“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

6, జనవరి 2020, సోమవారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (యమగండం ఎందుకు చెడ్డది?)

'యమగండం' అనేది ఎవడో కల్పించిన కల్లబొల్లి మాట తప్ప, అసలది ప్రామాణిక జ్యోతిష్య గ్రంధాలలో లేదని వ్రాశాను కదా ! కానీ దీనికి ప్రత్యామ్నాయంగా వేరే మాట లేదు గనుక ప్రస్తుతానికి ఈ మాటనే వాడుకుందాం. దీని గురించి మరికొంత వినండి !

యమగండ సమయంలో ఏ పని చేసినా చెడిపోతుందని, సర్వనాశనం అవుతుందని అనేవాళ్ళు ఆ సమయంలో ఏదైనా చేసి చూడండి. ఏమీ కాదు ! ఎవరైనా కొన్నిసార్లు సరదాగా టెస్ట్ చేసి అప్పుడు చెప్పండి !

పోనీ ఇంకో విషయం ! మనం ఏదైనా ముహూర్తం పెట్టుకున్నప్పుడు ఈ యమగండం అనేదాన్ని చూసి, దాన్నుంచి తప్పుకుంటున్నాం కదా ! మామూలుగా మనం చేసే రోజువారీ పనులలో కూడా  యమగండం అనేది ఎన్నోసార్లు వస్తూనే ఉంటుంది. కానీ ఆ విషయం మనం పట్టించుకోము. రీసెర్చి మైండ్ తో దీనిని చూసేవాళ్ళు మాత్రమే అలా గమనిస్తారు. నేనలా చాలాసార్లు గమనించాను. ఆ సమయంలో మనం చేసే పనులన్నీ చెడిపోవాలి కదా ! అలా ఏమీ జరగదు. జరగకపోగా, చాలాసార్లు ఆ సమయంలో మనం చేసే పని సక్సెస్ అవుతుంది. ఇది చాలాసార్లు గమనించాను. అప్పుడే నాకు అనుమానం వచ్చింది 'ఇదేంటి?' అని.

ఇంకో విషయం వినండి ! యమగండ సమయంలో చాలామంది పుడుతూ ఉంటారు. మరి వాళ్ళందరూ వెంటనే చనిపోవాలి కదా ! అలా ఏమీ జరగదు. ఈ విషయం ఎవరైనా గమనించారా మరి? అలాంటివాళ్ళు, వారివారి జీవితాలలో ఆధ్యాత్మిక మనస్కులుగా ఉండటం నేను చాలాసార్లు గమనించాను. అంటే, ప్రతి పనినీ స్వార్ధపూర్తితంగా 'నాకేంటి?' అంటూ చెయ్యకుండా, మంచీ చెడూ, న్యాయం ధర్మం, ఆలోచించి, నిదానంగా, ఎదుటి వ్యక్తులను బాధపెట్టకుండా, ఉన్నంతలో హాయిగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. 'యమగండం' అనేది అలా పనిచేస్తుంది. ఎందుకంటే, అది గురువు యొక్క ఉపగ్రహం గనుక, మనిషిని న్యాయమార్గంలో, ధర్మమార్గంలో నడిపిస్తుంది. న్యాయం, ధర్మం అనుసరించే మనిషి తన నిత్యజీవితంలో దూకుడుగా ఉండడు. స్వార్ధపూరితంగా ఉండడు. 'ఎవడెలా పోతే నాకేంటి? నాపని నాకు కావాలి' అనుకోడు. కనుక అలాంటివాడు తన జీవితంలో - నేడు లోకం అనుకుంటున్న 'సక్సెస్' ను - పొందలేడు.

అసలు, నేటిలోకం దృష్టిలో సక్సెస్ అంటే ఏమిటి? 'ఎలా సంపాదించావు? అని ఎవరూ అడగడం లేదు. 'ఎంత సంపాదించావు? అని మాత్రమే అడుగుతున్నారు. 'ఎంత ధర్మంగా బ్రతుకుతున్నావు?' అని అడగడం లేదు. 'ఎంత జల్సాగా బ్రతుకుతున్నావు? అని మాత్రమే అడుగుతున్నారు. 'ఇన్ని తప్పులు ఎందుకు చేశావు?' అనడగడం లేదు. 'ఇంత అమాయకంగా ఎలా దొరికిపోయావు?' అని మాత్రమే అడుగుతున్నారు. 'ఇంత తక్కువమందిని మాత్రమే ఎందుకు ముంచావు?' అనడుగుతున్నారు. కనుక నేటి లోకంలో ' సక్సెస్' నిర్వచనమే మారిపోయింది. అలాంటి సక్సెస్ ను 'యమగండకాలం' ఇవ్వదు గనుక అది పనికిరాని సమయం అయి కూచుంది. ధర్మంగా బ్రతకమని చెబుతుంది గనుక, 'అవసరమైతే దేనినైనా వదులుకోగాని ధర్మాన్ని మాత్రం వదలకు' అని చెబుతుంది గనుక అది 'గండకాలం' అయి కూచుంది. బూచిగా మారింది. దోషకాలం అయింది.

అంటే, నువ్వు చేసే ప్రతి వెధవపనికీ ఆసరాగా నిలవకపోతే అది చెడు అవుతుందా? ఆలోచించండి ! నువ్వు చెయ్యాలనుకున్న తప్పుడు పనులను  చెడగొడుతుంది గనుక యమగండకాలం దుష్ట సమయం అయింది. కాలక్రమేణా శుభకార్యాలలో కూడా దీనిని 'చెడు'గా చూడటం మొదలుపెట్టారు. పంచాంగాలలో వ్రాస్తున్నారు. జనం అనుసరిస్తున్నారు. జనానికి లాజిక్ అక్కర్లేదు కదా ! గొర్రెలమందకు లాజిక్ ఎందుకు? ముందు గొర్రె ఎటు పోతే వెనుకవి కూడా ఆటే పోతాయిగాని, 'ఇలా పోవడం సరియైనదేనా?' అని ఆలోచించవు. అదే ప్రస్తుతం మన సమాజంలో జరుగుతోంది.

యమగండం అనేది ఆధ్యాత్మికానికి చాలా మంచిది. ఈ సమయంలో చేసిన ధ్యానం చాలా మంచి ఫలితాలనిస్తుంది. ఈ విషయం నేను లెక్కలేనన్ని సార్లు గమనించాను. ఎన్నోసార్లు నాకిలా జరిగింది. ఆఫీస్ పనిలో ఉన్నపుడైనా, లేదా ఎక్కడో ఏదో స్టేషన్లో ఇన్స్పెక్షన్ లో ఉన్నప్పుడైనా, లేదా ఇంకేదో పనిలో ఉన్నప్పుడైనా, అకస్మాత్తుగా నాకు ధ్యానస్థితి చాలాసార్లు దానంతట అదే కలుగుతూ ఉంటుంది. అప్రయత్నంగా మనస్సు ఏకాగ్రం అవుతుంది. 'సతోరి' అనుభవంలోకి వస్తూ ఉంటుంది. నా చిన్నప్పటినుంచీ ఇలా చాలాసార్లు జరిగింది. అలా జరిగిన చాలాసార్లు ఆ సమయంలో 'యమగండకాలం' నడుస్తూ ఉండటం నేను గమనించాను. ఆ సమయంలో 'డబ్బు' గురించి, 'సంపాదన' గురించి, విలాసాల గురించి, సినిమాలు షాపింగులు, రాజకీయాల గురించి, ఇంకా ఇలాంటి చెత్త విషయాల గురించి, ఎవరైనా మాట్లాడితే వాళ్ళు క్రిమికీటకాలుగా నాకు కన్పిస్తారు. నేనెక్కడో మేఘాల పైన వెలుగులో ఉన్నట్లు, వాళ్లంతా బురదలో దొర్లుతున్నట్లు అనిపిస్తుంది. మనస్సు అంత ఎత్తులో ఉంటుంది. 'అమూల్యమైన మానవజన్మను పొంది కూడా ఎలా బ్రతుకుతున్నార్రా మీరు? ఎంత టైం ని వేస్ట్ చేసుకుంటున్నార్రా?' అని చాలా జాలి నాలో తలెత్తుతూ ఉంటుంది. ఇలాంటి మానసికస్థితిలో ఉన్న మనిషి  సోకాల్డ్ ' సక్సెస్' ను ఎలా పొందగలడు? ఎదుటివాడిని దోచుకోవాలని ఎలా అనుకోగలడు? కనీసం ఆ కోణంలో ఎలా ప్రయత్నించగలడు? కుదరదు. అలాంటివాడు తన జేబులోనుంచి ఎదుటివాడికి ఇస్తాడు గాని, ఎదుటివాడి జేబులోంచి లాక్కోడు. కనుక, యమగండకాలం దోషపూరితం అయింది. అన్నింటినీ చెడగొట్టే పాడుసమయం అయి కూచుంది. అదీ అసలు సంగతి !

సున్నితంగా, మెత్తగా, మంచిగా, ఆధ్యాత్మికంగా ఉండే మనుషులు ఈ లోకం దృష్టిలో చేతగానివాళ్ళు, పనికిరానివాళ్ళు, బ్రతకడం తెలియనివాళ్ళు, దద్దమ్మలు, మేనేజిమెంట్ తెలియనివాళ్ళు. ఎదుటి మనిషిని మాయమాటలతో బోల్తా కొట్టించి, దోచుకుని, బ్రతికేవాళ్ళు తెలివైనవాళ్ళు. ఇదీ నేటి లోకం తీరు !

యమగండం అనేది లౌకికమైన పనులకు, అందులోనూ స్వార్ధపూరితమైన పనులకు మాత్రమే చెడును చేస్తుంది. ఎందుకంటే అది ధర్మపూరిత సమయం గనుక. ధర్మానికి ప్రతిరూపమైన గురువు యొక్క ఉపగ్రహమైన యమఘంటక సమయం కనుక, ధర్మాన్ని ప్రోత్సహిస్తుంది. అధర్మాన్ని ఖండిస్తుంది. పాడుపనులను ఖచ్చితంగా చెడగొడుతుంది. అంతేగాని అది అన్నింటినీ చెడగొట్టదు. ఆధ్యాత్మిక సాధనలకు ఈ సమయం చాలా మంచిది.

ఈ విషయాన్ని నేను అనుభవంలో నిగ్గు తేల్చుకున్న తర్వాత మాత్రమే చెబుతున్నాను. మీరూ గమనించి చూడండి మరి !