టుకుపోయి మృత్యువాత పడక తప్పదు. వారికి నీటి అడుగు ఎన్నటికీ అందదు.

రాయి చిన్నదైనా, దాన్ని నీటిలో వేస్తే బుడుంగుమని మునిగి అది పడిన చోటే నీటి అడుగుకు చేరుకుంటుంది. అంతే కాని నీటి ఒరవడికి కొట్టుకుపోదు. అటువంటి ఏకాగ్రత సాధకునికి కావాలి. అప్పుడు అతడు మనో రాజ్యంలో పడి కొట్టుకుపోడు. ఆలోచనలను సూటిగా చేదించే విద్య అతనికి తలుస్తుంది. వాటి మూలానికి అతడు సూటిగా చేరగలడు. అటువంటి సామర్ద్యం ఉన్నవానికి జ్ఞాన ప్రాప్తి తేలికగా కలుగుతుంది. సతోరి అనుభవంలోకి వస్తుంది.

కావ్యకంఠ గణపతి ముని ఎన్నో మంత్రాలను ఏళ్ళతరబడి ఉపాసించాడు. కాని ఫలితం కనిపించలేదు. చివరకు బ్రాహ్మణస్వామి వద్దకు చేరాడు. అప్పటికి రమణమహర్షి అన్న పేరు ఆయనకు లేదు. అందరూ బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు. ఆయన మౌని. ఎవరితోనూ పలకడు. తన లోకంలో తానుంటాడు. గణపతి ముని తన బాధను వెళ్ళబోసుకున్నాడు. ఆయన యొక్క నిజాయితీని గమనించి బ్రాహ్మణస్వామి మనస్సు కరిగింది. ఏళ్ళ తరబడి మౌనం వల్ల ఆయన గొంతు పూడుకుపోయింది. మాట రాలేదు. అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని " మంత్రజపం చేసేటప్పుడు నాదం ఎక్కడ పుడుతున్నదో గమనించి ఆ స్థానంలో స్థిరంగా ఉండు. నేను అన్న భావన ఎక్కడ జన్మిస్తున్నదో గమనించి ఆ స్థానంలో స్థిరంగా ఉండు" అన్న మహొపదేశం చేశాడు. ఆ ఉపదేశమే గణపతి మునికి దారి చూపింది. ఆ తర్వాత ఎందరికో తారక మంత్రమైంది.


పుచ్చకాయతో పోలిస్తే రాయి చిన్నది. ఆకర్షణ లేనిది. ప్రపంచపు హోదాలు, మెరమెచ్చులు, పుచ్చకాయ వంటివి. అవి ఉపయోగపడతాయి. కాని జీవిత గమ్యానికి చేర్చలేవు. వాటికంటే, సూటిగా మూలానికి చేరగల చిన్న రాయి ఎంతో విలువైనది. ప్రజలు పుచ్చకాయను మోసుకోని పోయి తింటారు. కాని రాయికి కాళ్ళతో తంతారు. అలాగే, హోదాలకు ధనానికి ఈ ప్రపంచం ఎంతో విలువనిస్తుంది. కాని నిజమైన ఆధ్యాత్మికతను అది అర్థం చేసుకోలేదు. దానిని చూచి భయపడుతుంది. దూరంగా ఉంచుతుంది. ఇది లోకం తీరు.

నీటిలో పడి కొట్టుకొని పొయే పుచ్చకాయలాగా, ఆలోచనలలో పడి కొట్టుకొని పోయె స్థితిలో ఉన్న సాధకుడు ఎన్నిఏళ్ళు సాధన చెసినా ఆ సాధన అతన్ని గమ్యానికి చేర్చలేదు. రాయివలె, మనస్సు అడుగులకు సూటిగా చేరగలిగిన వాడు ఈ క్షణంలోనే జ్ఞానప్రాప్తిని పొందగలడు. ఇన్నాళ్ళూ తకెషి తన ఆలోచనలలో పడి ఈత కోడుతున్నాడు. అందుకే బుద్ధత్వాన్ని చేరుకోలేక పోతున్నాడు. అలాకాక, తన ఆలోచనల మూలాన్ని చేరుకున్న నాడు అతడు వెంటనే బుద్ధత్వాన్ని పొందగలడు.

నాన్ సేన్ తన ఈ చర్య ద్వారా ఇంతటి గూఢార్ధాన్ని తకేషికి సూచించాడు. తకేషి కూడా సామాన్యుడు కాదు. ఎంతో తపన ఉన్నటువంటి సాధకుడు. కనుకనే గురువుగారి చర్యలలోని అంతరార్ధాన్ని వెంటనే గ్రహించగలిగాడు.

ఆ రోజు రాత్రి తకేషి తన సర్వ శక్తులూ ఒడ్డి అంతర్ముఖుడు కావాలని ప్రయత్నించాడు. ఆలోచనలను నిర్దాక్షిణ్యంగా ఖండిస్తూ పోయాడు. నదిలో పడిన రాయి వలె తన ఆలోచనల మూలాన్ని చేరాలని ప్రయత్నించాడు. గంటలు గడిచాయి. తెల్లవారు ఝాము అయింది. హఠాత్తుగా అతనికి జ్ఞానోదయం కలిగింది. ఆలోచనలు పూర్తిగా ఆగిపొయాయి. కొలను అడుగుకు అతని చేతన చేరుకుంది. నిశ్చల సమాధి నిమగ్నత కలిగింది. అదే స్థితిలో తెల్లవారింది. అతనికి సర్వం తేటతెల్లంగా అర్థం అయింది. అతని ప్రయాణం సమాప్తం అయింది. బుద్ధత్వం లోకి అతడు ప్రవేశించాడు.

ఇక ఆశ్రమం లో ఉండవలసిన పని లేదు. అందుకే ఆశ్రమాన్ని వదలి మౌనంగా నిష్క్రమించాడు. నాన్ సేన్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. అతనికి మహదానందం కలిగింది. నిజానికి తకేషి గురువును వదలి ఎక్కడికీ వెళ్ళడం లేదు. ఇన్నాళ్ళూ ఇల్లు వదలి అతడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ప్రస్తుతం తన ఇంటికి తాను చేరాడు. బుద్ధత్వం పొందిన వారందరూ అదే ఇంటికి చేరుతారు.

నాన్ సేన్ శిష్యుడి నిష్క్రమణాన్ని మౌనంగా వీక్షిస్తూ ఉండిపోయాడు.