“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

21, ఫిబ్రవరి 2019, గురువారం

యురేనస్ గోచార ప్రభావం - మార్చ్ 2019

యురేనస్ అనే గ్రహం 1781 లో సర్ విలియం హెర్షెల్ అనే శాస్త్రజ్ఞుడి చేత కనుక్కోబడింది. అతని పేరుమీద చాలారోజులు దీనిని 'హెర్షెల్' అనే పిలిచేవారు. తరువాత గ్రీక్ పురాణాలలో ఆకాశానికి అధిపతి అయిన 'యురేనస్' పేరు పెట్టారు.

యురేనస్ అనే గ్రహం మనకు మహాభారతకాలానికే తెలుసని వాదనలున్నాయి. వాటికి రుజువులుగా, మహాభారతంలోని యుద్ధపర్వాల నుంచి కొన్ని శ్లోకాలను ఉదాహరిస్తూ ఉంటారు. వాటిల్లో శ్వేత, ధూమ, ఉపకేతు మొదలైన పేర్లతో యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో మొదలైన గ్రహాలను పిలిచారని అంటారు. ఆయా వాదనలను అలా ఉంచి, ప్రస్తుత యురేనస్ పరిస్థితి ప్రపంచానికి ముఖ్యంగా మన దేశానికి ఏం చేస్తుందో గమనిద్దాం.

రాశిచక్రాన్ని ఒకసారి చుట్టిరావడానికి యురేనస్ 84 సంవత్సరాలు తీసుకుంటుంది. ఒక మనిషి జీవితకాలంలో ఇది రాశిచక్రపు ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుంది. అంటే, ఒక రాశిలో ఈ గ్రహం 7 ఏళ్ళు ఉంటుంది. గతంలో, మార్చి 2011 లో ఈ గ్రహం మీనరాశినుండి మేషరాశికి మారింది. 

సాయనసిద్ధాంత రీత్యా 6-3-2019 న యురేనస్ తన వక్రగమనాన్ని, మేషరాశిలో తన సంచారాన్ని వదలి, మళ్ళీ వృషభరాశిలోకి ప్రవేశిస్తుంది. సాయన సిద్ధాంతం కూడా చక్కని ఫలితాలను, ముఖ్యంగా, దేశగోచారంలోనూ, సామూహిక పరిస్తితుల పరంగానూ ఇస్తుంది.

యురేనస్ అనేది ఈ క్రింది విషయాలపైన అదుపును కలిగి ఉంటుందని అనుభవ పరిశీలన చూపిస్తోంది.

1. ప్రజాసమూహాలలో అకస్మాత్తు మార్పులు

2.విప్లవకార్యక్రమాలు, సైనికచర్యలు, యుద్ధాలు, బాంబు దాడులు వగైరా.

3. సైన్స్ పరంగా కొత్త కొత్త మార్పులు. నూతన ఆవిష్కరణలు.

4. ప్రభుత్వాలు కూలడం, వ్యవస్థలు మారడం వగైరాలు.

ఇక, వృషభరాశి లక్షణాలు.

1. భౌతికజీవితపు విలాసాలు, సరదాలు.

2. ధనంమీద మోజు.

3. చాందస ధోరణులు, మారలేని మనస్తత్వం, బద్ధకం.

4.తను మారకుండా, ఉన్నదానిని ఉన్నట్లు ఎంజాయ్ చెయ్యాలనే ధోరణి.

5. దేశ ఆర్ధికరంగం.

6. భారతదేశానికి సూచిక.

యురేనస్ యొక్క ఈ లక్షణాలను వృషభరాశి లక్షణాలతో అనుసంధానం చేసి పరికిస్తే మనకు ఈ క్రింది సూచనలు కనిపిస్తాయి.

>> ప్రజాజీవితంలో సంఘర్షణ, ప్రభుత్వాలు కూలడం, పాత వ్యవస్థ పోయి కొత్త వ్యవస్థ రావడం.

>> సైన్స్ పరంగా, కమ్యూనికేషన్ పరంగా క్రొత్త మార్పులు.

>> ఉగ్రవాద చర్యలు. యురేనస్, పాకిస్తాన్ కు సూచిక అయిన మేషరాశిని విడచి, ఇండియాకు సూచిక అయిన వృషభరాశిలోకి అడుగుపెడుతున్న సమయంలోనే పుల్వామా ఎటాక్ జరిగింది. గమనించాలి.

>> ఆర్ధిక రంగంలో మార్పులు.

కొద్ది నెలల్లో మనదేశంలో రాబోతున్న ఎన్నికలనూ, ఈ యురేనస్ గోచారాన్నీ కలుపుకుని చూస్తుంటే, ఇండియాలో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు గడ్డుకాలం ముందున్నదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

అంతేగాక, మార్చ్ 6 తేదీన అమావాస్య అయింది, 7 న రాహుకేతువులు వారివారి రాశులు మారుతున్నారు (నిరయన సిద్ధాంతరీత్యా). గతంలో యురేనస్ ఈ విధంగా రాశులు మారిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా అనేక పెనుమార్పులు - భూకంపాలు, సునామీలు, రేడియేషన్ ప్రమాదాలు మొదలైనవి - జరిగాయి.

ఉదాహరణకు - 11-3-2011 న యురేనస్ మీనరాశిలో నుంచి మేషరాశికి మారింది. అదే రోజున జపాన్ లో తొహోకు అనే ప్రదేశంలో పెద్ద భూకంపం, సునామీ వచ్చాయి. జపాన్ లో 'ఫుకుషిమా నూక్లియర్ డిజాస్టర్' అదే రోజున జరిగింది. ఇది కాకతాళీయం అని చెప్పలేము.

అయితే, మీనం నుంచి మేషానికి యురేనస్ మారడం 84 ఏళ్ళకు ఒకసారి జరిగే ఒక మేజర్ సంఘటన. ప్రస్తుతం, వచ్చేనెల 7 న జరుగుతున్నది అంత మేజర్ సంఘటన కాదు. కానీ, అదే సమయంలో వస్తున్న అమావాస్య, రాహుకేతువుల గోచారాల వల్ల దాని ప్రభావం ఖచ్చితంగా బలంగానే ఉంటుంది. అంతేగాక, ప్రపంచదేశాలమీదా, ప్రజాజీవితాల మీదా, కొన్ని దీర్ఘకాలిక ప్రభావాలు దీనివల్ల తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా మన దేశం మీద ఇంకా బలంగా ఉంటాయి.

మొత్తం మీద మార్చి 6, 7, 8 తేదీలలో ప్రపంచవ్యాప్తంగానూ, మనుషుల వ్యక్తిగత జీవితాలలోనూ అకస్మాత్తుగా చెడుమార్పులు కలిగే సూచన బలంగా ఉంది. మనుషుల జీవితాలలో అయితే, ఈ ప్రభావం అనేది, యాక్సిడెంట్లు, రోగాలు, దుర్ఘటనల రూపంలో జరుగుతుంది. ఈ మూడు రోజులలో, మనుషులు చాలా డిస్టర్బ్ అవుతారు. పిచ్చిపనులు చేసి ప్రమాదాలలో పడతారు. మాటామాటా పెరిగి అనవసరమైన గొడవలు రేగుతాయి. ఉద్రేకాలకు, పట్టింపులకు పోయి నష్టపోతారు.

ముందే చెబుతున్నా ! జాగ్రత్త వహించండి మరి !