“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

1, ఏప్రిల్ 2021, గురువారం

ప్రశ్నలు - జవాబులు

వరదలా నాకొచ్ఛే పాఠకుల ప్రశ్నలు, వాటిలో కొన్నింటికి  నేనిచ్చిన జవాబులు ఈ పోస్టులో చదివి తరించండి ! మనుషులు ఎలా ఉన్నారో తెలుసుకుని మరీ తరించండి !

1. గురువుగారు ! మా అమ్మకు 82 ఏళ్ళు. షుగరు, బీపీ, థైరాయిడ్ ఉన్నాయి. ఇప్పుడు గుండెజబ్బు కూడా వచ్చింది. మొన్ననే సీరియస్ అయితే ఐసీయూ లో చేర్చాము. సమస్యేంటంటే, మూన్నెళ్లక్రితం నేనూ మా ఆయనా కలిసి పారిస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. టికెట్లు, హోటళ్లు అన్నీ బుక్ అయిపోయాయి. సరిగ్గా ఇప్పుడే మా అమ్మ ఐసీయూలో చేరింది. ఏం చెయ్యాలో  తోచడం లేదు. నేను పదేళ్లనుంచీ మీ బ్లాగ్ చదువుతూ ఉంటాను. హైదరాబాద్  లోనే ఉంటున్నాము. కానీ మిమ్మల్ని కలవాలని ప్రయత్నం అయితే చెయ్యలేదు. మీరెలా చెయ్యమంటే అలా చేస్తాను. మీమాట మాకు వేదవాక్కు. మీరే మాకు దైవం. దయచేసి త్వరగా జవాబు చెప్పండి.

జవాబు: నాకింత మంచి భక్తురాలుందా? కర్ణపిశాచికూడా నీ సంగతి నాకు చెప్పలేదే? బహుశా అదికూడా నిన్ను చూసి భయపడి ఉంటుంది. అమ్మదేముందమ్మా? ఈ అమ్మ కాకపోతే ఇంకో అమ్మ వస్తుంది. పారిస్ పోతే మళ్ళీ రాదుకదా ! అందుకని పారిసే ముఖ్యం. వెంటనే ఫ్లయిటెక్కు. ఈ లోపల ఇక్కడేదన్నా అయితే ఎవరో ఒకరు చూసుకుంటార్లే నీకెందుకు? నీ ఎంజాయిమెంట్ నీకు ముఖ్యం కదా. వెళ్ళు. అప్పుడే కదా వచ్చే జన్మలో కుష్టురోగం ఉన్న కుక్కగా పుట్టే అదృష్టం పట్టేది? సరేగాని, నీకు పిల్లలున్నరామ్మా? ఉంటె, నీ పెద్ద వయసులో వాళ్ళు 'హు ఆర్ యు డర్టీ క్రీచర్ గెట్ లాస్ట్' అని తప్పకుండా అంటారు. నీ ప్రాడక్ట్ అంతకంటే మంచిగా ఎలా ఉంటుందిలే? అందుకని ఇప్పుడే ఏదో ఒక లగ్జరీ ఓల్డేజి హోంలో బెడ్ బుక్ చేసుకో. అప్పటికి ఖాళీలుండకపోవచ్చు.

2. గురువుగారు ! నేను చాలా ఏళ్ల నుంచీ డాక్టర్ వంతెన గారి ఫాలోయర్ని. ఆయన చెప్పినట్లే డైట్ తీసుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉన్నాను. గత పదేళ్లనుంచీ నా బరువు 35 కేజీలే. అలా మెయింటెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఈ మధ్యన డాక్టర్ మహమ్మద్ బీన్ తుగ్లక్ గారి వీడియోలు చూస్తున్నాను. అందులో ఆయన  ఆకుల కషాయాలు త్రాగమని పోరుపెడుతున్నాడు. అన్నీ మానేసి గడ్డి తినమంటున్నాడు. ఇవి మొదలు పెట్టాక మరో అయిదు కేజీలు తగ్గి 30 కి వచ్చాను. ఇంకా బరువు తగ్గితే పోతావని మా ఫెమిలీ డాక్టర్ చెబుతున్నాడు. ఇప్పుడేం చెయ్యాలో నాకు తెలీడం లేదు. అర్జన్టుగా నేను బరువు పెరగాలి.  ఏం చెయ్యాలో చెప్పగలరు. 

జవాబు : పదేళ్లనుంచీ 35 కేజీలేనా? చాలా  బాగుంది నాయన ! అది చాలలేదా ఆకులు అలములు తింటానంటున్నావు? అవి తింటూ ఇలాగే కషాయాలు త్రాగితే త్వరలో బరువు 15 కేజీలకు దిగుతావు. అప్పుడు గాల్లో ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికైనా ఖర్చులేకుండా  వెళ్లిపోవచ్చు. కారూ స్కూటరూ ఏదీ అవసరం ఉండదు. ఇంకా కష్టపడి మరో పదికేజీలు తగ్గితే సింపుల్ గా 5 కేజీల బరువుకొస్తావు. అప్పుడైతే ప్రపంచంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి సంకల్పమాత్రంతో వెళ్లిపోవచ్చు. కాకపోతే ఒకటి, నీకందరూ కనిపిస్తూ ఉంటారు. నువ్వుమాత్రం ఎవరికీ కనిపించవు. అంతే ! సరే ఇంత మోజు పడుతున్నావు కాబట్టి నీకొక ఉపాయం చెప్తాను. విను. ఉదయం పూట వంతెనగారు చెప్పినట్లు చెయ్యి. సాయంత్రం తుగ్లక్ గారి సలహాలు పాటించు. రాత్రికి మాత్రం ఓషోగారిని తలచుకుని 'ఓపెన్ హెవెన్' బారుకెళ్ళు. అక్కడ అమృతమే కాకుండా అప్సరసలు కూడా ఉంటారు. ప్రపంచంలోని ఏ దరిద్రపు జంతువునైనా వండి వడ్డిస్తారు. అవన్నీ బాగా మెక్కు.  తెల్లవార్లూ అక్కడ గడిపి తెలతెలవారుతుండగా ఇంటికెళ్ళు. ఒక్క నెలరోజులు ఇలా చేశావంటే, నీ బరువు 100 కేజీలు సునాయాసంగా వస్తుంది. అందులో నీ పొట్ట ఒక్కటే 90 కేజీలుంటుంది. ఆ తర్వాత బారుకెళ్లే పని ఉండదు. ఎందుకంటే లేవలేవు. కదల్లేవు కదా. నీ ఇల్లే అప్పుడు బారైపోతుంది. అన్నీ నీ ఇంటికే వస్తుంటాయి. కాకపోతే బరువు అంతటితో ఆపు. లేకపోతే 200 అవుతావు. అప్పుడు ఓపెన్ గా హెవెన్ కెళ్తావు. జాగ్రత్త ! గుడ్ లక్.

3. ఇంకొకాయన సంబోధనా గింబోధనా ఏమీ లేకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వచ్చాడు.  బహుశా యమబిజీ పర్సన్ అయుంటాడు. పనీపాటా లేనోళ్ళం మనమేగదా ప్రపంచంలో. లేదా పరిచయం చేసుకోడానికి మొహమాటం అడ్డొచ్చి ఉంటుంది. ఎవడో స్వామీజీ అయ్యుంటాడు. ఆయనిచ్చిన మెయిల్ ఇలా ఉంది.

నా వయసు 45. 25 ఏళ్ళనుంచీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను. నాకు మంత్రం, తంత్రం, జ్యోతిష్యం, యోగం, మట్టీ మశానం అన్నీ తెలుసు. నా గమ్యం రమణమహర్షి పొందిన జ్ఞానాన్ని పొందటం. కానీ అదే కనుచూపుమేరలో కన్పించడం లేదు. మా గురువేమో 'వస్తుంది వస్తుంది ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి' అని చెప్పీ చెప్పీ మొన్నీమధ్య తనే పోయాడు. నాకు ఆత్మసాక్షాత్కారం వస్తుందా రాదా? నా జాతకం చూసి క్విక్ గా చెప్పండి. అవతల చాలా పనులున్నాయి. 

జవాబు: మీ ప్రశ్నకు ఒక వాక్యంలో జవాబుచెప్పడం కష్టం. మీకు ఒకటికి మించి ఛాయిసెస్ ఇస్తాను. వినండి. 

ఒకటి - నువ్వు కూడా వెంటనే చచ్చిపోయి మీ గురువు దగ్గరకు వెళ్ళు. ఆయన్నే అడుగు 'నాకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వకుండా ఎక్కడికిరా పారిపోతున్నావ్' అని. ఉపదేశం వాడిదగ్గరా? ప్రశ్నలు నన్నా? తినేది మొగుడి తిండీ, పాడేది ఎవడిదో పాట అన్నట్లుంది నీ సంగతి.

రెండు -  నీకు పట్టిన మంత్రం, తంత్రం, జ్యోతిష్యం, యోగం, మట్టీ మశానం అవన్నీ వదిల్తేగాని రమణమహర్షి స్థితి రాదు. పోనీ ఒక ఉపాయం చెప్తా విను. ఆయన గోచీతో ఉండేవాడు. నువ్వు అది కూడా వదిలేసి డైరెక్టుగా రోడ్డెక్కు. అప్పుడు ఆయనకంటే త్వరగా ఆ స్థితిని పొందవచ్చు.

మూడు - ఇన్ని మాయవిద్యలు పెట్టుకుని ఇంతబిజీగా జనాన్ని మోసంచేస్తూ బ్రతికే నీకు రమణమహర్షి స్ధితెలా వస్తుందిరా పిచ్చిసన్నాసి? ఈ జన్మకే కాదు. ఇంకో లక్ష జన్మలెత్తినా నీకా స్థితి  అనుమానమే. అందుకని నీ మాయబ్రతుకులో నువ్వుండు. నన్ను మళ్ళీ కదిలించకు.

4. ఈలోపల ఇంకో మహామంత్రసాధకుడు ఇలా మెయిలిచ్చాడు.

నేను పుస్తకంలో చూసి 'ఊగ్ర భైరవి' మంత్రం జపిస్తున్నాను. ఆమె దర్శనం కావడం లేదు. ఎలా అవుతుంది ? చెప్పండి.

జవాబు: ఆమె పేరు ఊగ్రభైరవి, వయాగ్రా భైరవి కాదు నాయనా. ముందు ఆ దేవత పేరు సరిగ్గా పలకడం  నేర్చుకో. పేరే సరిగ్గా పలకలేనివాడివి మంత్రమేం జపిస్తావు? ఆమె దర్శనం కాకపోవడమే ఆమె అనుగ్రహం నీ మీదుందని నిదర్శనం. ఆమె కనిపిస్తే ఆ తర్వాత ఆమె ఒక్కతే ఉంటుంది. నువ్వుండవు. గుండాగి స్పాట్లో చస్తావు. ఆమె కాళికాదేవికి ఒకరూపం. అలాంటి మంత్రాలు పుస్తకాలలో, నెట్లో చూసి జపం చెయ్యకూడదు. వెంటనే ఆపు. తేడా వస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయి. నువ్వు నా మాట వినవని, ఆపవని నాకు తెలుసు. నిజం చెప్పాలిగనుక చెబుతున్నాను. తర్వాత నీ ఇష్టం.

-----------------------------------

ఇలా ఉంటున్నాయి మహాజ్ఞానులైన పాఠకులిస్తున్న మెయిల్స్.

ఆమ్మో ! లోకం ఎంత ముందుకు పోతోంది?  జనం ఎంతెంత జ్ఞానులై  పోతున్నారు? మనం వెనుకబడిపోతున్నాం. అర్జన్టుగా నేనుకూడా ఓపెన్ హెవెన్ బారుకెళ్ళి వయాగ్రా రంభ మంత్రం జపించాలి. టైమౌతోంది. మళ్ళీ బారు మూసేస్తారు. వస్తా !