“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, నవంబర్ 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 58 ('శ్రీరామగీత' అమెరికానుండి విడుదల)

నా కలం నుండి వెలువడుతున్న 55 వ పుస్తకంగా ఆధ్యాత్మ రామాయణాంతర్గతమైన 'శ్రీరామగీత' నేడు విడుదల అవుతున్నది. దీనిని అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రం లోని షాంపేన్ సిటీ నుండి శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నాను.

మన హిందూమతంలో ఉన్న గ్రంధములలో నూరుకు పైగా 'గీత' లున్నాయి. అయితే, వాటిలో బహుళ ప్రచారమును పొందినది భగవద్గీత ఒక్కటే. కానీ, ఇతరములైన, దేవీగీత, హంసగీత, ఉద్ధవగీత, వశిష్టగీత, బ్రాహ్మణగీత మొదలైన ఎన్నో గీతలున్నాయి. బౌద్ధంలోని ధమ్మపదమును కూడా 'బుద్ధగీత' అంటారు. సంస్కృతంలో గీతమంటే 'చెప్పబడినది, గానం చేయబడినది' అని అర్ధము. ఆయా మహనీయుల బోధలన్నీ వారివారి 'గీతము' లనిన పేర్లతో మనకు లభిస్తున్నాయి. 


అత్యున్నతమైన వేదాంతతత్త్వమును ప్రతిపాదించే గ్రంధములే వీటిలో ఎక్కువగా ఉంటాయి. వేదప్రతిపాదితమైన పరబ్రహ్మతత్వమును, దానిని చేరుకునేటటువంటి జ్ఞానమార్గ సాధనను వివరించినది ఈ 'శ్రీరామగీత'. అంతేగాక, కర్మ, భక్తి, జ్ఞానమార్గములను, సాకార సగుణోపాసనను, నిరాకార నిర్గుణోపాసనను సమన్వయపరుస్తూ చెప్పబడిన అద్భుతమైన తాత్వికచింతన దీనిలో ఉంటుంది. శ్రీరాముని యొక్క అవతారతత్వమును, పరబ్రహ్మతత్వమును వివరిస్తూ ఈ గ్రంధం ఉంటుంది.


శ్లో || రామో విగ్రహవాన్ ధర్మః సాధుసత్య పరాక్రమః

రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః ||


రూపు దాల్చిన ధర్మమే రాముడు. ఆయన సౌమ్యుడు, సత్యమైన పరాక్రమవంతుడు. సర్వలోకములకు ఆయనే రాజు. దేవతలలో ఇంద్రునివంటివాడు.


శ్లో || జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం

యదిచ్ఛసి చిరం భోక్తుమ్ మా కృథా రామ విప్రియమ్ ||


నీ జీవితమునుగాని, సుఖమును గాని, దుర్లభమైన రాజ్యమును గాని, ఎక్కువకాలం కొనసాగించాలనుకుంటే రాముడిని నీ శత్రువుగా చేసుకోకు.


అని మారీచుడు, రావణునకు బోధించినట్లుగా రామాయణం అరణ్యకాండలో మనం చూడవచ్చు. అటువంటిది శ్రీరాముని మహోన్నతమైన వ్యక్తిత్వము, అవతారతత్వము.


ప్రాచీనకాలంనుంచీ, శ్రీరామచంద్రుని ఆరాధనకు ఆంధ్రదేశం పెటింది పేరు. 50 ఏళ్ల క్రితం నా చిన్నతనంలో, గ్రామగ్రామంలోనూ రామాలయాలు ఉండేవి. రామభజనలు, సంకీర్తనలు, శ్రీరామనవమి, హనుమజ్జయంతి ఉత్సవములు జరుగుతూ ఉండేవి. ఎంతవరకైతే సమాజంలో రామభక్తి ఉన్నదో అంతవరకూ ఆంధ్రదేశం అన్నింటిలోనూ పురోగమిస్తూ ఉండేది. సమాజంలో నీతినియమములు, పద్ధతులు కూడా చక్కగా ఉండేవి. ప్రజలు ధర్మాన్ని తప్పకుండా ఉండేవారు. రానురాను రామభక్తి తగ్గిపోతూ వచ్చింది. రావణాసురుడిని హీరోగా చూపిస్తూ సినిమాలు తియ్యడం మొదలైంది. రామాయణవిషవృక్షం వంటి విషపు పుస్తకాలు వచ్చాయి. అప్పటినుంచీ ఆంధ్రదేశ పతనం మొదలైంది.


శ్రీరాముడి వేషాలు సినిమాలలో వేసి పేరు తెచ్చుకున్నవారు కూడా నిజజీవితంలో ధర్మాన్ని తప్పారు. పతనమయ్యారు. 'యథారాజా తథాప్రజా' అన్నట్లు క్రమేణా ప్రజలలో కూడా రామభక్తి లోపిస్తూ వచ్చింది, దానికి తగినట్లే, సమాజంలో నీతినియమాలు మాయమౌతూ వచ్చాయి. ప్రస్తుతం ధర్మంతో కూడిన జీవితాలు ఎక్కడా కనపడటం లేదు. ధర్మానికి ప్రాధాన్యం మాయమై, ధనానికి, అవినీతికి ప్రాధాన్యం పెరిగింది. హిందూవ్యతిరేక మతాలు చాపక్రింద నీరులాగా సమాజంలోకి పాకడం మొదలు పెట్టాయి. సమాజం క్రమేణా బీటలువారుతూ వచ్చింది. ఇదంతా రావణభక్తి ఫలితమే.

ధర్మస్వరూపుడైన శ్రీరాముని భక్తి సమాజంలో తగ్గిపోవడమే ఆంధ్రదేశపు నేటి దురవస్థకు గల ప్రధానమైన కారణం. మళ్ళీ రామభక్తి పుంజుకున్ననాడే ఆంధ్రదేశం అన్నిటా బాగుపడుతుంది. లేదంటే ఆంధ్రదేశం ముందుముందు ఏమౌతుందో చెప్పడం కష్టం. రాముని వ్యతిరేకించేవారు రాక్షసులే కాబట్టి, రాక్షసులతో నిండిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు.


అదంతా అలా ఉంచితే, ఒక్క వారం రోజులలో ఈ పుస్తకమును వ్రాయగలగడానికి తగిన వాతావరణమును సమకూర్చి సహకరించిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు ప్రవీణ్, చావలి శ్రీనివాస్ లు, షాంపేన్ లో మమ్మల్ని ఎంతో ఆప్యాయతతో ఆదరిస్తున్న శ్రీనివాస్ నూకల దంపతులకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులను అందిస్తున్నాను. వారి చేతులమీదుగా అమెరికానుండి ఈ మహత్తరమైన గ్రంధం విడుదల అవుతున్నది.


అమెరికా వచ్చాక ఇప్పటికి అయిదు పుస్తకాలను వ్రాశాను. ఇండియా వచ్చేలోపల ఇంకొక అయిదు పుస్తకాలను వ్రాయాలని సంకల్పం. ఏమౌతుందో చూడాలి.


యధావిధిగా ఈ గ్రంధం కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది. చదవండి. హిందూమతాన్ని సక్రమంగా అర్ధం చేసుకోండి. మీ జీవితాలకు ధన్యత్వాన్ని అద్దుకోండి.