“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

28, మార్చి 2020, శనివారం

కరోనా కతలు - 2 (సెల్ఫ్ క్వారంటైన్)

సెల్ఫ్ క్వారంటైన్ అనేది ఇప్పుడు కొత్తగా వింటున్నాం. కానీ ఇది మనకేప్పుడో తెలుసు. ఎందుకంటే ఇది మన దేశంలోని యోగులకు ధ్యానులకు ఎప్పటినుంచో అలవాటైన పనే.

నా శిష్యులు చాలామంది ఫోన్లు చేసిన పాపం నా క్షేమసమాచారాలు కనుక్కుంటూ ఉంటారు. 'జాగ్రత్తగా ఉన్నారా సెల్ఫ్ క్వారంటైన్ లో?' అంటూ. వాళ్ళందరికీ ఒకటే చెబుతూ ఉంటాను. 'కొత్తేముంది? ఎప్పటినుంచో మనం చేస్తున్నది అదేగా?' అని.

ఈరోజున చేతులెలా కడుక్కోవాలో, బయటనుంచి వస్తే కాళ్లేలా కడుక్కోవాలో, స్నానం చేస్తున్నపుడు ఒళ్లెలా రుద్దుకోవాలో కూడా టీవీల్లో నేర్పిస్తున్నారు. సినీనటులు మరీ వచ్చి చెబుతున్నారు. వాళ్ళు ఎన్నాళ్లకోసారి స్నానం చేస్తారో మనకు చెప్పరనుకోండి. అది వేరే విషయం.

పాతరోజుల్లో అయితే మనిషి ఊపిరి ఇంకొక మనిషికి తగలనంత దూరంలో ఉండి మాట్లాడేవారు. శుచీ శుభ్రతా బాగా పాటించేవారు. నా చిన్నప్పుడు పల్లెటూర్లలో దీనిని చూచాను. కానీ ఇన్నేళ్ళ తర్వాత నాగరికనగరాల్లో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం - అందరిముందు దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవాలని, కర్చీఫ్ అడ్డుగా ఉంచుకోవాలని, వేరే వాళ్ళ ముఖంమీద దగ్గడం తుమ్మడం చెయ్యకూడదని. రోడ్డుమీద ఒంటేలు పొయ్యకూడదని, క్యూలలో తోసుకోకుండా దూరం పాటించాలని . ఇలాంటి చిన్నచిన్న విషయాలు కూడా కోట్లు ఖర్చు చేసి ఉద్యమస్థాయిలో ప్రభుత్వాలు ప్రజలకు నేర్పించే స్థితిలోకి మనం చేరుకున్నాం ! కలికాలం ఇది కాకుంటే మరేంటి?

పాతకాలంలో బయట నుంచి ఇంట్లోకి వస్తుంటే 'ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఇంట్లోకి రా' అని చెప్పేవాళ్ళు. చాలా కుటుంబాలలో అయితే ఎవరూ చెప్పకుండా వాళ్ళే కడుక్కుని లోపలకు వచ్చేవాళ్ళు. దానికి వీలుగా నీళ్ళ తొట్లు ఇంటి బయటే ఉండేవి. లేకపోతే కనీసం బకెట్లో నీళ్ళన్నా వాకిట్లో పెట్టేవాళ్ళు. ఆ అలవాట్లన్నీ హుష్ కాకీ అయ్యాయి నేడు. పొద్దున్న లేస్తే ఎలా పళ్ళు తోముకోవాలో ఎవరో ఒక తార టీవీలో చూపిస్తే గాని మనకు అర్ధం కానంత ఘోరమైన స్థితిలో ఉన్నాం మనం.

మనలాంటి వాళ్లకి కరోనా రాకపోతే ఇంకేం వస్తుంది మరి?

కొద్దిగా సంస్కారం ఉన్నవాళ్ళకు ఈ క్వారంటైన్ రూల్స్ కొత్తగా ఏమీ నేర్పక్కర్లేదు. ఎవరూ చెప్పకుండానే వాళ్ళవి పాటిస్తారు. ఇక పరిణతి చెందిన యోగులు ధ్యానులు అయితే కొన్ని వేల ఏళ్ళ నుంచీ వారంతట వారే వీటిని పాటిస్తున్నారు. అందరూ పాటించడం లేదేమని బాధపడుతున్నారు. బహుశా అందుకే ఈ వైరస్ ఇప్పుడు వచ్చి అందరికీ నేర్పుతోందేమో - ఎలా పళ్ళు తోముకోవాలి, ఎలా వళ్ళు రుద్దుకోవాలి, ఎలా ముఖం కడుక్కోవాలి, ఎంత దూరంలో ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అంటూ.

నిజమైన ధ్యాని జీవితం మొత్తం సెల్ఫ్ క్వారంటైన్ సూత్రం మీదే నడుస్తుంది. అందులో చాలా ఆనందం ఉంటుంది. అది రుచిచూస్తేగాని అర్ధం కాదు. ఇప్పటిదాకా మనకు తెలిసిన అతి గొప్ప సెల్ఫ్ క్వారంటైన్ యోధుడు శ్రీ అరవిందులు. ఆయన 40 ఏళ్ళ పాటు బయటకు రాకుండా ఒక గదిలో ఉండిపోయాడు. 1910 లో పాండిచేరి కి వచ్చి సెటిల్ అయిన ఆయన 1950 లో చనిపోయెంతవరకూ తన గదిలోనుంచి బయట ప్రపంచంలోకి రాలేదు. ఇంతకంటే పెద్ద సెల్ఫ్ క్వారంటైన్ ప్రపంచానికి ఇప్పటిదాకా తెలియదు.

ఇంతకంటే ఇంకా పెద్ద క్వారంటైన్ యోధులు హిమాలయాలలో ఉన్నారు. ఏభై ఏళ్ళ పాటు తమ గుహలలో నుంచి బయటకు రాకుండా ఉన్న సాధువులు, యోగులు హిమాలయగుహలలో చాలామంది నేటికీ ఉన్నారు. వాళ్ళ జీవితాలు వేరు. వాళ్ళ గమ్యాలు ఆశయాలు వేరు. మన కుళ్ళు జీవితాలు వేరు. మనకీ వాళ్ళకీ పోలిక ఉండదు.

మనది ఎంతసేపూ బయట వెతుకులాట. వాళ్ళదేమో లోపల ప్రయాణం. ఆబగా లోకం మీద పడి తినకపోతే ఏదో నష్టపోతాం అని మన బాధ. ఎలా తిన్నా నీకు దక్కెంత మాత్రమే దక్కుతుంది మెల్లిగా తిను, సుఖంగా తిను, పక్కవాడి నోటిదగ్గరది లాక్కొని తినకు, పరుగెత్తకు, నిదానంగా నడువు, నువ్వు నష్టపోయేది ఏమీ లేదు - అని వాళ్ళు చెబుతారు. మంచి చెబితే మనకు ఎక్కదు కదా !

జైలులాగా ఉంది ఇంకా ఎన్నాళ్ళు ఈ క్వారంటైన్? అని చాలామంది తెగ బాధపడుతున్నారు. ఎందుకంటే, తోచక. నన్నడిగితే ఇది చాలా బాగుందని అంటాను. తపస్సు అలవాటైతే, ధ్యానం అలవాటైతే అలాంటివారికి ఈ సెల్ఫ్ క్వారంటైన్ చాలా బాగుంటుంది. వారికి కావలసింది ఇదే. నాలుగుగోడల మధ్యన తలుపులేసుకుని కూచుంటే వారికదే స్వర్గంలా ఉంటుంది. ఎంతసేపు అలా ఉంటారు? అని అనుమానం వస్తోందా? ఎంతసేపు కాదు ఎన్ని రోజులు అని అడగండి. ఎన్ని రోజులైనా ఉండవచ్చు, ఎలా ఉండాలో తెలిస్తే !

మనోనేత్రం విచ్చుకుంటే గది తలుపులు తియ్యకుండానే ప్రపంచంలో ఎక్కడ ఏముందో కళ్ళముందు కనిపిస్తుంది. చూడాలనుకుంటే. ఆఫ్ కోర్స్ చూసే అవసరం లేదనుకోండి. అది వేరే విషయం.

చావు నెత్తిమీదకొస్తే గాని లోకం సెల్ఫ్ క్వారంటైన్ విధించుకోదు. కానీ కొంతమంది చావును అన్వేషిస్తూ, చావును ఎలా దాటాలో అన్వేషిస్తూ, తమకు తామే సెల్ఫ్ క్వారంటైన్ అవుతారు. ఇదేమీ వారికి కొత్త కాదు. ఎప్పటినుంచో తెలిసిన విషయమే.

కొంతమంది తాగుబోతులు, డ్రగ్ అడిక్స్ ఉంటారు. వాళ్లకు లివర్ పాడైపోయి ఒళ్లంతా గుల్ల అయిపోతుంది. మానుకోరా లేకపోతే చస్తావ్ అని డాక్టర్లు చెబుతారు. కానీ వాళ్ళు వినరు. చావనైనా చస్తారు గాని ఆ అలవాట్లు మానుకోరు. అలా ఉంది నేటి జనాల పరిస్థితి కూడా ! జనం చేత మంచి వినిపించాలంటే, చావుతో దానికి ముడిపెట్టాలి. అప్పుడు వింటారు. ఇది ప్రకృతికి బాగా తెలిసిన రూలే.

అందుకే నేనంటాను. ఇన్నాళ్ళకు, ఇన్నేళ్ళకు, లోకం ఎలా ఉండాలో అలా ఉంటోంది. ప్రజలు ఎలా ఉండాలో అలా ఉంటున్నారు. అనవసరమైన విషయాలన్నీ మూలనపడి అత్యంత అవసరమైన విషయాలే మిగిలాయి. ఇదీ లోకం ఉండవలసిన తీరు. కనుక, ఈ క్వారంటైన్ కనీసం రెండు మూడేళ్ళైనా కొనసాగాలి. ఇలాగే ఎవరింట్లో వాళ్ళుండాలి. ఎవరి హద్దుల్లో వారుండాలి అని నేనంటాను.

ఏం తట్టుకోలేరా? చాలా ఎక్కువనిపిస్తోందా? రోడ్లమీదకు రాకుండా ఉండలేకపోతున్నారా? టీవీ చూడకుండా గాసిప్ వాగకుండా బ్రతకడం కష్టంగా ఉందా? బలాదూరుగా తిరుగుతూ చెత్త తిండ్లు తింటూ, చెత్త వాగుడు వాగుతూ, చెత్తపనులు చేస్తూ, చెత్తచెత్తగా బ్రతకడం మానేస్తే బ్రతకలేకపోతున్నారా? మీ ఖర్మ ! చెత్తలో కలవండి ! మిమ్మల్ని బాగుచెయ్యడం నా వల్ల కాదు.