“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

27, జనవరి 2023, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర - 90 (గుడ్ బై అమెరికా - ప్రస్తుతానికి)

అమెరికాకు గతంలో వచ్చిన రెండుసార్లూ వేసవికాలంలో వచ్చాను. ఈసారి కావాలని చలికాలంలోనే వచ్చాను. ఏమంటే, అందరూ భయంకరంగా వర్ణిస్తున్న డెట్రాయిట్ చలి ఎలా ఉంటుందో చూద్దామని ఇలా వచ్చాను. మైనస్ డిగ్రీల చలిని ప్రత్యక్షంగా చూచాను.

అయితే, గత 40 ఏళ్ల అమెరికా చరిత్రలో ఈ చలికాలమే అతితక్కువ చలిగా ఉందట. మామూలుగా అయితే ఈ సమయానికి గుట్టలు గుట్టలుగా మంచు ఉంటుందట. ఈ ఏడాది లేదు. మంచుతుఫాన్ వల్ల గత రెండు రోజులనుంచి మాత్రమే మంచుగుట్టలు కనిపిస్తున్నాయి. ఇదంతా అమెరికా న్యూస్ ఛానల్స్ లో చెబుతున్నారు. మనం అడుగుపెట్టిన వేళా విశేషమేమో మరి? లేదా క్లైమేట్ చేంజ్ ప్రభావం కావచ్చు.

'ఇప్పుడే మీకు నరకంలాగా అనిపించిందా? ఇంతకు ముందొచ్చినట్లైతే ఇంకేమనేవాళ్ళో?' అంటున్నారు ఇరవై ఏళ్ల పైనుంచీ ఇక్కడుంటున్న నా శిష్యులు. ఏమీ అనను. ఏదో మాటవరసకి నరకం అన్నానుగాని, నిజానికి అలాంటిదేమీ లేదు. స్వర్గనరకాలు మనసులో ఉన్నాయిగాని బయటేముంది? ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటాయి. మనిషి జీవితమే ఇంత !  

ఈ ఆరునెలల కాలంలో నేను ఎటువంటి టూరిస్ట్ ప్లేసులూ చూడలేదు. కనీసం చాలామంది పొలోమంటూ పరిగెత్తిపోయి చూచే నయాగరా జలపాతం, లాస్ వెగాస్ లు కూడా చూడలేదు. ఊరకే ఇంటిపట్టున ఉన్నానంతే. అవన్నీ చూడాలని మనకు ఇంట్రస్ట్ ఉంటే కదా అక్కడకు వెళ్ళడానికి? ఏముందక్కడ చెత్త ! నేను అమెరికాకు వచ్చింది నన్నభిమానించే  మనుషులకోసం గాని, ప్లేసుల కోసం కాదు. టూరిస్టు ప్లేసులు చూడాలంటే ఇండియాలో లేవా? ఇండియాలో లేనివి ఇక్కడేమున్నాయి?

మరి ఈ ఆరునెలలకాలంలో ఏం చేశాను? లోకం దృష్టిలో ఏమీ చెయ్యలేదు. నాలుగు గోడల మధ్యలో ఉంటూ, నా సాధనలో నేను కాలం గడిపాను. అదేంటో లోకానికి తెలియదు. తెలియవలసిన అవసరం కూడా లేదు.

అయితే, లోకానికి కనిపించే పనులు కూడా కొన్ని చేశాను.

ఆధ్యాత్మిక నిధులవంటి పది అద్భుతములైన పుస్తకాలను వ్రాశాను. అవి, 

    • 1. శ్రీ గోరక్ష వచన సంగ్రహము 
    • 2. యోగబీజము 
    • 3. అధ్యాత్మోపనిషత్ 
    • 4. Medical Astrology - II
    • 5. ఉత్తరగీత
    • 6. శ్రీరామగీత 
    • 7. సనత్సుజాతీయము 
    • 8. కైవల్యోపనిషత్ 
    • 9. వేదాంతసారము 
    • 10. ముక్తికోపనిషత్. 
అయిదు స్పిరిట్యువల్ రిట్రీట్స్ ను నిర్వహించాను. అవి, 
    • 1. డెట్రాయిట్ రిట్రీట్ 
    • 2. గాంగెస్ రిట్రీట్ 
    • 3.  షాంపేన్ రిట్రీట్ 
    • 4. కేంటన్ రిట్రీట్ 
    • 5. ట్రాయ్ రిట్రీట్.
  • అమెరికా శిష్యులకు యోగ - తంత్ర దీక్షలిచ్చాను.
  • ఇరవైగంటల పైగా నిడివిగల ఆడియో ఉపన్యాసాలిచ్చాను. శిష్యులడిగిన అనేక ఆధ్యాత్మిక సందేహాలను తీర్చాను.
  • ఈ పర్యటనా విశేషాలను వివరిస్తూ 90 పోస్టులను వ్రాశాను.
ఈ ఆర్నెల్లకాలంలో, అమెరికా నాలుగుమూలలా ఉన్న నా శిష్యులు నన్ను తమ కుటుంబసభ్యులలాగా చూసుకున్నారు. వాళ్ళు చూపించిన ప్రేమను, గౌరవాన్ని ఎన్నటికీ మరచిపోలేను. అంతగా నన్ను అభిమానించారు. నేను నడచిన సాధనామార్గంలో వాళ్ళు కూడా నడవడానికి సిద్ధమయ్యారు. నావద్ద యోగదీక్షలను స్వీకరించారు. నేను నడచిన, నడుస్తున్న యోగమార్గం లోకి అడుగుపెట్టారు. వాళ్ళ మంచితనానికి, సత్ప్రవర్తనకు ఎంతో ఋణపడ్డాను.

దీనికి భిన్నంగా, చాలాఏళ్ల నుంచీ పరిచయం ఉన్న కొందరు పాతశిష్యులైతే ఈ ఆర్నెల్లకాలంలో నన్ను చూడటానికి రాకపోగా, కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు. అంతగా డబ్బు వ్యామోహంలో కూరుకుపోయారు. లేదా, వారికి కావలసినవి నా దగ్గర దొరకలేదేమో? బహుశా, వారికి కావలసినవి ఇచ్చే గురువుల వద్దకు చేరిపోయి ఉంటారు. సరే, వాళ్ళ ప్రాప్తం అంతవరకే. మాయాప్రభావం అలాంటిది మరి ! దానిని తప్పుకోవడం ఎవరికి సాధ్యం? అది ఒక్కొక్కరిని ఒక్కొక్కవిధంగా పట్టుకుంటుంది. ఆడిస్తుంది. అంతిమంగా చూస్తే, ఎవరి కర్మ వారిది. అంతే !

నేను ఉపదేశించే యోగమార్గంలో నడిచేవాళ్ళనే నేను ఇష్టపడతాను. వారికే నా సమయాన్ని కేటాయిస్తాను. అంతేగాని, కాలక్షేపం కోసం ఫోన్లు చేసేవాళ్ళను, అవసరం ఉన్నపుడు మాత్రమే ఫోన్లు చేసేవాళ్లను, పనులు కావడం కోసం జ్యోతిష్యప్రశ్నలు, పరిహారాలు అడిగేవాళ్ళను, లౌక్యంగా మాట్లాడేవాళ్ళను దూరం ఉంచుతాను. అలాంటివారితో మాట్లాడటం కూడా టైం వేస్ట్ అని నా అభిప్రాయం. లోకుల దురాశకు అనుగుణంగా డాన్స్ చేసే బిజినెస్ గురువులు, జ్యోతిష్కులు చాలామంది లోకంలో ఉన్నారు. అలాంటి వాళ్ళకు అలాంటి వాళ్ళే సరిపోతారు. మనదారి వేరు. శుద్ధమైన యోగ-వేదాంత మార్గంలో నడిచేవాళ్లే నాతో ఉంటారు. ఉండగలరు కూడా. అందరికీ అది సాధ్యం కాదు.

ఆర్నెల్లు అయిపోయాయి. అమెరికా పొమ్మంటోంది. ఇండియాలోని మా ఆశ్రమం రమ్మంటోంది. ఇప్పుడు ఇండియాకు బయలుదేరుతున్నాను.

నాతో ఆత్మీయతానుబంధాన్ని పెంచుకున్న అమెరికాశిష్యులు కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు. ఆర్నెల్లనుంచీ వదలి ఉన్న ఇండియా శిష్యులు ఇక త్వరగా వెనక్కు రమ్మంటున్నారు. వారిలో కొందరు వాళ్ళ US సిటిజెన్ షిప్ నీ, మరికొందరు తమ గ్రీన్ కార్డులనీ సరెండర్ చేసి మరీ, నాతోపాటు ఆశ్రమజీవితం గడపడానికి ఇండియాకు వచ్చి సెటిలై ఉన్నారు. నా రాకకోసం ఎదురుచూస్తున్నారు. కనుక వాళ్ళ కోసమైనా నేను ఇండియాకు తిరిగి రావాలి.

గుడ్ బై అమెరికా, ప్రస్తుతానికి.

ఒకటి రెండేళ్లలో మళ్ళీ కలుసుకుందాం ... వీలైతే !