“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, ఏప్రిల్ 2021, శుక్రవారం

స్వామి నిర్మలానంద - ఒక విస్మృత మహనీయుడు -2 (జాతక విశ్లేషణ)

సామాన్యంగా, మహనీయుల యొక్క ఖచ్చితమైన జాతకవివరాలు మనకు లభించవు. అందులోను, 150 ఏళ్ల క్రితం జన్మించిన వారి వివరాలు సరిగ్గా లభించడం మన అదృష్టమేనని చెప్పాలి. Swami Nirmalananda - His life and teachings అనే పుస్తకంలో స్వామియొక్క జననవివరాలు లభిస్తున్నాయి. శ్రద్ధ ఉన్నవారు చదవండి. ఎంతసేపూ పనికిరాని చెత్తపుస్తకాలు చదవడం, నెట్టు, యూట్యూబు, సొల్లుకబుర్లలో కాలం గడపడం కాదు మనిషి చెయ్యవలసింది. మనిషి పుట్టుక పుట్టినందుకు ఇలాంటి మహనీయుల జీవితాలు చదవాలి. కొంతైనా వారి సువాసన మనకు అంటించుకోవాలి. వారు చూపిన మార్గంలో కొద్దిగానైనా నడవాలి. అప్పుడే మనిషి జన్మ ఎత్తినందుకు మనకు కూడా  కొంత సార్ధకత ఉంటుంది.

ఈయన 23-12-1863 న రాత్రి 8.30 ప్రాంతంలో కలకత్తాలో జన్మించాడు. ఆరోజున మార్గశిర శుక్ల చతుర్దశి, బుధవారం, రోహిణీ నక్షత్రం - 4 వ పాదం నడుస్తున్నది. కుందస్ఫుట విధానంలో జననకాల సంస్కరణ (Birth time rectification) చేయగా జననసమయం రాత్రి 8-32-30 అవుతున్నది. ఆ సమయానికి వేసిన జాతకం, వర్గచక్రములు, దశలు, జాతకుని జీవితంలోని ఘట్టములు ఇత్యాదులతో ఖచ్చితంగా సరిపోతున్నందున ఇదే స్వామియొక్క అసలైన జననసమయమని నేను నిర్ధారిస్తున్నాను.

లగ్నం, కర్కాటకం 27 డిగ్రీలలో పడుతూ, మీననవాంశను సూచిస్తున్నది. షడ్వర్గులలో సింహహోర, మీనద్రేక్కాణము, మిథున ద్వాదశాంశ, వృశ్చిక త్రిమ్శాంశలు ఉదయిస్తున్నాయి. ఆధ్యాత్మికజీవితాన్ని సూచించే వింశాంశకుండలి లగ్నం తుల అవుతున్నది. ఈయనకు జననసమయంలో చంద్ర - రవి - బుధ దశ నడుస్తున్నది.

నక్షత్రాధిపతి అయిన చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటూ మంచి మనస్సును, జాలిగుండెను, దయాస్వభావాన్ని సూచిస్తున్నాడు. అయితే, ఈ జాతకంలో రాహుకేతువులు నీచస్థితిలో ఉండటాన్ని గమనించాలి. ఉఛ్చచంద్రుడు నీచకేతువుతో కలసి ఉండటం ఈ జాతకంలో ఒక విచిత్రమైన యోగం. ఇది తల్లివైపునుంచి సంక్రమించిన ఒక శాపాన్ని సూచిస్తున్నది. ఆ శాపమేమిటి అన్న లోతైన విషయాలను నేనిక్కడ చర్చించను. దీనివల్ల తెలివితేటలు, దయాహృదయం ఉన్నప్పటికీ, జీవితపు చరమాంకంలో దుర్భరమైన మానసికవేదనను పడవలసి ఉంటుందన్న సూచన ఉన్నది. స్వామి జీవితంలో ఖచ్చితంగా అదే జరిగింది. దీనికారణం తెలియాలంటే నా పద్ధతిలో జ్యోతిష్యవిశ్లేషణ చేయడం మీకు తెలియాలి.  లాభస్థానమనేది ద్వితీయ కర్మస్థానం కూడా. గతకర్మ ఛాయలు ఇక్కడ గోచరిస్తాయి. అవి ఏయే రూపాలలో  ఈ జన్మలో ప్రకటితమౌతాయో ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు.

ఈ యోగం ఇంకొక విచిత్రమైన ఫలితాన్నిస్తుంది. షష్టాధిపతి మేనమామకు సూచకుడు. ఈ జాతకంలో షష్టాధిపత్యం పట్టిన గురువు చతుర్దంలో శుక్రునితోకలసి ఉంటూ పాపార్గళానికి గురయ్యాడు.  మేనమామకు వివాహము లేకపోవడాన్ని, సంతానం లేకపోవడాన్ని, ఆయనొక సాధువైపోవడాన్ని ఈ యోగం సూచిస్తుంది. దీనికి తగినట్లుగానే, స్వామి మేనమామ  అయిన నిత్యగోపాల్ అనే ఆయన సన్యసించి జ్ఞానానంద అవధూత అనే పేరుతో బెంగాల్లో అనేక మఠాలు స్థాపించాడు. వాటిని 'మహానిర్వాణమఠం' అంటారు. అవన్నీ ఇప్పటికీ నడుస్తున్నాయి. ఈ నిత్యగోపాల్ అనే ఆయన శ్రీరామకృష్ణుల దగ్గరకు వస్తూపోతూ ఉండేవాడు. ఆయన్ను ఆరాధించేవాడు. కానీ, తర్వాత తనదంటూ ఒక ప్రత్యేక సాంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఈయన భక్తులు ఈయన్ను బలరాముని అవతారంగాను, శీరామకృష్ణులను  కృష్ణుని అవతారంగాను ఈనాటికీ కొలుస్తారు.

కనుక దైవసాధనలో పడి లౌకికజీవితాన్ని త్యజించడము, సన్యాసం స్వీకరించి సాధువుగా మారడము అనేవి వీరి కుటుంబంలో ఉన్నాయి. ఈ విధంగా కొన్ని కొన్ని పోకడలు జీన్స్  లో వస్తాయి. తమతమ పూర్వీకులలో ఎవరైనా ఋషులు ఋషితుల్యులు లేనిదే ఇలాంటి పోకడలు ఉన్నపళంగా ఎవరికీ రావు. గోత్రమహిమ అంటే ఇదే. వివేకానందస్వామి జీవితంలో కూడా దీనిని గమనించవచ్చు. వారి వంశంలో, తరానికొకరు చొప్పున పెళ్లి చేసుకోకుండా సాధువులుగా మారిపోవడం ఉన్నది. వివేకానందస్వామి చిన్నప్పుడు  ఆయన శ్రీరామకృష్ణుల వద్దకు తరచుగా పోతూ ఉండటం చూచి ఆయన తల్లి 'ఈ పిల్లవాడు కూడా సన్యాసి అయిపోతాడేమో?' అని భయపడేది. ఆ భయమే నిజమైంది. ఈ విధంగా కొన్ని పోకడలు కొన్ని వంశాలలో కొన్ని కుటుంబాలలో ఉంటాయి. అదే విధంగా నిర్మలానంద స్వామి గారి కుటుంబంలో కూడా తల్లివైపునుంచి ఈ పోకడలున్నాయి.

స్వామి మేనమామగారైన నిత్యగోపాల్ (జ్ఞానానంద అవధూత) గారి వివరాలను ఇక్కడ చూడవచ్చు.


నిర్మలానందస్వామి జాతకంలో సూర్యుడు దారాకారకుడయ్యాడు. ఆయన ఆరవ ఇంటిలో ఉండటం, అది సహజరాశిచక్రంలో నవమస్థానం కావడం, ద్వాదశాధిపతి అయిన  బుధుడు సూర్యునితో కలసి ఉండటం వల్ల ఈ జాతకునికి వివాహజీవితం లేదని తెలుస్తున్నది. చంద్రలగ్నం నుంచి ఇదే దారాకారకుడైన సూర్యుడు అష్టమంలో ఉండటం కూడా ఈ ఫలితాన్ని బలపరుస్తున్నది. ఆరూఢలగ్నమైన మీనం నుంచి సప్తమంలో శని కూర్చుని ఉండటం వివాహభావాన్ని ధ్వంసం చేసింది. పైగా, నేనెన్నో పాత పోస్టులలో వ్రాసినట్లుగా, పౌర్ణమి నాడుగాని,  సమీపంలోగాని పుట్టినవారి వివాహజీవితం విఫలం అవుతుంది. లేదా పరిష్కరించలేని సమస్యలు దానిలో తప్పకుండా ఉంటాయి.  ఈ కొండగుర్తును ఎన్నో  జాతకాలలో నేను గమనించాను.

స్వామి శుక్ల చతుర్దశి నాడు జన్మించారు. మర్నాడే పౌర్ణమి. అంటే ఆయన జననం పౌర్ణమి ఛాయలోనే జరిగింది. మరి ఆయన పెళ్లి చేసుకోకపోవడంతో వింత ఏమున్నది? ఒకవేళ చేసుకునిగనక ఉన్నట్లయితే దానికి సంబంధించిన బాధలు విపరీతంగా పడి ఉండేవాడు. 

ద్వాదశభావం నుంచి తల్లిగారి పూర్వీకుల దర్శనం అవుతుంది. ఇది మిథునం అవుతున్నది. నవమాధిపతి అయిన శని చతుర్దంలో ఉంటూ, తల్లిగారి పూర్వీకులు లోతైన ఆధ్యాత్మిక చింతనాపరులని తెలియజేస్తున్నాడు. సప్తమాధిపతి అయిన గురువు మంత్రస్థానంలో మంత్రస్థానాధిపతి అయిన శుక్రునితో కలసి ఉంటూ, ఆధ్యాత్మిక సాధనాపరులైన వీరు వివాహానికి దూరమౌతారన్న సత్యాన్ని రుజువుచేస్తున్నాడు. కనుక తల్లిగారి నుంచి ఈయనకు లోతైన ఆధ్యాత్మిక చింతనాపరమైన జీన్స్ సంక్రమించాయి.

జననకాలదశను నా విధానంలో విశ్లేషణ చేద్దాం. జనకాలదశ : చంద్ర - రవి - బుధదశ  అయింది.

చంద్రుడు లగ్నాధిపతిగా ద్వితీయపూర్వకర్మస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. పూర్వ ఆధ్యాత్మికకర్మకు కారకుడైన నీచకేతువుతో కలసి ఉన్నాడు. శుక్రుని కేంద్రస్థితివల్ల కేతువుకు నీచభంగమైంది. కనుక, ఈ జన్మలో చేసే తపస్సువల్ల పూర్వజన్మలలోని చెడుకర్మ పక్వానికివచ్చి హరించుకు పోతుంది. జీవితచరమాంకంలో దీని శేషం వల్ల మానసికవేదన ఉంటుంది. సూర్యుడు కుటుంబస్థానాధిపతిగా కర్మ - ఋణ క్షేత్రంలో ఉన్నాడు. ఇది సహజరాశిచక్రంలో  ఆధ్యాత్మిక జీవితానికి సూచికగా నవమస్థానమైన ధనుస్సయింది. వీరి కుటుంబంలో ఉన్న లోకపరమైన ఆధ్యాత్మికరుణం దీనివల్ల సూచితమౌతున్నది. లోకులకు వీరు ఎంతో చెయ్యవలసి ఉంటుంది. ఈయన కూడా సంసారజీవితాన్ని త్యజించి, సాధువుగా మారి, ఎంతోమందికి ఎంతో మార్గదర్శనం, సహాయం, సేవలను చెయ్యవలసి ఉంటుంది. బుధుడు తృతీయాధిపతిగా పూర్వజన్మల కర్మలకు సూచకుడు.  అవి ఈ జన్మలో ఆ స్థానంలో ఉన్న శనిద్వారా పక్వానికి వస్తూ, సామాన్యజనానికి ఈయన ఎంతో సేవ చెయ్యవలసి ఉన్నదని సూచిస్తున్నది.

శని నవమస్థానాన్ని చూస్తూ, సన్యాసజీవనం, కర్మయోగం, సేవామార్గాల ద్వారా ఈయన జీవనగమనం సాగుతుందని చెబుతున్నాడు. ఈ స్థానం సహజరాశిచక్రంలో కర్మ ఋణ స్థానమైన కన్య కావడం గమనార్హం. దీనివల్ల - ఎంతో మంది బ్రహ్మచారులకు సన్యాసులకు ఈయన గురుస్థానాన్ని అధిరోహిస్తాడన్న సత్యం  సూచింపబడుతున్నది.  స్వామికి దాదాపుగా వెయ్యిమంది శిష్యగణం ఉన్నది. కర్ణాటక, కేరళలలో దాదాపుగా 20 మఠాలను ఈయన స్థాపించారు. ఎన్నివేలమంది స్వామి మార్గదర్శనంలో ఆధ్యాత్మికజీవితాలను గడిపి ధన్యులైనారో లెక్కేలేదు.

ఈ విధంగా స్వామి జాతకం ఒక మహత్తర యోగిపుంగవుని జాతకంగా కనిపిస్తున్నది.

( ఇంకా ఉంది )