నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

5, మే 2019, ఆదివారం

ఆధ్యాత్మిక కులపిచ్చి

మన దేశంలో అంతా కులమయమే. వాడు ఎంత వెధవ అయినా సరే, 'మనోడు' అయితే చాలు, వాడిని చంకనెక్కించుకుంటాం. 'మనోడు' కాకపోతే వాడిలో ఎంత టాలెంట్ ఉన్నా పట్టించుకోం, లేదా వాడిని అణగదోక్కేస్తాం. ఇది చేదునిజం.

మన దేశమూ, మన సమాజమూ పెద్ద మేడిపండులని గతంలో నేనెన్నో సార్లు వ్రాశాను. ఇది అబద్దం కాదు. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయాల్లో, సినిమాల్లో ఎక్కడ చూచినా ఈ 'కులపిచ్చి' మీదే అంతా నడుస్తూ ఉంటుంది. సినిమాలలో అయితే, 'మనోడు' కాకపోవడం వల్ల ఎందఱో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అవకాశాలు రాక మట్టి కొట్టుకుపోయారు. అంత టాలెంట్ లేని నటులు కూడా 'మనోళ్ళు' అవ్వడంతో జనాల నెత్తిన రెండు మూడు దశాబ్దాల పాటు రుద్దబడ్డారు.

ఎమ్జీఆర్ ని చూచో, లేక తనకే బుద్ధి పుట్టిందో తెలీదు కాని, ఎన్టీఆర్ రాజకీయాలోకి వచ్చి పార్టీ పెట్టాక, సినీ పాపులారిటీని రాజకీయాలకు ఇలా కూడా వాడుకోవచ్చా అని సినీజీవులకు బాగా అర్ధమై, వాళ్ళు కూడా రాజకీయ షెల్టర్ తీసుకోవడమూ లేదా తమతమ కులాలను కూడగట్టుకుని పార్టీలు పెట్టడమూ చేసారు. దీనివల్ల ప్రజలు ఏమైపోయినా, కొందరు వ్యక్తిగతంగా బాగా సక్సెస్ అయ్యారు. ఇదంతా లోకవిదితమే.

మన దేశంలో రాజకీయ పార్టీలన్నీ కులపార్టీలే. కులం అనేది 'లేదు లేదు' అని ఎంతమంది ఎంతగా అరిచి 'గీ' పెట్టినా అది రోజురోజుకీ బలపడుతూనే ఉంది. గతంలో కంటే ఇప్పుడింకా బలపడింది.

ఇదంతా అలా ఉంచితే, ఆధ్యాత్మికరంగం కూడా దీనికి మినహాయింపు కాకపోవడం విచిత్రాతి విచిత్రం.

బ్రహ్మంగారు మా వాడని కంసలివారు ఆయన్ను తప్ప ఇంకొకరిని కొలవరు. కన్యకాపరమేశ్వరి మా అమ్మాయి అని కోమటివారు ఆమెను తప్ప ఇంకొకరిని కొలవరు. ఇకపోతే వెంకటేశ్వరస్వామి కమ్మవారి కులదైవం. వారు శివుడి జోలికే పోరు. ఎందుకంటే, శివుడు డబ్బులివ్వడని వారి ప్రగాఢవిశ్వాసం. వేమనయోగి రెడ్డివంశంలో పుట్టాడు కనుక ఆయన మా దేవుడని రెడ్లు అంటున్నారు. కాశినాయనను కూడా వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. మొన్నమొన్నటి దాకా జనాన్ని తన మాయలతో మెస్మరైజ్ చేసిన సత్యసాయిబాబా గారు రాజుల వంశంలో పుట్టాడు గనుక, రాజులలో ఆయన భక్తులు ఎక్కువని ఒక మిత్రుడు ఈ మధ్యనే నాకు చెప్పాడు. రాజులు ఎక్కువగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలలో అందుకనే ఆయనకు ప్రాబల్యం ఎక్కువట.

ఇకపోతే, శ్రీ రామకృష్ణులు, రమణమహర్షీ, జిల్లెళ్ళమూడి అమ్మగార్లు బ్రాహ్మణులు గనుక వారి భక్తులలో బ్రాహ్మలే ఎక్కువట. మిగతా కులాలవారు వీరిని ఎక్కువగా ఇష్టపడరట. అరవిందులది క్షత్రియవంశం గనుక ఆయన అనుచరుల్లో క్షత్రియులు ఎక్కువట, ఇక ఎస్సీ ఎస్టీలకు అగ్రవర్ణాలంటే కోపం గనుక ఈ దేవుళ్ళను ఎవరినీ వారు పూజించరట. అందుకే విదేశీప్రవక్త అయిన జీసస్ నే వాళ్ళు దేవుడిగా కొలుస్తారట.

ఈ గోలంతా వింటే, కులం అనేది మన రక్తంలో ఎంతగా జీర్ణించుకుపోయిందో, ప్రతివిషయాన్నీ కులం ఒక్కటే ఎలా డిసైడ్ చేస్తుందో, చివరకు దైవత్వాన్ని నిర్ణయించేది కూడా 'కులం' ఏ విధంగా అవుతున్నదో అని ఆశ్చర్యం వేసింది.

మొన్నీ మధ్యన రోడ్డుమీద వస్తుంటే, నెహ్రూనగర్లో ఎస్వీ రంగారావు విగ్రహం ఒకటి కనిపించింది. అది కీచకుని గెటప్ లో ఉంది. ఇదేం ఖర్మో నాకర్ధం కాలేదు. ఎన్టీఆర్ బొమ్మలు కూడా దుర్యోధనుడి వేషంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కీచకుడూ దుర్యోధనుడూ దుర్మార్గులు. మంచివాళ్ళు కారు. అన్యాయాలూ అక్రమాలూ రేపులూ చేసినవాళ్ళు. అలాంటి దుర్మార్గుల వేషాలలో తమ అభిమాననటులను చూచుకుని మురిసిపోవడం ఏం ఖర్మో నాకైతే అర్ధం కాలేదు. అన్యాయాలూ అధర్మాలూ చేసినవాళ్ళ వేషాలలో ఉన్న వారిని పూజించడం ఆరాధించడం దేనికి సంకేతమో నాకైతే అర్ధంకావడం లేదు. ఎన్టీఆర్ దుర్యోధనుడి వేషంలో ఉన్నాడు గనుక, కీచకుడి వేషంలో ఎస్వీఆర్ ను పెట్టారన్నమాట కాపులు? ఇంకే వేషమూ దొరకనట్లు? వెనకటికి ఒకడు ఒంటికి నిప్పు పెట్టుకుంటే, ఇంకొకడు ఇంటికి నిప్పు పెట్టుకున్నాడట. అలా ఉంది. ఏంటో ఈ వేలం వెర్రి? అని బాధేసింది.

ఒక కులంలో పుట్టినంత మాత్రాన 'టాలెంట్' అనేది రాదు. 'టాలెంట్' ఉన్నవాళ్ళు అన్ని కులాలలోనూ ఉంటారు. కులాలకు అతీతంగా 'టాలెంట్' అనేదాన్ని గుర్తించి దానికివ్వాల్సిన మెప్పును దానికి అందించే  పరిస్థితి మన సమాజంలో రావాలి.

అదేవిధంగా, ఒక కులంలో పుట్టినంత మాత్రాన ఎవడూ మహనీయుడు అవడు. కులాన్నీ మతాన్నీ ప్రాంతాన్నీ దేశాన్నీ, ఈ లిమిట్స్ అన్నింటినీ దాటిన భూమికను అందుకున్నవాడే ఆధ్యాత్మికంగా మహనీయుడౌతాడు. మహనీయులకు ఏ కులమూ ఉండదు. ఏ మతమూ ఉండదు. మానవసంబంధమైన పరిమితులను అన్నింటినీ వారు దాటిపోతారు. ఈ సింపుల్ విషయాన్ని అర్ధం చేసుకోకుండా, 'మన కులంలో పుట్టాడు గనుక వీడే మన దేవుడు' అంటూ, మిగతా దేవుళ్ళకు పోటీగా వీరికి కూడా గుళ్ళు కట్టించి ఆర్భాటాలు చెయ్యడం చూస్తుంటే మన జనాలు ఎప్పటికీ ఎదగరేమో అని నాకు గట్టి నమ్మకం ఏర్పడిపోయింది.

నిజమైన మహనీయుడెవడూ 'నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు, ఊరకే నన్ను నమ్ము చాలు. నిన్ను నేను రక్షిస్తాను. నీదంతా నేనే చూసుకుంటాను.' అని ఎన్నడూ చెప్పడు. అలా చెప్పేవాడు అసలు మహనీయుడే   కాడు. 'ముందు నువ్వు ధర్మంగా బ్రతుకు. ఆ తర్వాత నా దగ్గరకు రా. అప్పుడు చూద్దాం' అనే అంటాడు. బుద్ధుడు కూడా ఇదే  స్పష్టంగా   చెప్పాడు గనుక ఆయన్ను మన దేశం నుంచే బయటకు తరిమేశాం. అంత గొప్ప సమాజం మనది !

మొన్నొక మిత్రుడు ఇలా అన్నాడు.

'మా ఏరియాలో రామాలయానికి ఎవరూ పోవడం లేదు. ఎప్పుడు చూచినా అది నిర్మానుష్యంగా ఉంటోంది. కానీ షిర్డీ సాయిబాబా గుడి మాత్రం కిటకిటలాడుతోంది. ఏంటీ వింత?'

అతనికిలా చెప్పాను.

'మనుషులలో పెరుగుతున్న అధర్మానికి, స్వార్ధానికి ఇది గుర్తు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. నీ కోరికలు అప్పనంగా ఆయన తీర్చడు. నువ్వు ధర్మంగా ఉన్నప్పుడే ఆయన మెచ్చుతాడు. లేకుంటే మెచ్చడు. సాయిబాబా అయినా అంతే. కాకపోతే, శ్రీరాముడు దేవుని అవతారం. సాయిబాబా కాదు. ఆయనొక ముస్లిం సాధువు. కానీ కొందరు కుహనా గురువులు ఆయనను ఒక దేవుడిని చేశారు. అన్ని కోరికలూ అప్పనంగా తీరుస్తాడని ప్రచారం చేసారు. గొర్రెజనం నమ్ముతున్నారు. ఎగబడుతున్నారు. రాముడినీ, ధర్మాన్నీ వదిలేశారు. స్వార్ధంతో కొట్టుకుంటున్నారు. అందుకే సాయిబాబా గుడి కిటకిట లాడుతోంది. రామాలయంలో ఎవరూ ఉండటం లేదు. అంతే ! వెరీ సింపుల్ !' అన్నాను.

మనిషి - కులానికి, స్వార్ధానికి, మోసానికి పెద్ద పీట వేసుకుని, తమకు నచ్చినవారిని దేవుళ్ళుగా మార్చుకుని, గుడులు కట్టుకుని, వారిని పూజిస్తూ, ఆరాధిస్తూ, అదే పెద్ద ఆధ్యాత్మికత అనుకుంటూ భ్రమిస్తూ ఉన్నంతకాలం ఈ సమాజం ఇలాగే అఘోరిస్తూ ఉంటుంది.

కులపిచ్చితో, స్వార్ధంతో, అధర్మంతో, కుళ్ళిపోతున్న ఇలాంటి సమాజానికి నిజమైన ఆధ్యాత్మిక ఔన్నత్యం కలుగుతుందని ఆశించడం ఒక పెద్ద భ్రమ. అంతే !