“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

15, నవంబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 55 (షాంపేన్ రిట్రీట్ ముగిసింది)

11, 12, 13 తేదీలలో జరిగిన షాంపేన్ రిట్రీట్ విజయవంతంగా ముగిసింది.

సాత్వికమైన మితాహారం, యోగాభ్యాసం, ధ్యానం, సందేహాలకు సమాధానాలు, చర్చలతో కూడిన ప్రేమపూరిత వాతావరణంలో ఈ మూడు రోజుల రిట్రీట్ జరిగింది. దైవాన్వేషణ, ధ్యానం, తమను తాము దిద్దుకోవడం, జీవితాలకు ఔన్నత్యాన్ని అద్దుకోవడం - ఇవి తప్ప వేరే మాటలు, ఆలోచనలు ఎవరికీ లేవు.  

అమెరికాలో ఎక్కడెక్కడినుంచో వచ్చిన, ఎవరికెవరో తెలియని క్రొత్తమనుషులు, అందరూ ఒకే కుటుంబంలాగా స్వచ్ఛమైన ప్రేమాభిమానాలతో మూడు రోజులపాటు కలసి మెలసి ఉంటూ, పంచవటి సాధనావిధానాన్ని నేర్చుకున్నారు. స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూచారు.

ఉన్నతమైన ధ్యానవిధానాలను వీరికి వివరించి, కొన్నింటిని అభ్యాసం చేయించాను. యోగాభ్యాసంలో ఉన్నత స్థాయి అభ్యాసాలు ఎలా ఉంటాయో వీరికి వివరించి, ప్రదర్శించి చూపించాను. నేర్పించాను.

మూడురోజులూ ఒకే కుటుంబంలాగా కలసి ఉండి, జీవితాలకు ధన్యత్వాన్ని కలిగించే ఎన్నో విషయాలను నేర్చుకుని, సంతృప్తిగా అందరూ వారివారి ఊర్లకు వెళ్లిపోయారు. ఉండటానికి వీలైన కొందరు మాత్రం 14, 15 తేదీలలో కూడా మాతో ఇక్కడే ఉండి, ఈరోజున బయలుదేరి వెళ్లారు. 'మళ్ళీ మీరెప్పుడు కనిపిస్తారో తెలియదు. అందుకే ఇంకొన్ని రోజులు మీతో కలసి ఉంటాం' అన్నది వారి ఉద్దేశ్యం.

వారివారి ఊర్లకు రమ్మని అందరూ నన్ను ఆహ్వానించారు. వీలైనప్పుడు వస్తానని వారికి మాటిచ్చాను.

ఇండియాలో నాతో కలసి ఉన్నవారు, నాకు పరిచయస్తులు ఎవరూ నా దగ్గరనుండి వీటిని నేర్చుకోలేకపోయారు. ఇన్ని వేలమైళ్ల దూరంలోని అమెరికాలో ఉంటున్న వీరు నేర్చుకున్నారు.

ఆకలిని బట్టి ఆహారం లభించడం ఆధ్యాత్మిక జీవితపు రహస్యాలలో ఒకటి ! అది ఈ విధంగా మళ్ళీ ఋజువైంది.

వ్యక్తిగత కారణాలరీత్యా ఫోటోలు పెట్టడం లేదు.