“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, ఏప్రిల్ 2021, బుధవారం

బహుశా పోయాడేమో !

నాల్రోజులనాడు ఒక మెయిలొచ్చింది. ఆయన చాలాకాలం నుంచీ, అంటే పదేళ్లనుంచీ నాకు తెలిసినాయనే. ఒక రకంగా చెప్పాలంటే నాకు మిత్రశత్రువన్నమాట. అదేంటి ఆ పదం వాడారని మళ్ళీ తుమ్మకండి. చెప్తా వినండి.

నేను ఏ పోస్టు రాసినా, దానికి ఒక యాంటీ మెసేజి నాకు పంపిస్తూ ఉండేవాడు చాలాకాలంపాటు. చాలావరకూ ఆ మెసేజిలు ఎగతాళిగానే ఉండేవి. ఉదాహరణకు, ఒక మంచి ఆధ్యాత్మిక పోస్ట్ రాస్తే, దానిని ఎగతాళి చేస్తూ ఒక మెసేజి ఇచ్ఛేవాడు. మంచిగా ఒక విషయం మీద పోస్టు రాస్తే, దానికి యాంటీగా మెసేజి ఇచ్చేవాడు.

ఎక్కడో ఏదో వరద భీభత్సమో, ఇంకేదో ఆపదో వచ్చినపుడు నేను జ్యోతిష్య విశ్లేషణ వ్రాస్తే, దానికి ఎగతాళిగా 'ఆత్మకు చావులేదు. జననం ఉన్నపుడు మరణం ఉంటుంది. ఇది అనివార్యం, ధీరుడు శోకించరాదు' అంటూ భగవద్గీత శ్లోకాలు కోట్ చేసి ఒక స్మైలీ పంపేవాడు ఎగతాళిగా. ఇలా చాలాసార్లు చేశాడు.ప్రతి పోస్టుకీ చేసేవాడు. నేను చదివి నవ్వుకుని ఊరుకునేవాడిని. చివరాఖరికి తనకే విసుగొచ్చి మానుకున్నాడు. ఒంటిచేత్తో ఎన్నాళ్లని చప్పట్లు చరచగలడు పాపం ! తర్వాత్తర్వాత తెలిసింది ఏమిటంటే, ఆయనొక చిన్నపాటి గురువుగా చెలామణీ అవుతున్నాడని. జ్యోతిష్యం వగైరాలు చెబుతూ డబ్బులు కూడా బానే సంపాదిస్తున్నాడని. సరే ఎవరి ఖర్మ వాడిదని వదిలేశాను.

ఆ సదరు మహనీయుడు మెయిలిచ్చాడు.

'గురువుగారికి నమస్కారం. ప్రస్తుతం కరోనా వచ్చింది. క్వారంటైన్ లో ఉన్నాను. నా జాతకంలో ఫలానాదశ నడుస్తోంది. నేను బ్రతికి బయటపడాలంటే ఏయే రెమెడీలు పాటించాలి? ఏమేం చెయ్యాలి? మీ మాటమీద నాకు చాలా నమ్మకం. గురి. మీరేది చెయ్యమంటే అది చేస్తాను. దయచేసి జవాబు ఇస్తారని ఆశిస్తున్నాను. జాతకం కోసం నా జనన వివరాలు జత చేశాను. గమనించగలరు'

నేనిలా జవాబిచ్చాను.

'నమస్తే. నేను మీకు గురువెప్పుడయ్యానో నాకు గుర్తు లేదు. మీరే ఒక గురువుగా ఉన్నారని విన్నాను. కనుక మీ సంబోధనను నేను ఒప్పుకోలేను. కరోనా చాలా మందికి వస్తోంది. మీకు కూడా వచ్చింది. ఇందులో వింతేమీ లేదు. జ్యోతిష్యశాస్త్రంలో పండిపోయిన మీకు, జాతకం ఆయుస్సును పొడిగించలేదని తెలియకపోవడం వింతగా ఉంది. రెమెడీలతో అలా జరిగే పనైతే పాతకాలపు జ్యోతిష్కులు, ఋషులు, మహారాజులు చావకుండా మన మధ్యనే ఇంకా తిరుగుతూ ఉండాలి. జ్యోతిష్యంలో ఉద్దండులైన వరాహమిహిరుడు వగైరాలు మన కళ్ళముందే ఉండాలి. కానీ అలా  జరగడం లేదు. నా ప్రతి పోస్టునీ పనిగట్టుకుని మరీ ఎగతాళి చేసే మీకు సడన్ గా నా మీద ఎప్పుడు గురి కుదిరిందో అర్ధం కావాలంటే ముందు నా జాతకం చూపించుకోడానికి నేను కేరళ వెళ్ళాలి. ప్రస్తుత పరిస్థితులలో ప్రయాణం చెయ్యడం అంత మంచిది కాదు గనుక, ఒకటిరెండు నెలలలో కేరళ వెళ్లే పనుంది గనుక, అప్పుడు చూపించుకోగలవాడను. నన్ను మీకు గుర్తుకు తెచ్చిన కరోనాకు  ధన్యవాదములు'.

ఆ మెయిల్ చదివి ఆయనకు ఎగశ్వాస మొదలైందని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను.  బహుశా ఆక్సిజన్ లెవల్స్ కూడా తగ్గిపోయి ఉండవచ్చు. ఆ పరిస్థితిలో కూడా వెంటనే ఇలా మెయిలిచ్చాడు. 

'ఆపదలో ఉన్నవారితో పరాచికాలాడటం సంస్కారం అవుతుందా?'

నేనూ తక్కువ తినలేదు కదా ! ఇలా తిరుగు మెయిలిచ్చాను.

'అన్నీ బాగా ఉన్నపుడు మంచిమాటలను ఎగతాళి చెయ్యడం ఏమౌతుందో ముందు చెప్పండి. ఆపదలోనే అన్నీ గుర్తుకురావడం ఎలాంటి సంస్కారమో మీరే ఆలోచించుకోండి'. 

అప్పుడు అసలు బాధ బయపడింది.

'నా బాద్యతలు తీరలేదు. అన్నీ సగంలోనే ఉన్నాయి. ఇప్పుడు నాకేదైనా అయితే నావాళ్లు ఏమికావాలి? అందుకే మిమ్మల్ని రిక్వెస్టు చేస్తున్నాను. రెమెడీలు చెప్పండి'.

ఆయన గతంలో నాకు పంపించిన ఎగతాళి మెయిల్సన్నీ నా మెయిల్ బాక్సులోనే ఇంకా పడిఉన్నాయి. వాటిని కాపీ చేసి ఆయనకు పంపిస్తూ ఇలా చెప్పాను.

'భగవద్గీతనుంచీ, పురాణాలనుంచీ పుంఖానుపుంఖాలుగా శ్లోకాలను కోట్ చేస్తూ మీరు గతంలో నాకు చేసిన హితబోధలు ఇవిగో. అవి ఇతరులకు చెప్పడానికా? లేక మీరు ఆచరించడానికా? అవసరానికి పనికిరాని ఆధ్యాత్మికత ఎందుకు? 'ఆత్మకు చావు లేదు' అని మీరు నాకు చాలాసార్లు చెప్పారు. మరి ఇప్పుడు మీరెందుకు చావుకు భయపడుతున్నారు? మీరిప్పుడు పోతే ఏమౌతుంది? ఆత్మకు చావులేదుకదా? మళ్ళీ ఇంకోచోట పుడతారు. దానికేమైంది? ఇంత సింపుల్ విషయానికి అంత బాదెందుకు? అందుకని హాయిగా చచ్చిపోండి. లేకపోతే మీరు నాకు గతంలో ఉపదేశించిన భగవద్గీత శ్లోకాలన్నీ అబద్దాలౌతాయి మరి ! నాకే జ్యోతిష్యమూ రాదు. నాకే రెమెడీలూ తెలీవు. నన్నడక్కండి'

ఆ తరువాత ఆయన్నుంచి నాకు మెయిల్ రాలేదు.

బహుశా పోయాడేమో !