“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, నవంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 61(అమెరికాలో దేవాలయాలు)

అమెరికా వచ్చిన నాలుగునెలలలో ఇప్పటికి రెండు గుళ్ళు చూచాను. అదికూడా పక్కవారికోసం వెళ్లడమే గాని, మనకు గుళ్ల పిచ్చి లేదు. నిజం చెప్పాలంటే ఇండియా అయినా ఇక్కడైనా చాలా గుళ్ళలో నాకేమీ అనుభూతి కలగదు. కారణం? వాటిలో భక్తికంటే వ్యాపారధోరణి ఎక్కువగా ఉండటమే.

అమెరికాలోని 50 రాష్ట్రాలలో ఎన్ని గుళ్ళున్నాయో నాకైతే తెలియదు. ప్రస్తుతం ఇంకా ఎన్ని గుళ్ళు కడుతున్నారో అసలే తెలియదు. కానీ ఒక్క విషయం చెప్పగలను. వీటిల్లో ఎక్కడా దైవశక్తి లేదు. అంతా ఫక్తు వ్యాపారమయమే.

ఇక్కడున్న మనవాళ్ళు కూడా, మన ఆచారాలను, మన ఆధ్యాత్మికతను ఏదో మిస్సవుతున్నామన్న ఫీలింగ్ తో గుళ్లకు వెళ్లి పూజలు చేయించుకుంటూ ఉంటారు గాని, వారికి కూడా నిజమైన ఆధ్యాత్మికత ఏమాత్రమూ తెలియదు. ఇక పూజారులు చూద్దామా అంటే, కొత్త కొత్త గుళ్ళు, కొత్త క్లయింట్లు, కొత్త బిజినెస్, ఇది తప్ప వారికి కూడా దైవశక్తి లేదు. పూజారికి దైవశక్తి ఉండటమంటే, నేతిబీరకాయలో నెయ్యి ఉన్నట్లే కదా !

ఇక్కడున్న చాదస్తపు ఇండియన్స్ చూద్దామంటే, పండగలు పబ్బాలు వచ్చినపుడు పంచెలు, చీరలు కట్టుకుని గుళ్ళకొస్తారు. పూజలు, ప్రసాదాలు, హెచ్చులు, ముచ్చట్లు హోదాల ప్రదర్శనలు అంతా మన ఇండియాలో లాగే గోలగోలగా ఉంటుంది.  కాకపోతే, ఇండియాకంటె ఇక్కడ గ్రూపులు ఇంకా ఎక్కువ. ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళతోనే కలుస్తారు. ఏ కులగ్రూపుతో ఆ కులపువాళ్ళే కలుస్తారు. ఇక్కడ కూడా కులగుళ్ళు బాగా పెరుగుతున్నాయి. గ్రూపులు ఎప్పుడో వచ్చేశాయి. మన దరిద్రాలన్నీ ఇక్కడకు కూడా దిగుమతి అయ్యాయి, ఇంకా అవుతున్నాయి.

ఈ రోజు ఉదయం ఒక గుడికెళ్ళాను. వెళ్ళాను అనడం కంటే వెళ్ళవలసి వచ్చింది అనడం సబబుగా ఉంటుంది. ఒక ముప్పై అడుగుల విగ్రహం పెట్టారక్కడ. ఇంకా కొన్ని జంబో సైజు విగ్రహాలు ఆరుబయట గ్రౌండులో ఎందుకెండుతూ, వానకు తడుస్తూ అఘోరిస్తున్నాయి. ఏమంటే, వాటికి గుడికట్టాలి, కట్టినప్పుడు లోపలకు తెస్తామన్నారు. నవ్వొచ్చింది. మరి నెత్తిమీద కప్పు లేకుండా, 30 అడుగుల విగ్రహాలను ఇండియాలో తయారుచేయించి, యిక్కడకు షిప్పింగ్ చేయించి, ఆరుబయట వెయిటింగ్ లో పెట్టడం ఏమిటి? ఆలోచిస్తే దీని వెనుక రహస్యం క్షణంలో అర్ధమైంది.

దేవుడు ఎండకెండి, వానకు తడుస్తున్నాడని రెలిజియస్ బ్లాక్ మెయిల్ చేసి డొనేషన్లు దండుకోవడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ ఇష్టదైవాలు అలా ఆరుబయట అఘోరిస్తుంటే ఏ హిందువు మాత్రం ఊరుకుంటాడు? కాబట్టి, బాధతో, భయంతో, కుప్పలుగా విరాళాలిస్తారు. అందులో సగం బొక్కెయ్యచ్చు, మిగతాదాంతో మళ్ళీ బిజినెస్  మొదలు. ఆ బిజినెస్ లో  మళ్ళీ ఆ జనమే సమిధలు. పిచ్చిజనం పిచ్చి గోల !

ఈ గుడి కమిటీ ఎవరు? అని అక్కడి పిల్లపూజారిని అడిగాను. వేరే ఇంకొక గుడిలో చాలా ఏళ్ళు పనిచేసిన ఒక  పెద్దపూజారి, గ్రీన్ కార్డు వచ్చాక, అక్కడ మానేసి, ఈ స్థలం కొని ఇక్కడ కొత్త గుడి మొదలుపెట్టాడని చెప్పాడు పిల్లపూజారి. ఈ మధ్యన చాలామంది పూజారులు అలా చేస్తున్నారు. గ్రీన్ కార్డు రావడం ఆలస్యం,  వేరే చిన్న గుడి కట్టేసుకుంటున్నారు. మనవాళ్ళు గనక, కంపెనీలు మారినట్లు, లేదా తామే ఒక స్టార్ట్ అప్ కంపెనీ పెట్టినట్టన్నమాట !

అది సాఫ్ట్ వేర్ టెక్నాలజీ. ఇది రెలిజియస్ టెక్నాలజీ. అంతే తేడా.

గుడిగా మార్చకముందు ఇదొక చర్చ్ అట. ఎవరూ రాకపోతుంటే, ఆ అమెరికన్ కమిటీవారు దాన్ని అమ్మేశారు. ఇక్కడ క్రైస్తవం వేగంగా క్షీణిస్తున్నది. చదువుకున్న వాళ్ళెవరూ దాన్ని నమ్మడం లేదు. స్థలం చీప్ గా వస్తోందని మనవాళ్లు కొనుక్కుని మన గుడిగా మార్చారు. కానీ వీళ్ళు చేస్తున్నది కూడా బిజినెస్సే, అదే సారాయిని ఇంకొక సీసాలో పోశారు అంతే. సరుకు అటూఇటుగా అదే, ప్యాకింగ్ మాత్రమే మారింది.

దణ్ణం పెట్టుకుని వచ్చేస్తుంటే, 'డిసెంబర్ నాలుగున రండి.  అభిషేకం ఉంది' అన్నాడు పిల్లపూజారి.

'ఎవరికి?' అన్నా సీరియస్ గా.

'స్వామికి?' అన్నాడు పూజారి అయోమయంగా..

ఇంకా ఎందుకులే పాపం పిల్లోడిని ఆడుకోవడమనిపించి, నవ్వేసి బయటకొచ్చేశా.

30 అడుగులు 40 అడుగులు విగ్రహాలు పెడుతున్నారు, పూజలు అభిషేకాలు చేస్తున్నారు గాని అక్కడ దైవశక్తి ఏమీ ఉండటం లేదు.  ఈ విషయం పిచ్చిభక్తులకు తెలీదుకదా, వస్తున్నారు, పోతున్నారు. మాయాప్రపంచం భలే సరదాగా ఉంది !

ఒక గుడిలో దైవశక్తి ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? ఎలా ఆ గుడిని మెయిన్ టెయిన్ చెయ్యాలి? అన్నది మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు. అంతా వ్యాపారం అయిపొయింది. ఛీ అనిపించింది.

ఇక్కడ గుళ్ళు మన ఇండియాలో గుళ్లలాగా ఉండవు. మన ఇండియాలో చేసినట్టు ఇక్కడ గోలచేస్తే, వెంటనే మూస్తారు. కనుక, అదొక ఇల్లులాగే ఉంటుంది. లోపల మాత్రం శుచీ శుభ్రతా ఏమీ ఉండవు. స్టోర్ రూమంటూ ఉండదో, లేక ప్లాన్ చేసుకోరో తెలీదుగాని, అన్నీ చెల్లాచెదురుగా పడేసి ఉంటాయి. మనం గుడికొచ్చామా, లేక, ఒక పచారీ కొట్టుకొచ్చామా అని అనుమానం మనకే వస్తుంది. అంత గందరగోళంగా ఉంటుంది లోపల.

ఇంకా చెప్పాలంటే, ఒక డీసెన్సీ అన్నది, ఒక నీట్ నెస్ అన్నది ఇక్కడి చర్చిలలోనే కన్పిస్తుంది గాని మన గుళ్ళలో ఎక్కడా కనిపించదు  మన గుళ్ళు సూపర్ బజార్ లాగా ఉంటాయి గాని దేవాలయం లాగా ఉండవు. 

ఇక్కడున్న మనవాళ్లలో కొందరికి గురువులుగా చెలామణీ అవుదామని తెగ దురదగా ఉంటుంది. వాళ్ళు ఈ గుళ్ళలో ఫౌండర్లుగా, కమిటీ మెంబర్లుగా, ఉంటారు. కొంతమంది అందులో దూరదామని చూస్తూ ఉంటారు.  కొంతమంది దూరి, అధికారం చెలాయిస్తూ ఉంటారు.  వాళ్ళకదొక సంతుత్తి.

వీళ్ళందరూ నాకు ఎదిగీ ఎదగని అటిజం పిల్లల్లాగా కనిపిస్తున్నారు.

పేరేమో ఒక దేవుడి గుడి అని ఉంటుంది, కానీ లోపలకెళ్తే మ్యూజియం లో ఉన్నట్లు, పాత, క్రొత్త, కొక్రొత్త ఇలా ఎంతోమంది దేవతల విగ్రహాలు కనిపిస్తున్నాయి. కొన్నేమో, పాతబడిపోయి మూలల్లో అఘోరిస్తూ కన్పిస్తున్నాయి. వాటినెవరూ పట్టించుకోవడం లేదు.

'ఒక్క దేవుడి గుడిని కట్టుకుని దాన్ని శుద్ధంగా మెయిన్ టెయిన్ చెయ్యవచ్చు కదా ! ఇంతమంది దేవుళ్ళని పెట్టి, మొయ్యలేని బరువును నెత్తికెత్తుకోవడం ఎందుకు?' అని కర్ణపిశాచిని అడిగాను.

'ఏంటీ దేవతల విషయాలు నన్నడుగుతున్నావ్?' అంది కొంటెగా.

'పేరుకు పిశాచివైనా నువ్వుకూడా ఒక మినీదేవతలాంటి దానివే కదా? అందుకే నిన్నడిగా. అయినా నువ్వుతప్ప నాకెవరున్నారు చెప్పు?' అన్నా ఉబ్బేస్తూ.

'ఒద్దులే. ఇంకెవరిదగ్గరైనా వెయ్యి ఈ డ్రామాలు. మేం పడం ఇటువంటివాటికి' అంది నవ్వుతూ.

'సరే, అడిగినదానికి చెప్పచ్చు కదా?' అన్నాను బ్రతిమాలుతూ.

'అలా రా దారికి. ఇందులో ఏమీ బ్రహ్మరహస్యం లేదు. ఒక్కదేవుడిని పెడితే ఆయన భక్తులే వస్తారు. ఆయన పండగ ఏడాదికొకసారి మాత్రమే వస్తుంది. మిగతా ఏడాదంతా గుళ్ళో ఈగలు తోలుకోవాలి. అందుకని అందరినీ గేలం వేసి పట్టడానికి, అంతమంది దేవతలను పెడతారు. సింపుల్' అంది కర్ణపిశాచి.

'అంతమందిని పెట్టుకుంటే ఏకనిష్ఠ ఎలా ఉంటుంది?' అడిగాను.

'అందుకే అక్కడ దైవశక్తి ఏమీ ఉండదు. అదొక బిజినెస్ అంతే' అని చప్పరించేసింది కర్ణపిశాచి.

'అంతేనా? మన ఇండియాలో చాలదని ఇక్కడ కూడా మొదలుపెట్టారన్నమాట?' అన్నా.

'ఇండియాలో చాలా నయం. శక్తివంతమైన క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఒక దేవుడంటే, అక్కడ శుద్ధంగా ఆ దేవుడికే పూజ జరుగుతుంది. కనుక శక్తి ఉంటుంది. అలాంటిచోట్లలోనే అవినీతి జరుగుతోంది. ఆఫ్కోర్స్ అక్కడ కూడా బిజినెస్ గుళ్ళు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకోవడమే అనవసరం. ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ఆరాధనా స్థలమైనా ఇంతే. అసలు విషయం ఏమీ ఉండదు. పొట్టు ఫుల్లు. బియ్యం నిల్లు. అంతే' అంది కర్ణపిశాచి.

పిశాచయినా సత్యం చెప్పింది. సంతోషం కలిగింది.

సృష్టిలో దైవాన్ని చూడలేనివాడే గుడిలో చూస్తాడు. సాటిజీవులలో దైవాన్ని చూడలేనివాడే ఎక్కడో దృష్టి సారిస్తాడు. మళ్ళీ ఇందులో డబ్బు, కులాలు, అహంకారాలు, హెచ్చులు, గొప్పలు రాజకీయాలు, కుట్రలు, పైరవీలు.

దేవుడా ! ఎలా భరిస్తున్నావ్ ఈ మనుషుల్ని ?