“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, ఏప్రిల్ 2019, సోమవారం

ప్రహ్లాదుడు ఎదురింట్లో ఉండాలి. మనింట్లో కాదు

కొంతకాలం క్రితం ఒకాయన నాకు తెగ ఫోన్లు చేస్తూ ఉండేవాడు. ఎందుకు చేస్తున్నారు అనడిగితే 'నేను ఒకసారి గుంటూరు వచ్చి మిమ్మల్ని కలవాలి. ఎప్పుడు రమ్మంటారో చెప్పండి?' అని అడుగుతూ ఉండేవాడు. 'కారణం ఏమిటి?' అంటే చెప్పెవాడు కాడు. 'మిమ్మల్ని కలవాలి, వచ్చినప్పుడు చెబుతాను' అని అంటూ ఉండేవాడు.

ఇలాంటి వారిని కలవడానికి నేనేమీ ఇక్కడ ఖాళీగా లేను గనుక - 'నాకు కుదరదు'  అని చెబుతూ ఉండేవాడిని.

'పోనీ వీకెండ్ లో అయినా ఖాళీ రోజు చెప్పండి. వస్తాను' అనేవాడు.

'వీకెండ్ లో  మరీ బిజీగా ఉంటాను. అస్సలు కుదరదు' అని చెబుతూ ఉండేవాడిని.

అయినా సరే, పట్టు వదలని విక్రమార్కుడిలాగా పోన్లు చేస్తూనే ఉండేవాడు.

అలా ఒకసారి  ఫోన్ చేసినపుడు, 'అసలు మీకేం కావాలి? ఎందుకు నాకిలా మాటమాటకీ  ఫోన్ చేస్తున్నారు?' అనడిగాను.

'మాకొక సమస్య ఉంది. దానికి సొల్యూషన్  కావాలి' అన్నాడు.

'సారీ. సమస్యలు తీర్చడం నా పని  కాదు. నాకే   బోలెడన్ని సమస్యలున్నాయి. వాటిని తీర్చేవారి కోసం నేనూ వెదుకుతున్నాను. దొరికితే అడ్రస్ మీకూ ఇస్తాను. ఆయన్ని కలవండి' అని చెప్పాను.

'అది కాదు. మా సమస్య మీరే' అన్నాడు.

' నేనా?' ఆశ్చర్యపోయాను.

'అవును. మీరే' అన్నాడు.

'ఎలా?' అన్నాను.

' మా అబ్బాయి మీ ఫాలోయరు' అన్నాడాయన.

' సరే. ఇందులో సమస్య ఏముంది?' అడిగాను.

'అదే అసలు సమస్య. మా వాడు మీ పుస్తకాలు విపరీతంగా చదువుతున్నాడు. ఎప్పుడు చూసినా మీ మాటలే మాట్లాడుతూ ఉన్నాడు' అన్నాడు.

'ఇందులో తప్పేముంది?' అడిగాను.

'మావాడికి ఇంకా ముప్పై కూడా రాలేదు.ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇప్పుడే  ఆధ్యాత్మికం ఏంటి?' అన్నాడు దురుసుగా.

'ఓహో అదా విషయం? మరి ఆధ్యాత్మికత ఏ వయసులో కావాలి?' అడిగాను.

' అది పెద్ద వయసులో కదా కావలసింది?' అన్నాడు ఇంకా విసురుగా.

' అలాగా !   మీకిప్పుడు ఎన్నేళ్ళు?'  అడిగాను.

'అరవైకి దగ్గరలో ఉన్నాను' అన్నాడు.

'మరి మీకు  వచ్చిందా ఆధ్యాత్మికత?' అడిగాను.

' నేను డైలీ యోగా చేస్తాను' అన్నాడు కోపంగా.

' ప్రతి ఏడాదీ షిరిడీ తిరుపతీ కూడా వెళుతుంటారా?' అన్నాను నవ్వుతూ.

' అవును' అన్నాడు.

' అయ్యప్ప   దీక్ష కూడా చేస్తుంటారా?' అడిగాను.

' ప్రతి ఏడాదీ చేస్తాను. ఇప్పటికి ఇరవై సార్లు శబరిమల వెళ్లాను' అన్నాడు  గర్వంగా.

'ఇంతమాత్రానికే ఆధ్యాత్మికత మీకు వచ్చిందని, అసలిదొక ఆధ్యాత్మికతనీ అనుకుంటున్నారా?'  అడిగాను.

జవాబు లేదు.

' పోనీ, మీరు నా పుస్తకాలు చదివారా?' అడిగాను.

' లేదు' అన్నాడు.

'మరి చదవకుండా వాటిల్లో ఏముందో మీరేం చెప్పగలరు?' అడిగాను.

' అదికాదు.  మా వాడు మిమ్మల్ని ఫాలో  అవడం  మాకిష్టం లేదు' అన్నాడు.

'నేనేమీ చెడిపోమ్మని ఎవరికీ చెప్పడం లేదు. మంచినే చెబుతున్నాను. ధర్మంగా బ్రతకమని చెబుతున్నాను. ఇందులో తప్పేముంది?  అసలీ విషయాలు మీ పిల్లలకు మీరు చెప్పాలి. మీరు చెయ్యని పనిని నేను చేస్తున్నందుకు మీరు నాకు థాంక్స్ చెప్పాల్సింది పోయి ఇలా అరుస్తున్నారేంటి?' అడిగాను.

'ఏదేమైనా సరే, మావాడు మీ పుస్తకాలు చదవడం మాకు నచ్చదు' అన్నాడాయన.

'మానిపించుకోండి. నాకేమీ అభ్యంతరం లేదు'  అన్నాను.

'మీరు చెప్పండి' అన్నాడాయన గట్టిగా.

'నేను చెప్పను. అతనే పుస్తకాలు చదవాలో నేనెలా డిసైడ్ చేస్తాను? అది  అతనిష్టం' అన్నాను.

'మరి మేమేం చెయ్యాలి?' అన్నాడు.

'నాకేం తెలుసు? అది మీ సమస్య. మీరే  తీర్చుకోవాలి. నేను ముందే చెప్పాకదా నేనున్నది సమస్యలు తీర్చడానికి కాదని' అన్నాను నేనూ గట్టిగానే.

ఫోన్ కట్ అయిపోయింది.

భలే నవ్వొచ్చింది.

పరిపూర్ణంగా ఎలా జీవించాలో, ఆనందంగా  ఎలా జీవించాలో తప్ప ఇంకేమీ నా పుస్తకాలలో ఉండదు. మంచిగా, ధర్మంగా ఎలా జీవించాలో  తప్ప ఇంకేమీ ఉండదు. ఇది చెడెలా అవుతుందో నాకైతే అర్ధం కావడం లేదు.

'మా అబ్బాయి  మీ పుస్తకాలు చదివి మంచిగా తయారౌతున్నాడు. వాడి ఈడు పిల్లలు హాయిగా తాగుతూ తిరుగుతూ అవినీతి డబ్బు ఎలా సంపాదించాలో  నేర్చుకుంటూ ఉంటే మావాడు మీ పుస్తకాలు చదివి మంచిగా చెడిపోతున్నాడు. ఇది మాకిష్టం  లేదు' - అని తల్లిదండ్రులు అంటున్నారు. ఇక ఆ తల్లిదండ్రులు ఎలాంటి మనుషులై ఉంటారో వేరే చెప్పనవసరం లేదనుకుంటాను.  రాక్షసకులంలో ప్రహ్లాదుడు పుట్టినట్లు కొందరు పిల్లలు పుడుతూ ఉంటారు. వాళ్ళు మంచిమార్గంలో నడవడం ఆ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు.

హిరణ్యకశిపులూ ప్రహ్లాదులూ పాతయుగాలలోనే కాదు, ఇప్పుడూ ఉన్నారు.

జిల్లెళ్ళమూడి అమ్మగారు ఒక మాటను తరచుగా అనేవారు - 'ప్రహ్లాదుడు ఎదురింట్లో  ఉండాలి. మనింట్లో కాదు' అని.

ప్రహ్లాదచరిత్ర చదివి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటాం. 'అబ్బా ! పాపం! దేవుడి కోసం ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పడ్డాడో' అంటూ. కానీ మన పిల్లలు ధర్మమార్గంలో నడుస్తూ, నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో ఎదుగుతూ ఉంటె మాత్రం సహించలేం. ఇదీ లోకం తీరు !

ఆధ్యాత్మికమైనా, దేవుడైనా, ఇంకేదైనా  సరే !  అది మన ఇష్టం వచ్చినట్లు ఉండాలి గాని, అది చెప్పినట్టు మనం ఉండం !  ఇదీ మన వరస !

నా పుస్తకాలు చదివి చెడిపోతున్నారట ! చెడిపోవడం అంటే ఏమిటో అసలు? తాగి తందనాలాడుతూ, ఫ్రెండ్స్ తో కలసి తిరుగుతూ, యూ ట్యూబులో ఫోర్న్ చూస్తూ, అమ్మాయిల వెంట పడుతూ ఉంటె బాగుపడటం అన్నమాట నేటి తల్లిదండ్రుల దృష్టిలో ! దానికి విరుద్ధంగా మంచి పుస్తకాలు చదువుతూ, మంచి సర్కిల్ లో ఉన్నవారితో స్నేహం చేస్తూ, మంచిగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటె, దానిని ' చెడిపోవడం' అంటున్నారు !

అద్భుతం ! గొప్ప తల్లిదండ్రులురా బాబూ ! 

జిల్లెళ్ళమూడి అమ్మగారు ఎన్ని సంఘటనలను చూచిన పిదప ఈ మాటన్నారో గాని  అది అక్షర సత్యం.

' ప్రహ్లాదుడు ఎదురింట్లో ఉండాలిగాని మనింట్లో ఉండకూడదు'

కరెక్టే కదూ !