“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

6, మార్చి 2020, శుక్రవారం

Chart of Sri Aurobindo - Astro analysis - 7 (Spiritual Revolutionary)

అరవిందుల జీవితం చాలా విచిత్రమైనది. ఒక సినిమాకి ఎలాగైతే రెండు భాగాలుంటాయో, అలాగే ఆయన జీవితానికీ ఉన్నాయి. అందులో మొదటి సగం పూర్తిగా విప్లవాత్మకమైన తీవ్రవాదంతో కూడుకున్నదైతే, రెండవ సగం పూర్తిగా అత్యున్నతమైన, కొండొకచో అసంభవమైన, ఆధ్యాత్మికతతో కూడుకున్నది. రెండూ రెండు భిన్నధృవాలు. కానీ ఆ భిన్నధృవాలు ఆయనలో కలిశాయి. దానికి కారణం ఆయన జాతకంలో లగ్నంలో ఉన్న నీచ అంగారక, ఉచ్చగురువుల సంబంధం. అయితే, ఆ గ్రహాల వల్ల ఆయన జీవితం అలా ఉందా? లేకపోతే, గతజన్మలలో ఆయన జీవించిన జీవితాల వల్ల ఇప్పుడు అలాంటి గ్రహయోగాలలో ఆయన పుట్టాడా? అని ప్రశ్నిస్తే రెండోదే నిజమని తేలుతుంది. గ్రహాలది ఎప్పుడూ తప్పు అవదు. తప్పు మనదే ఉంటుంది. మనం చేసుకున్న కర్మే, మన జాతకంలోని గ్రహాల రూపంలో మనల్ని వెంటాడుతుంది. ఈ విషయాన్ని ముందుగా సరిగ్గా అర్ధం చేసుకోవాలి.

ఆయన జీవితానికి పునాది పాశ్చాత్యసమాజంలో పడింది. ప్రాధమిక విద్యాభ్యాసం దశలోనే ఆయన ఒక యూరోపియన్ గా పెరిగాడు. హైస్కూలు, కాలేజీ విద్య అంతా ఆయన ఇంగ్లాండ్ లోనూ, కేంబ్రిడ్జి లోనూ చదివాడు. కనుక ఆయన పునాదులన్నీ యూరోపియన్ పునాదులే. అక్కడే ఆయన మొదటిసారిగా డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని చదివి అర్ధం చేసుకున్నాడు. అప్పట్లో సైన్సు ప్రపంచాన్ని అదొక ఊపు ఊపుతూ ఉన్న రోజులవి.

'పరిణామం' అనేది డార్విన్ సిద్ధాంతంలోని మూలసూత్రం. ఇదే సిద్ధాంతాన్ని, తర్వాతి రోజులలో ఆయన తన సాధనకు కూడా వర్తింపజేశాడు. మనిషి పశువు నుంచి పుట్టాడు. చాలా rudimentary mind ఉన్న జంతువు నుంచి, ఒక ఆలోచన అనేది ఉన్న మనసున్న మనిషిగా మానవుడు ఎదిగాడు. ఇక్కడనుంచి దివ్యమనస్సును కలిగినవానిగా దివ్యమానవునిగా దేవతగా మానవుడు రూపాంతరం చెందాలి. లేకుంటే భూమిమీద మనిషి బ్రతుకు దుర్భరం అవుతుంది అన్న నిశ్చయానికి ఆయన తన తర్వాతి రోజులలో వచ్చాడు. అయితే, ఇదంతా కూడా ఆయనకు 40 ఏళ్ళు దాటాక జరిగింది. కానీ అప్పటి యోగమార్గానికి పునాదులు ఆయనకు చిన్నవయసులోనే పడ్డాయని చెప్పక తప్పదు.

కాలేజీ చదువు నుంచి ఆయన దృక్పధం ఇండియాలో జరుగుతున్న స్వాతంత్ర పోరాటం వైపు మళ్ళింది. మన దేశం బానిసత్వంలో మగ్గుతూ ఉండగా, మనం ఇంగ్లీషు చదువులు చదువుకుని విదేశాలలో స్థిరపడి ఉపయోగం ఏముందన్న ఆలోచన ఆయనలో మొదలైంది. ఈ ఆలోచనే, కావాలని గుర్రపుస్వారీ పరీక్షను లేటుగా వచ్చి, ICS పరీక్షను తప్పడానికి ఆయన్ను ప్రేరేపించింది. ఆయన ICS పరీక్ష చాలా మంచిర్యాంక్ లో పాసయ్యాడు. కానీ గుర్రపు స్వారీకి లేటుగా వచ్చి కావాలని డిస్ క్వాలిఫై అయ్యాడు. ఇక అక్కడనుంచి ఆయన జీవితం ఇండియా స్వాతంత్ర్యపోరాటంతో కలసిపోయింది.

ఇండియాకి వచ్చిన తర్వాత, బెంగాల్లోని తీవ్రవాద గ్రూపులతో కలసి ఆయన చురుకుగా పనిచేశాడు. దాదాపు 17 ఏళ్ళు ఆయన ఈ విప్లవజీవితాన్ని గడిపాడు. బ్రిటిష్ వారి గుండెల్లో భయాన్ని పుట్టించాడు. The most dangerous man గా బ్రిటిష్ వారిచేత ముద్ర వేయబడ్డాడు. ఎక్కడకు వెళ్ళినా ఆయన్ను CID లు వెంటాడుతూ ఉండేవారు. చివరకు 1910 లో పాండిచేరి చేరుకొని 1950 వరకూ పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైనారు. పాండిచేరి చేరాక ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. బెంగాల్ తీవ్రవాద గ్రూపులతో కొన్నాళ్ళు సంబంధాలు కొనసాగించిన ఆయన తర్వాత పూర్తిగా వాటితో సంబంధాలను త్రెంచుకున్నారు.

ఆయన జీవితాన్ని మూడుభాగాలుగా చూస్తే, మొదటి 20 ఏళ్ళు ఆయన విద్యాభ్యాసరంగంలో గట్టి పునాదులు పడి ఆయన్ను ఒక గొప్ప ఇంటలెక్చువల్ గా రూపుదిద్దాయి. ఈ సమయంలో ఆయనను నడిపింది ద్వితీయంలో ఉన్న సూర్య - బుధ - శుక్ర యోగం. రచనా శక్తి, కవితాశక్తి, ఆలోచనాశక్తి, చక్కటి విద్య ఇవన్నీ ఈ యోగం ఇచ్చింది.

20వ ఏటనుంచీ, లగ్నంలో ఉన్న కుజయోగం పనిచెయ్యడం మొదలుపెట్టింది. అందుకని అప్పటినుంచీ తీవ్రవాదం వైపు ఆయన మొగ్గు చూపాడు. ఇది ఆయన 38 ఏట వరకూ సాగింది. ఆ తర్వాత అదే లగ్నంలో ఉన్న ఉచ్చగురుయోగం పనిచేసింది. అందుకే అప్పటివరకూ ఉన్న జీవితాన్ని వదిలేసి పూర్తిగా ఆధ్యాత్మికత వైపు ఆయన మారిపోయాడు. ఆ తర్వాత ఉచ్చరాహు కేతువులు పనిచేశాయి. యోగసిద్ధులు, అతీతమైన దర్శనాలు, సాక్షాత్కారాలు మొదలైనవి కలిగాయి. ఇలా ఆయన జీవితం అంతా మూడు భాగాలుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు.

అయితే, పంచమాదిపతి అయిన అంగారకుడు లగ్నంలో నీచభంగాన్ని పొంది ఉండటంతో, ఆధ్యాత్మికరంగంలో కూడా ఆయన ఒక విప్లవవాదిగానే రూపుదిద్దుకున్నాడు. అదెలాగో ఇప్పుడు చెబుతాను.

మామూలుగా ఆధ్యాత్మికత అంతా కూడా, 'నేను మోక్షాన్ని ఎలా పొందాలి?' అన్న అంశం వైపే సాగుతూ ఉంటుంది. 'మిగతా వాళ్ళూ, మిగతా ప్రపంచమూ ఎలా పోతే నాకెందుకు? వాళ్ళ ఖర్మ వాళ్ళది' అనే ధోరణిలోనే ఆధ్యాత్మికత ఉంటుంది. ఈ ధోరణిని మొదటగా మార్చి, సమాజం పట్ల సాదువులకున్న బాధ్యతను వారికి గుర్తు చేసినది బుద్ధభగవానుడు. ఆ తర్వాత వివేకానందుడు. దానికి కారణం రామకృష్ణుల బోధ. ఈ భావనలను ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రపంచ మానవాళి మొత్తాన్నీ ఆధ్యాత్మికవెలుగు లోకి తీసికెళ్ళాలన్న సంకల్పాన్ని చేసినది అరవిందులు. అయితే, ఆయన దీనిని చేసిన విధానం చాలా విప్లవాత్మకమైనది. మతాలు మార్చడం ద్వారానో. కొత్త దేవుళ్ళని ప్రోమోట్ చెయ్యడం ద్వారానో అది చెయ్యాలని ఆయన ఆశించలేదు. Super Mind అనేదాన్ని భూమిమీదకు దించడం ద్వారా మాత్రమే మానవజాతి మొత్తాన్నీ ఉద్ధరించడం సాధ్యమౌతుందని, మిగతా ఏ పనులు చేసినా  అది కుదరదని ఆయన నమ్మారు. అందుకే ఆయన, 40 ఏళ్ళ పాటు ఒక గదిలో కూర్చుని సాధనలో జీవితాన్ని గడిపారు. ఇది చాలా విప్లవాత్మకమైన చర్య. ఆ విధంగా అరవిందులు ఒక ఆధ్యాత్మిక విప్లవ వీరుడని నేను విశ్వసిస్తాను.

భూలోకాన్ని దాని ఖర్మకు వదిలేసి ఆ పైనున్న వెలుగులోకి వెళ్లి తన మోక్షాన్ని తాను చూచుకోవాలని ప్రతి సాధకుడూ యోగీ ఆశిస్తారు. ఇప్పటి వరకూ ఎవరైనా చేసినది అదే. మోక్షం పొందటం అంటే, ఈ భూసంబంధమైన రొచ్చు నుంచి బయటపడి, తప్పుకుని, పైకి వెలుగులోకి వెళ్ళిపోవడం. కానీ అరవిందులు మాత్రం, ఆ వెలుగును ఈ భూమిపైకి దించాలని ప్రయత్నించారు. మానవాళి అంటే ఎంత ప్రేమ, ఎంత సానుభూతీ ఉండాలి అలా చెయ్యాలంటే?

దీనిని సాధించే విధానంలో కూడా అరవిందులు తనదైన నూతనపంధాను అవలంబించారు. ఆయన సన్యాసాన్ని ఒప్పుకోలేదు. ప్రోత్సహించలేదు. బుద్ధుడు, వివేకానందుడు సన్యాసాన్ని ప్రోత్సహించారు. కానీ అరవిందులు అలా చెయ్యలేదు. All life is yoga అని ఆయనన్నారు. ఇక్కడ Yoga అంటే నేడు ఫాన్సీగా అందరూ చేస్తున్న ఆసనాలు కాదు. అరవిందుల మాటల్లో యోగా అంటే అంతరిక యోగసాధన అని అర్ధం. నిజానికి మనం సంసారులమైనా సన్యాసులమైనా ఇంకేమైనా కూడా సాధన చెయ్యవచ్చు. చెయ్యాలి కూడా ! సాధన లేని జీవితం పశువు జీవితమే. పశువుకీ అంతరిక సాధన తెలియని మనిషికీ పెద్ద భేదం ఏమీ ఉండదు. బయట ఆకారంలోనే తేడాగాని, లోపలి మానసిక స్థితిలో ఏమీ తేడా ఉండదు. కనుక సన్యాసం తీసుకోకుండానే సాధన చెయ్యవచ్చు అని అరవిందులన్నారు. అందుకే ఆయన మార్గంలో సన్యాసానికి విలువ లేదు. మనిషి ఏ స్థితిలో ఉన్నా పరవాలేదని, సాధన చెయ్యవచ్చని, దానికి సన్యాసమే అక్కరలేదని ఆయన్నారు. ఇది చాలా మంచిభావమే. అయితే, సరిగ్గా ఆచరించకపోవడం వల్ల ఇదే భావం ఆయన అనుచరుల పతనానికి ఎలా కారణం అయిందో ముందు ముందు వివరిస్తాను.

ఒక్క ఇండియాకి స్వతంత్రం తెస్తే ఏమీ జరగదని ఆయనకు తెలుసు. ప్రస్తుతం ఏం జరుగుతోంది? తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారు. దోపిడీ అప్పటికంటే ఇంకా విచ్చలవిడిగా సాగుతోంది. 'బ్రిటిష్ వాడి పాలన ఉంటేనే బాగుండేది. అనవసరంగా మనకు స్వతంత్రం వచ్చింది' అని చాలామంది పాతతరం వాళ్ళు అనుకోవడం నేను చాలాసార్లు విన్నాను. కనుక మనుషులలో ఉన్నతమైన మార్పు రాకుండా ఊరకే స్వతంత్రం వస్తే ఏమీ ఉపయోగం లేదు, ఇంకా దోపిడీ పెరగడం తప్ప. దొంగలకు, విలువలు లేనివాళ్ళకు స్వతంత్రం ఇస్తే ఏమౌతుంది? అదే ఇప్పుడు జరుగుతోంది.

కనుక ఇండియాకు స్వతంత్రం వస్తే ఏమీ ఒరగదని ఆయనకు పాండిచేరి చేరిన అతిత్వరలో అర్ధమైంది. మానవజాతి మానసికస్థాయి మొత్తాన్నీ ఏకమొత్తంగా వెలుగులోకి లేపితే తప్ప ఈ అధ్బుతం జరగదని ఆయనకు తెలిసిపోయింది. కనుక ఆ బృహత్కార్యం కోసం ఆయన తన జీవితాన్ని వెచ్చించాడు. అందులో ఎంతవరకూ కృతార్థుడైనాడన్నది అప్రస్తుతం. మనలా మురికిగుంటలో పందుల్లా బ్రతకకుండా ఒక ఉన్నతాశయం కోసం ఆయన బ్రతికాడు. చాలదూ?

తాము ఏ సమాజంలో అయితే బ్రతుకుతున్నారో ఆ సమాజం పట్ల తమకున్న సామాజిక, బౌద్ధిక, నైతికములైన గురుతర బాధ్యతలను నేరవేర్చమని సాధువులకు మొట్టమొదటగా చెప్పినది బుద్దుడు, వివేకానందుడు. ఆ సమాజాన్ని ఏకమొత్తంగా దైవత్వంలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నించినది అరవిందులు. వీరు ముగ్గురే మానవాళి మొత్తం గురించి నిజంగా ఆలోచించిన వారు. తపనపడినవారు. ఆఫ్ కోర్స్ ! వివేకానందుల వెనుక ఉన్న శక్తి రామకృష్ణులని మనం మరువకూడదు.

అరవిందులలాగే ఆయన అంతరంగ శిష్యులు కూడా విప్లవవీరులే. జాతకంలో పంచమస్థానం శిష్యులకు సూచికని మనకు తెలుసు. దాని అధిపతి కూడా అంగారకుడే అయ్యాడు. కనుక గురువువంటి వారే శిష్యులూ అయ్యారు. సామాన్యంగా ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది. నేటి దొంగగురువులకు దొంగశిష్యులు దొరుకుతున్నట్లే, అసలైన గురువులకు అసలైన శిష్యులే దొరుకుతారు. ఇది ఆధ్యాత్మిక లోకపు నియమాలలో ఒకటి. ఎప్పుడూ ఇది ఇలాగే జరుగుతుంది. గురువు నిజాయితీతో కూడిన వాడైతే శిష్యులూ అలాంటివారే దొరుకుతారు. గురువు దొంగ అయితే అతని చుట్టూ శిష్యులూ అలాంటివారే పోగౌతారు.

అదేవిధంగా, అరవిందుల ప్రధాన శిష్యురాలైన మదర్ అని పిలువబడే మీరారిచర్డ్ కూడా అత్యంత సాహసోపేతమైన వనితే. తనవైన అన్నీ వదులుకుని ఆమె అరవిందుల దగ్గర ఉండిపోయింది. ఒక ఫ్రెంచ్ వనిత అయ్యుండి, తమ పాలనలో ఉన్న భూభాగంలో ఒక శరణార్ధిగా ఉన్న ఒక బానిసజాతి మనిషితో జీవితాంతం ఉండిపోవడానికి ఆమె సిద్ధపడింది. దానికోసం తన భర్తకు డైవోర్స్ ఇచ్చేసింది. నేను ప్రాన్స్ కు రానని చెప్పేసింది. అరవిందుల సాధనామార్గంలో నడుస్తూ ఆయనతో కలసి పేదరికాన్ని చవిచూస్తూ, ఉందోలేదో తెలియని గమ్యాన్ని వెదుక్కుంటూ ప్రయాణించడానికి ఆమె సిద్ధపడింది.

అప్పటికింకా, అరవిందులకు సిద్ధి కలుగలేదు. ఆయన తనదైన సాధనామార్గంలో ఉన్నారుగాని, ఇంకా తన సాధనలో ఒక స్థిరత్వంగాని సిద్ధిగాని ఆయనకు కలుగలేదు. అంటే, ఆయన పోతున్న దారి ఎక్కడకు తీసుకుపోతుందో ఆయనకే స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ, ఆయనతో కలసి ఆయన మార్గంలో నడవడానికి ఆమె సిద్దపడి, తన కుటుంబాన్ని, తన దేశాన్ని, తన ప్రజలను, తనవైన అన్నింటినీ వదిలేసి పాండిచేరిలో ఉండిపోయింది. ఎంత గొప్ప సాహసం ఉండాలి అలా చెయ్యాలంటే? అదీ మదర్ విశిష్ట వ్యక్తిత్వం !!

నిజానికి, ఇలాంటి సాహసం లేనిదే ఎవ్వరూ నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టలేరు. ఊరకే పూజలు చేసుకుంటూ, ఎవడో ఒక దొంగ గురువును నమ్ముకుని వాడికి భజన చేస్తూ అదే అసలైన ఆధ్యాత్మికత అనుకుంటూ గొర్రెల్లా ఉండిపోవడమే గాని, నిజమైన ఆధ్యాత్మిక యోగమార్గం సాహసం లేనివారికి, తెగింపు లేనివారికి, కమిట్ మెంట్ లేనివారికి ఎంతమాత్రమూ దక్కదు.

కనుక ఆమె కూడా, తన గురువైన అరవిందుల లాగే, ఒక విప్లవవనిత అని, ఒక సాహసవనిత అనీ నేనంటాను. సామాన్యంగా ఒక గూటిపక్షులే ఒక గూటికి చేరుతూ ఉంటాయి. వేరే గూటిపక్షులు ఈ గూటిలోకి చేరవు. గురువు ఏదైతే శిష్యులూ అదే అవుతారు.

అచ్చును బట్టే బొమ్మలు వస్తాయి మరి !

(ఇంకా ఉంది)