నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

4, ఫిబ్రవరి 2019, సోమవారం

పర్సు పోయింది . దొరుకుతుందా లేదా?

ఈరోజు మధ్యాన్నం ఒకాయన ఫోన్లో ఈ ప్రశ్నను అడిగాడు.

'నిన్న నా పర్సు పోయింది. అందులో విలువైన కార్డులున్నాయి. దొరుకుతుందా లేదా? అన్నిచోట్లా వెదికాము. దొరకలేదు. ఎక్కడ పోయి ఉంటుంది?'

ఈ రోజు అమావాస్య. అమావాస్య నీడలో మరుపు రావడం, ఉద్రేకాలు పెచ్చరిల్లడం, ఆ గొడవలో పడి ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం మామూలే అనుకుంటూ ప్రశ్నచక్రం వేసి చూచాను.

ఆ సమయానికి వేసిన ప్రశ్నచక్రం ఇలా ఉంది.

లగ్నాధిపతి శుక్రుడు అష్టమంలో శత్రుక్షేత్రంలో బాధకుడైన శనితో కలసి ఉన్నాడు. అష్టమాధిపతి గురువు సప్తమంలో రహస్య ప్రదేశమైన వృశ్చికంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. వృశ్చికం సహజ అష్టమస్థానం. హోరాదిపతి కూడా శుక్రుడే అవుతూ అష్టమంలో ఉంటూ, విలువైన వస్తువులు పోవడాన్ని సూచిస్తున్నాడు.

కనుక పర్సు దొరకదని చెప్పాను.

ఎక్కడ పోయి ఉంటుంది? అన్న ప్రశ్నను ఇప్పుడు చూడాలి. విలువైన వస్తువులను ద్వితీయం సూచిస్తుంది. ద్వితీయాధిపతి బుధుడు చరరాశియైన నవమంలో బాధకస్థానంలో తీవ్ర అస్తంగతుడై ఉన్నాడు. అమావాస్య యోగంలో ఉన్నాడు. కేతువుతో కూడి ఉన్నాడు. ఆ కేతువు బాధకుడైన శనిని సూచిస్తున్నాడు. ఆ నవమం సహజ దశమం అయింది.

కనుక, తన ఆఫీసు పనిమీద దూర ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ ఈ పర్సు పోయిందని చెప్పాను. స్నేహితులను సూచిస్తున్న లాభాధిపతి గురువు సప్తమంలో ఉంటూ లగ్నాన్ని చూస్తున్నందున, ఆ పర్సు పోయిన సమయంలో నీ స్నేహితులు కూడా నీ పక్కనే ఉన్నారని, నీ పర్సు పోయిన విషయాన్ని వాళ్ళు కూడా గమనించారని చెప్పాను.

అప్పుడతను ఇంకా వివరంగా ఇలా చెప్పాడు.

నిన్న ఏదో ఆఫీసు పనిమీద అదే ఊరిలో దూరంగా ఉన్న ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ ఒక రెస్టారెంట్ లో స్నేహితులతో కలసి భోజనం చేశామని, బిల్లు కడదామని చూసుకుంటే పర్సు కనిపించలేదని, పర్సు పోయిన విషయం అక్కడే తను మొదటిసారిగా గమనించానని అతను నాతో చెప్పాడు.

అప్పుడు ఇంకా ఇలా చెప్పాను.

అదే రెస్టారెంట్ లో వీళ్ళ దగ్గరగా కూచున్న కొందరు అమ్మాయిలను వీళ్ళు గమనిస్తూ, వాళ్ళమీద కామెంట్లు విసురుతూ నవ్వుతూ ఉన్న సమయంలో వీళ్ళ అజాగ్రత్తను గమనించి ఎవడో ఇతని పర్సు కొట్టేశాడని, ఆ రెస్టారెంట్ చాలామంది కస్టమర్స్ తో సందడిగా ఉందనీ చెప్పాను.

అతను చాలా ఆశ్చర్యపోయాడు.

'ఎలా చెప్తున్నారు?' అడిగాడు ఆశ్చర్యంగా.

'అది నీకెందుకు? నిజమా కాదా?' అడిగాను. అష్టమంలో కలసి ఉండి అర్గలం పట్టి, ఒకవైపు నాలుగు గ్రహాలతో, ఇంకో వైపు ఒక గ్రహంతో అప్పచ్చి అయిపోయి వాక్స్థానాన్ని చూస్తున్న శనిశుక్రులను గమనిస్తూ.

'నిజమేనండి ! మా టేబుల్ పక్కనే కూచున్న అమ్మాయిలను చూస్తూ కామెంట్లు చేస్తూ సరదాగా భోజనం చేశాము. తర్వాత చూసుకుంటే జేబులో పర్సు లేదు. ఇది కూడా ఎలా చెప్పారు?' అన్నాడు.

'ఎలాగోలా చెప్పాలే గాని, నీ పర్సు మీద ఆశలు వదిలేయ్ బాబూ. అది దొరకదు.' అని చెప్పాను.

మనం చూడని విషయాలను కూడా ఈ విధంగా జ్యోతిష్యజ్ఞానం మనకు చూపిస్తుంది మరి !