“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

28, జులై 2014, సోమవారం

ఆధ్యాత్మిక సందేహాలు-యోని తంత్రం

నా రచనలు చదివి వాటిని అభిమానించే ముగ్గురు వ్యక్తులు కొన్నాళ్ళ నుంచీ నన్ను కలుస్తామని అడుగుతున్నారు.కానీ సమయం కుదరడం లేదు.

'మీరెందుకు నన్ను కలవాలనుకుంటున్నారు?' అని అడిగాను.

కొన్ని ఆధ్యాత్మిక సందేహాలనూ జ్యోతిష్యపరమైన సందేహాలనూ తీర్చుకోడానికి కలుద్దామనుకుంటున్నామని అన్నారు.

ఎవరైనా వారివారి లౌకికసమస్యలతో జ్యోతిష్య రెమెడీల కోసం నన్ను కలుస్తామంటే నాకు ఇష్టం ఉండదు.లౌకికజీవితపు కోరికల్లో కూరుకుని పోయి ఉన్న అలాంటివారితో నా టైం వృధా చేసుకోలేను.కానీ ఎవరైనా నిజాయితీ ఉన్న సాధకులు వారి సాధనామార్గంలో ఎదురౌతున్న నిజమైన సమస్యల పరిష్కారం కోసం కలుస్తామంటే మాత్రం నాకు చాలా సంతోషం కలుగుతుంది.

చాలాసార్లు ఒక విచిత్ర విషయాన్ని ఇలా అడిగేవారు గమనించి ఉంటారు. వారు అనుకున్నంత మాత్రాన నన్ను కలవడం సాధ్యంకాదు.ఈ విషయం నేను ఇంతకుముందు ఒకసారి వ్రాస్తే 'అబ్బో నువ్వంత గొప్పవాడివా?' అంటూ కొందరు నన్ను ఎగతాళి చేశారు.వారి అజ్ఞానానికి జాలిపడి నవ్వుకుని ఊరుకున్నాను.

ఎవరినైతే అంతరాంతరాలలో నిజమైన ఆధ్యాత్మిక తపన ఊపేస్తూ ఉంటుందో వారు మాత్రమే నన్ను కలవగలరు.అనుసరించగలరు.అలా లేనివారు గుంటూరులో మా ఇంటి పక్కనే ఉన్నప్పటికీ నన్ను కలవలేరు.ఇది నేను ఎన్నోసార్లు గమనించిన సత్యం.నాతో Astral Connection ఏర్పడనిదే నన్ను కలిసి మాట్లాడటమూ అనుసరించడమూ సాధ్యంకాదు.

మాత దానికి ఒప్పుకోదు.అలా కలవాలని ప్రయత్నించే వారికి రకరకాల పరీక్షలు పెడుతుంది.ఇది పంచవటి గ్రూప్ లోని వారికి చాలామందికి ప్రత్యక్ష అనుభవమే.

నిన్న ఆదివారమే గనుక వారిని మా ఇంటికి రమ్మని చెప్పాను.ఈలోపల 'రైల్వే ఆఫీసర్స్ క్లబ్ మహిళాసంఘం' వారు గుంటూరు విజయవాడల మధ్యలో ఉన్న 'హాయ్ ల్యాండ్' పిక్నిక్ ప్లాన్ చేశారు.మహిళాసంఘం చాలా పవర్ ఫుల్ కాబట్టి వారు ప్లాన్ చేస్తే భర్తలు నోర్మూసుకుని అనుసరించవలసిందే.అక్కడ వాటర్ స్పోర్ట్స్ తో బాటు ఇంకా చాలాచాలా ఉంటాయి సరదాగా వెళదాం అని అందరూ అన్నారు. 

ఆహూతులను రమ్మని చెప్పాను గనుక,నేను రాలేను,ఇంట్లో ఉంటానని చెప్పి మా శ్రీమతిని పిక్నిక్ కు వెళ్ళి రమ్మన్నాను.ఉదయం 9.30 కు ఒక బస్సు నాలుగు కార్లలో వారందరూ పిక్నిక్ కు వెళ్ళిపోయారు.నేను ఇంట్లోనే కూచుని, వస్తానన్న వారికోసం ఎదురుచూస్తున్నాను.

పదిగంటల ప్రాంతంలో సురేంద్ర,ప్రసాద్,రాజశేఖర్ అనేవారు వచ్చారు.కుశల ప్రశ్నలు అయ్యే సమయంలోనే వారి 'ఆరా' లు రీడ్ చేసి,విషయాలు గ్రహించి, వారేమి అడుగుతారా అని మౌనంగా గమనిస్తున్నాను.

వారిలో ప్రసాద్ అనే ఆయన మొదలు పెట్టాడు.

'మీ రచనలు కొన్ని చదివాను.నాకు చాలా నచ్చాయి.అమ్మవారి ఉపాసన ఇలా ఉంటుంది అయ్యవారి ఉపాసన ఇలా ఉంటుంది అని స్పష్టంగా మీరు వ్రాసిన విధానం నచ్చింది.నాకు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న సందేహాలు అడగాలని వచ్చాను.'

'మంచిది చెప్పండి' అన్నాను.

నాకు చిన్నప్పటి నుంచీ కాళీమాత అన్నా,తంత్రసాధన అన్నా చాలా ఇష్టం.కానీ సరియైన మార్గం చూపేవారు దొరకలేదు.వెదుకుతున్నాను.నాకు చాలాసార్లు అమ్మ దర్శనం ఇచ్చింది.ఎత్తైన కొండల దగ్గర ఒక నది పారుతూ ఉంటుంది.ఆ కొండలలో అమ్మవారి ఎత్తైన విగ్రహం ఉంటుంది.దాని సమక్షంలో నేను పూజలు చేస్తున్నట్లు నాకు చాలాసార్లు స్ఫురణ కలిగింది.

అమ్మను ఎలా పూజించాలో తెలియకపోయినా,తనకు రక్తం అంటే ఇష్టం అంటారు గనుక నా చేతిని కోసుకొని ఆ రక్తాన్ని ఒక ప్లేట్ లో పట్టి అమ్మ ఎదురుగా పెట్టేవాడిని.అమ్మ సంతోషించినట్లే నాకు అనిపించేది.నాకూ ఆనందం కలిగేది.శ్రీవిద్యాదీక్ష కోసం కంచి స్వాములవారైన జయేంద్రసరస్వతి గారిని కలసి అడిగాను.కాని ఆయన ఇవ్వలేదు.

అప్పుడు నడుస్తున్న శనిహోరను గమనిస్తూ 'ఆయన ఏమన్నారు?' అన్నాను.

'నీవు బ్రాహ్మణుడవు కావు కదా.శ్రీవిద్యను చెయ్యగలవా?చాలాకష్టం. కుదరదు.'అన్నారు.

'అలా అన్నారా?'

అవును.ఆయన పక్కన ఉన్నవాళ్ళు కూడా ఎగతాళిగా మాట్లాడారు.నాకు చాలా బాధ కలిగి వెనక్కు వచ్చేశాను.బ్రాహ్మణ కులంలో పుట్టనంత మాత్రాన శ్రీవిద్యకు పనికిరానా అని నాకు బాధ కలిగింది.మా ఇంటికి వచ్చిన తర్వాత డాబామీదకు వెళ్ళి గగనంలో లోకి చూస్తూ ఏడుస్తూ అమ్మను ప్రార్ధించాను. తర్వాత కొన్ని రోజులకు స్వప్నంలో అమ్మ మంత్రాక్షరాలు ఆకాశంలో మెరుస్తూ కనిపించాయి.వెంటనే నిద్రలేచి ఆ మంత్రాన్ని వ్రాసుకున్నాను. అప్పటి నుంచీ దానినే జపిస్తున్నాను.

వింటున్న నాకు చాలా సంతోషం కలిగింది.

'చాలా మంచిది.మనుషులతో పనేముంది?అమ్మే స్వయంగా మిమ్మల్ని కరుణించింది.దీనినే స్వప్నదీక్ష అంటారు.తంత్రంలో ఇది సమ్మతమైన విషయమే.'అన్నాను.

అప్పుడే మేరుప్రస్తారం ఒకటి చేయించుకుని ఇంట్లో పూజలో ఉంచుకున్నాను.కాని ఇంటిలోని వారి పోరు ఎక్కువై పోయింది.నేను వీటిలో పడి ఏదో అయిపోయి సంసారం వదిలేస్తానేమో అని వారు భయపడ్డారు.ఆ పోరు తట్టుకోలేక పూజ చేస్తున్న మేరుప్రస్తారాన్ని నదిలో పారేశాను.అదొక ఘోరమైన తప్పు చేశాను.దానికి ఇప్పటికీ బాధపడుతున్నాను.' అన్నాడు.

'అవునా?' అన్నాను.

'అవును.నాకు యోనితంత్రం అంటే చాలా ఇష్టం.మనస్సు దానివైపే పోతూ ఉంటుంది.ఆ విధానం నేర్పేవారి కోసం వెదుకుతున్నాను.ఈలోపల నాకు తెలియకుండానే దాని అభ్యాసాలు కొన్నింటిని ఆచరించాను.కాని వాటిని ఎలా చేస్తున్నానో నాకే తెలియదు.' అంటూ ఆ అభ్యాసాలను కొన్నింటిని వివరించాడు.

(అవి వ్యక్తిగతమైన వివరాలు గనుక ఇక్కడ వ్రాయడం లేదు)

అమ్మ లీలను గమనించి నాకు కొంత ఆశ్చర్యం కలిగింది.

'ఇదంతా ఎందుకు జరుగుతున్నది?వాటి గురించి ఏమీ తెలియకపోయినా నా మనసు తంత్రమార్గం వైపూ అందులోనూ యోనితంత్రం వైపూ ఎందుకు లాగుతున్నది?' అడిగాడు.

మహనీయులైన నా గురువులనూ జగన్మాత కాళినీ స్మరించి మనస్సును ఏకాగ్రం చేసి చూచాను.విషయం అర్ధమైంది.అంతేగాక ఆయన జాతకంలో గ్రహస్థితులు కూడా తెలిసిపోయాయి.

'మీరు ఒకానొక గతజన్మలో బ్రాహ్మణులే.అప్పుడు అస్సాం బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ఉండేవారు.అప్పుడు మీరు కాళికా తంత్రసాధన చేసేవారు. అందులోనూ యోనితంత్రానికి చెందిన సాధనలు మీరు బాగా చేశారు.ఆ సమయంలో మీరు మామూలు సాధకుడు కారు.మీరు అందులో ఒక గురువుగా సంఘంలో చెలామణీ అయ్యారు.ఆ క్రమంలో మీకు కొన్ని శక్తులు సిద్ధించాయి.వాటిని లౌకిక కార్యకలాపాలకూ శిష్యుల బాధలూ కోరికలూ తీర్చడానికి వాడారు.వాళ్ళ కర్మ మీకు చుట్టుకున్నది.అందుకే మీకు సాధనా భ్రష్టత్వం కలిగింది.కానీ పూర్వజన్మ వాసనలు మిమ్మల్ని వెంటాడు తున్నాయి.అందుకే ఈ జన్మలో బ్రాహ్మణులు కాకపోయినా,కుటుంబంలోని వారి వ్యతిరేకత తీవ్రంగా ఉన్నాకూడా మీ మనస్సు వాటివైపే లాగుతున్నది.' అన్నాను.

'దానిని మళ్ళీ నాకు నేర్పించి నన్ను సరియైన మార్గంలో పెట్టే గురువులు ఎక్కడ దొరుకుతారు?' అడిగాడు.

నవ్వొచ్చింది.

'ఏమో నాకేం తెలుసు?మీరే వెదకాలి.అలాంటివారు వెదికితే దొరకరు.అయినా మీరు ఎక్కడని వెదుకుతారు?వారి అడ్రస్ మీకు తెలియదు కదా?అలాంటివారు సమాజంలో ఉండరు.ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటారు.ఒకవేళ వారు సమాజంలో ఉన్నా,మేము పలానా అని వారి మెడలో బోర్డు కట్టుకుని ఉండరు.అమ్మ అనుగ్రహం లేనిదే మీరు వారిని గుర్తించలేరు.' అన్నాను.

'మరెలా?' అడిగాడు.

'గురువుని వెదకడం అనేది బజారులో ఒక షాపుని వెదికినట్లుగా ఉండదు.ఆ ప్రాసెస్ వేరు.యాడ్స్ చూచి మార్కెట్లో వెదికితే మీరు దొంగగురువుల చేతిలో పడటం ఖాయం.మార్గం అదికాదు.మీలో తపన కలగాలి.మీ హృదయంలో అది ఒక భరించలేనంత స్థాయిలో కలగాలి.పగలూ రాత్రీ నిరంతరం గురువుకోసం మీరు దైవాన్ని ప్రార్ధించాలి.మీ జీవితంలో అది ఫస్ట్ ప్రయారిటీ కావాలి.మిగతా ఏ విషయాలైనా సరే దాని తర్వాతనే ఉండాలి.అవసరమైతే జీవితంలోని దేనినైనా ఒదులుకోడానికి మీరు సిద్ధపడాలి.అంతటి తపన మీలో కలిగినప్పుడు మీ గురువును దైవమే మీ దగ్గరకు చేరుస్తాడు.అంతవరకూ కుదరదు.' అన్నాను.

ఆయన వింటున్నాడు.

'చూడండి.చాలామంది ఆధ్యాత్మికసాధన అని కబుర్లు చెబుతూ ఉంటారు. వాళ్ళను చూస్తె నాకు నవ్వు వస్తూ ఉంటుంది.అవన్నీ పుస్తకాలు చదివి టీవీ ప్రవచనాలు విని చెప్పే కబుర్లు.అవి ఎందుకూ కొరగావు.

నిజమైన సాధకులు అలా ఉండరు.తపనతో వారి హృదయం రగిలిపోతూ ఉంటుంది.సాధన ముందు జీవితంలో ఇంకేదీ వారికి రుచించదు.దానికోసం జీవితంలో ఇంక దేనినైనా వారు పక్కకు తోసివేస్తారు.

ఒక ఉదాహరణ చెప్తాను వినండి.

పరమహంస యోగానందగారు తన గురువుగా యుక్తేశ్వర్ గిరి గారిని కలవక ముందు ఒక ఆశ్రమంలో ఇంకొక గురువు దగ్గర కొన్నాళ్ళు ఉన్నారు.ఒకసారి గురువు చెప్పిన క్రమం తప్పి భోజనం చేసి ఆయన వచ్చేలోపలే యోగానంద గారు నిద్రకు ఉపక్రమిస్తారు.ఆయన వచ్చి చీవాట్లు పెడతారు.అవసరమైతే భోజనం మానెయ్యి అంతేగాని నీ సాధన మానరాదు. అని ఆయన అంటారు.

భోజనమే కాదు.సాధనకు అడ్డొస్తే ఇంక దేనినైనా సరే నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసేసే దీక్ష మీలో ఉండాలి.అలాంటివారే నిజమైన సాధకులు.అంతేగాని మిగతా పనులన్నీ ముగించి చివరిలో కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తానంటే కుదరదు.ఈ రోజు సినిమాకెళదాము సాధన రేపు చూచుకుందాం అంటే కుదరదు.ఆధ్యాత్మికం అనేది చివరిబేరం కాదు.జీవితంలో మొట్ట మొదటి బేరమే అది కావాలి.దానిముందు పెళ్ళాంపిల్లలూ తల్లి దండ్రులూ బంధువులూ స్నేహితులూ ఉద్యోగమూ ఇంకా ఏదైనా సరే పక్కకు తప్పుకోవాల్సిందే.అదీ సాధన అంటే.' అన్నాను.

'ఈ స్థితి నాకు కొంతకాలం క్రితం కలిగింది.అప్పుడు ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండిపోయాను.ఒకరిక్రింద ఉద్యోగం చెయ్యడం నాకు మనస్కరించలేదు.అలా కొంతకాలం ఉన్నాను.'అంటూ కొంతసేపు చెప్పాడు.

నేను మౌనంగా వింటున్నాను.

'ఈ ఊరిలో కూడా కొందరు కాళీఉపాసన చేసినవారు ఉన్నారు కదా?' కాసేపాగి అడిగాడాయన.

'అవును ఉన్నారు.ఎలాగూ వచ్చారుకదా.అక్కడకు కూడా వెళ్ళిరండి.' అన్నాను నవ్వుతూ.

'అబ్బే అలాకాదు.ఊరకే అడిగాను.'అన్నాడు.

'ఏం పరవాలేదు.వెళ్ళి చూడండి.అక్కడ మీకు ఏయే పనులు కావాలంటే ఏయే హోమాలు చెయ్యాలో తెలుస్తుంది.అక్కడకొచ్చే వాళ్ళు కూడా అందరూ అలాంటి కోరికలతో వచ్చేవారే.అంతేగాని నిజమైన ఆధ్యాత్మికతా అంతరిక సాధనా మీకు అక్కడ దొరకవు.'స్పష్టంగా తేల్చి చెప్పాను.

'నేను చేస్తున్నది సరియేనంటారా?చేతిని కోసుకుని రక్తాన్ని అమ్మకు అర్పించడం లాంటివి సరియైన విధానాలేనా?వామాచారం మంచిదేనా?యోనితంత్రం మంచిదేనా?' అడిగాడాయన.

'అన్నీ మంచివే.సాధనాపరంగా చూస్తే ఎక్కువా తక్కువా మెట్లేగాని మంచీ చెడూ అని ఉండవు.లోకం దృష్టితో సాధనా విధానాలను తీర్పు తీర్చరాదు. లోకం గుడ్డిది.దానికేం తెలుసు?ఎంతసేపూ ఇంద్రియభోగాల కోసం కొట్టుకుంటూ మోసంలో కుళ్ళిపోతున్న లోకులకు ఆధ్యాత్మిక రహస్యాలెలా తెలుస్తాయి?అవి వాళ్ళ ఊహకు కూడా అందనంత ఎత్తులో ఉన్నాయి.

మీరు భగవద్గీత గుణత్రయ విభాగయోగం చూడండి.అందులో ఉపాసనలో భేదాలు భగవంతుడే వివరించాడు.మీరు చేస్తున్న రకం ఉపాసన తామసికమైనది.అదీ మంచిదే.తర్వాతి మెట్టు రాజసికం.అదీ మంచిదే.ఆ తరవాతది సాత్వికం.అది ఉత్తమం.దాని తర్వాతది శుద్ధసాత్వికం.అది అత్యుత్తమం.కానీ అత్యుత్తమం కదా అని మీరు దానిని బలవంతంగా పాటించకూడదు.మీ తత్త్వానికి ఏది సరిపోతుందో దానిని మీరు మొదలు పెట్టాలి.అక్కడనుంచి పైకి ఎదగాలి.అదే సరియైన విధానం.

"మీరు నేను వ్రాసిన 'శ్రీవిద్య' చదివారా?" అడిగాను.

'లేదు' అన్నాడాయన.

'ముందు అది చదవండి.మీలాంటి శ్రద్ధాళువుల కోసమే నా బ్లాగ్లో ప్రత్యేకమైన విభాగంలో దానిని ఉంచాను.దానిలో మీ సందేహాలన్నీ తీరుతాయి.'

'చదువుతాను' అన్నాడాయన.

'మీరు 'గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ' కూడా చదవండి.అందులో రామకృష్ణులు చెప్పినారు.కొలుపులూ బలులూ రక్తతర్పణాలూ ఇలాంటి వాటితో కూడి ఉండేది తామసిక ఉపాసన.ఆడంబరం కోసం చేసేది రాజసిక ఉపాసన.మూడో కంటికి తెలియకుండా చేసేది సాత్విక ఉపాసన.అసలు ఏ ఉపాసనా అవసరం లేని సహజస్థితి శుద్ధసాత్వికం.'

'నేడు లోకకళ్యాణం కోసం అంటూ అనేకమంది హోమాలూ యాగాలూ అట్టహాసంగా చేస్తున్నారు.108 కుండాలూ,1008 కుండాలూ పెట్టి హోమాలు చేస్తున్నారు.ఇదంతా బోగస్.లోకాన్ని సృష్టించినవాడు ఒకడున్నాడు. లోకకళ్యాణం వాడు చూచుకుంటాడు.అందులో మనం వేలు పెట్టనక్కరలేదు. మన ఇంటిని మనం బాగు చేసుకోలేం.లోకాన్ని బాగుచెయ్యగలమా?'

'వారివారి పెళ్ళాలు వారు చెప్పినమాట వినరు.వారి పిల్లల్ని వారు అనుకున్నట్లుగా పెంచలేరు. ఇక లోకాన్ని ఉద్ధరిస్తారా?ఇదంతా భ్రమ.వారు చేసేది లోకకళ్యాణం కోసం కాదు.వారి కళ్యాణం కోసం.పరిచయాలు పెంచుకోవడానికీ,బ్లాక్ మనీని వైట్ గా మార్చుకోడానికీ హై సర్కిల్స్ లో జరిగే తంతులు ఇవన్నీ.  

నిజమైన సాధకుడు ఏం సాధన చేస్తున్నాడో అతని ఇంటిలోని వారికి కూడా తెలియదు.అదంతా అతనికీ దైవానికీ మధ్య వ్యవహారం.మూడో కంటికి ఆ రహస్యాలు తెలియవు.తెలియకూడదు కూడా.

మీరు చేస్తున్నది మంచిదే.కాని మీరు ముందుకు ఎదగాలి.

'అది ఒకప్పుడు చేశాను.ఇప్పుడు కాదు.ఇప్పుడు రమణమహర్షి మార్గంలోకి వచ్చాను.మేము ముగ్గురమూ తరచుగా అరుణాచలం వెళుతూ ఉంటాము. అక్కడ ఉండి సాధనా గిరిప్రదక్షిణా చేస్తూ ఉంటాము.రాజశేఖర్ త్వరలో 108 ప్రదక్షిణాలు పూర్తి చెయ్యబోతున్నాడు.' అన్నాడు.'

'నేను షిరిడీ సాయి భక్తుడిని.శరత్ బాబూజీని అనుసరిస్తాను'అని రాజశేఖర్ అన్నాడు.

'మంచిదే.సాయిబాబా సద్గురువే.రమణమహర్షి మహాజ్ఞాని.కాని వీరందరూ అమ్మ ముందు చిన్నపిల్లలని మర్చిపోకండి.సమస్త లోకాలనూ సృష్టించి నడిపించి తిరిగి సంహరిస్తున్న మహాశక్తి కాళి.సద్గురువులతో సహా ఎవరైనా ఆమె ముందు చిన్నచిన్న పిల్లలే.'

'మీరు తామసిక సాధనను దాటి సాత్విక జ్ఞానమార్గంలోకి అడుగు పెట్టారు. కాని అన్నీ అమ్మ కంట్రోల్ లో ఉన్నవే.రమణమహర్షి మహాజ్ఞాని. ఆయన మార్గం చాలా మంచిది.కాని అనుసరించడం కష్టం.' అన్నాను.

ఇంకా ఇలా చెప్పాను 

'కాళి తామసిక దేవత కనుక ఆమెను పూజించకూడదు అని హలదారి విమర్శించేవాడు.ఈ విషయంపై వివరణను శ్రీరామకృష్ణులు సరాసరి అమ్మనే అడిగారు.

దానికి అమ్మ నవ్వి--'వాడొక వెర్రివెధవ.అల్పజీవి.వాడికేం తెలుసు?త్రిగుణాలన్నీ నాలోనే ఉన్నాయి.నేనే వాటిని సృష్టించాను.అవన్నీ నేనే. వాటికి అతీతమైన పరబ్రహ్మమునూ నేనే.' అని స్పష్టంగా చెప్పింది.

కనుక తామసికపూజ తప్పుకాదు.అదొక మెట్టు.దానిని దాటి ఎదగాలి. ముందుకు రావాలి.అది తామసికసాధన కనుకనే దక్షిణాచార పరులు సామాన్యంగా మనం అనుకునే వామాచారాన్నిఒప్పుకోరు.కాని నిజమైన వామాచారం చాలా మంచిది.నా ఉద్దేశ్యంలో దక్షిణాచారానికి పైమెట్టు వామాచారం.ఎందుకంటే పరమశివుడు త్వరగా ప్రసన్నుడౌతాడు.ఆయన భోలా శంకరుడు.కాని శక్తి అలా త్వరగా ప్రసన్నం కాదు.ఆమె కరుణించాలంటే చాలా కష్టం.అనేక పరీక్షలు జీవితంలో ఎదురౌతాయి.నిన్ను అనుక్షణం ఆమె పరీక్షిస్తుంది.

శక్తిపూజ చాలాకష్టం అని అందరూ అంటారు.కాని ఆ కష్టం ఏమిటో గ్రహించలేరు.కష్టం అంటే చేసే పూజల్లోనూ నియమాలలోనూ కష్టం కాదు. అమ్మ పెట్టే పరీక్షలలో ఆ కష్టం ఉంటుంది.నీ నిత్యజీవితంలో నిన్ను తల్లక్రిందులు చేసే సమస్యలను అమ్మ ఎదురు చేస్తుంది.నిన్ను ఇంటా బయటా ఊపి పారేస్తుంది.నీ జీవితం అగమ్యగోచరం అవుతుంది.వాటికి నీవు తట్టుకుని నిలబడగలిగితే అప్పుడు అమ్మ కరుణిస్తుంది.నీలో అహం పిసరంత ఉన్నా కింద పడేసి తొక్కుతుంది.శక్తిపూజ కష్టం అంటే అసలైన అర్ధం ఇది.అది మాటలు చెప్పినంత తేలిక కాదు.ఆ దారిలో నడిచేవారికే ఆ విషయాలు అర్ధం అవుతాయి.బయటనుంచి చూచేవారికి అవి అర్ధం కావు.

'యోనితంత్రం రాజమార్గం.సరిగ్గా ఆచరిస్తే అత్యంత త్వరితంగా అది గమ్యానికి చేరుస్తుంది.'అన్నాను.

ప్రసాద్ గారికి ఆనందం కలిగింది.

'నిజమా?' అన్నాడు.

'అవును.కాని దానిని నేర్పించే గురువు అంత సులభంగా దొరకడు.ఒకవేళ మీ అదృష్టం బాగుండి దొరికినా అంత త్వరగా మీకు నేర్పించడు.మీలో నేను పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తేనే నేర్పుతాడు.లేకుంటే కుదరదు.పైగా ఆ సాధనలో మీకొక 'స్త్రీ' సహకారం కావలసి వస్తుంది.

తంత్రసాధనలో సరియైన అవగాహన ఉండి,దానిని సాధించాలనే పట్టుదల ఉన్న స్త్రీని తాంత్రికపరిభాషలో 'భైరవి' అంటారు.అలాంటి భైరవి మీకు నేటి కలికాలంలో ఎక్కడ దొరుకుతుంది?నేడు ఎక్కడ చూచినా వస్తు వ్యామోహమూ,నగలూ చీరలూ డబ్బూ విలాసాలూ కార్లూ ఇళ్ళూ సరదాలూ ఇవే తప్ప, ఉన్నతమైన ఆధ్యాత్మిక చింతన ఉన్న స్త్రీలు ఎక్కడున్నారు?నా ఏభై ఏళ్ళ జీవితంలో ఇంతవరకూ నాకు అలాంటి వాళ్ళు ఒక్కరో ఇద్దరో తప్ప ఎవరూ కనిపించలేదు.ఆ ఒక్కరో ఇద్దరో కూడా సంసారపు బాధ్యతలలో చిక్కుకుని ఉన్నారు.వాళ్ళు ఆ ఊబిలోనుంచి బయటపడలేరు.

అందులోనూ తంత్రసాధన అంటే ముందుకొచ్చే సాహసం ఉన్న స్త్రీ సాధకులు నాకు ఇంతవరకూ తారసపడలేదు.ఎక్కడైనా అస్సాం,బెంగాల్,లేదా హిమాలయాల లోనో,టిబెట్ లాంటి చోట్లలో ఉన్నారేమో?మన ఆంధ్రాలో అలాంటి ఉన్నతులైన తంత్ర సాధకురాండ్రు నాకు తెలిసి ఒక్కరూ లేరు. తంత్రం అంటేనే అసహ్యమూ భయంతో దూరంగా తొలగి పోయేవారు మనకు ఎక్కడ చూచినా కనిపిస్తారు.ఎక్కడో ఒకరిద్దరికి అలాంటి  భావాలున్నప్పటికీ వారు సంసారబంధాలలో ఇరుక్కుపోయారు.

వారికి లోకం ఏమనుకుంటుందో అన్న భయమూ,సంసారం ఏమైపోతుందో అన్న భయమూ ఉంటాయి.ఇలాంటి భయాలున్నవారు తంత్రసాధనకు ఏమాత్రం పనికిరారు.కనుక మీకు అలాంటి సహచరి ఈజన్మకు దొరకదు.' చెప్పాను.

'మరెలా? విశాఖపట్నం దగ్గరి దేవీపురంలో యోనితంత్రం ఉన్నదని విన్నాను. నిజమేనా?' అన్నాడాయన.

'నేనూ అక్కడి బొమ్మలనూ ఆ వీడియోనూ చూచాను.నిజమైన శీవిద్యోపాసన అలా ఉండదు.అంతర్యాగపరులైనా బహిర్యాగపరులైనా అలాంటి అర్ధనగ్న ప్రతిమలను పెట్టి వాటిని పూజించవలసిన పని లేదు.అవి నాకు అసభ్యంగా కనిపించాయి.' అన్నాను.

'ఒక్కొక్క దేవతా ప్రతిమ దగ్గరా వారివారి బీజాక్షరాలను మనచేత అనిపిస్తూ పూజ చేయిస్తారు' అని రాజశేఖర్ అన్నాడు.

నవ్వొచ్చింది.

'అసలైన శ్రీవిద్యా పూజావిధానం అదికాదు.నాకు తెలిసి ప్రస్తుతం యోనితంత్రాన్ని అనుసరిస్తున్న ఒకేఒక్క వ్యక్తి వివాదాస్పద కేసులను ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద.' అన్నాను.

వాళ్ళు ఆశ్చర్యపోయారు.

'అవును.ఆయన ఆశ్రమంలో జరిగేది అదే అని నా విశ్వాసం.' అన్నాను.

'అంటే అది కూడా అమ్మ పెట్టిన పరీక్షేనా?' అడిగాడు ప్రసాద్.

'అవును.ఆ సాధనలు రహస్యంగా జరగాలి.లోకానికి తెలియవలసిన అవసరం లేదు.ఆయన దారి తప్పాడు.లోకంలో ప్రచారం చేసుకుంటూ శిష్యులను పోగేసుకుంటున్నాడు.అమ్మకు కోపం వచ్చింది.నీ గోలేదో నువ్వు చూసుకోకుండా లోకంతో నీకెందుకురా అని అతన్ని శిక్షించింది.

ఇప్పుడు ఎక్కడికి పోయినా జనం రాళ్ళతో కొడుతున్నారు.కోర్టు కేసులు వెంటాడుతున్నాయి.అందుకే ఎక్కడికీ కదలలేక ఒక గదిలో బందీ అయ్యాడు. అమ్మ పెట్టిన పరీక్షను అర్ధం చేసుకుని మళ్ళీ సరియైన దారిలోకి వస్తే ఆయన బాగుపడతాడు.అలా కాకుండా లోకంతో పెట్టుకుని వాళ్ళతో వాదించడమూ కోర్టుకేసుల వెంట పరిగెట్టడమూ ప్రత్యర్ధుల మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నించడమూ ఇత్యాదిపనులు చేస్తే అతనికి సాధనాభ్రష్టత్వం కలుగుతుంది.' అన్నాను.

(మిగతాది రెండో భాగంలో)