“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

8, ఫిబ్రవరి 2009, ఆదివారం

కర్ణ పిశాచినీ విద్య

జ్యోతిషవిద్యలో అనేక విధానములున్నవి. గణిత, ఫలిత, పరిహారభాగాలను ఔపోశన పట్టి చెప్పేది ఒక విధానం. మంత్రప్రయోగం ద్వారా దేవతా వశీకరణం చేసుకొని గణితంతో సంబంధం లేకుండా చెప్పేది ఒక విధానం. ఈ మంత్రవిధానములో మహామంత్రములు,క్షుద్ర మంత్రములు కలవు. వీటిలో ఎక్కువమంది అభ్యాసం చేసేది కర్ణపిశాచినీ విద్య. తమిళ నాడు,కేరళ,ఒరిస్సా లలో ఈ విద్య ఉంది.

నాకు వెంకటాద్రిగారని ఒక మిత్రుడు ఉండేవాడు. ఆయనకు జ్యోతిషం కొంత తెలుసు.జాతకచక్రం చూసి కొన్ని ముఖ్యమైన విషయాలు కొండగుర్తులతో చెప్పగలిగేవాడు. ఈ ప్రావీణ్యం జ్యోతిష్కులతో తిరిగి సంపాదించాడు. కాని ఎవరి దగ్గరా గురుముఖతా జ్యోతిషం నేర్చుకోలేదు. ఈయన రకరకాల జ్యోతిష్కులను నావద్దకు తెచ్చి పరిచయం చేసేవాడు. ఒక రోజు 2002 లో అనుకుంటాను. ఒక 25 ఏళ్ల వ్యక్తిని నావద్దకు తీసుకొచ్చాడు. అతడు మన ఇంటికి వచ్చి కూర్చుంటేతప్ప ఏమీ చెప్పలేడు. జాతకచక్రం అవసరం లేదు. మాఇంటిలో కూర్చుని, నా చెయ్యి చూపించ మని, ఒక్క క్షణం చూసాడు. మీ భార్య పుట్టింది సోమవారం నాడు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అది నిజమే. తరువాత మా కుటుంబంలో జరిగిన అనేక సంఘటనలు ఎవరో చెవిలో చెప్పినట్టు చెబుతూ వచ్చాడు. అన్నీ నిజాలే. లోపల బెడ్రూములో కొక్కీ కి తగిలించి ఉన్న నా పాంటుజేబులో ఉన్న వందరూపాయలనోటు నంబరు ఒక కాగితం మీద రాసిపెట్టి, నోటు తెచ్చి పోల్చి చూడమన్నాడు. ఆశ్చర్యం !!! నంబర్ సరిగ్గా సరిపోయింది.

అప్పుడు నాకు అర్థమైంది అది మంత్రవిద్య అని. నేను లోలోపల నా గురువులను స్మరించి శత్రుస్తంభనం చెయ్య గల బగళాముఖీ మంత్రాన్ని మానసికంగా జపించాను. ఇది దశమహావిద్యలలో అతి ప్రభావవంతమైన శక్తి. కొద్దిసేపటి తరువాత అతను ఏమీ చెప్పలేక దిక్కులు చూడసాగాడు. నేను కారణం అడిగాను. మొదట్లో అతను ఏమీ చెప్పలేదు. కాని చాలాసేపు తటపటాయించి, చివరికి "అయ్యా, మీ వద్ద ఏదో మహా మంత్రముంది. అందువల్ల కర్ణపిశాచినీ పలకటం లేదు" అన్నాడు.

అతను చెప్పిన వివరాల ప్రకారం, దీనిని తమిళనాడులో వాళ్ల గురువు నేర్పాడు. కొండనాలుక కొంత కత్తిరించి తరువాత ఉపదేశం ఇస్తారు. జీవితాంతం కొన్ని నియమాలు పాటించాలి. 40 రోజులు నిష్టగా రాత్రిళ్ళు పిప్పలాదఋషి కృతమైన కర్ణపిశాచినీ మంత్రాన్ని లక్ష జపించాలి. తరువాత విభీతకి సమిధలతో హోమం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. ప్రతిరోజూ దేవతకు తాను తినేఆహారంలోంచి కొంత నైవేద్యం పెట్టాలి.అప్పుడు కర్ణపిశాచిని ఇతని చెవిలో అన్ని వివరాలు చెబుతుంది.స్టీరియోసౌండు లాగా చెవిలో కోరిన సమాచారం వినిపిస్తుంది. కాని మహామంత్రోపాసకుల వద్ద ఇది పని చెయ్యదు. అతనికి కొంత డబ్బు ఇచ్చి పంపేసాను. ఒకటి రెండుసార్లు అలా కలిశాడు. తరువాత కనబడలేదు. కాని అతను చాలా సరిగ్గా జరిగిన విషయాలు చెప్పగలిగాడు. దీనినిబట్టి, కర్ణ పిశాచినీ విద్య ఉంది అని నాకు రూఢిగా తెలిసింది.

ఇటువంటి మంత్రవిద్యలు అనేక రకములు ఉన్నవి. స్వప్నేశ్వరి, స్వప్నవారాహి, వటయక్షిని, ఉన్మత్తభైరవం, ఉచ్చిష్టగణపతి ఇత్యాది. K.P System ఆద్యుడు ప్రొఫెసర్ కే.యస్. కృష్ణ మూర్తి గారు ఉచ్చిష్టగణపతి ఉపాసకుడు. జరగబోయే విషయాలు నిమిషాలు సెకండ్లతో సహా సరిగ్గా చెప్పగలిగేవాడు.ఈయన విమానంలో శ్రీలంకకు పోతున్నప్పుడు విమానం ఎన్ని గంటలకు శ్రీలంకకు చేరుతుందో చెప్పమని విమానంలో ప్రయాణం చేస్తున్నవారు అడిగారు. కృష్ణమూర్తిగారు ఒక టైము చెప్పాడు. వాళ్లు ఎగతాళి చేసి,విమానం సరియైన సమయానికే ప్రయాణం చేస్తోంది. మీరు చెప్పినది తప్పు అన్నారు. కాని కొద్దిసేపటికే ఏదో వాతావరణ కారణాలవల్ల ఆలస్యమై సరిగ్గా కృష్ణమూర్తిగారు చెప్పిన సమయానికి ఎయిర్ పోర్టులో దిగింది. ఇటువంటివి అనేకం ఆయన మంత్రసిద్ధి మరియు జ్యోతిషజ్ఞానం వల్ల చెప్ప గలిగాడు.

బీ.వీ.రామన్ గారు కూడా చిన్నప్పుడు కర్ణపిశాచినీ సాధన కొంతకాలం చేసినట్లు ఆయన జీవితకథలో రాసుకున్నారు. ఈసంగతి తెలిసి ఆయన తాతగారైన ప్రొఫెసర్ సూర్యనారాయణరావు గారు మందలించి  ఆ సాధనను ఆపించారు. మహామంత్రమైన గాయత్రిని నిత్యము జపించే వారికి ఇటువంటి క్షుద్రమంత్రముల అవసరం ఉండదు. అందువల్ల తర్వాత ఆయన గాయత్రిని మాత్రమె జపించేవారు.  

క్షుద్రమంత్రములు త్వరగా సిద్దిస్తాయి. కాని వాటివల్ల తరువాత హాని కలుగుతుంది. సాత్వికములైన మహా మంత్రములు త్వరగా సిద్దించవు. కాని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాయి. హాని కలిగించవు. స్వల్ప ప్రయోజనముల కోసం అటువంటి క్షుద్ర మంత్రముల జోలికి పోవటం మంచిది కాదు. కాని అట్టి విద్యలు ఉన్న మాట వాస్తవమే.