“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

2, జులై 2014, బుధవారం

చైనా ఆయిల్ పైప్ లైన్ లీక్-హాంగ్ కాంగ్ ఆందోళనలు-నైజీరియా కారుబాంబు పేలుడు-కొనసాగుతున్న రాహుప్రభావం

30-6-2014 సోమవారం సాయంత్రం 6.15 ప్రాంతంలో దాలియన్ అనే చైనీస్ పోర్ట్ సిటీ దగ్గర ఆయిల్ పైప్ లైన్ లీకై ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది.

ఆయిల్ అనేది రాహువు కారకత్వాలలో ఒకటి అని మళ్ళీ మళ్ళీ చెప్పనక్కరలేదు.ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు ఈ విషయం వ్రాసి ఉన్నాను.

కరెక్ట్ గా ఆరోజున శుక్ల తృతీయ.అంటే అమావాస్యకు మూడోరోజు.కనీసం 20,000 మందిని అక్కడనుంచి తరలించారు.ఎంతమంది ప్రమాదంలో గాయపడ్డారో లేదా చనిపోయారో బయటకు తెలియదు.చైనాలో బయటకు పొక్కకుండా రహస్యాలను దాచిపెట్టడం మామూలే.

ఈ సంఘటన సాయంత్రం 6.15 ప్రాంతంలో జరిగింది.ఆ సమయానికి గ్రహస్తితి ఎలా ఉందో చూద్దాం.ఆ సమయానికి ఆశ్లేషా నక్షత్రం నడుస్తున్నది.ఆశ్లేష సర్పనక్షత్రం అనీ రాహువు అధీనంలో ఉంటుందనీ ముందే వ్రాశాను.అదే రోజున ఈ ప్రమాదం జరగడం ఎంత విచిత్రం?

ఇకపోతే మనుష్యులకు లగ్నాలూ రాశులూ ఉన్నట్లే దేశాలకూ ఉన్నాయి.వాటికి స్వాతంత్ర్యం వచ్చిన సమయాన్ని ఆయా దేశాలకు సహజలగ్నాలుగా కొందరు స్వీకరిస్తున్నారు.అది సరికాదు.స్వాతంత్రం రాకముందు కూడా ఆ దేశం ఉన్నది.అసలు కొన్ని దేశాలు పరాయి పాలనలోకి పోనేలేదు.కనుక దేశాలకు లగ్నాలను వాటి స్వాతంత్ర్యసమయాన్ని బట్టి కాకుండా ఆ దేశం యొక్క లక్షణాలను బట్టి నిర్ణయించడం తార్కికంగా ఉంటుంది.పాతకాలపు ప్రఖ్యాత పాశ్చాత్య జ్యోతిష్కుడు 'అలాన్ లియో' తన పరిశీలనను బట్టి తనకు తోచినట్లు దేశాలకు లగ్నాలను నిశ్చయించాడు.తర్వాతకూడా చాలామంది పాశ్చాత్య జ్యోతిష్కులు ఆ పనిని చేశారు.అందులో కొన్ని సరిపోతాయి.కొన్ని సరిపోవు.

మనుష్యులకు ఉన్నట్లే ప్రతీదేశానికి కొన్నికొన్ని లక్షణాలుంటాయి.ఆయా లక్షణాలను బట్టే రాశులను నిర్ణయించాలి.ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పన్నెండు రాశులలో ఇమిడిపోతాయి.ఎందుకంటే ప్రాధమికంగా మానవస్వభావం ఈ పన్నెండు రాశులను దాటి బయటకు పోదు.

ఈకోణంలో చూస్తే చైనాకు వృశ్చికరాశి బాగా సరిపోతుంది.ఎందుకంటే వృశ్చికరాశి వారికి గుట్టు ఎక్కువ.అన్నీ రహస్యంగా ఉంచాలన్న తాపత్రయం వారికి ఉంటుంది.తమ విషయాలు ఎవరైనా గమనిస్తారేమో అని జంకు ఎక్కువగా ఉంటుంది.దానికి తోడు వృశ్చికరాశివారికి స్వార్ధం చాలా ఎక్కువ ఉంటుంది.ఎదుటివారు ఏమైపోయినా సరే తమపని అయితే చాలు అన్న మనస్తత్వం ఉంటుంది.అవసరం అనుకుంటే ఎదుటివారిని నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేయడానికి కూడా వారు వెనుకాడరు.చైనాకు కూడా ఈ లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయని చరిత్ర చదివితే అర్ధం అవుతుంది.పైగా చైనా చిహ్నం అయిన డ్రాగన్ విషజంతువు.అలాగే వృశ్చికం కూడా విషకీటకమే. కనుక చైనాది వృశ్చికరాశే అని నేను భావిస్తాను.

పైగా మనది మకరరాశి.మనకు ఏకాదశం చైనారాశి అవుతుంది.అంటే మిత్రస్థానం.కానీ అది మకరానికి బాధకస్థానం గనుక ప్రస్తుతానికి మిత్రులుగా నటిస్తున్నా వారివల్ల మనకు చాలా బాధలుంటాయి.అలాగే జరుగుతున్నది కదా. 

వృశ్చికరాశికి ద్వాదశంలోనే ప్రస్తుతం శపితయోగం ఉన్నది.కనుక భారీనష్టం సూచింపబడుతున్నది.దానికి అనుగుణంగానే సోమవారం నాడు ఆశ్లేషా (రాహు)నక్షత్రంలో ఈ సంఘటన జరిగింది.ఆ సంఘటన జరిగినప్పుడు కూడా లగ్నం వృశ్చిక ధనూరాశుల మధ్యలో సంధిలో పడింది.ఆ సమయానికి నక్షత్రాదిపతి అయిన బుధుడు అష్టమంలో సున్నా డిగ్రీలలో వక్రించి బాగా బలహీనుడుగా ఉండటం చూడవచ్చు.కనుకనే 20,000 మందిని అక్కడనుంచి ఖాళీ చేయించవలసినంత పెద్ద ప్రమాదం జరిగింది.

నిన్న హాంగ్ కాంగ్ లో లక్షలాది మంది రోడ్లమీదకు వచ్చి ధర్నా చెయ్యడం జరిగింది.హాంగ్ కాంగ్ ప్రజలు కూడా చైనీస్ జాతివారే అన్నది గమనించాలి. అంటే ప్రకృతి వైపరీత్యాలను సృష్టించడం నుంచి మనుష్యులలో ఆవేశాలను రెచ్చగొట్టడంవరకూ గ్రహప్రభావం అన్ని స్థాయులలోనూ ఉంటుందని ఋజువు కావడం లేదూ?నిన్నకూడా ఆశ్లేషా నక్షత్రమే హాంగ్ కాంగ్ లో నడిచింది.

అయితే ఈ రెండు సంఘటనలలోనూ ఎక్కువ ప్రాణనష్టం జరగలేదు.కారణం ఏమంటే వృశ్చిక రాశికి కోణస్థితిలో ఉచ్చంలో ఉన్న గురువుగారి స్థితి.ఆయన దృష్టి పడటం వల్ల  ఘోరమైన ప్రమాదాలూ గొడవలూ జరుగకుండా పరిస్థితి అదుపులోకి వస్తున్నది.అదే లేకుంటే జరిగే ప్రాణనష్టాన్ని ఆపడం ఎవరి వల్లా అయ్యేది కాదు.


నిన్న ఉదయం 8.00 గంటల సమయంలో ఈశాన్య నైజీరియాలో 'మైదుగురి' అనే ఊరిలో కారు బాంబు పేలి కనీసం 50 మంది చనిపోయారు.అనేక కార్లూ ద్విచక్రవాహనాలూ తుక్కుతుక్కు అయ్యాయి.నిన్న మంగళవారం కావడమూ ఆశ్లేషా నక్షత్రమే నడుస్తూ ఉండటమూ గమనించాలి.లగ్నం కర్కాటకం అయింది.హోరాదిపతి శుక్రుడు కార్లకు సూచకుడన్న విషయమూ ఆయన ఏకాదశంలో బాధకస్థానంలో ఉన్నాడన్న విషయమూ గమనార్హములు.వాహనస్థానంలో శపితయోగం ఉన్న విషయం గమనించండి.


50 మంది చనిపోయారంటే అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది.కాని అసలు విషయం అది కాదు.రంజాన్ మాసం కావడంతో ఎక్కువమంది వ్యాపారస్తులు అప్పటికి షాపులు తెరవలేదు.లేకపోతే పేలుడు ధాటికీ ఇంకా ఎన్నో రెట్లు ప్రాణనష్టం జరిగి ఉండేది.అంటే,మతపరమైన కార్యక్రమంలో ఉన్నందువల్ల వారు రక్షింపబడ్డారు.అన్ని మత కార్యకలాపాలకూ గురువు అధిపతి అని గుర్తు ఉంచుకుంటే,ఈ సంఘటనలో గురువుగారి ఉచ్చస్థితి వారిని ఎలా కాపాడిందో అర్ధమౌతుంది.లగ్నం కర్కాటక రాశిలోనే ఉచ్చంలో ఉన్న గురుచంద్రుల సమక్షంలోనే ఉన్నదని గమనించాలి.ఇది తాత్కాలిక గజకేసరీయోగం.ఈ విధంగా గురువుగారి అనుగ్రహం ప్రమాదాలనుంచి ప్రజలను అనూహ్యంగా కాపాడుతుంది.

శపితయోగం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూపడంకోసం కొన్ని ఉదాహరణలు ఇచ్చాను.ఆప్ఘనిస్తాన్ లో జరుగుతున్న మారణకాండను కూడా వ్రాసి ఈ పోస్ట్ ను ఇంకాఇంకా పొడిగించడం ఇష్టంలేక ఇక ఆపుతున్నాను.