“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

21, ఏప్రిల్ 2021, బుధవారం

కాళిక నవ్వుతోంది

ఉన్నట్టుండి దబదబా

లోకమంతా పాటిస్తున్న మడిని చూచి

కాళిక నవ్వుతోంది

ఉన్నట్టుండి గజగజా

వణికిపోతున్న మానవజాతిని చూచి

కాళిక నవ్వుతోంది


మూతీ ముక్కూ గుడ్డతో మూసుకోడాలూ

చేతులూ కాళ్ళూ కడుక్కోవడాలూ

దూరంగా ఉండు తాకొద్దు అనడాలూ

అంటరానితనాన్ని మళ్ళీ పాటించడాలూ

మా ఇంటికి రావద్దని తలుపులేసుకోడాలూ

బంధుత్వాలన్నీ మటుమాయం కావడాలూ చూస్తూ

కాళిక విరగబడి నవ్వుతోంది


కుయ్యో కుయ్యో మంటూ అంబులెన్స్ లు 

కుక్కపిల్లల్లా తిరుగుతూనే ఉండడాలూ

బెడ్లన్నీ హౌస్ ఫుల్ అని

ఆస్పత్రులు బోర్డులు పెట్టడాలూ

పీల్చడానికి గాలికూడా లేదు ఆక్సిజన్ నిల్లంటూ

గాలి సైతం స్తంభించిపోవడాలూ చూస్తూ

కాళిక విరగబడి నవ్వుతోంది


అప్పటిదాకా వాటేసుకున్నవాళ్ళే

బాబోయ్ అంటూ దూరం పరిగెట్టడాలూ

నా అన్నవాళ్ళందరూ ఇంట్లో ఉన్నా

అనాథలా ఆస్పత్రిలో చావుకెదురు చూడటాలూ

కన్నవాళ్ళని కూడా కంటిచూపు లేకుండా

కాటికి సాగనంపడాలూ చూస్తూ

కాళిక విరగబడి నవ్వుతోంది


అడ్డగోలుగా సంపాదించినవాళ్లు

అడ్డంగా ఆస్పత్రుల్లో పడి మూలగడాలూ

డబ్బులెక్కువై అడ్డంగా బలిసిన వాళ్లు 

లక్షకింకో లక్ష పారేసి పేదోళ్ల బెడ్లు కొనుక్కోవడాలూ

పేదోడి అంబులెన్స్ తలుపు కూడా తియ్యకుండా

పేషంటును వెనక్కి సాగనంపడాలూ చూస్తూ

కాళిక విరగబడి నవ్వుతోంది


మహారాష్ట్ర నుంచి శ్రీమంతులొచ్చి

హైదరాబాద్లో ఆస్పత్రి బెడ్లు ఆక్రమించడాలూ

ఇక్కడి వాళ్లకి దిక్కూ దివాణం లేక

అంబులెన్స్ లోనే అసువులు బాయడాలూ

రోజూ ఎన్నో చావులను ఎదురుగా చూస్తున్నా

డాక్టర్లు డబ్బులకోసం అంగలార్చడాలూ చూస్తూ

కాళిక విరగబడి నవ్వుతోంది


డబ్బొక్కటి చాలు ఇంకేమీ అక్కర్లేదన్నవాళ్ళే

మమ్మల్ని కాపాడమంటూ ఏడవడాలూ

ఎంతైనా ఇస్తాం మీ కాళ్ళు మొక్కుతాం

మమ్మల్ని బ్రతికించమని మొత్తుకోడాలూ

బెడ్లకోసం ఆస్పత్రులలో నడుస్తున్న

డబ్బుల వేలంపాటలూ దందాలూ చూస్తూ

కాళిక విరగబడి నవ్వుతోంది


నిన్నటిదాకా సర్వస్వమనుకున్నవి

ఈ రోజున విలువలేకుండా పోయాయి

విర్రవీగే మనుషుల జీవితాలన్నీ

ఒక్కసారిగా తారుమారై పోయాయి

డాబూ దర్పం అందం అహం

డబ్బూ మదం పదవీ పందేరం

అన్నీ ఒక్కసారిగా  ఆవిరైపోవడం చూసి

కాళిక విరగబడి నవ్వుతోంది


దేనిని చూచైతే మనిషి విర్రవీగుతూ

అహంకారాన్ని పెంచుకుంటున్నాడో

అదే ఒక్క క్షణంలో లేకుండా పోవడమూ

పోతున్న వాళ్ళని చూసి కూడా

ఉన్నవాళ్ళకి ఏమాత్రమూ బుద్ధిరాక

మేమిక్కడే ఉంటామని అనుకోవడమూ చూసి

కాళిక విరగబడి నవ్వుతోంది


మానవసంబంధాలన్నీ ఆవిరైపోవడాలూ

మానవత్వం మంటగలిసి పోవడాలూ

కళ్లెదుట చావు కరాళ నృత్యం చేస్తున్నా

కరెన్సీయే ముఖ్యమై పోవడాలూ

పక్కవాడిని తోసేసి క్యూలు దాటేసి

సిఫార్స్ తో వాక్సిన్ పొడిపించుకున్నా

కరోనా తప్పకపోవడాలూ చూస్తూ

కాళిక విరగబడి నవ్వుతోంది


కాలం నడుస్తూనే ఉంది

కాళిక నవ్వుతూనే ఉంది