“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, జులై 2020, గురువారం

U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis ( A real Jnani)

ప్రపంచం మొత్తానికీ ఎదురు తిరిగి 'గో టు హెల్' అని అనగలిగిన తెలుగువాళ్ళు నాకు తెలిసి ఇప్పటివరకూ చరిత్రలో ఇద్దరే ఇద్దరున్నారు. ఒకరు గుడిపాటి వెంకటచలం. మరొకరు - ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి అనబడే యూజి. వీరిలో చలం గురించి ఇంతకుముందు వ్రాశాను. ఆయనొక కవి, స్వప్నికుడు, ప్రేమికుడు, డబ్బుకు, కుహనా మానవ సంబంధాలకు, సమాజపు కట్టుబాట్లకు, సంకెళ్లకు లొంగని తీవ్రవాది. యూజీ ఏమో 'అసలు మనసే లేదు', 'నువ్వు లేకుండా పోతేగాని నువ్వుండవు' పొమ్మన్న తీవ్రజ్ఞాని. చలం గురించి తెలుగువాళ్ళకు తప్ప వేరెవరికీ పెద్దగా తెలీదు. యూజీ గురించి ప్రపంచమంతా తెలుసు. ఆఫ్ కోర్స్, ఉన్నతమైన ఆలోచనలంటే ఏమిటో తెలియని నేటి చవకబారు యూత్ కి  వీరిద్దరూ తెలీదనుకోండి. అది వేరే సంగతి !

ఇద్దరూ తెలుగువాళ్లవడం ఒక వింతయితే, ఇద్దరూ కృష్ణాజిల్లా బ్రాహ్మలే కావడం ఇంకొక విచిత్రం. చలం వల్లూరిపాలెంలో పుడితే, యూజీ బందర్లో పుట్టాడు. ఇద్దరికీ రమణమహర్షితో సంబంధం ఉండటం, ఇద్దరూ జ్ఞానమార్గంలో ప్రయాణించడం
ఇంకొక విచిత్రం. అయితే, చలం జ్ఞానసిద్ధిని పొందలేక పోయాడు. యూజీ పొందాడని అంటారు.

చలం 1894 లో పుట్టి 1979 లో అరుణాచలంలో పోతే, యూజీ 1918 లో పుట్టి 2007 లో ఇటలీలో పోయాడు. ఇద్దరికీ సినిమారంగంతో సంబంధాలున్నాయి. చలం స్వయంగా 'మాలపిల్ల' సినిమాకు మాటలు రాస్తే, సినిమా ప్రముఖులైన మహేష్ భట్, పర్వీన్ బాబీలు యూజీకి వీరశిష్యులు. చలమూ, యూజీ ఇద్దరూ చివరకు అనామకంగానే పోయారు. ఇద్దరివీ ఆధ్యాత్మికపరంగా చాలా తీవ్రమైన భావాలు, కాకపోతే, చలం ఇంకా ఒక అన్వేషకునిగానే మరణించాడు. యూజీ జ్ఞానసిద్ధిని పొంది తనువు చాలించాడు. వీరిద్దరి జాతకాలలో ఈ సూచనలు చాలా స్పష్టంగా గోచరిస్తాయి.

నిన్నటినుంచీ ఎందుకో యూజీని ఎక్కువగా చదువుతున్నా. ఈ రోజు ఆయన జాతకం వేద్దామని చూస్తే, ఈరోజే ఆయన పుట్టినరోజని తెలిసింది. ఇలాంటి కాకతాళీయ సంఘటనలు నా జీవితంలో మామూలే కావడంతో పెద్దగా ఆశ్చర్యమేమీ కలగలేదు గాని, మైండులేని యూజీగారితో నాకేంటి ట్యూనింగ్? అని మాత్రం ఆశ్చర్యం కలిగింది. ఆయనంత హైలెవల్ పిచ్చి మనకు లేకపోయినా, కొద్దో గొప్పో మనకూ ఉందిగా పిచ్చి అని నాకు నేనే సర్దుకున్నా.

రమణమహర్షి, రజనీష్, జిడ్డు, యూజీ - వీళ్ళ మార్గం అటూ ఇటూగా ఒకటే. కాకపోతే, ప్రస్తుతానికి రమణమహర్షిని కాసేపు ప్రక్కన ఉంచుదాం. ఎందుకంటే, ఆయనలో వివాదాస్పదమైన అంశాలు ఏవీ లేవు. వివాదాలకు ఆయన అతీతుడు. పోతే, మిగిలిన ముగ్గురిలో నేను యూజీకే ఉన్నతస్థానాన్నిస్తాను. దానికి కొన్ని కారణాలున్నాయి.

రజనీష్ లోకాన్ని మోసం చేసినట్లు యూజీ చెయ్యలేదు. రజనీష్ మనుషుల్ని వాడుకున్నట్లు  యూజీ వాడుకోలేదు. రజనీష్ బోధించినట్లుగా తనకు అనుభవంలో లేనివాటిని యూజీ బోధించలేదు. ఒక ఇంటర్వ్యూలో రజనీష్ గురించి మాట్లాడుతూ యూజీ ఇలా అన్నాడు - 'రజనీష్ ఒక పింప్. అబ్బాయిల్ని అమ్మాయిల్ని హాయిగా ఎంజాయ్ చెయ్యమని రజనీష్ చెప్పేవాడు. దానికి తాంత్రికసెక్స్ అని పేరుపెట్టాడు. ఇద్దరిదగ్గరా డబ్బులు మాత్రం తను తీసుకునేవాడు. అలాంటివాడిని ఇంకేమనాలి?'

ఈ వీడియో యూట్యూబ్ లో ఉంది చూడండి.

'సత్యసాయిబాబా గురించి మీ అభిప్రాయం ఏమిటి?' అని యూజీ ని ఒక ఇంటర్వ్యూలో అడిగారు.

'అతనొక క్రిమినల్' అని యూజీ జవాబిచ్చాడు.

ఈ వీడియో కూడా యూట్యూబులో ఉంది చూడండి. 

జిడ్డు కృష్ణమూర్తిని చాలాకాలంపాటు యూజీ అనుసరించాడు. కానీ తరువాత జిడ్డును వదిలేశాడు. దానికి చాలా కారణాలున్నాయి. తన స్నేహితుడైన రాజగోపాల్ భార్య రోసలిన్ తో జిడ్డు రాసలీలలు నడిపాడని యూజీ అన్నాడు. జిడ్డుతో చాలా దగ్గరగా ఎన్నోఏళ్ళు ఉన్నాడు గనుక యూజీకి ఇంసైడ్ స్టోరీలు తెలుసు. విషయం తెలిసికూడా రాజగోపాల్ నోర్మూసుకోవడానికి కారణం, ఆ సంస్థకున్న వందల కోట్లాదిరూపాయల విలువైన రియల్ ఎస్టేటూ, ఆస్తులూ కారణాలని కూడా ఆయనన్నాడు.

అదే జిడ్డు, సెక్స్ కు వ్యతిరేకంగా ఉపన్యాసాలిచ్చేవాడు. ఒక సందర్భంలో అమెరికాలోని యూత్ తో మాట్లాడుతూ జిడ్డు' అసలు మీరెందుకు సెక్స్ ను కోరుకుంటారు? మీ స్నేహితురాలి చేతిని ఊరకే అలా పట్టుకుని శాంతంగా ఉండలేరా మీరు?' అన్నాడని యూజీ అనేవాడు. ఇది నిజమే. జిడ్డు చెప్పిన 'చాయిస్ లెస్ అవేర్ నెస్' అనేది పెద్ద 'బుల్ షిట్' అని, యూజీ అనేవాడు.

ఈ వీడియో కూడా  యూట్యూబ్ లో ఉంది చూడండి.

ఏమీ చెయ్యనక్కర్లేదని ఒకపక్కన చెబుతూ ఇంకోపక్కన యోగాసనాలను జిడ్డు అభ్యసించేవాడు. తన చర్మం మృదువుగా కనిపించడానికి కేరళనుంచి ప్రతినెలా తెప్పించే నూనెతో మసాజ్ చేయించుకునేవాడని యూజీ చెప్పాడు. ఇలాంటి హిపొక్రసీలు జిడ్డులో చాలా ఉన్నాయి.

జిడ్డులోని ఇలాంటి హిపోక్రసీని భరించలేని యూజీ క్రమేణా జిడ్డుకు దూరంగా జరిగాడు. తరువాత, యూజీకి హఠాత్తుగా 'కెలామిటి' అనే ఒక గడ్డుకాలం ఎదురైంది. ఆ సమయంలో ఆయన మనస్సు పూర్తిగా ధ్వంసమైపోయిందని, అప్పటినుంచీ ఆయన గాలిపటంలాగా దేశాలు తిరుగుతూ, తనను చూడటానికి వచ్చినవారితో మాట్లాడుతూ, హిపోక్రసీ ఏమాత్రం లేని ఒక సహజమానవుని లాగా బ్రతికాడని  అంటారు. ఈ 'కెలామిటి' అన్న స్థితినే మనోనాశమని అంటారు. ఒక మనిషి ప్రపంచాన్ని చూచే తీరును, ప్రపంచంతో వ్యవహరించే తీరును మనోనాశమనేది పూర్తిగా మార్చిపారేస్తుంది. ఆ స్థితినుండి బయటపడిన మనిషి జ్ఞానిగా రూపొందుతాడు. అటువంటి జ్ఞానం యూజీకి కలిగిందని ఆయన అనుచరులు నమ్ముతారు.

ఎవరి అనుచరులైనా, వారి గురువు చాలా గొప్పవాడనే అంటారు. కానీ, ఊరకే అలా అంటే సరిపోదు. దానికి రుజువులు ఆ గురువుల జీవితాలలో కనిపించాలి. ఈ కోణంలో చూచినప్పుడు, రజనీష్, జిడ్డుల జీవితాలతో పోల్చుకుంటే యూజీ జీవితం చాలా స్వచ్చంగానే గడిచింది. ఆయనతో చాలాకాలం క్లోస్ గా తిరిగిన ఒకప్పటి బాలీవుడ్ గ్లామర్ డాల్ పర్వీన్ బాబీ ఇలా అంటుంది.

'నా జీవితంలో ఎంతోమందిని నేను చూచాను. కానీ ఎదుటి మనిషిని తన స్వార్ధానికి ఏమాత్రమూ వాడుకోకుండా ఉన్న మనిషిని ఒక్క యూజీని తప్ప ఇంకెవరినీ చూడలేదు. అంత మంచిమనిషిని కూడా చూడలేదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా, నాతో ఎడ్వాంటేజ్ తీసుకోవడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు'.

యూజీలో కాంప్రమైజ్ అనేది లేదు. ఉన్న సత్యాన్ని ముఖం పగలగొట్టినట్లు చెబుతాడు. 'నీకు చేతనైతే ఆచరించు. లేదా చావు' అంటాడు. యూజీ జీవితంలో రహస్య కోణాలు కూడా లేవు. అంత ఓపెన్ గా బ్రతికిన మనిషిని ఇంతవరకూ తాము చూడలేదని ఎంతోమంది అన్నారు.

'లోకానికి మీరిచ్చే సందేశం ఏమిటి?' అని ఒక సమయంలో యూజీని అడిగారు.

దానికాయన ఇలా అన్నాడు.

'ఏమీలేదు. లోకం ఎలా పోతే నాకెందుకు? నా భావాలను లోకం అనుసరించకపోతేనే మేలు. లోకం చావనీ, నాకు సంబంధం లేదు'.

మహేష్ భట్ ఇలా అంటాడు.

'నేను మానసికంగా ఎంతో నలిగిపోయినస్థితిలో రజనీష్ దగ్గరకు వెళ్లాను. 'నాకు చాలా భయం వేస్తోంది. దేవుడున్నాడో లేడో నాకు తెలియడం లేదు. నాకు ఆసరాగా ఎవరున్నారు?'. అనడిగాను.

దానికి రజనీష్ ఇలా అన్నాడు. ' జీసస్ కూడా తన చివరిక్షణాలలో దేవుని ఉనికిని సంశయించాడు. సిలువమీద ఉన్నపుడు 'దేవా ! నా చెయ్యిని ఎందుకు వదిలేశావు? అని అరిచాడు. వెంటనే దేవుడిని తన పక్కనే చూచాడు. అదేవిధమైన స్థితిలో నీవున్నావు. ఇప్పుడు నిన్ను రక్షించడానికి నీ ప్రక్కన నేనున్నాను.'   

మనుషులకు ఏది కావాలో అది రజనీష్ ఇచ్చేవాడు. నీకు కేకు కావాలంటే ఆయన కేకునిచ్చేవాడు. అలా ఇస్తూ ఇస్తూ తన ట్రాప్ లోకి మనుషులను లాక్కునేవాడు. మనుషుల బలహీనతలతో రజనీష్ ఆడుకున్నాడు.  కానీ యూజీ అలా కాదు. నీకు నచ్చినా నచ్చకపోయినా సత్యాన్ని ఉన్నదున్నట్లుగా ఆయన చెప్పేవాడు. తరువాతి కాలంలో, నేను యూజీని కలసినప్పుడు గురువు గురించి చెబుతూ ఆయనిలా అన్నాడు.

'నిజమైన గురువనేవాడు ఎక్కడైనా ఉంటే, తన నుంచి కూడా నిన్ను విముక్తుడిని చేస్తాడు'.

నా దృష్టిలో యూజీ ఒక గొప్ప జ్ఞాని. మైండ్ లెస్ స్థితిని యోగంలో అమనస్కస్థితి అంటారు. అది జ్ఞానసిద్ధికి సూచిక. యూజీ అలాంటి స్థితిని పొందాడని నా ఊహ. అయితే, అందరు నిజమైన జ్ఞానులలాగానే ఆయనకూడా పెద్దగా లోకగౌరవాన్ని పొందకుండానే మరణించాడు. అయితే, అలాంటి మనుషులు గౌరవాన్ని అగౌరవాన్ని పెద్దగా లెక్కచెయ్యరనుకోండి. ఆయన జాతకాన్ని, జీవితాన్ని వచ్చే పోస్ట్ లలో చూద్దాం.

( ఇంకా ఉంది )