“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, మార్చి 2020, ఆదివారం

Chart of Sri Aurobindo - Astro analysis - 5 (మొదటి అనుభవాలు - కవిత్వధోరణి)

బరోడామహారాజు సాయాజీరావ్ గయక్వాడ్ కొలువులో నెలకు 300 రూపాయల ఉద్యోగం దొరకడంతో Feb 1893 లో అరవిందులు బ్రిటన్ నుండి వెనక్కు వచ్చేసి ముంబాయిలోని Apollo Bunder ఓడరేవులో కాలుమోపారు. అప్పట్లో ఆ జీతం చాలా ఎక్కువ. కానీ ఒక ICS officer కు చాలా తక్కువ. అంత తక్కువ జీతానికి తనకొక ICS officer దొరకాడని గయక్వాడ్ అనుకున్నాడు. ఇండియాకు తిరిగి వచ్చేస్తే, స్వాతంత్ర ఉద్యమంలో తన పాత్ర పోషించవచ్చని అరవిందులు అనుకున్నారు. ఏమైతేనేం ఆ విధంగా ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. ఆ సమయంలో ఆయన జాతకంలో శుక్ర-బుధ-బుధ దశ జరిగింది.

కర్కాటక లగ్నానికి ఈ దశలు మంచివి కావు. వీరిద్దరూ కుటుంబస్థానంలో ఆ స్థానాధిపతి అయిన సూర్యునితో కలసి ఉండటంతో ఆయన తన కుటుంబం ఉంటున్న దేశానికి తిరిగి వచ్చాడు. కానీ బుధశుక్రులిద్దరూ కర్కాటక లగ్నానికి కానీ, దనూరాశికి కానీ మంచిని చెయ్యరు గనుకా, ముఖ్యంగా ధనూరాశికి వీరిద్దరూ మహాదోష ప్రదులు గనుకా, పితృకారకుడైన సూర్యునితో కలసి ఉన్నారు గనుకా, అందులోనూ దనూరాశి నుండి సూర్యుడు నవమాదిపతి అవుతూ తండ్రిని సూచిస్తున్నాడు గనుకా, నవమస్థానంలోనే ఈ ముగ్గురూ ఉన్నారు గనుకా, అరవిందులు ఇండియాలో అడుగుపెట్టడం. ఆయన తండ్రి చనిపోవడం ఒకేసారి జరిగాయి.

అయితే, నవమస్థానం అనేది ఆధ్యాత్మికసాధనకు కూడా సంకేతం గనుక ముంబాయి ఓడరేవులో అడుగుపెట్టీ పెట్టడంతోనే, "ఒక విశాలమైన ప్రశాంతత తనపైకి దిగి వచ్చినట్టు" ఆయన ఒక అనుభవాన్ని పొందాడు. ఈ ప్రశాంతత అనేది కొన్ని నెలలు ఆయనతో అలాగే ఉండిపోయింది.

1893-94 మధ్యలో ఆయన బరోడా మహారాజు కొలువులో ఉద్యోగం చేశాడు. అదే సమయంలో ఆయన ప్రయాణిస్తున్న గుర్రపుబండి ప్రమాదానికి గురైంది. బుధశుక్రుల చెడుదశలు నడుస్తూ ఆయనను యాక్సిడెంట్ కు గురిచేశాయి. ధనూరాశికి శుక్రుడు శత్రు, రోగ, ఋణాలకు అధిపతి అని మర్చిపోరాదు. కనుక ఈ దశలో ఆయనకు యాక్సిడెంట్ జరగడం సహజమే. కానీ ఆ యాక్సిడెంట్ నుంచి ఆయన రక్షింపబడ్డాడు. అప్పుడు తనలోని దైవాంశను ఆయన అనుభూతి చెందాడు. ప్రమాదం జరుగబోతున్న క్షణంలో ఒక తీవ్రసంకల్పంతో ఆయనా ప్రమాదాన్ని జరుగకుండా తప్పించాడు. ఇదంతా బుధశుక్రులున్న నవమస్థానం ప్రభావంతో జరిగింది. ఇది దైవత్వంతో సంబంధం ఉన్న స్థానం గనుక, యాక్సిడెంట్ జరుగుబోతున్న క్షణంలో  లోలోపల నుండి ఒక బలమైన సంకల్పం పొంగి వచ్చి ఆ యాక్సిడెంట్ ను తప్పించింది. ఇది తన ప్రమేయం లేకుండా జరిగింది. తనలో ఉన్న దైవత్వఛాయను ఆయనా క్షణంలో అనుకోకుండా గుర్తించాడు. ఈ సంఘటనను వివరిస్తూ తరువాత The Godhead అనే పద్యం ఒకదాన్ని వ్రాశాడు. ఆయన వ్రాసిన పద్యాన్ని ఇక్కడ యధాతథంగా ఇస్తున్నాను, క్రింద నా స్వేచ్చానువాదంతో సహా !

The Godhead

I sat behind the dance of Danger’s hooves
In the shouting street that seemed a futurist’s whim,
And suddenly felt, exceeding Nature’s grooves,
In me, enveloping me the body of Him

భవిష్యత్తును సూచించే గందరగోళపు బజారులో
ప్రమాదపు డెక్కల నాట్యం వెనుక నేను కూర్చున్నాను
హటాత్తుగాప్రకృతి ధోరణులను అధిగమిస్తూ
నన్ను ఆవరించిన ప్రభుని ఆత్మను నాలోనే చూచాను

Above my head a mighty head was seen,
A face with the calm of immortality
And an omnipotent gaze that held the scene
In the vast circle of its sovereignty

నా శిరస్సుపైన, ఇంకొక పెద్ద శిరస్సు
అమరత్వపు ప్రశాంతతతో నిండిన ముఖం ఒకటి
ఈ సంఘటన మొత్తాన్నీ తన శక్తివంతమైన చూపుతో
తన విశాలమైన రాజసత్వంతో తిలకిస్తోంది

His hair was mingled with the sun and breeze;
The world was in His heart and He was I:
I housed in me the Everlasting’s peace,
The strength of One whose substance cannot die.

ఆయన కురులు

సూర్యునితో వాయువుతో మమేకమై ఉన్నాయి
విశ్వమంతా ఆయన గుండెల్లో ఒదిగి ఉంది
ఆయనే నేను
ఎవరికైతే మరణం లేదో, ఆయన శక్తిని
ఆయన అమరశాంతిని నాలో ధరించాను

The moment passed and all was as before;
Only that deathless memory I bore

ఆ సంఘటన అంతమైంది, అంతా మునుపటిలాగే ఉంది
మరణం ఎరుగని ఆ జ్ఞాపకం మాత్రం నాలో నిలిచిపోయింది
--------------------
ఆయనకు కలిగిన మరొక అనుభవం శ్రీనగర్ లోని శంకరాచార్య పర్వతం మీద కలిగింది.దీనిని అక్కడివారు 'తఖ్త్ - ఎ - సులేమాన్' అంటారు. అక్కడ శారదాదేవి ఆలయం ఉన్నది. ఈ అనుభవం ఆయనకు May - Aug 1903 సమయంలో కలిగింది. అప్పుడాయనకు సూర్యదశ అయిపోయి చంద్రదశ మొదలైంది. ఈ అనుభవం కలిగినప్పుడు ఆయనకు చంద్ర - చంద్రదశ నడుస్తోంది. శనిచంద్రులిద్దరూ కలసి ఉండటమూ, చంద్రుడు మూలానక్షత్రంలో ఉంటూ, నక్షత్రాదిపతి అయిన కేతువు సహజ అష్టమం అయిన వృశ్చికంలో ఉచ్చస్థితిలో ఉండటమూ గమనించాలి. అందుకే ఆయనకు అలాంటి అనుభవాలు అనుకోకుండా కలిగేవి. పైగా చంద్రునినుంచి రహస్యానుభవాలకు సూచకమైన అష్టమంలో పంచమాదిపతి కుజుడు నీచభంగంలో ఉండటమూ, లగ్నాదిపతి అయిన గురువు ఉచ్చస్థితిలో ఉండటంవల్ల ఆయనకు ఆధ్యాత్మికానుభవాలు సునాయాసంగా కలిగేవి. ఈ అనుభవాలు కూడా ఎవరికిబడితే వారికి, ఎప్పుడుబడితే అప్పుడు కలగవు. దానికి కావలసిన యోగాలు జాతకంలో ఉండాలి. ఆయా దశలు జీవితంలో రావాలి. అంటే, గ్రహానుకూలత దశానుకూలతలు ఉండాలి. అప్పుడే అలాంటి అనుభవాలు కలుగుతాయి. లేకపోతే తల్లక్రిందులుగా తపస్సు చేసినా కలగవు.


అక్కడ తనకు కలిగిన అనుభవాన్ని వివరిస్తూ 'Hilltop temple', 'Adwaita' అనే రెండు పద్యాలను ఆయన వ్రాశాడు. నా తెలుగు అనువాదంతో వాటిని ఇక్కడ చదవండి.

Hilltop temple

After unnumbered steps of a hill-stair
I saw upon earth’s head brilliant with sun
The immobile Goddess in her house of stone
In a loneliness of meditating air

అంతం లేనట్లు అనిపిస్తున్న పర్వతపు మెట్లెక్కి
ధ్యానిస్తున్న గాలిలోని ఏకాంతంలోరాతిఇంటిలో
భూగోళపు శిరస్సుపైన మండుతున్న సూర్యునిలా
చలనం లేకుండా కూర్చుని ఉన్న దేవతను చూచాను

Wise were the human hands that set her there
Above the world and Time’s dominion;
The Soul of all that lives, calm, pure, alone,
Revealed its boundless self mystic and bare

ప్రపంచానికి కాలానికి అతీతంగా
ఆమెను చెక్కిన చేతులు ఎంత జ్ఞానంతో కూడినవో?
శాంతంగా, స్వచ్చంగా, ఏకాంతంగా ఉన్న దివ్యాత్మ
అంతులేని, అంతుబట్టని తన స్వరూపాన్ని
అక్కడ ఆవిష్కరించింది

Our body is an epitome of some Vast
That masks its presence by our humanness.
In us the secret Spirit can indite
A page and summary of the Infinite,
A nodus of Eternity expressed
Live in an image and a sculptured face

మన దేహం ఒక విశాలస్పృహకు శిఖరం
దానిని మానవత్వం అనే ముసుగు కప్పుతోంది
రహస్యమైన ఆత్మ దానిలో వ్రాయగలదు
అంతులేని ఒక పుటను, ఒక సారాంశాన్ని
కాలాతీతమైన ఒక చిక్కుముడిని
ఒక ప్రతిమ తనలో దాల్చింది

Advaita

I walked on the high-wayed Seat of Solomon
Where Shankaracharya’s tiny temple stands
Facing Infinity from Time’s edge, alone
On the bare ridge ending earth’s vain romance

సాల్మన్ శిఖరాన్ని అధిరోహించాను
శంకరాచార్యుని ఆలయం అక్కడుంది
ఏకాంతంగా
కాలపు అంచులనుంచి అనంతత్వాన్ని చూస్తూ
ఆ కొండ కొమ్ము పైన
పృధివి యొక్క వృధా స్వప్నాలను అంతం చేస్తూ

Around me was a formless solitude:
All had become one strange Unnameable,
An unborn sole Reality world-nude,
Topless and fathomless, for ever still.

నా చుట్టూ ఆకారంలేని ఏకాంతం నిలిచింది
పేరులేని ఏదో ఒక ఉనికిలో అంతా లీనమైంది
పుట్టుక నెరుగని ఒక సత్యం నగ్నంగా నిలిచింది
ఆదీ అంతం లేకుండా, ఒక శాశ్వత స్థాణువుగా

A Silence that was Being’s only word,
The unknown beginning and the voiceless end
Abolishing all things moment-seen or heard,
On an incommunicable summit reigned

ఎక్కడ పుట్టిందో తెలీకుండా
నిశ్శబ్దపు అంతంలో లయమౌతూ
ఈ క్షణపు దృశ్యాలను ధ్వనులను చెరిపివేస్తూ
ఎవరూ చేరుకోలేని శిఖరం మీద
మౌనమే తానైన స్పృహ వెలిగింది

A lonely Calm and void unchanging Peace
On the dumb crest of Nature’s mysteries

ఒక ఏకాంతపు నిశ్చల శూన్యం
మార్పులేని ఒక ప్రశాంతత
ప్రకృతి రహస్యాల మూగ ఎదపైన

1905 లో ఆయన నర్మదా నదీతీరంలో చాందోడ్ అనే ప్రదేశంలో ఉన్న కాళీ ఆలయాన్ని దర్శించారు. అక్కడాయనకు కాళీమాత దర్శనం కలిగిందని అంటారు. ఆ అనుభవాన్ని ఆయన ఇలా వ్రాశారు. నా తెలుగు స్వేచ్చానువాదాన్ని కూడా ఆస్వాదించండి మరి !

Stone Goddess

In a town of gods, housed in a little shrine,
From sculptured limbs the Godhead looked at me,
A living Presence deathless and divine,
A Form that harboured all infinity

దేవతల నగరంలో ఒక చిన్న ఆలయం
చెక్కిన శిల్పంనుంచి దేవత నావైపు చూచింది
మరణంలేని దివ్యత్వపు ఉనికి
అనంతత్వాన్ని తనలో ఇముడ్చుకున్న ప్రతిమ

The great World-Mother and her mighty will
Inhabited the earth’s abysmal sleep,
Voiceless, omnipotent, inscrutable,
Mute in the desert and the sky and deep

మహావిశ్వానికి జనని తన అమేయమైన ఇచ్చతో
పృధివి యొక్క పాతాళపు నిద్రను ఆవరించింది
మౌనంగా, శక్తివంతంగా, ఊహలకు అతీతంగా
ఎడారిలో శూన్యంలో అంతుతెలియకుండా

Now veiled with mind she dwells and speaks no word,
Voiceless, inscrutable, omniscient,
Hiding until our soul has seen, has heard
The secret of her strange embodiment

ఆమె మనస్సును ధరించింది, కానీ ఉలకదు పలకదు
మౌనంగా, అభేద్యంగా, సర్వశక్తిగా
అర్ధంకాని తన స్వరూపంలో తాను నిలిచి ఉంది
మన ఆత్మ తనను చూచేదాకా, వినేదాకా

One in the worshipper and the immobile shape,
A beauty and mystery flesh or stone can drape

స్థాణువుగా శిల్పంలో
ఒకటిగా ఆరాధకుని ఆత్మలో 
ఒక సౌందర్యం, ఒక రహస్యం
మనిషిలో శిల్పంలో
చెక్కబడి ఒకే తీరులో...

ఈ కవిత్వధోరణి ఆయనకు చిన్నప్పటి నుండే ఉండేది. బ్రిటన్ లో చదువుకుంటున్న సమయంలో పది పదకొండేళ్ళ చిన్నవయసులోనే ఆయన ఇంగ్లీషు, ఫ్రెంచ్, లాటిన్, గ్రీక్ భాషలలో కవిత్వం వ్రాసేవాడు. అవి అక్కడి సాహిత్య వేదికలపైన వినిపించేవి. ఈ ధోరణి ఆయన జీవితాంతం ఉంది. ఇదే శైలి ఆయన వ్రాసిన 'సావిత్రి' అనే మార్మిక ఉద్గ్రంధంలో కనిపిస్తుంది. ఆయన కవిత్వాన్ని ఒక సాధనగా తీసుకున్నాడు. రోజులో ఎక్కువభాగం ఆయన వ్రాస్తూ ఉండేవాడు. దీనికి సూచనలు ఆయన జాతకంలో బలంగా ఉన్నాయి.

అయితే ఆయన వచనం మాత్రం చాలా విసుగును పుట్టించే శైలిలో ఉంటుందని చెప్పక తప్పదు. అంతమంటూ లేని చాలా పొడుగాటి వాక్యాలలో, విక్టోరియన్ ఇంగ్లీషులో, గొలుసుకట్టు పదాలలో ఆయన తన భావాన్ని చెప్పే శైలి అందరికీ నచ్చదు. రజనీష్ ఉద్దేశ్యంలో అయితే - 'ఒకేఒక్క వాక్యంలో మామూలు మనిషి చెప్పగలిగిన భావాన్ని అరవిందులు ఒక పేజీకి వ్రాస్తారని' అంటాడు. Mother India పత్రిక ఎడిటర్ అయిన బాబూరావ్ పటేల్ అయితే - నిద్రపట్టడం లేదని తన వద్దకు వచ్చిన ఒక రోగికి 'అరవిందుల Lectures on the Gita చదువు, రెండుపేజీలు  కూడా కాకముందే నీకు నిద్ర ముంచుకు వస్తుంద' ని సలహా ఇచ్చి పంపేవాడు. 'ఒకవేళ అప్పటికీ నీకు నిద్ర ముంచుకురాకపోతే ఆయనదే ఇంకో పుస్తకం 'Synthesis of Yoga' చదువు, చచ్చినట్టు నిద్ర అదే వస్తుంది' అని చెప్పేవాడు.

అరవిందుల వచనశైలి అలాంటి గ్రాంధికంలో, అర్ధంకాని మార్మికపదాలలో, చిక్కటి ఇంగ్లీషులో చాలా అయోమయంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక పేజీ మొత్తానికి ఒకటే వాక్యాన్ని ఆయన వ్రాస్తాడు. ఆ వాక్యం దాదాపు 50 లైన్లతో ఉంటుంది ! డిక్షనరీ పక్కన లేకుంటే ఆయన వాడే పదాల అర్ధాలు అంత సులువుగా మనకు కొరుకుడు పడవు. ఇదంతా పంచమంలోని ఉచ్చకేతు ప్రభావం ! కేతువు పొడుగాటివాటిని సూచిస్తాడని మనకు తెలుసు కదా ! వృశ్చికం రహస్యాలకు నిలయం ! పంచమం కవిత్వం ! ఇంకేం కావాలి?

జాతకంలో పంచమాధిపతి వల్ల కవిత్వధోరణి వస్తుంది. అరవిందులకు పంచమంలో కేతువు ఉచ్చస్థితిలో ఉన్నది. పంచమాదిపతి కుజుడు లగ్నంలో నీచభంగంలో ఉన్నాడు. చంద్రుని నుంచి మళ్ళీ పంచమాదిపతి కుజుడే అవుతూ ఆయనకున్న బలమైన కవిత్వశక్తిని సూచిస్తున్నాడు. ఆ కుజుడు రహస్యస్థానమైన అష్టమంలో నీచభంగాన్ని పొంది శక్తివంతుడై, ఉచ్చగురువుతో కూడి, ఆధ్యాత్మికపరమైన రహస్యవిషయాలతో కూడిన కవిత్వాన్ని సూచిస్తున్నాడు. అదేగా ఆయన జీవితంలో జరిగింది మరి !

(ఇంకా ఉంది)