“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, జనవరి 2023, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 89 (పరాశక్తి ఆలయం - మంచుతుఫాన్)

అమెరికా ట్రిప్ ముగియబోతోంది.

పాంటియాక్ లోని పరాశక్తి ఆలయంతో, ఇక్కడి పరాశక్తి అమ్మవారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఈ అనుబంధం ఇప్పటిది కాదు. బయటకు కన్పించడం వరకూ, గత పదేళ్లనుంచీ ఇది కొనసాగుతోంది. దానికి ముందు ఇంకా ఎంతో కాలం నుంచీ ఉంది. కానీ ఆ విషయాలు ఇక్కడ వ్రాయను. మీరు నమ్మలేరు. కాబట్టి అనవసరం.

ఈ ప్రాంతంలో దేవి పరాశక్తి ఆలయం ఉన్న వీధిపేరు సరసోత లేన్. నాలుగువందల ఏళ్ల క్రితం యూరోపియన్స్ అమెరికాను ఆక్రమించినపుడు అప్పుడున్న పేర్లనే ఇప్పటికీ ఉంచారు. అవన్నీ అప్పటి రెడ్ ఇండియన్స్ పెట్టుకున్న పేర్లు. చాలాప్రాంతాలకు రెడ్ ఇండియన్స్ పెట్టిన పేర్లను అమెరికన్స్ అలాగే ఉంచేశారు. వాటిలోవే ఈ పాంటియాక్, సరసోత మొదలైనవి. నిజానికి ఈ 'సరసోత' అనేది 'సరస్వతి' అనే వైదిక జ్ఞానదేవత  యొక్క పేరు. సరస్వతీ అమ్మవారిని రెడ్ ఇండియన్స్ 'సరసోత' అనేవారు. అదేపేరును అమెరికా వాళ్ళు కూడా ఇప్పుడు వాడుతున్నారు. దాని అర్ధం వారికి తెలీదు. మనకు తెలుసు.

చరిత్ర ప్రకారం, దాదాపు పదివేల సంవత్సరాల క్రిందటినుంచీ ఇక్కడి పాంటియాక్ ప్రాంతంలోని రెడ్ ఇండియన్స్, జ్ఞానదేవతయైన సరస్వతీదేవిని ఆదిపరాశక్తిగా ఆరాధించేవారు. ఆమెను "సరసోత" అని వాళ్ళు పిలిచేవారు.  యూరోపియన్స్ వచ్చి అదంతా ధ్వంసం చేసేశారు. రెడ్ ఇండియన్ల భాషనూ సంస్కృతినీ ఆచారాలను అన్నింటినీ తుడిచి పెట్టేశారు. పనికిరాని అబద్దాలపుట్ట క్రైస్తవాన్ని వాళ్ళమీద బలవంతంగా రుద్దారు.  కానీ, వాళ్ళు చేసిన తప్పులు వాళ్లకు తెలుసు. అందుకని, భయంచేత అదే పేరును ఇప్పటికీ అలాగే ఉంచారు. ఇప్పుడు సరిగ్గా ఇదేచోట, తమిళులు అద్భుతమైన ఆదిపరాశక్తి ఆలయాన్ని నిర్మించారు. దాదాపు 40 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారు తమిళ సోదరులు.

చాలా ఏళ్లక్రితం ఇక్కడికొచ్చి స్థిరపడిన డాక్టర్ కృష్ణకుమార్ అనే తమిళసొదరుడు ఒకసారి కంచిలో నాడీజ్యోతిష్యం చూపించుకున్నపుడు, 'నువ్వు అమెరికాలో అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తావు' అని రీడింగ్ వచ్చింది. మొదట్లో ఆయన దానిని నమ్మలేదు. కానీ అనేక ఏళ్ల తర్వాత ఈ ఆలయాన్ని ఆయనే నిర్మించవలసి వచ్చింది. అదే నేటి ఆదిపరాశక్తి ఆలయం.

పదేళ్ల క్రితం, అంటే 2013 లో నేను 'శ్రీవిద్యారహస్యం' పుస్తకాన్ని వ్రాశాను. ఆ తరువాత, ఈ ఆలయానికి 2016 లో మొదటిసారిగా వచ్చాను. అప్పుడే ఇక్కడ 'శ్రీవిద్యోపాసన' మీద ఉపన్యాసమిచ్చాను.  ఆ తరువాత 2017 లో వచ్చాను. అప్పుడు 'లలితాసహస్రనామాలు - శక్తి ఉపాసన' అనే అంశం పైన మాట్లాడాను. నేను వ్రాసిన 'శ్రీ లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక' అనే పుస్తకం వ్రాయాలన్న సంకల్పం ఈ ఆలయంలో ఉన్న సమయంలోనే నాలో కలిగింది. అదే ఆ పుస్తకంగా ఆవిర్భవించింది. నేడు వేలాదిమందికి స్ఫూర్తినిస్తోంది.

ఈ ఆలయానికి మళ్ళీ ఇప్పుడొచ్చాను. ఈసారి ఎటువంటి ఉపన్యాసమూ ఇవ్వలేదు. ఇక్కడివాళ్ళు మాట్లాడమన్నారు. కానీ నేనే తిరస్కరించాను. వచ్చిన ప్రతిసారీ ఒక్కొక్కవిధంగా జగన్మాత నన్ను అనుగ్రహిస్తూనే ఉన్నది. అవన్నీ ఇక్కడ వ్రాసి మిమ్మల్ని అపనమ్మకానికి గురిచేయడం నాకిష్టం లేదు.

కానీ ఒక్కవిషయం చెప్తాను. ఈ ఆలయంలో అద్భుతమైన శక్తితరంగాలున్నాయి. ఇక్కడున్నంత సేపూ మనం అమెరికాలో ఉన్నామన్నది పూర్తిగా మర్చిపోతాం. ఇండియాలోని ఏదో ఒక శక్తిపీఠంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ఆలయం నుండి బయటకు రావాలని అనిపించదు. అంతటి శక్తిప్రభావం ఇక్కడ ఉన్నది.

నిన్న ఆలయానికి వెళ్ళొచ్చాము. పరమేశ్వరి ఆదిపరాశక్తికి ప్రణామం చేసి, 'అమ్మా! ఇండియాకు బయలుదేరుతున్నాం. మళ్ళీ త్వరలో వచ్చి నీ దర్శనం చేసుకునేటట్లు అనుగ్రహించు తల్లీ' అని ప్రార్ధించి తిరిగి వచ్చాము.

ఆ ఫోటోలను ఇక్కడ చూడండి.


'వింటర్లో నార్త్ అమెరికా వచ్చాను. మైనస్ 14 డిగ్రీల చలిని చూశాను. కానీ మంచు తుఫాన్ను చూడలేదే' అని నిన్న అనుకున్నా. తెల్లారి లేచేసరికి అదికూడా వచ్చింది. కెనడా నుంచి తూర్పువైపుగా ప్రయాణిస్తున్న మంచుతుఫాన్ ఒకటి, యూ ఆకారంలో ఒక వంపుతిరిగి, చికాగో, డెట్రాయిట్ పరిసరప్రాంతాలను ఇవాళ ఒక ఊపు ఊపేసింది. తెల్లవారు ఝామునుంచీ మంచువర్షం కురుస్తోంది. గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోయింది. రేపు ఉండదు. మాయమైపోతోంది.

అందుకని సరదాగా మంచుతుఫాన్లో ఒక గంటసేపు తిరిగి వచ్చా. ఆ ఫోటోలను ఇక్కడ చూడండి.