“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, మే 2019, శుక్రవారం

జ్యోతిష్కుల్లారా దుకాణాలు మూసుకోండి !

తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది అని చాలామంది జ్యోతిష్కులు జోస్యాలు చెప్పారు. కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. టీడీపీ గల్లంతు లేకుండా ఓడిపోయింది. టీడీపీకి అనుకూలంగా చెప్పిన జ్యోతిష్కుల అంచనాలన్నీ తప్పయ్యాయి.

ఈ రోజుల్లో నాలుగు మాయమాటలు నేర్చుకున్న ప్రతివాడూ ఒక జ్యోతిష్కుడే. తెలిసీ తెలియని పూజలు, హోమాలు చేయించి అమాయకుల్ని మోసం చేసి డబ్బులు కాజేయ్యడం తప్ప అసలు సబ్జెక్టు వీళ్ళలో ఎక్కడా లేదు.

రెండు నెలల క్రితం జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూని ఈరోజు మధ్యాన్నం యూట్యూబులో చూచాను. అందులో ఆయన క్లియర్ గా చెప్పాడు. ''ఇప్పుడు ఎన్నికలంటూ వస్తే, టీడీపీకి 40 సీట్ల కంటే రావు. కావాలంటే రాసిస్తాను'' అని స్పష్టంగా చెప్పాడు. అదే జరిగింది. మరి జగన్ కి జ్యోతిష్యం రాదే? జరగబోయేదాన్ని అన్ని నెలలముందే ఎలా చెప్పాడు?

సమాజంలో ఏం జరుగుతున్నది? ప్రజల నాడి ఎలా ఉంది? అన్న విషయాలు జాగ్రత్తగా గమనించిన ప్రతివారూ జగన్ రెండు నెలల క్రితం చెప్పినదే చెప్పారు. అదే జరిగింది. దీనికి పెద్ద జ్యోతిష్యాలు రానక్కరలేదు. వాస్తవిక దృక్పధం ఉంటె చాలు. మన చుట్టూ ఏం జరుగుతున్నదో గమనిస్తే చాలు.

అసలీ జ్యోతిష్కులలో దొంగ జ్యోతిష్కులే ఎక్కువ. వీళ్ళకున్నంత దురహంకారం ఇంకెవరికీ ఉండదు. వీళ్ళలో నీతి నియమాలతో కూడిన జీవితం కూడా ఉండదు. డబ్బుకోసం ఏమైనా చేసే రకాలే నేడు జ్యోతిష్కులుగా సమాజంలో చెలామణీ అవుతున్నారు. వీళ్ళ మాటలు నిజాలెలా అవుతాయి?

నిన్న మా మిత్రుడు ఒకాయన పోన్ చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్.

'రిజల్స్ చూశారా?' అన్నాడాయన.

'చూశాను' అన్నాను.

'మీ అభిప్రాయం?' అడిగాడు.

'జనం అభిప్రాయమే నాది కూడా. టీడీపీ ప్రభుత్వం మీద ప్రజలలో విశ్వాసం లేదు. వాళ్ళు చెప్పే అబద్దాలు, వాళ్ళు చేస్తున్న అవినీతి చూడలేక జనం విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే జగన్ స్వీప్ చేశాడు. ప్రజాతీర్పు స్పష్టంగా ఉంది. ఇంకేం కావాలి? కమ్మవారికి కంచుకోటలైన కృష్ణా, గుంటూరు జిల్లాలలో కూడా టీడీపీ ఓడిపోయింది అంటే, వాళ్ళు కూడా టీడీపీకి వెయ్యలేదని స్పష్టంగా తెలుస్తున్నది. కులాలకతీతంగా ప్రజాతీర్పు జగన్ వైపే ఉంది. కనిపిస్తోంది కదా? ప్రజలు పిచ్చోళ్ళు కారు. ఎల్లకాలం అబద్దాలు చెప్పి వారిని మోసం చెయ్యడం సాధ్యం కాదనేది మళ్ళీ రుజువైంది' అన్నాను.

'మరి నాకు తెలిసిన జ్యోతిష్కుడు ఒకాయన టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పాడు. అదేంటి?' అన్నాడాయన.

ఎవరా జ్యోతిష్కుడు? అని నేను అడగలేదు. ఎందుకంటే, అలాంటి వారి పేరు తెలుసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఆయనే చెప్పుకొచ్చాడు.

'ఆయన చాలా పేరున్న జ్యోతిష్కుడు. పది వేళ్లకీ పది ఉంగరాలుంటాయి. టీవీలో వస్తుంటాడు. టీడీపీ గెలుపు ఖాయం అన్నాడు. బోర్లా పడ్డాడు.' అన్నాడు.

'అడక్కపోయారా మరి?' అన్నాను.

'ఫోన్ చేసి అడిగాను. ''అదే నాకూ అర్ధం కావడం లేదండీ?'' అని నసిగాడు' అన్నాడు మా ఫ్రెండ్.

భలే నవ్వొచ్చింది నాకు.

'ఆయనకే అర్ధం కాకపోతే ఇక జనానికేం చెబుతాడు జ్యోతిష్యం? దుకాణం మూసుకొని, ఉంగరాలు మొత్తం తీసేసి, ఏదైనా పని చేసుకుని బ్రతకమనండి బుద్ధుంటే.' అన్నాను.

'అదేంటి అంతమాటన్నారు?' అన్నాడు.

'ప్రతి జ్యోతిష్కుడూ తప్పులు చేస్తాడు. ఎక్కడ తప్పు పోయిందా అని తన జోస్యాన్ని సరిచూసుకోవాలి. అది కూడా తెలీకుండా 'ఎక్కడ తప్పు పోయిందో అర్ధం కావడం లేదండీ' అంటే అతను వేస్ట్ అని అర్ధమన్నమాట. అలాంటప్పుడు అది చెయ్యక ఇంకేం చెయ్యాలి?' అన్నాను.

'అంతేలెండి. కానీ నాదొక డౌటు. జ్యోతిష్యం అనేది ఒకటే సబ్జెక్టు కదా? ఇలా రకరకాలుగా ఎలా చెబుతారు వీళ్ళు?' అన్నాడు.

'చెప్తా వినండి. జ్యోతిష్యం ఒకటే సబ్జెక్టు. కానీ వీళ్ళకు రకరకాల మైండ్ సెట్స్ ఉంటాయి. వీళ్ళేమైనా ఋషులా స్వచ్చమైన నిష్కల్మషమైన మైండ్ తొ ఉంటానికి? వీళ్ళలో చాలామంది డబ్బుకు అమ్ముడుపోయే రకాలే. పైగా దురహంకారం నిలువెల్లా నిండి ఉంటుంది వీళ్ళకు. ఇక వీళ్ళకు జ్యోతిష్యవిద్య ఎలా పట్టుబడుతుంది? ఏవో ఫుట్ పాత్ పుస్తకాలు నాలుగు చదివేసో, లేదా తెలుగు యూనివర్సిటీ నుంచి ఎమ్మే జ్యోతిషం కరెస్పాండేన్స్ కోర్స్ చేసో, నాకు జ్యోతిష్యం వచ్చేసింది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. జ్యోతిష్యశాస్త్రం పట్టుబడాలంటే కొన్ని దైవికమైన క్వాలిటీస్ మనిషిలో ఉండాలి. అది ఉత్త ఎకాడెమిక్ సబ్జెక్ట్ కాదు ఆషామాషీగా రావడానికి. పైగా, జ్యోతిష్కుడికి బయాస్ లేని మైండ్ ఉండాలి. ఈ సోకాల్డ్ జ్యోతిష్కులందరూ ఏదో ఒక పార్టీకి బాకారాయుళ్ళే. పైగా డబ్బుకు అమ్ముడుపోయే రకాలే. కనుక వీళ్ళకు unbiased minds ఉండవు. వేషంలో తప్ప వీళ్ళ జీవితాలలో ఏ విధమైన దైవత్వమూ ఉండదు, సబ్జెక్టూ  ఉండదు, నీతీ ఉండదు. అందుకే వీళ్ళ జోస్యాలు ఫలించవు.

'ఈయనకు పదివేళ్ళకూ పది ఉంగరాలున్నాయని చెప్పాను కదా?' అన్నాడు మా ఫ్రెండ్.

'అంతమాత్రం చేత జ్యోతిశ్శాస్త్రం వస్తుందని అనుకోకండి. అది ఉత్త వేషం. వేశ్యకూడా వేషం వేస్తుంది. కానీ అది పతివ్రత కాలేదు. వీళ్ళూ అంతే. రెమెడీలు చేబుతామంటూ అమాయకుల్ని మోసం చేసిన డబ్బులతో చేయించుకున్న ఉంగరాలు అవన్నీ. అవి వాళ్ళ చెడుఖర్మకు సూచికలు. వాళ్ళ జ్ఞానానికి కాదు. గడ్డం పెంచి, రుద్రాక్షమాలలు మెళ్ళో వేసుకుని, వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంటే జ్యోతిష్యం రాదు. వస్తుంది అనుకుంటే అది పెద్ద భ్రమ. అలాంటి వేషాలు చూసి మోసపోకండి.' అన్నాను.

'మరి మా జ్యోతిష్కుడిని ఏం చెయ్యమంటారు?' అడిగాడు ఫ్రెండ్.

'దుకాణం మూసుకోమనండి' అని ఫోన్ కట్ చేశాను.