అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

24, జూన్ 2009, బుధవారం

కాళికా తత్త్వం-1


కాళీ ఉపాసన మన ఆంద్రదేశంలో అంతగా కనిపించదు. కాని బెంగాలు రాష్ట్రంలో కాళి ప్రతి ఇంటిలో ఇలవేలుపుగా ఆరాధించ బడుతూ ఉంటుంది.వారికి కాళి ముద్దులపట్టి.దశరా నవరాత్రులు వచ్చాయంటే  బెంగాలు రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంటుంది.

ప్రతిఇంటిలో కాళిని సొంతకూతురుగా భావించి అల్లుని ఇంటినుంచి పండుగకు పుట్టింటికి వచ్చినట్లు భావించి ఉత్సవాలు చేస్తారు.దశరా తరువాత తిరిగి ఆమె అల్లుని ఇంటికి పోయేటపుడు ఆకుటుంబం బాధ వర్ణనాతీతం.నిజంగా బాధను తట్టుకోలేక భోరున ఏడిచేవాళ్లు ఎందఱో ఉన్నారు.అట్టి భక్తి ఉన్నది కనుకనే బెంగాలురాష్ట్రంలో కాళీసిద్ధులు ఎందఱో ఈనాటికీ మనకు కనిపిస్తారు.

కాళికాతత్వాన్ని తెలుసుకోవలేనంటే శ్రీరామకృష్ణుని మాటల్లోనే తెలుసుకో గలము.సాక్షాత్ అవతారమూర్తి చెప్పినమాటల కంటే అధికారిక వివరణ ఇంకొకటి ఉండబోదు.కాళీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీరామకృష్ణుడే. దక్షినేశ్వర కాళికాలయంలో ఉన్న కాళీమూర్తి ఆయన మాటలకు స్పందించింది.నైవేద్యం పెడితే తిన్నది.సందేహాలకు తల్లిగా సమాధానం చెప్పింది.నిరాశలో ఓదార్చింది.సమస్త దివ్యానుభవాలను అలవోకగా ప్రసాదించింది.గొప్ప గురువులను రప్పించింది.ఆయా సాధనామర్మాలు తానె చెప్పి చేయించింది. సిద్ధిదాత్రియై అనుభూతులను ఇచ్చింది.

వివేకానందుడు కల్లోలస్థితిలో ఉన్నపుడు శ్రీ రామకృష్ణులు ఆయన్ను దేవాలయానికి పోయి కాళీమాతనే ఏమికావాలో అడుగమని చెబుతారు. నరేంద్రుడు ఆలయంలో ప్రవేశించి కాళీవిగ్రహం ఎదుట నిలువగానే ఆయనకు కాళీమాత సజీవంగా పీఠంపై నిలబడి దర్శనం ఇచ్చింది. ఆ ప్రేమమయ తెజోమూర్తిని చూచిన నరేంద్రుడు తన లౌకికసమస్యలను మరచి శుద్ధభక్తిని వైరాగ్యాన్ని మాత్రమె కోరి తిరిగి వెనుకకు వస్తాడు.

ఒకరోజు రాఖాల్ను కాళీమాతమందిరం ఎదురుగా ఉన్న నాట్యమంటపంలో ధ్యానం చేయమని శ్రీ రామకృష్ణులు రాత్రిపూట ఒంటరిగా పంపిస్తారు.రాఖాల్ ధ్యానానికి కూర్చోనగానే తనకు కలిగిన దివ్యానుభవానికి చకితుడై పోయాడు.గర్భగుడిలోనుంచి కళ్లు మిరమిట్లు గొలిపే తెజోరాశి బయలుదేరి లోకాన్నంతా తన తేజస్సులో ముంచుతూ రాఖాల్ వైపు వచ్చి అతన్ని కూడా ముంచెత్తుతుంది. ఆ అనుభవంలో తన వ్యక్తిత్వం అదృశ్యం అయి సమాధిస్థితిని అందుకొంటాడు రాఖాల్. తరువాతి కాలంలో ఈయనే బ్రహ్మానందస్వామిగా లోకపూజ్యుడైనాడు. రాఖాల్ మాకందరికీ రాజు అని వివేకానందస్వామి స్వయంగా అనేవారు.

రాఖాల్ మరియు నరేంద్ర ఇద్దరూ యువకులుగా ఉన్నపుడు బ్రహ్మసమాజ భావనలకు ప్రభావితులై విగ్రహారాధనను నిరసించేవారు.అదే వివేకానందుడు జ్ఞానమూర్తిగా అమెరికాలో పర్యటించినపుడు విగ్రహారాధనలోని రహస్యాలను చెప్పి పాశ్చాత్యులను చకితులను చేసాడు. తాను సాధించిన లోకప్రసిద్ధిని విజయాలను కాళీమాత తన ద్వారా చేయించినదని తాను ఒక పనిముట్టును మాత్రమె అని ఆయన విశ్వసించేవాడు.

నేను ఒకసారి ఇలాగే కలకత్తాకు వెళ్ళినప్పుడు కాళీఘాట్ లో జరుగుతున్న జంతుబలులను చూచి తట్టుకోలేక తీసుకుపోయిన కొబ్బరికాయను కొట్టకుండా విసురుగా అక్కడనుంచి బయటకు వచ్చేసాను. అక్కణ్ణించి దక్షినేశ్వర్ కాళీదేవాలయానికి పోయేదారిలో ఆ కొబ్బరికాయ నా చేతిలోనే ఎప్పుడు పగిలిపోయిందో తెలియదు. చూస్తె పగిలిపోయి నా చేతిలోనే నీరు కారుతూ ఉంది.ఇది నేను నాతో ఉన్నమిత్రులూ చూచి నోటమాట రాక నిశ్చేష్టులమైనాము. సైన్స్ స్టూడెంట్ ను అయిన నేను దీనికి ఎలా వివరణ ఇచ్చుకోవాలో తెలియక ఊరుకున్నాను.

ఈ సంఘటన 31 డిసెంబర్ 1998 నాడు జరిగింది.

మాకు తెలిసిన ఒకరి సోదరుడిని గంధపుచెక్కల దొంగ వీరప్పన్ బంధించాడు. అతని విడుదలను కోరుతూ కాళీఘాట్ ఆలయంలో హోమం జరిపించారు. అక్కడ కలకత్తాలో హోమం పూర్ణాహుతి అయిన రోజునే ఇక్కడ వీరప్పన్ అతన్నివిడుదల చేసాడు.ఇది నిజంగా జరిగిన నమ్మలేని నిజం. ఇది నేను చూడలేదు కాని విన్నాను.ఇది చెప్పిన వ్యక్తి అబద్దాలు చెప్పే మనిషి కాదు. ఆమె ఉన్నత విద్యావంతురాలు. శారదామఠంలో సన్యాసినిగా పవిత్ర నియమపూరిత జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి. కనుక ఇది నిజమే అని విశ్వసిస్తున్నాను.

కలకత్తా కాళీఘాట్లో ఉన్న కాళీమాత మరియు దక్షినేశ్వర్లో ఉన్న కాళీమాత విగ్రహాలు సజీవమూర్తులు. అనగా జాగృత దేవతలు. ధ్యానములో కొంత సాధన ఉన్నవారికి ఇది అనుభవంలోకి వస్తుంది.

'Autobiography of a Yogi' అనే తన పుస్తకంలో పరమహంస యోగానందగారు దక్షినేశ్వరంలో తనకు కలిగిన కాళీమాత దర్శనాన్ని 'The heart of a stone image'  అనే అధ్యాయంలో అద్భుతంగా వర్ణించారు.

హలదారి అని ఒక కజిన్ శ్రీ రామకృష్ణులకు ఉంటాడు.కాళి తామసిక దేవత ఆమెను పూజింపరాదు అని అతను అంటాడు.అది విని శ్రీరామకృష్ణులు ఏడుస్తూ అమ్మ ఎదురుగా కూలబడి 'ఏమిటమ్మా ఇది? ఈ విషయం నిజమేనా?నీవు తామసిక దేవతవా?' అని అడుగుతారు.

అప్పుడు అమ్మ సమస్త ప్రపంచాన్నీ మిరుమిట్లు గొలిపే తన దివ్యరూపంతో కనిపించి 'వాడి ముఖం.వాడొక అల్పుడు.నా నిజతత్త్వం వాడికేమి తెలుస్తుంది నాయనా?ఒక్క తామసిక గుణమేం ఖర్మ?రాజసికమూ నేనే.సాత్వికమూ నేనే.మూడు గుణాలూ నాలోనే ఉన్నాయి.అవి నేనే.వాటికి అతీతంగా కూడా నేనే ఉన్నాను.చూడు' అంటూ ఆ దర్శనాలను ప్రసాదిస్తుంది.

అప్పుడు శ్రీరామక్రిష్ణులు సంతోషంతో కాళికాలయం నుంచి బయటకు వస్తూ 'ఒరే మూర్ఖుడా!!నువ్వొక తెలివిలేని దద్దమ్మవని అమ్మ చెప్పింది. ఇంకెప్పుడూ కాళి తామసిక దేవత అని అనకు.' అని చీవాట్లు పెడతారు.

తెలియని వారికి కాళి ఒక భయంకర దేవత.

తెలిసిన వారికి ఆమె ప్రేమమయి.సమస్త జగత్తులకూ తల్లి.ఆపదలో రక్షించే దివ్యజనని.నవ్వుతూ వరాలిచ్చే దేవత.

కాళీ అనుగ్రహాన్ని పొందితే తంత్ర రహస్యాలన్నీ అరచేతిలో వచ్చి నిలుస్తాయి.
read more " కాళికా తత్త్వం-1 "

22, జూన్ 2009, సోమవారం

దశ మహా విద్యలు-కాళి



దశ మహావిద్యలలో అత్యంత ముఖ్యమైన దేవత కాళికాదేవి.తాన్త్రికులకు ఆమె ఇష్టదేవతతంత్రమున ఎందరు దేవతలు ఉన్నా కాళీమాతకు ప్రత్యెకస్థానం ఉన్నది. ఎందుకంటే కాళీఉపాసనలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.కాళీ ఉపాసన అతిశీఘ్ర ఫలదాయిని.అతిప్రాచీన కాలం నుంచీ మనదేశంలో పరంపరగా వస్తున్నది. ఒక జీవితకాలం పట్టే సాధనను కాళీమాత కొన్ని నెలలలో ఇవ్వగలదు.కానీ ఈ సాధన అందరూ చెయ్యలేరు.ఇది చాలా కష్టమైన సాధన..

కాళికారూపం భయం గోలిపెదిగా ఉంటుంది. కాని తత్త్వం తెలుసుకుంటే భయం ఉండదు. కాళీదర్శనం కలిగితే అంతకంటే అదృస్టం ఇంకొకటి ఉండదు. కాళికా వరప్రసాదికి అసాధ్యం అనేది ముల్లోకాలలో లేనేలేదు. అతని ఆజ్ఞను పంచభూతాలు తలదాల్చవలసిందే. 

భయంకరమైన కాళీరూపాలు కూడా చాలా ఉన్నాయి.అవి చూచి సామాన్య సాధకులు తట్టుకోలేరు.గుండె పగిలి అక్కడే చస్తారు.కాళీమాత రూపాలు ఒకటి కాదు.అనేకం ఉన్నాయి.భద్రకాళి,స్మశానకాళి,కరాళకాళి,మహాకాళి ఇలా చాలారూపాలు ఉన్నాయి.వాటిలో స్మశానకాళీ రూపం అత్యంత భయానకం.కాని మహాకాళి అలా కాదు.ఆమె రూపం అత్యంత మనోహరం అయిఉండి కూడా మాతృత్వ భావనను కలిగిస్తుంది.మన సొంతతల్లిని కొన్ని ఏళ్ళ తరువాత చూచినప్పటికంటే ఇంకా ఎక్కువ ప్రేమ హృదయంలో పెల్లుబుకుతుంది. కారణం ఆమె ప్రపంచానికే తల్లి. ఆది శక్తి. దేవతలకు మానవులకు సమస్త జీవకోటికి చరాచర సమస్త సృష్టికి మాత.

కాళి సామాన్యంగా నాలుగు చేతులు కలిగి ఉంటుంది. నూరు చేతుల రూపం కూడా ఉన్నప్పటికీ సామాన్యంగా మనం చూచే రూపం మాత్రం ఇదే.ఒక చేతిలో ఖడ్గము, ఇంకొక చేతిలో ఖండిత శిరస్సు, మిగిలిన రెండు చేతులలో వరద అభయ ముద్రలు దాల్చి అచేతనుడైన శివునిపైన నిలబడి ఉన్నట్లు మనం సాధారంగా కనబడే చిత్రాలలో చూస్తాము.ఇది చిత్రకారుని ఊహకాదు. నిజముగా దర్శనం ఇచ్చే దేవతాస్వరూపం కూడా ఇలాగే ఉంటుంది. కాని చిత్రంకంటే ఎన్నోరెట్లు జీవంతో ఉంటుంది. ఈ ఆకారం భయానకమే. కాని అది రాక్షసప్రవృత్తి కలవారికే గాని ఆమె బిడ్డలకు కాదు. బిడ్డకు తల్లి కోపంగా ఉన్నా భయం కలుగదు. ఆతల్లి కోపం తనలోని అసుర ప్రవృత్తి పైనే గాని తన పైన కాదు అన్న సత్యం తెలిస్తే భయం పటాపంచలౌతుంది.

ఈచిత్రం లోని అంతరార్థం చూద్దాము. మన దేవతల విగ్రహాలు చిత్రాలు, చిత్రకారుని ఊహలు కావు. అవి మార్మికభాషా సంకేతాలు. గొప్ప భావాన్ని దృశ్యరూపంగా చెప్పవలెనంటే అంతకంటే బాగా చెప్పటం, కవితాత్మకంగా చెప్పటం సాధ్యం కాదు.శివుడు అనగా సృష్టికి ముందు ఉన్నటువంటి అఖండ నిరాకాల నిశ్చల పరతత్త్వం. అట్టి నిశ్చల తత్వమున కదలిక వచ్చి సృష్టి జరిగింది. ఆ కదలికే శక్తి. ఆ శక్తికే కాళి అని పేరు. అచేతనంగా పడి ఉన్న శివుడు సృష్టికి మూలము ఆధారము అయిన పరమాత్మ. ఆ పరమాత్ముని ఆధారంగా శక్తి సృష్టిస్థితిలయలు చేస్తున్నది. అనగా అచేతన బ్రహ్మము పైన చేతనాత్మక శక్తి నాట్యం చేస్తున్నది. దీనినే శివునిపైన శక్తి నిలిచి ఉన్న చిత్రంగా చూపుతారు. వెరశి ఈ చిత్రం ఒక అద్భుత సత్యానికి ప్రతిబింబము.

ఆంతరిక తాంత్రికలోకంలో ప్రవేశించి మరొక అర్థాన్ని కనుగొందామా? సాధకుడు ఇంద్రియాతీతుడై సమాధి అవస్థలో ప్రవేశించినపుడు దేహస్పృహ కోల్పోతాడు.అపుడు శవం మాదిరిగా అచేతనుడై పడి ఉంటాడు.కాని ఆ అచేతనునిలో ఆద్యాశక్తి కుండలీరూపంలో జాగ్రుతమై ఉంటుంది. కదలిక లేక సమాధి అవస్థలో ఉన్న సాధకునిలో మహాశక్తి జాగృతం అయి ఉంటుంది. ఈ శక్తి అతనిలోని రాక్షసత్వాన్ని ఒకే దెబ్బతో అంతం చేస్తుంది. అతనికి వరద అభయశక్తిగా నిలిచి రక్షిస్తుంది. ఆ జాగ్రుత శక్తి ముందు ఏ రాక్షస ప్రవృత్తులూ నిలవలేవు. చావు లేని రక్తబీజుడైనా సరే ఈ శక్తిముందు అంతం కావలసిందే.

మనిషి తనలోని పశుప్రవృత్తి, రాక్షసప్రవృత్తి పోవాలని ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చు. కాని అవి సఫలం కావు.పూర్తిగా కళ్లు తెరిచిన జాగ్రుత కుండలినీ శక్తి మాత్రమె ఈ పని ఒక్క క్షణంలో చెయ్యగలుగుతుంది. ఒక విధంగా ఆమె నిరంతరం జరుగుతున్న బాహ్యసృష్టి ప్రక్రియకు సజీవరూపం.ఇంకొక రకంగా సాధకుని ఆంతరిక సాధనాప్రక్రియకు ప్రతిరూపం. ఈ విధంగా బాహ్య ఆంతరిక భూమికలలో నిరంతరం ఆమె లీల జరుగుతూ ఉంటుంది. కాళీ అనుగ్రహం పొందగలిగితే అట్టి వాని జన్మలో ఇక అందుకోవలసిన శిఖరాలు ఉండవు. ఆమె సర్వ శక్తిమయి.పరబ్రహ్మ మహిషి అని దేవీ భాగవతం స్తుతించింది. సమస్త లోకాలు భువనాలు ఆశక్తి ఆటలు.లీలా విలాసాలు.సమస్త అవతారాలు,దేవతలు ఆమె బిడ్డలు. ఆ శక్తి లోనే పుట్టి పెరిగి లయిస్తుంటారు.  కాళీశక్తికి అతీతంగా ఏదీ లేదు. ఎవరూ లేరు.ఇదే కాళీ తత్త్వం.
read more " దశ మహా విద్యలు-కాళి "

20, జూన్ 2009, శనివారం

బ్రూస్ లీ జాతకం

ప్రఖ్యాత కుంగ్ ఫూ స్టార్ బ్రూస్ లీ 27-11-1940 తేదీన 7.12 నిముషాలకు శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. కుంగ్ ఫు అనే విద్య ఒకటుంది అన్న విషయాన్ని ప్రపంచానికి తనసినిమాలతో పరిచయం చేసాడు. తరువాత ఎందరు కుంగ్ ఫూ స్టార్స్ వచ్చినా ఈయనస్థానం ఈయనదే. ఆయన జాతకాన్ని ఇక్కడ ఇస్తున్నాను.

ఈయన అసలు
పేరు జూన్ ఫాన్ లీ. ఈ పేరులో లీ అనేది వీరి ఇంటి పేరు. ఈయన విక్రమనామ సంవత్సరం కార్తీక బహుళ చతుర్దశి రోజున బుధ వారం బుధ హోరలో స్వాతినక్షత్రం-4 పాదంలో జన్మించాడు. ఈయన జాతకంలో ఆత్మ కారకుడు కూడా బుదుడేకావటం ఒక విశేషం.జన్మ సమయంలో శోభన యోగం, విష్టి కరణం ఉన్నవి.


ఈయన 
తండ్రి చైనా వాడు. కాని తల్లి యొక్క తండ్రి జర్మన్ మరియు తల్లి చైనీస్ వనిత. కనుక జర్మన్ రక్తం ఈయనలోఉన్నది. ఈయన పుట్టినపుడు రాహు/చంద్ర/శుక్రదశ జరుగుతున్నది. రాహుచంద్రుల కలయిక గ్రహణయోగం. కనుక తండ్రివైపు నుంచి ఈయన వంశానికి శాపం ఉన్నదని చెప్పవచ్చు. ఇటువంటి శాపం వీరి వంశానికి ఉన్నదని చెబుతారు. బ్రూస్ లీ తన 32 వ ఏటఅనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. అలాగే ఈయన కొడుకైన బ్రాండన్ లీ తన 26 వ ఏట సినిమా షూటింగ్ సమయంలో మరణించాడు. వీరి వంశానికి శాపం ఉన్నది అని బ్రూస్లీ తండ్రి గట్టిగా నమ్మేవాడు. శాపం ఉందా లేదా అనేది జాతక విశ్లేషణలో తరువాత చూద్దాము.

ఈయన తండ్రి చైనీస్ ఒపేరాలో ఆర్టిస్టు గా పని చేసేవాడు. బ్రూస్లీ బాల నటుడిగా కొన్ని సినిమాలలో నటించాడు. చిన్నప్పుడు ఒక గాంగు లీడర్ గా ఉండేవాడు. 13 ఏళ్ళ వయసులో జరిగిన ఒక వీధి కొట్లాటలో బ్రూస్లీ బాగా దెబ్బలుతిన్నాడు. ఆ పౌరుషంతో ప్రఖ్యాత వింగ్ చున్ మాస్టర్ అయిన యిప్ మాన్ వద్ద శిష్యుడిగా చేరి కుంగ్ ఫూ అభ్యాసంమొదలు పెట్టాడు. 1954-57 మధ్య కాలంలో ఈయన యిప్ మాన్ శిష్యుడిగా ఉండి కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేసాడు. ఈసమయంలో ఈయనకు గురు దశలో రాహు అన్తర్దశ జరిగింది. మధ్యలోనే వింగ్ చున్ అభ్యాసం వదలి
పెట్టి తిరిగి అమెరికా చేరాడు. గురుఛండాల యోగ దశలో నేర్చుకున్న వింగ్ చున్ ఈయనకు పెద్దగా ఉపయోగపడలేదు.

మార్షల్ ఆర్ట్స్ ను సూచించే గ్రహ స్థితులు:

స్థిరలగ్నమైన వృశ్చికం రాశి, దశాంశలలో ఉదయిస్తున్నది. కుజ సంబంధ లగ్నంతో రవి కలిసి ఉండటం వల్ల వీరవిద్యలలో నైపుణ్యం ఉన్నట్లు తెలియటమే కాక లోకప్రసిద్దుడు అవుతాడని చెప్ప వచ్చు. వీరవిద్యలకు కారకుడైన కుజుడు నవాంశ, దశాంశలలో ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల కుంగ్ ఫూ లో ఆరితేరాడు. కాని కుజుని గ్రహయుద్ధస్థితి వల్ల, ద్వాదశస్థితి వల్ల అదంతా అర్ధాంతరంగా ముగుస్తుందని తెలుస్తున్నది. ఆరింట శని మరియు గురు గ్రహముల కలయిక వల్ల మార్షల్ ఆర్ట్స్ లో గొప్ప ఓర్పుతో సాధన చేసి ఒక స్టార్ అవుతాడని సూచన ఉంది. కానీ శని నీచ వక్ర స్థితులలో ఉండటంతో చివరకు అంతా వృధా అవుతుందని సూచన కూడా ఉంది.

శని గురువులు శుక్ర నక్షత్రంలో ఉన్నారు. అదీగాక భరణి అనేది యమునిచే పాలింపబడే నక్షత్రం. కనుక, గర్ల్ ఫ్రెండ్ వల్ల చావు మూడింది.

దశాంశలో లగ్న రవులు వర్గోత్తమాంశ తో ఉండుట వల్ల మార్షల్ ఆర్ట్స్ తో లోక ప్రసిద్దికెక్కుట ద్వారా సంపాదనసూచింపబడుతున్నది. కానీ, లగ్నాదిపతి యగు కుజుడు ద్వాదశ శత్రుస్థానస్థితి మంచిదికాదు. శుక్రునితో మరియు ఆత్మకారకుడగు బుధునితో కలయిక వల్ల ప్రేమ వ్యవహారాలలో చిక్కుకొని తన అధోగతికి తానే కారకుడైనాడు. కుజబుధశుక్రుల కలయికవల్ల మల్లయుద్ధ ప్రావీణ్యం ఏర్పడుతుంది అని పరాశరమహర్షి, జైమినిమహర్షులు చెప్పిన మాట అక్షరాలా నిజంకావటం ఈ జాతకంలో చూడ వచ్చు.

సహజ పంచమాదిపతి అయిన రవి లగ్నంలో మిత్ర క్షేత్రంలో ఉండి ఎక్కువ వర్గ చక్రములో లగ్నంలో ఉండటంతో రంగస్థలనటుడు గాను, నృత్యం లోను  ప్రావీణ్యత కలిగింది. బ్రూస్లీ హాంగ్ కాంగ్ లో చాచా డాన్స్ చాంపియన్ అని చాలామందికి తెలియదు. విక్రమస్థానంపైన కుజ శనుల దృష్టితో ధైర్యం పౌరుషం కలిగాయి. దశమస్థానం పైన గురుదృష్టితో అమెరికాలో కుంగ్ ఫూ స్కూల్ స్థాపించి అనేక మందికి గురువుగా కుంగ్ ఫూ నేర్పించాడు.

కాని ద్వాదశంలో ఉన్న కుజుని మీద శనిదృష్టి రహస్య శత్రువులను ఇవ్వటమే కాక ఇప్పటికీ మిస్టరీ గా మిగిలినమరణాన్ని ఇచ్చింది. ద్వాదశంలో చంద్ర, కుజ, బుధ శుక్రుల కలయిక వల్ల ఈయన మీద అనేక స్కూల్స్ ప్రభావంఉన్నది. పని చేసేవి ఫలితం చూపించేవి అయితే ఏ స్టైల్ నుంచి అయినా టెక్నిక్స్ తీసుకో వచ్చు అంటూ "జీత్ కునే డో" అని ఒక కొత్త స్టైల్ మొదలు పెట్టాడు. దీన్ని "The way of intercepting fist" అంటూ కొన్నాళ్ళు పిలిచి తరువాత ఈపేరును తొలగించాడు.

జీవితంలో ఎటువంటి బంధాలూ ఉండకూడదని నమ్మేవాడు. అలాగే మార్షల్ ఆర్ట్స్ కూడా గిరి గీసుకొని ఇది నా స్టైల్ అంటూ ఉండటం తప్పు అని చెప్పే వాడు. ఈ ధోరణి వల్లనే నేడు అమెరికాలో M.M.A - Mixed Martial Arts అనే ట్రెండ్ వచ్చింది. తాను బతికి ఉన్నప్పుడు ఎంతో మందికి తనదైన స్టైల్ నేర్పించినా ముగ్గురికి మాత్రమె తన స్టైల్ లో బోధించటానికి సర్టిఫికేట్ ఇచ్చాడు. ఓపెన్ మైండ్ తో ఉండటం ముఖ్యం అని చెప్పేవాడు. ఈయన భావాలు జెన్ సిద్ధాంతాలకు దగ్గరిగా ఉంటాయి. సాంప్రదాయంగా వస్తున్న అనేక  కుంగ్ ఫూ అభ్యాసాలను నిరసించాడు. ఉదాహరణకు కరాటేలో కటా ప్రాక్టీస్ లేదా కుంగ్ ఫూ లో ఫాం ప్రాక్టీస్ అనవసరం అని తేల్చి చెప్పాడు. ఎందుకంటే అది వీధి పోరాటంలో పనికిరాదు అని చెప్పాడు. ఇది చాలా వరకు నిజం కూడా.
read more " బ్రూస్ లీ జాతకం "

18, జూన్ 2009, గురువారం

మార్షల్ ఆర్ట్స్- హార్డ్ ఎండ్ సాఫ్టు స్టైల్స్


మార్షల్ ఆర్ట్స్ ( వీర విద్యల) ను రెండు విధములైన శాఖలుగా స్థూలంగా విభజింపవచ్చు.ఒకటి హార్డ్ స్టైల్స్. రెండు సాఫ్టు స్టైల్స్. చైనీస్ ఫిలాసఫీ తెలిసిన వారికి యిన్-యాంగ్ గురించి తెలిసి ఉంటుంది. వీరవిద్యలకు యిన్ యాంగ్ కు దగ్గరి సంబంధం ఉన్నది.యాంగ్ అనేది పురుషశక్తికి వెలుతురుకు ప్రతీక. దీని క్రిందకు వచ్చే వీరవిద్యలలో బలం,క్తి ముఖ్యములు.

షావోలిన్ స్టైల్స్ లో టైగర్, లెపర్డ్, డ్రాగన్, కోవకు చెందినవి. చోయి లే ఫట్, హంగ్ గార్ మొదలైన స్టైల్స్ లో కూడా బలానికి శక్తికి శరీర దృడత్వానికి ప్రాధాన్యత ఎక్కువ. చైనీస్ కుంగ్ ఫూ మాత్రమె కాక ఇతర విద్యలైన కరాటే, టేక్వాన్ డో, హ్వరాంగ్ డో, జుజుత్సు, కపియోర, సూమో రేజిలింగ్ మొదలైన విద్యలు కూడా మేస్కులిన్ విద్యలే. అంటే వీటిలో మొద్దుబలానికే ప్రాధాన్యత.



యిన్ స్త్రీశక్తికి చీకటికి ప్రతీక. ఫైవ్ ఏనిమల్ స్టైల్స్ లో క్రేన్ మరియు స్నేక్ స్టైల్స్ ఈ శాఖకు చెందినవి.వీటిలో బలానికి ఎక్కువ ప్రాధాన్యత లేదు.బేలన్స్, టైమింగ్,గురిచూసి నాడీకేంద్రముల మీద సరిగ్గా చావు దెబ్బ తియ్యటం ముఖ్యంగా ఉంటాయి.చైనాలోనే పుట్టిన తాయిఛి,బాగువా,జింగ్ యి ఈ మూడు విద్యలూ ఫేమినైన్ వీరవిద్యలు.వీటిలో వాటర్ ప్రిన్సిపుల్ ఎక్కువగా వాడుతారు.

నీరు అతి బలహీనమైనది. కాని ఏ వస్తువునైనా తనలో ఇముడ్చుకోగలదు. అలాగే ఈ ఫేమినైన్ మార్షల్ ఆర్ట్స్ చూడటానికి అమాయకంగా కనిపిస్తాయి. కాని చాలా ప్రమాదకారులు. చూడటానికి సాఫ్టు గా కనిపించే ఇలాంటి ప్రమాదకర విద్యలలో ప్రేయింగ్ మాన్టిస్ స్టైల్ ఒకటి.

పైపైన చూడటానికి యాంగ్ స్టైల్స్ బాగున్నట్టు ఉంటాయి. కాని యిన్ స్టైల్స్ ను సాధించటం చాలాకష్టం.యాంగ్ స్టైల్స్ కు అయిదేళ్ళు పడితే యిన్ స్టైల్స్ సాధించటానికి పదేళ్ళు పడుతుంది. ఎందుకంటే శరీరశక్తి సాధించటం తేలిక. కాని యిన్ విద్యలు ప్రాణశక్తితో కూడుకున్నవి.ఇవి ప్రాణవిద్యలు. ప్రాణశక్తినంతా ఒక చోటికి కేంద్రీకరించి నాడీ కేంద్రంమీద కొట్టవలసి ఉంటుంది. అది సరిగా చెయ్యగలిగితే చాలా ప్రమాదకరం.బాంబు పేలినంత శక్తిని విడుదల చేస్తుంది.

యిన్ స్టైల్స్ లో పాయిజన్ హేండ్ అనేది రహస్యవిద్య. ఈవిద్యలో నిష్ణాతుడైతే ఊరకే నాడీకేంద్రాన్ని చిన్నగా కొడితే చాలు. అది స్లో పాయిజన్ లా పనిచేసి ఆ వ్యక్తి క్రమేణా క్షీణించి మరణిస్తాడు. అంటే ఒకరకంగా ఇది చేతబడి లాంటిది.ఏ రోగమో ఏ వైద్యుడూ కనిపెట్టలేదు. ఏ టెస్టులకూ ఏమీ దొరకదు.

జపనీస్ మార్షల్ ఆర్ట్స్ లో జూడో మరియు అయికిడో ఈ రెండూ ఫేమినైన్ విద్యలు. జపనీస్ లో 'జు' అంటే సాఫ్టు అని అర్థం.కరాటేలో కూడా 'గో-జు' స్టైల్ అని ఒకటుంది. అందులో కూడా సాఫ్టు టెక్నిక్స్ ఉంటాయి.జపనీస్ విద్య అయిన నిన్-జుత్సు మోస పూరిత టెక్నిక్స్ కు పెట్టింది పేరు. ఇది కూడా ఫేమినైన్ శాఖకే చెందుతుంది.

షావోలిన్ కుంగ్ ఫూ లో నిష్ణాతులు చెప్పేదేమంటే నిజానికి యిన్ యాంగ్ మార్షల్ ఆర్ట్స్ అంటూ విడివిడిగా లేవు. షావోలిన్ స్టైల్స్ లో రెండూ ఇమిడి ఉంటాయి. షావోలిన్ కుంగ్ ఫూలో మొదట బలంతో మొదలుపెట్టి, చివరకు జెన్ మెడిటేషన్ మరియు కి-గాంగ్ అభ్యాసాల ద్వారా సాఫ్టు టెక్నిక్స్ అయిన ప్రాణవిద్యా విధానాలు నేర్చుకోవటం జరుగుతుంది. అలాగే సాఫ్టు విద్యలయిన తాయి-ఛి,వుడాంగ్ కుంగ్ ఫూలలో మొదట సాఫ్టు స్కిల్స్ తో మొదలు పెట్టి తరువాత హార్డ్ స్కిల్స్ నేర్చుకోవటం ఉంటుంది. ఏదైనా రెండవది లేక ఒక్కటే పరిపూర్ణం కాలేదు.పురుష స్త్రీ శక్తులు కలిశిన అర్థనారీశ్వరతత్వమే పరిపూర్ణతత్త్వం అయినట్లు, వీరవిద్యలలో కూడా రెండింటిలో మాస్టరీ సాధిస్తేనే అది పరిపూర్ణ విద్య అవుతుంది.

సాఫ్టు ఆర్ట్ అయిన తాయి ఛి మాస్టర్ "యాంగ్- లు- చాన్" పది వేల ఫైట్స్ చేసి ఒక్కదానిలో కూడా ఓటమికి గురి కాలేదు. ఈయన ఫైట్ చేసింది సాదాసీదా మనుషులతో కాదు.కుంగ్ ఫూ లో తలపండిన మాస్టర్స్ తో తలపడి చాలెంజ్ ఫైట్స్ చేసాడు.

ఈయన విధానాన్ని కాటన్ బాక్సింగ్ అనేవారు.ప్రత్యర్థికి ఈయనను తాకటమే అసాధ్యం అయేది. దూదిపింజ ఎలా గాలిలో తేలుతూ మనం కొట్టినాకూడా దెబ్బ తగిలించుకోకుండా ఎగురుతూ ఉంటుందో అలా ఉండేది ఈయన స్టైల్. ఇది యిన్ స్టైల్ కు, వాటర్ ప్రిన్సిపుల్ కు ఒక మచ్చుతునక. ఇటువంటి సామర్ధ్యం రావాలంటే జీవితాన్ని దానికి పూర్తిగా అంకితం చేసి అకుంఠితదీక్షతో సాధన చేసినపుడే అది సాధ్యం అవుతుంది.
read more " మార్షల్ ఆర్ట్స్- హార్డ్ ఎండ్ సాఫ్టు స్టైల్స్ "

17, జూన్ 2009, బుధవారం

శని మహర్దశ


వింశోత్తరీ దశావిధానంలో శనిదశ 19 సంవత్సరాలు ఉంటుంది. అతి పెద్దదశ అయిన శుక్రదశ తరువాత ఇదే ఇన్నిఏళ్ళు ఉండే దశ. సామాన్యంగా శనిదశ అంటే మనకు భయం ఉంటుంది.అది చాలావరకూ నిజమే.దశా కాలంలోమనకు కలిగే ఫలితాలు మూడు విధాలుగా ఉంటాయి.

ఈ మూడు విధాలైన ఫలితాలనూ సమన్వయము చేసుకుని చూడాలి.అప్పుడు ఆ దశలో ఏమేం జరుగుతుందో అర్ధమౌతుంది.

ఒకటి:
గ్రహముల యొక్క సహజ కారకత్వములను బట్టి వచ్చే ఫలితాలు. ఈ రీతిలో,శనిభగవానునికి గల సహజ కారకత్వములు చూద్దాము.

సహజ జ్యోతిశ్చక్రములో (Natural Zodiac) ఈయనకు 10,11 స్థానములు అయిన మకరం కుంభం స్వక్షేత్రములు.కనుక కర్మ,లాభ స్థానముల కారకత్వములు ఈయనకు ఉంటాయి. అనుభవించాల్సిన కర్మను అనుభవింపజేయటం,ఇవ్వవలసిన లాభములను ఇవ్వటం చేస్తాడు. ఈయన యొక్క సహజలక్షణాలైన బద్ధకం,సోమరితనం,పనులు కాకపోవటం,నిరాశా నిస్పృహలు,నరాల,ఎముకల రోగాలు,పెద్దల మరణాలు,చికాకులు,అంగ వైకల్యం కలగటం,ఏక్సిడేంట్లు కావటం మొదలైనవి జరుగుతాయి.

చరరాశులకు 11 స్థానం బాధకస్థానం గనుక ఈయన దశ సాధారణంగా అనేక బాధలను ఇస్తుంది.ఆయా బాధలు ఈ 19 ఏళ్ళలో శని గోచారరీత్యా సంచరించే స్థానాలను బట్టి (మేషం ఒకటో స్థానంగా తీసుకుని చూడగా) ఉంటాయి. దశా అంతర్దశలలో కూడా గ్రహముల సహజ కారకత్వములు పరిగణనలోకి తీసుకోవాలి.

ఉదాహరణకు శనిదశలో కుజ అంతర్దశ వచ్చినపుడు జ్వరాలు, దెబ్బలు తగలటం,రక్తదర్శనం, ఆస్పత్రి పాలు కావటం, సోదరులకు హాని మొదలైనవి కనిపిస్తుంటాయి.ఇది సహజ కారకత్వములు మరియు సహజజ్యోతిశ్చక్ర విధానం బట్టి అంచనా వేసే పద్దతి.

రెండు:
జాతకచక్రరీత్యా లగ్న చంద్రుల్లో బలవత్తరమైన స్థానమును బట్టి, శనికి కలిగిన ఆదిపత్యములు,ఆయన ఉన్న ఇంటినిబట్టి రెండవస్థాయి ఫలితములు ఉంటాయి.శనినుంచి అంతర్దశా నాథుడైన గ్రహము యొక్క స్థితిని బట్టి ఆగ్రహము ఉన్న స్థానము మరియు కారకత్వములను బట్టి ఫలితములు ఊహించాలి.

దశానాదునికి అంతర్దశానాధుడు 6,8,12 స్థానములలో ఉంటే మంచి జరుగదు. కోణస్థితిలో ఉంటే ( అనగా ఒకదానికొకటి 5/9 ),అదికూడా అవి మిత్రగ్రహాలై ఉంటే మంచి జరుగుతుంది.శత్రుగ్రహాలైతే కొంత మంచి కొంత చెడు జరుగుతుంది. కేంద్రస్థితిలో (4/10 ) ఉంటే ఆయా పనులు నిదానంగా పూర్తి అవుతాయి. లేదా పరస్పర శత్రుగ్రహాలైతే పనులు జరుగవు. కారకత్వాలు దెబ్బ తింటాయి.

మూడు:
గోచారరీత్యా,జననకాల చంద్రస్థితికి శని ప్రస్తుతం సంచారం చేస్తున్న ఇంటిని బట్టి ఫలితములు ఉంటాయి.ఇందులో ముఖ్యముగా చూడవలసినది. ఏలినాటి శని,అర్ధాష్టమశని,అష్టమశని.

చంద్రునికి 12,1,2 స్థానాలలో శనిసంచారమే ఏలినాటిశని.శనిసంచారం ఒక్కొక్క రాశిలో రెండున్నర ఏళ్ళు ఉంటుంది కనుక ఈ మూడు స్థానాలకు కలిపి ఏడున్నర ఏళ్ళు ఉంటుంది.

స్థూలంగా వీటి ఫలితాలు ఏమనగా: 

12 లో సంచరిస్తున్నపుడు అనవసర ఖర్చులు, రోగాలు, ఆస్పత్రి లో చేరటం, నిరాశ, ఆధ్యాత్మిక చింతన పెరగటం, ఎడమ కంటికి రోగం, తల్లి మరణం, ఏ పనీ కలిశి రాకత్రిప్పట పెట్టటం ఉంటాయి.

ఇక చంద్రుని మీదికి వచ్చినపుడు, మానసిక ఆందోళన, భయం, తల్లికి ప్రాణ గండం లేకమరణం, మాత్రు సంబంధ బంధువుల మరణాలు, భార్యకు ఆరోగ్య భంగం, చేసే వృత్తిలో ఆటంకాలు, చికాకులు, తనఆరోగ్యం దెబ్బ తినటం జరుగుతాయి.

ఇక రెండవ స్థానంలో కొచ్చినపుడు కుటుంబ చికాకులు, కుడి కంటికి రోగం, అతివాగుడు వల్ల ప్రమాదాలు, లేక మాట్లాడ వలసిన చోట మాట రాక పోవటం, భోజన సౌఖ్యం కొరత, జీర్ణాశయ బాధలు, కుటుంబంలో మరణాలు ఉంటాయి. కనుకనే ఏలినాటి శని అంటే జనులలో భయం ఉంటుంది.

ఇక అర్ధాష్టమశని జరుగుతున్నపుడు విద్యలో ఆటంకాలు, గుండెజబ్బులు, ప్రయాణంలో ప్రమాదాలు, తల్లిమరణం మొదలైనవి ఉంటాయి.

చివరిదైన అష్టమశని జరిగేటపుడు:--

పనులు సర్వనాశనం కావటం, ప్రతి పనిలోనూ నష్టం, స్వమరణం, కోర్టు చిక్కులు, ప్రత్యర్థుల దాడులు, దీర్ఘరోగాలు మొదలైనవి ఉంటాయి.

ఈ మూడు విధములైన ఫలితములను బేరీజు(Correlate)చేసి ఏ ఫలితాలైతే మళ్ళీమళ్ళీ కనిపిస్తుంటాయో అవి చాలావరకూ జరుగుతాయి అని చెప్పవచ్చు.ఇదంతా వినటానికి సులువుగా ఉన్నప్పటికీ ఆచరణలో చాలా కష్టంగా ఉంటుంది.

ఉదాహరణకి,ఏ జాతకానికైనా సహజకారకత్వాలు మారవు.కాని ఆధిపత్యాలు మారుతాయి. తరువాత, శని ఉన్న స్థితిని బట్టి కొందరికి ఉచ్ఛ (Exalted) గానూ, కొందరికి నీచ (Debilitated) గానూ, కొన్నిసార్లు వక్రి (Retrograde ) గానూ, కొన్నిసార్లు అతి బలహీనుడు గానూ, కొన్నిసార్లు అస్తన్గతుడు (Combust) గానూ ఉండవచ్చు. కనుక పాజిటివ్ మరియు నెగటివ్ ఫలితాలను కూలంకషంగా బేరీజు వేసి మొత్తం ఫలితాన్ని అంచనా వేయవలసి ఉంటుంది.

మొత్తంమీద, సహజ కారకత్వములు, ఆధిపత్యములు, దశ అన్తర్దశలు, గోచారము, ఇంకా సూక్ష్మంగా చూడాలంటే అష్టవర్గ బలము విచారించి చెబితే ఫలితములు చాలావరకు సరిపోతాయి.

కాని శని భగవానుని సహజ కారకత్వములు మంచివి కాదు గనుక ఎంత మంచి చేసినా చివరకు మళ్ళీ చెడు జరుగుతుంది. దీనినే లోకంలో శని పైకి లేపి కిందపడేస్తాడు అని వాడుకభాషలో అంటారు.NTR జాతకంలో రాజయోగాన్ని ఇచ్చినట్లే ఇచ్చి చివరకు అటువంటి పరిస్ధితి కలిగించి అటువంటి మరణం కలిగింది కూడా శని ప్రభావమే.


చివరిగా ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి. శనిదశ వేరు, ఏలినాటి శని వేరు. ఈ రెంటికీ తేడా ఉన్నది. శని మహాదశ పైన చెప్పినట్లు 19 ఏళ్ళు ఉంటుంది. అది కొందరికి చిన్నతనంలో రావచ్చు కొందరికి మధ్య వయసులో మరికొందరికి ముసలితనంలో రావచ్చు. కొందరికి అసలు రాకపోవచ్చు.

ఏలినాటి శని అనేది శనిగ్రహము గోచారరీత్యా జననకాల చంద్రుని దగ్గరకు వచ్చిన ఏడున్నర ఏళ్ళకాలం. ఈ రెండూ ఒకటి కాదు. భేదం ఉన్నది. ఒకటి జననకాల నక్షత్రాన్ని బట్టి లెక్క వేసే దశ. ఇంకొకటి గ్రహముల సంచారం బట్టి వచ్చేటటువంటి స్థితి. 

శనిదశ ఒక జాతకానికి చెడు చేసేదిగా ఉండి, ఆ దశలో ఏలినాటి శని వస్తే ఆ జాతకుడు పడే బాధలు ఆ దేవుని కెరుక. ఇట్టి స్థితి మధ్య వయసులో లేదా ముసలితనంలో వస్తే పరలోకప్రాప్తి తధ్యం. చాలామంది ఆ బాధలను భరించలేక ఆత్మహత్యలు చేసుకోవటం కూడా ఇటువంటి కాలంలోనే జరుగుతుంది.కొన్ని ఉదాహరణ జాతకాలతో చూస్తె బాగా అర్థం అవుతుంది.

సమయం వచ్చినపుడు ప్రాక్టికల్ కేస్ లు చూద్దాం.
read more " శని మహర్దశ "

15, జూన్ 2009, సోమవారం

మా పావా గడ్ యాత్ర













మొన్న ఏప్రిల్ నెలలో గుజరాత్ లోని పావా గడ్ సందర్శనా భాగ్యం కలిగింది. ఇది నేనున్న బరోడాకు దాదాపు ఏభై కిలో మీటర్ల దూరం ఉంటుంది. అక్కడ కొండ మీద కాళీ మాత ఆలయం ఉన్నది. మొదటగా బరోడా నుంచి స్టాఫ్ కాలేజి బస్సులో ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి మధ్యలో ఆగుతూ పదకొండుకు పావాగడ్ చేరాము. అక్కడ నుంచి కొంత దూరం కొండ ఎక్కిన తరువాత రోప్ వే లో కొండ మీదకు చేరాము. అక్కడ నుంచి మళ్ళీ దాదాపు 200 మెట్లెక్కి కాళీ మాత ఆలయం చేరుకున్నాము. పావా గడ్ మన తిరుపతి కొండ లాగే అనేక కొండల సముదాయం. ఒక కొండ కొంత ఎక్కిన తరువాత ఇంకొక కొండ కనిపిస్తుంది. రోప్ డాడ్ ప్రయాణం చాలా ఉత్సాహం గా సాగింది. కాని పైకి వెళ్ళిన తరువాత ఎవరో చెప్పారు. 2003 లో రోప్ వే తెగి కాబిన్స్ లోయ లో పడి యాత్రికులు చచ్చి పోయారుట. దాదాపు 50 మంది గాయాల పాలయ్యారని. తరువాత రోప్ వెను ఇంకొక మంచి కంపెనీ కి కాంట్రాక్టు ఇచ్చారని తెలిసింది.

కాళీ మాత ఆలయం చాలా ప్రాచీనమైనది అని చెపారు కాని మధ్యనే కట్టినట్లు ఉంది. తరువాత తేలిసింది. ఇది నిజానికి ఎన్నో వేళ ఏళ్ళ నాటి దేవాలయం. కాని ముస్లిముల దండ యాత్రలలో ధ్వంసం అయింది. తరువాత మళ్ళీ పునర్ నిర్మాణం జరిగింది. ముస్లిములు అనేవారు శిల్ప కళను ఇతర మతాలను నాశనం చెయ్యటానికే పుట్టారేమో అని అక్కడ కొంతమంది కామెంట్ చేసి తిట్టారు. నిజమే కావచ్చు.

మన దేశంలో ఎక్కడ చూచినా ముస్లిముల చేతిలో ధ్వంసం అయిన దేవాలయాలు ఏన్నో కనిపిస్తాయి. ముస్లిములు ప్రపంచ వ్యాప్తం గా చీదరించుకో బడటానికి కారణం వారు ఏ దేశంలో ఉంటే ఆ దేశ సంస్కృతి తో మమేకం కారు. అక్కడి సంస్కృతినీ శిల్ప సంపదనూ దేవాలయాలనూ ధ్వంసం చేసారు. అందుకనే వారంటే సాధారణం గా వ్యతిరేక భావం ఉంటుంది అనిపించింది. ముఖ్యం గా గుజరాత్ లో ముస్లిం లు అంటే వ్యతిరేక భావం జనం లో బాగా కనిపిస్తుంది. కారణం ముస్లిం దండ యాత్రలలో మొదటగా దెబ్బ తిన్న రాష్ట్రం గుజరాత్ కావటమే అని నా గుజరాతీ స్నేహితుడు ఒకడు చెప్పాడు.

అదలా ఉంచితే, ఉత్తరాదిన మన లాగా శిల్ప సౌందర్యం తక్కువ. ఒక త్రికోణాకారపు ముఖం నేల బారుగా గుహ గోడకు చెక్కి దానికి రెండు పెద్ద కళ్లు నాలుక ఉన్న విగ్రహమే కాళీ మాత. రోప్ వె లో ప్రయాణించి పైన దిగిన తరువాత మళ్ళీ దాదాపు రెండు వందల మెట్లు ఎక్కాలి. అప్పుడు కొండ కొమ్ముకు చేరగలము. అక్కడే కాళీ మాత ఆలయం ఉంది. రెండు వందల మెట్లు చాలా వరకు నిటారుగా ఉండి ఎక్కటం కష్టం అనిపిస్తుంది.అలవాటు లేనివారికి కష్టం అవుతుంది. గుండె ఊపిరి తిత్తుల జబ్బులు ఉన్నవారు ఇక్కడ హరీ మనటం ఖాయం. అంత ఆయాసం వచ్చేలా సూటిగా పైకి ఉన్నట్లు ఉంటాయి.

ప్రదేశంలో ప్రాచీన జైన మందిరాలు చాలా ఉన్నాయి. కాని అవి శిధిలం అవుతున్నాయి. కాళీ మాత ఆలయం పాత దాన్ని పునరుద్ధరించి కొత్తగా కట్టినట్లు ఉంది. ఇక్కడ స్థల పురాణం బట్టి శ్రీ రాముని కుమారులు లవ కుశులు ఇక్కడ తపస్సు చేసినట్లు చెబుతారు. నాతో వచ్చిన మిత్రుడు జగదీశ్వర రావు గారికి ఇది ఒక పురాతన తాంత్రిక ఆలయం గా తోచింది. ఇక్కడ తాంత్రిక స్పందనలు అధికంగా ఉన్నాయి. దేవీ మంత్ర సాధనకు చాలా అనుకూల ప్రదేశం గా తోచింది. ఒకప్పుడు ఇక్కడ బలులు ఉండేవట. ప్రస్తుతం లేవు అని పూజారి చెప్పాడు. అహింస కు ఆలవాలం అయిన జైన మందిరాలు ఒక వైపు, బలులు మొదలైనవి జరిగే కాళికా ఆలయం ఇంకో వైపు విచిత్రం గా అనిపించింది.

చివరిగా ఇది సంగీత విద్వాంసుడైన బైజు బావరా నివసించిన ప్రదేశం అని తెలిసింది. బైజు బావరా ఇక్కడ కొండ కింద ఉన్నటువంటి చంపానేర్ అనే ఊళ్ళోనే ఉండేవాడని స్థానిక మిత్రులు చెప్పారు. ఈయన తాన్సేన్ సమకాలికుడు, తాన్ సేన్ కంటే బాగా పాడ గలిగిన వాడు అని అంటారు.

మేము రోప్ వేలో దిగి కిందికి వస్తుంటే దారిలో హార్ట్ ఎన్లార్జిమేంట్ ఉన్న ఒక ముసలామె నడవలేక ఆయాసపడుతూ కొడుకు కోడలు సహాయంతో అడుగులో అడుగు వేసుకుంటూ కొండ ఎక్కటం కనిపించింది. కష్టం అమ్మా పైన 200 మెట్లు మీరు ఎక్క లేరు అని మేము వారించినా వినకుండా ఎక్కుతున్న వారిని చూచి నోట మాట రాక అచేతనుల మైనాము. మన అయ్యప్ప దీక్షలవలె అక్కడి జనం కాళీ దీక్షలు ధరించి దారి పొడుగునా నడుచుకుంటూ సూరత్ నుంచి అహమదాబాదు నుంచి కూడా నడిచి వచ్చి కొండ నేక్కుతున్నారు.

ఇక్కడ చుట్టూ పక్కల భిల్లులు అనే కొండ జాతి వారు అధికం అని తెలిసింది. చివరి రెండువందల మెట్లు పరిగెత్తుకుంటూ ఎక్కి రొప్పుతూ రోజుతూ నాలిక బయట పెట్టి కాళీ మాత లాగే అరుస్తూ ఆమె ముందు మోకరిల్లి నమస్కారం చేస్తున్నారు. పూజారి ప్రశాంతం గా వీరి చేష్టలు చూస్తూ ఆశీర్వచనం చేస్తున్నాడు. అతని ముఖం మంచి కళగా ఉంది. కాళీ మంత్ర ఉపాసకుడని తెలిసింది.

కొండ మీద అక్కడక్కడా పాడు బడిన పడుతున్న జైన మందిరాలు ఇతర గుళ్ళు విశిరేసినట్లుగా ఉన్నాయి. చీకటి గుహలుగా కొన్ని ఉన్నాయి. గబ్బిలాలు పాములకు నిలయాలుగా కనిపించాయి. ఒక పురాతన జైన మందిరం పార్శ్వ నాథునిది కనిపించింది. అందులో జప ధ్యానాలు చేసుకొని తిరిగి రోప్ వె ద్వారా క్రిందికి దిగాము. దిగుతున్నపుడు ఇంతకు ముందు ఏక్సిడెంట్ లో రోప్ వె తెగి కింద పడి పోయిన వారి మానసిక స్థితి తలపుకు వచ్చింది. ఇటువంటి సామూహిక మరణాలకు కారణం సమిష్టి కర్మ. ఇవి ఎందుకు జరుగుతాయి అనేదానికి మహా భారతం లో భీష్మ పితామహుడు ధర్మ రాజుకు వివరించిన ఘట్టం గుర్తుకు వచ్చింది.

మేము సరిగ్గా మిట్ట మధ్యాన్నం 12 నుంచి 3 లోపల కొండనెక్కి దిగాము. భయంకరమైన ఎండా మన విజయ వాడ గుంటూరు ఎండలను తలపించింది. సాయంత్రానికి తిరిగి బరోడా చేరాము. మర్నాడు మా గ్రూపులో చాలా మంది వడ దెబ్బతో పడక లేశారు. బలహీనులు, ముసలి వారు యాత్ర జోలికి పోవాలంటే చలి కాలం శ్రేష్టం. కాని వేసవిలో పోతే మాత్రం వడ దెబ్బతో అడ్డం పడటం ఖాయం.
read more " మా పావా గడ్ యాత్ర "

11, జూన్ 2009, గురువారం

దశ మహా విద్యలు


శాక్తతంత్రములో ఎందరు దేవతలున్నా ముఖ్యముగా ఉపాసింపబడే వారు దశమహావిద్యలు.అచింత్యము, అవ్యక్తము అయిన చైతన్యమును ఈశ్వరుడు అంటుంది తంత్రము.అదే చైతన్యము కదలికను పొంది త్రిగుణాత్మికగా మారి సృష్టిస్థితిలయములను చేస్తున్నపుడు శక్తి అవుతుంది.ఆ శక్తి ప్రపంచమును నడిపించుటకు పదిరూపాలుగా ఉంటుంది.ఆ పదిరకములైన శక్తులే దశమహా విద్యలు.

కాళి,తార,భువనేశ్వరి,బగలాముఖి,ఛిన్నమస్త, త్రిపురభైరవి,కమలాత్మిక,ధూమవతి,లలిత, మాతంగి అనబడువారే దశమహావిద్యలు.వీరు కేవలము బాహ్య ప్రపంచము నందేగాక అంతర్ప్రపంచమున కూడా అధివసించి ఉంటారు.కనబడే బాహ్యప్రపంచముగాని,కనపడని ఆంతరిక ప్రపంచముగాని వీరి ఆధీనములోనే నడుస్తూ ఉంటాయి.వీరిని సాధనామార్గమున దర్శించవచ్చు. వీరి అనుగ్రహమును పొందవచ్చు.దానితో ప్రపంచమున అసాధ్యములైన కార్యములు సాధించవచ్చు.వీరు శక్తులు.అనగా ఎనర్జీ బాడీ కలిగిన చైతన్యపుంజములు.

జగన్మాత భుక్తిముక్తి ప్రదాయిని.అనగా ఐహిక లాభములను ఆముష్మిక లాభములను కూడా సమముగా ప్రసాదించగలదు.ఎక్కువగా మానవులు ఈ శక్తులను ఐహికలాభముల కోసమే ఉపాసించటం కనిపిస్తుంది. ఆంద్రదేశములో వీరి ఉపాసన తక్కువ.అక్కడక్కడ ఒకరిద్దరు ప్రసిద్ధ దేవీ ఉపాసకులు కనిపిస్తుంటారు. కాని బెంగాలు రాష్ట్రములో,అస్సాంరాష్ట్రములో, ఒకప్పటి కాశ్మీరులో, నేటి కేరళ లో వీరి ఆరాధన ఎక్కువగా ఉంది.

జ్యోతిషపరంగా,ఒరిస్సాలోని కటక్ కు చెందిన డా||నిమాయి బెనర్జీగారు, లగ్నము మరియు తొమ్మిది గ్రహములను కలిపి మొత్తం పది దోషములకు, దశమహావిద్యలతో రేమేడీలు చేయగల గొప్ప మంత్రోపాసకుడు.ఈయన ప్రస్తుతము జ్యోతిషవిద్యను అధిగమించి పూర్తిగా కాళీ ఉపాసనలో మునిగినవాడు.రోజులో ఎక్కువ భాగం ధ్యానసమాధిలో కాలం గడుపుతూ ఉన్నవాడు.Planets and Forecast పత్రికకు సంపాదకుడు.ఈయన ఇంటర్వ్యూ కోసం చాలామంది MP లు క్యూలో ఉంటారు.

రాజస్తాన్ కు చెందిన నారాయణదత్త శ్రీమాలికూడా ప్రసిద్ధి చెందిన తంత్రవేత్త. Mantra-Tantra-Yantra పత్రికను నడిపేవారు.మన ఆంద్రదేశంలో చందోలుశాస్త్రిగారు అనబడే తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి గారు గొప్పదేవీ ఉపాసకుడు. వీరిలో శ్రీమాలి గారు, శాస్త్రి గారు ఇప్పుడు లేరు,గతించారు. 

జాతకములో బలం లేకపోవటం పూర్వజన్మల చెడుకర్మ వల్ల కలుగుతుంది. దానిని పోగొట్టుకొని సుఖశాంతులతో జీవితం గడపవలేనని ప్రతివానికీ ఉంటుంది.దానికి దైవబలం తప్పనిసరిగా కావాలి.దశమహావిద్యల ఉపాసనద్వారా జాతకములోని చెడును నిర్మూలించు కోవటం సాధ్యం అవుతుంది.శక్తి అనుగ్రహం వల్ల పూర్వకర్మల చెడుప్రభావం భస్మీపటలం అవుతుంది. కనుక దోషాన్ని బట్టి ఏ దేవతాఉపాసన అవసరమో చూచుకొని దానిని ఆచరించడంద్వారా సుఖ శాంతులతో కూడిన జీవితాన్ని పొందవచ్చు.
read more " దశ మహా విద్యలు "

9, జూన్ 2009, మంగళవారం

స్వైన్ ఫ్లూ- హోమియో ఔషధాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త రోగం స్వైన్ ఫ్లూ. దీన్నిH1N1 వైరస్ అని పిలుస్తున్నారు. దీనిలక్షణాలు మరియు హోమియో ఔషధాలు పరిశీలిద్దాం.

లక్షణాలు:
ముక్కు కారుడు, గొంతు నొప్పి, దగ్గు, జ్వరం,ఒళ్ళు నొప్పులు, తల నొప్పి,చలి, నీరసంఉంటాయి. వీటికి తోడూ వాంతులు విరోచనాలు ఉండవచ్చు. ఇప్పుడు ఇది మనిషి నుంచిమనిషికి వ్యాపించే దశకు చేరుకుంది. డిల్లీ లో కేసులు ఉన్నాయి అంటున్నారు. మన దేశం లో ఉన్న అద్వాన్నపరిస్థితులు నగరాల లోని కాలుష్యం రైళ్ళు బస్సులలో ప్రయాణాల వల్ల త్వరలో దేశమంతా పాకవచ్చు. లక్షణాలుకనిపించిన తోడనే ఇదే రోగం అని నిర్థారణకు రావద్దు. పరీక్షలలో తేలితే అప్పుడు మందులు వాడాలి. రోగానికిపనికొచ్చే హోమియో మందులు ఇక్కడ ఇస్తున్నాను.

ఉపయోగ పడే హోమియో మందులు:
చలి, జ్వరం ,ఒళ్ళు నొప్పులు, తల నొప్పి ఉంటే
యూపతోరియం పెర్ఫోలిఎటం అనే మందు బాగా పని చేస్తుంది. లక్షణాలను బట్టి రుస్ టాక్స్ అనే మందూ వాడవచ్చు.

వాంతులు విరేచనాలు ఉన్నపుడు
చైనా, ఆర్సేనికం, విరేట్రం అనే మందులు బాగా పని చేస్తాయి. వీటికి తోడుగాముందు ఒక డోసు ఇంఫ్లుఎంజినం అనే నోసోడ్ ను 200 పోటేన్సిలో వాడి తరువాత లక్షణాలను బట్టి పైనచెప్పిన మందులు నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున వేస్తూ రోగం తగ్గే కొలదీ క్రమేణా వ్యవధి పెంచుతూ రావాలి. లక్షణాలను బట్టి స్పాన్జియా, ఫాస్ఫరస్ అనే మందులు కూడా అవసరం కావచ్చు.

మందులు వాడి స్వైన్ ఫ్లూ రోగాన్ని సమర్థ వంతం గా ఎదుర్కోవచ్చు.
read more " స్వైన్ ఫ్లూ- హోమియో ఔషధాలు "

8, జూన్ 2009, సోమవారం

వినరో భాగ్యము విష్ణు కథ

నిన్న పని మీద తిరుపతి లో ఉన్నాను. సాయంత్రం గోవిందరాజ స్వామి కోనేటి మెట్ల మీద శ్రీసామవేదం షణ్ముఖ శర్మ గారి " వినరో భాగ్యము విష్ణు కథ" అనే ఏడు రోజులు ప్రవచనం లోమొదటి రోజు జరుగుతున్నది. ప్రసంగం ఆద్యంతమూ వినడం జరిగింది. ఒక వందా రెండువందల మించి జనం రాలేదు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో ఇంత తక్కువ స్పందనా అనిఆశ్చర్యం కలిగింది.

శర్మగారి ప్రసంగం వినటం నాకిదే మొదటిసారి. చాలా హృద్యంగా, ఆశువుగా, ఆహ్లాద కరంగాసాగింది. విష్ణు పురాణం నుంచి కొన్ని ఘట్టాలను తీసుకొని సృష్టి పూర్వం ఉన్నటువంటి వటపత్ర శయనుడైనపరమాత్ముని అవతారాన్ని, తరువాత విశ్వ రూపుడైన విరాట్ పురుష అవతారాన్ని, తరువాత భూమిని ఉద్ధరించినయజ్ఞ వరాహ అవతారాన్ని ఇలా మూడు విష్ణు అవతారాల వైభవాన్ని చక్కగా వివరించారు.

అవ్యక్తమైన భగవత్ తత్వాన్ని, వ్యక్త రూపములైన అవతారాలను సమన్వయ పరుస్తూ చెప్పిన ఉదాహరణలు చాలాచక్కగా ఉన్నాయి. ముఖ్యంగా విషయం లో తాదాత్మ్యం చెంది ఆయన చెప్పే తీరు నాకు బాగా నచ్చింది. వేదములనుంచి, ఉపనిషత్తు నుంచి సందర్భానుసారంగా ఉదాహరించటం నచ్చింది. ఆయన శైవం మీద, శాక్తేయంమీద బాగా మాట్లాడగలరని విన్నాను. కాని అంతే సమానంగా విష్ణు వైభవం గురించి చాలా బాగా మాట్లాడారు. సరస్వతీకటాక్షం, ఉపాసనా బలం కలిగిన వ్యక్తి గా నాకు తోచింది. ముఖ్యంగా మన సనాతన ధర్మము (హిందూ మతము) గురించి తెలిసీ తెలియక వ్యాఖ్యానించే వారు శర్మ గారి ఉపన్యాసాలు తప్పక వినాలి. ముఖ్యంగా హిందువులు ఇతరమతాలలోకి గుంపులుగా మారుతున్న నేటి రోజులలో హిందూ మతం గొప్పతనాన్ని తెలియ చెప్పే ఇటువంటి పండితులఉపన్యాసాలు చాలా అవసరం.

కార్యక్రమం వెంకటేశ్వర భక్తి చానల్ వారు లైవ్ రికార్డింగ్ చేసారు. వారం రోజులు కార్యక్రమం ఉంటుంది. నా బ్లాగుచదివేవారిని ప్రోగ్రాం తప్పక చూడమని, తెలిసిన వారికి చూపించమని కోరుతున్నాను.
read more " వినరో భాగ్యము విష్ణు కథ "

6, జూన్ 2009, శనివారం

తంత్ర విద్య

"తన్యతే విస్తార్యతే ఇతి తంత్రం" -- దేనివల్ల అయితే తెలియబడుతుందో దేనివల్ల అయితే వ్యాపిస్తుందో అది తంత్రము. ఈనిర్వచనము కొంత అర్థంకానిదిగా ఉంటుంది.

జ్ఞానము మానవఅనుభవానికి అతీతంగా ఉన్నప్పటికీ అందుబాటులోనే ఉంటుంది. దానిని అందుకొనడానికి ఒక ప్రక్రియ అవసరం. ఆప్రక్రియే తంత్రం అని పిలువబడుతుంది. ఏమీ చెయ్యకుండా ఊరకేఉండే జ్ఞానమార్గసాధన గాని, బుద్దుని విపస్సానధ్యానంగాని అవీ ఒకప్రక్రియలే. కనుక అవీ తంత్రమార్గము యొక్క పద్ధతులే అనిచెప్పవచ్చు.

సృష్టినియమాలను అర్థంచేసుకొని ఆయాపద్ధతుల ద్వారా ఆయా శక్తులను సాధించుట, ఆయా అలౌకిక అనుభవాలను, శక్తులను పొందటానికి తంత్రము ఉపయోగపడుతుంది. తాంత్రికజ్ఞానము ఒక బలీయమైన శక్తి. దానిని మంచికీ వాడవచ్చు, చెడుకూవాడవచ్చు. లేక ఆత్మజ్ఞానప్రాప్తికీ వాడవచ్చు. లేక దేవతాసాక్షాత్కారానికి, సిద్ధులసంపాదనకూ వాడవచ్చు. మనము ఉపయోగించుకునే విధానాన్నిబట్టి తిరిగికర్మను మనమే సృష్టి చేసుకుంటాము. కనుక దానినివాడిన తీరునుబట్టి మనం మళ్ళీ ఖర్మ అనుభవించవలసి వస్తుంది.


తంత్రము పరమశివప్రోక్తము. ప్రపంచానికి ఆదిగురువు పరమశివుడు. ఆయన శక్తికి ఉపదేశించినవే అరవై నాలుగుతంత్రములు. ఇవి అన్నీ పరమరహస్యములు. రహస్యంగా ఎందుకు ఉంచాలి?-- అలాఉంచి బ్రాహ్మణులు అంతా నాశనం చేసారు అని ఒక పిడివాదన ఉన్నది. 

మనచరిత్ర మనంమర్చిపోయి ఇంగ్లీషువాడు తన అసూయతో వ్రాసిన చెత్తచరిత్ర చదువుతూ అదేనిజమని నమ్ముతున్న స్థితిలో ఇటువంటి భావాలుకలగడం సహజమే. బ్రాహ్మణులు దేనినీ దాచిపెట్టలేదు. అర్హులైనవారికి అన్నీ ఉపదేశించారు. తమ కులంఏమిటో తెలియకపోయినా ఋషుల శిష్యులై వేదవేదాంగాలను నేర్చుకున్న సత్యకామజాబాలివంటివారు వేద సాహిత్యంలో ఎందఱో కనిపిస్తారు. మంచినడవడికా, మంచిప్రవర్తనా ఉన్నవారికి అన్నీ అందుబాటులోనే ఉంటాయి. నలందా విశ్వవిద్యాలయంలో ఎన్నిరకాలైన సబ్జెక్టులు బోధింపబడేవో ఎక్కడెక్కడినుంచి విద్యార్ధులు వచ్చి అక్కడ నేర్చుకునేవారో ఆలోచిస్తే బ్రాహ్మణులు దాచిపెట్టారు అన్న వాదన అసంబద్దం అనితేలిపోతుంది. ముస్లిముల దండయాత్రలవల్లా, వారి రాక్షసచర్యలవల్లే మన విలువైన సాహిత్యం అంతా నాశనమైంది. అంతేగాని బ్రాహ్మణులు దాచిపెట్టినందువల్ల కాదు. ఇంకాచెప్పాలంటే వేదాలను తమమస్తిష్కాలలో నిక్షిప్తం చేసుకొని తరతరాలుగా వాటిని అందిస్తూ కాపాడుతూ వస్తున్న అద్భుతప్రక్రియ వల్లే ఈనాటికీవేదాలు నిలబడిఉన్నాయి అంటే దానికి బ్రాహ్మణులే కారకులని ఘంటాపదంగా చెప్పవచ్చు.


అదీగాక అన్నింటినీ రోడ్డుమీద వ్యాపారానికి పెట్టలేము. తెలుసుకొని అందరూ చెయ్యగలిగేదికూడా ఏమీఉండదు.  అర్హులైనవారికి అన్నీ నేర్పించబడతాయి. ఇది ప్రక్రుతిధర్మం. ఆటంబాంబు ఎలా తయారుచెయ్యాలో థియరీపరంగా మనకు తెలుసు. కాని దానిని తయారు చెయ్యవలసి వస్తేమాత్రం, ముందుగా, యురేనియం ప్లుతోనియం వంటి ఆయా పదార్ధాలు సంపాదించాలి, వాటిని శుద్ధిచెయ్యాలి, ఆయాపరికరాలు ఉండాలి, ప్రక్రియావిధానం మెట్టుమెట్టుగా తెలియాలి, ప్రయోగవిధానం తెలియాలి, తీరా ప్రయోగంలో తేడావస్తే ఎలా దానిని నిగ్రహించాలో తెలియాలి. ఇన్ని మెలికలు అందులో ఉన్నాయి.

అలాగే తంత్రవిద్య ఊరకే పైపైన తెలిస్తే చాలదు. దానికి కొన్ని మూలికలు, ద్రవ్యములు, వస్తువులు, ఉపకరణాలు కావాలి. వాటిని ఉపయోగించే విధానం తెలియాలి. సమర్థుడైన గురువు దొరకాలి. సాధన చేయాలి. సాధనలో ఆటంకాలు ఏర్పడితే ఎలావాటిని అధిగమించాలో తెలియాలి. అన్నిటినీమించి సాధకునికి కొన్నిఅర్హతలు ఉండాలి. జీవితంలో కొన్నికొన్నింటిని తనంతట తాను వదులుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే తంత్రసిద్ధి కలుగుతుంది.

అసలు ఇంత గొడవ ఎందుకు? ఎందుకొచ్చిన మంత్రతంత్రాలు? హాయిగా మనబతుకు మనం బతికితే పోలా? అనుకుంటే ఏ సమస్యా లేదు. అయితే, మన అవగాహనారాహిత్యంతో ఇటువంటి భావాలు కలుగుతాయి. సివిల్ సర్వీస్ సాధించటానికి ఎంత కష్టపడి చదువుతుంటారో మనకు తెలుసు. ఐఐటీ సీటు కోసం రాత్రింబగళ్ళు చదువుతారు. దేశంగానిదేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా పోయి వాళ్లచేత తన్నులు తింటూ అవమానాలు భరిస్తూ ఎందుకు బతుకుతున్నారు ? ఇవన్నీ ఎందుకు? తిండి కోసమేగా? హాయిగా పల్లెటూళ్ళో చెట్టుకింద నులక మంచం వేసుకొని చద్దన్నం తింటూ చీకూచింతా లేకుండా కాలం గడపవచ్చుగా? తిండికోసం ఇన్నిదేశాలు తిరగడం ఎందుకు? ఇన్ని చదువులెందుకు? ఇన్ని బాధలెందుకు? ఇన్ని టెన్షన్ లెందుకు? మనం తినే ఒకముద్ద అన్నంకోసం ఇన్ని బాధలు పడాలా -- అంటే ఎలా ఉంటుంది? ఇదీ అంతే. మనిషికి ఏదో సాధించాలనే తపన అంతర్లీనంగా ఉంటుంది. కొందరు లౌకికప్రయోజనాలు ఆశిస్తారు. ఇంకొందరు పారలౌకిక ప్రయోజనాలు కోరతారు. తంత్రం రెండూ ఇవ్వ గలదు. ప్రక్రుతి శక్తులను తన చేతిలోకి తీసుకొని వాటితో పనులు సాధించటం తంత్రం లో ఒక భాగం.

తంత్రసాధనవల్ల ప్రపంచంలో సాధించలేనిది లేదు. తంత్రసిద్దుల వల్ల మానవుడు కోరుకునే సమస్తమూ ప్రకృతి నుంచి సాధించవచ్చు. మానవుని తీరనికోరికలు తంత్రసాధనవల్ల, దేవతానుగ్రహం వల్ల తీరుతాయి. కావాలి అనుకుంటే కోరికలకు అతీతమైన స్థితీ అందుకోవచ్చు. అకుంఠిత దీక్షా, సాధనా ఒక్కటే కావలసింది.

మనిషి ఎంతకష్టపడినా, పాకులాడినా దేవతాఅనుగ్రహం లేకుంటే ఏమీ సాధించలేడు. సివిల్ సర్వీస్ పరీక్షలోఇంటర్వ్యూ స్థాయి దాకా వెళ్లి నెగ్గినవాడికీ, నెగ్గని వాడికీ తెలివిలో పెద్దతేడా ఉండదు. కాని మొదటివాని జీవితం అనూహ్యంగా మారుతుంది. రెండవవాని  జీవితం మామూలుగా ఉంటుంది. ఏమిటీ తేడా? శక్తిఅనుగ్రహం లోనే తేడా ఉంటుంది. అదిఉంటే అన్నీ సాధ్యమే. అది లేకుంటే మానవుడు ఏదీ సాధించలేడు. శక్తి అనుగ్రహాన్ని పొందే విధానమే తంత్రం. 

శక్తిఅనుగ్రహం లేకపోతె శివుడుకూడా కదలలేడు అని శంకరులు తన "సౌందర్యలహరి" లో అంటారు. శక్తిసహాయం తోనే శివుడు సృష్టి చెయ్యగలుగుతున్నాడు. శక్తిఅనుగ్రహాన్ని పొందిన సిద్ధుడు సృష్టినియమాలను  మార్చగలడు. శక్తి అనుగ్రహసాధనే తంత్రం.
read more " తంత్ర విద్య "