“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, ఫిబ్రవరి 2019, ఆదివారం

అబ్బాయి తిరిగి వస్తాడా? - ప్రశ్నశాస్త్రం

ఈరోజు మధ్యాన్నం 12-22 కి ఒకరు ఈ ప్రశ్నను అడిగారు.

'మాకు తెలిసినవాళ్ళ అబ్బాయి వేరే ఇంటికి తీసుకెళ్లబడ్డాడు. అతను తిరిగి వస్తాడా?'

ప్రశ్నచక్రాన్ని గమనించగా - లగ్నాధిపతి శుక్రుడు బాధకుడైన శనితో కలసి అష్టమంలో ఉన్నాడు. కనుక 'ఇప్పట్లో రాడు' అని చెప్పడం జరిగింది. హోరాదిపతి గురువై ఉన్నాడు. అతనే అష్టమాధిపతిగా సప్తమంలో రహస్యస్థానమైన వృశ్చికంలో ఉంటూ లగ్నాన్ని చూస్తున్నాడు. కనుక ఈమె భర్త హస్తం కూడా దీనిలో ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అతనికి ఈ అబ్బాయి ఇంటికి రావడం ఇష్టం లేదనీ తెలుస్తోంది.

విషయం ఏమిటని ప్రశ్నించగా - ఈ అబ్బాయిని పదహారేళ్ళుగా పెంచుకున్నారని, ఇన్నాళ్ళ తర్వాత పెంపుడుతండ్రి ఇష్టపడకపోవడంతో, అసలు తల్లిదండ్రులు ఆ అబ్బాయిని వెనక్కు తీసికెళ్ళారనీ, పెంచిన ప్రేమను తట్టుకోలేక ఈ తల్లి అలమటిస్తోందనీ తెలిసింది.

మన:కారకుడైన చంద్రుడు రాహువుతో డిగ్రీ కంజంక్షన్ లో ఉండటం ఈమె యొక్క మనోవేదనను స్పష్టంగా చూపిస్తోంది. అదే విధంగా కర్కాటకం తృతీయం అవుతూ ఈమె చెల్లెలిని సూచిస్తూ, మకరం చెల్లెలి భర్తను సూచిస్తూ అక్కడ కేతువు శనిని సూచిస్తూ ఉండటము, లగ్నాధిపతి అయిన శుక్రునికి కేతు గురులతో అర్గలం పట్టి ఉండటము గమనించగా, ఈమె భర్తతో ఈమె చెల్లెలి భర్తకూడా తోడై ఈ అబ్బాయిని వెనక్కు పంపడంలో ప్రధానపాత్ర పోషించారని అర్ధమైంది. విచారించగా అది నిజమే అని తెలిసింది. రాహుకేతువుల వర్గోత్తమ స్థితి వల్ల, ఈమె చెల్లెలి భర్త దీనిలో చాలా గట్టి పాత్ర పోషిస్తున్నాడని చెప్పాను. అవునని అడిగిన వ్యక్తి అన్నాడు.

విషయం అర్ధమైంది గనుక ఇప్పుడు ఆ అబ్బాయి వెనక్కు వచ్చే అవకాశం ఎప్పుడుంది అన్న విషయం చూడాలి.

దశలు గమనించగా, ప్రశ్నగురు మహాదశ ఇంకా వారం రోజులుంది. ప్రస్తుతం గురు-కుజ-సూర్యదశ నడుస్తున్నది. గురువు పాత్ర చాలా గట్టిగా ఉన్నది. కుజుడు సప్తమాదిపతిగా భర్తను సూచిస్తూ ద్వాదశ స్థానసంబంధం వల్ల భర్తయొక్క రహస్య కుట్రను స్పష్టంగా చెబుతున్నాడు. సూర్యుడు చతుర్దాదిపతియై, దశమంలో, కొడుకును సూచిస్తున్న బుదునితో కలసి ఉండి, చతుర్ధాన్ని చూస్తున్నాడు. కనుక ఆ అబ్బాయికి రావాలని ఉన్నప్పటికీ రాలేని స్థితి ఉన్నదని తెలుస్తోంది.

వారం తర్వాత 57 రోజులపాటు నడిచే ప్రశ్నశని దశలో కూడా ఈ అబ్బాయి వెనక్కు రాడు. ఈమెకు మనోవేదన తప్పదు. తర్వాత 51 రోజులపాటు నడిచే బుధదశలో సాధ్యం కావచ్చు అని చెప్పాను. అంటే, ఏదైనా సరే, ఇంకొక రెండు నెలలలోపు అబ్బాయి తిరిగి వచ్చే అవకాశం లేదని చెప్పడం జరిగింది.

ఈ విధంగా, మన ఇంట్లో మనం కూర్చుని, ముక్కూ ముఖం తెలియని వారి కుటుంబం గురించి, కుటుంబ విషయాలను గురించి, ప్రశ్నశాస్త్ర సహాయంతో ఎలా తెలుసుకోవచ్చో చెప్పడానికి ఈ ప్రశ్నజాతకమే ఒక ఉదాహరణ.

(ఆ కుటుంబం యొక్క కొన్ని వ్యక్తిగత విషయాలను దాచిపెట్టడం జరిగింది)