“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

12, ఫిబ్రవరి 2009, గురువారం

జెన్ - సాధనా రహస్యం



జెన్ సాంప్రదాయంలో హోటీ అని ఒక బుద్ధుడు ఉన్నాడు. ఆయన్నే లాఫింగ్ బుద్ధ అని అంటారు. ఈ రోజుల్లో అదృష్టచిహ్నం గా షాపులలో, ఇళ్ళ వాకిళ్ళలో ఉంచే ప్రతిమ ఆయనదే. ఆయన వీపున ఒక పెద్ద మూట ఉండేది. దానిలోమిఠాయిలు, బొమ్మలు ఉండేవి. ఊరూరా తిరుగుతూ వాటిని పిల్లలకు పంచుతూ ఉండేవాడు.

ఒకరోజు కొందరు ఆయన్ని ఇలా అడిగారు
హోటీ. మీరు జెన్ మాస్టర్ కదా. జెన్ అంటే ఏమిటో మాకు చెప్పండి?
దానికి హోటీ జవాబు చెప్పలేదు, సరికదా తన వీపున ఉన్నమూటను ఒకేసారి దభేల్మని కింద పడేసాడు.
ప్రజలు ఆశ్చర్య పడ్డారు
తిరిగి మూటను తన భుజానికి ఎత్తుకున్నాడు హోటీ.
పెద్దగా నవ్వుతూ తన దారిన తను సాగిపోయాడు.

జెన్ కథలు అతి సామాన్యంగా ఉంటవి. అర్థం చేసుకో గలిగితే గంభీర అర్థం వాటిలో దాగి ఉంటుంది.ఈ జెన్ కథలో కూడాగొప్ప అర్థం ఉంది. హోటీ మామూలు మనిషి కాదు. సమ్యక్ జ్ఞానాన్ని పొందిన వాడు. జవాబు చెప్పకనే చెప్పాడు. ప్రతిమనిషి పెద్ద బరువును మోస్తున్నాడు. తన ఆలోచనలు, సంస్కారాలు, కోప తాపాలు, రాగ ద్వేషాలు, వెరసి తన అహంఅనే పెద్ద మూటను ప్రతివాడు మోస్తున్నాడు. ఈ అహాన్ని గనక వదుల్చుకో గలిగితే అదే ముక్తి. అదే జెన్.

ఒక సారి అహంకార నాశం అనుభవమైతే తరువాత జీవితం ఒక ఆటగా ఉంటుంది. శరీరం ఉన్నన్ని రోజులు తిరిగి అదేమనసు, అదే అహంకారం తో ఆట సాగుతుంది. కాని ఇదంతా ఆట అని తెలుస్తూనే ఉంటుంది. తిరిగి మూటనుఎత్తుకోటంలో అర్థం అదే. నవ్వుతూ సాగిపోవడం లో అర్థం కూడా అదే.