“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

29, మార్చి 2020, ఆదివారం

కరోనా కతలు - 3 (భలే కొత్త జోకు Go In)

ఈ మధ్యన ఒక కొత్త జోకు విన్నాను.

ఎవరో గురువుగారు ప్రోమోట్ చేసారో లేక వాళ్ళ శిష్యులు ప్రస్తుత లోకపరిస్థితిని తెలివిగా మార్కెటింగ్ చేసుకోవడం కోసం పోమోట్ చేశారో తెలీదు గాని, ఇది చక్కర్లు కొడుతోంది. నాకూ ఎవరో పంపించారు. భలే నవ్వొచ్చింది. అదేంటో చెప్పనా ?

When you cant go out , go in అట. పక్కనే ధ్యానంలో ఉన్న ఒక మంచి ఒంపుసొంపుల అమ్మాయి బొమ్మ. దేవుడా ! ధ్యానాన్ని మార్కెటింగ్ చెయ్యడానికి కూడా అమ్మాయే కావాలి ! సబ్బులు, టూత్ పేస్టులు, నూనెలు, క్రీములతో సమానంగా ధ్యానాన్ని కూడా చేసి కూచోబెట్టారన్న మాట నేటి వ్యాపార గురువులు?

ఈ మెసేజిని అందరికీ పంపించేవాళ్ళకైనా కొంచం బుద్ధి ఉండాలి. ఇదేం చెబుతోంది? నిన్ను నీ లోపలకి పొమ్మంటోంది. మరి నువ్వేం చేస్తున్నావు? అది చెయ్యకుండా అందరికీ ఆ మెసేజి పంపించి, అది వాళ్ళకిలే నాక్కాదు అని హాయిగా టీవీ పెట్టుకుని కాళ్ళు బారజాపుకుని కారప్పూస మెక్కుతూ కూచున్నావు? అంతేలే ! అన్ని సూక్తులూ వేరేవాళ్ళ కోసమే కదా? మనకోసం మాత్రం కాదు. వేరేవారికి మెసేజి పంపిస్తే మన బాధ్యత తీరిపోయింది. అంతేనా?

ఈ మధ్యలో ఇంత మంచి జోకు నేను వినలేదు. ఎలాగో చెప్తా వినండి.

ఈ రోజు కరోనా వచ్చిందని, బయటకు వెళ్లకూడదని, ఉన్నట్టుండి ఎవరూ లోపలకు వెళ్ళలేరు. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచీ మనకు బయట తిరగడం అలవాటై ఉంది. ఈరోజు ప్రభుత్వాలు మిమ్మల్ని రోడ్ల మీదకు రానివ్వడం లేదు గనుక, ఉన్నట్టుండి పెద్ద ధ్యానులం కావాలంటే అస్సలు కుదరని పని. నేను చెప్పేది అబద్దం అనుకుంటే కాస్త ప్రయత్నించండి. అది జరిగే పని కాదని మీకు ఒక్క పావుగంటలో అర్ధమౌతుంది.

ధ్యానమనేది ఎవరికీ ఒక్కరోజులో రాదు. Go in అని చెప్పడం సులువే. లోకంలో అదే అసలైన కష్టం. దానికి ఎన్నో పునాదులుండాలి. ఎంతో పరిశ్రమ ఉండాలి. దానికోసం నీ జీవితంలో ఎన్నింటినో నువ్వు వదులుకుని ఉండాలి. దానికోసం ఎంతో తపన పడి ఉండాలి. ఏళ్ళకేళ్ళు దానికోసం శ్రమించి ఉండాలి, అప్పుడు మాత్రమే ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు Go in కాగలుగుతావు. లేకపోతే వేరే వాళ్లకు మెసేజీలు పంపుకోవడమే సరిపోతుంది. అంతకంటే ఇంకేమీ రాదు.

ధ్యానమనేది ఇంకేమీ చెయ్యలేక చేసేది కాదు. అన్నీ చెయ్యగలిగి ఉన్నపుడు అవన్నీ మానుకొని చేసేది. అలా చేస్తేనే నీకది వస్తుంది. అప్పుడే నువ్వు Go in కాగలుగుతావు. అలా చెయ్యాలంటే దాన్ని అసలెందుకు చెయ్యాలో నీకు తెలియాలి. దానికోసం ఒక తపన, ఒక ఆకలి నీలో పుట్టాలి. దానికోసం నీకు పిచ్చెక్కాలి. అప్పుడు నీకది దక్కుతుంది. అదంతా ఏళ్ళకేళ్ళు పట్టే ఒక పెద్ద ప్రాసెస్. అంతేగాని ఇవాళ బయటకేల్తే పోలీసులు తంతున్నారని ఏమీ తోచక ధ్యానం చేద్దాంలే అని కళ్ళు మూసుకుంటే రెండే వస్తాయి. అయితే నిద్ర, లేకపోతే కలలు. ఈ రెండూ తప్ప అక్కడ Go in ఉండదు. Get out ఉండదు. మధ్యలో త్రిశంకు స్వర్గమే మనకు మిగిలేది.

కాబట్టి ఈ మెసేజిని ఇలా మారుస్తున్నా నేను.

When you cant go out, go out anyway, because you cant go in.
And be thrashed by the police. Then you will go in (to your house).

అదీ సంగతి. చివరకు మిగిలేది బుచ్చిబాబు అన్నట్టుంది.

అర్ధమైందా?