“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, జులై 2014, బుధవారం

ఆధ్యాత్మికనిధులు - సద్గురు లక్షణములు

మొన్న పదమూడో తేదీన నా పుట్టినరోజు సందర్భంగా, ఆధ్యాత్మిక నిధులనబడే ఈ పదమూడు పద్యాలను నా అభిమానుల కోసం ఇస్తున్నాను.

1
కం||సంసారాటవిని దగిలి
హింసల నందుచు వగచెడి హీనమనుష్యుల్
కంసారిన్ దలచుటెపుడు?
మాంసపు దేహమె నిజమని మందుదురిలలో

సంసారం అనే అడవిలో చిక్కుకుని దారి కనిపించక నానా హింసలు పడుతున్న హీనులైన మానవులు దైవాన్ని స్మరించేదేప్పుడు? వారికంతటి సమయం ఉంటుందా? నిరంతరకర్మ అనే క్రూరుడైన యజమాని,వారికి విశ్రాంతిని ఎప్పటికైనా ఇస్తాడా?

మాంసపూరిత దేహమే సత్యమని భ్రమించి దానికోసమే పరుగులెత్తే మనుష్యులు ఎప్పటికైనా ఆధ్యాత్మికమార్గంలోకి అడుగు పెట్టగలరా?పెట్టలేరు.ఏదో అద్భుతం జరుగుతుందని ప్రతిరోజూ ఆశిస్తూ కాలహరణం చేస్తూ చివరకు చావును ఆహ్వానించడమే వారికి జరుగుతుంది.

2
ఆ||మాయ జీవనంపు మత్తులందున జిక్కి
తెలివియంచు దలచి తిరుగువారు
దైవభూమియందు దీపించగా లేరు
మోక్షమెట్లు దొరకు మోసమందు?

లౌకిక జీవితంలో ఎదుటివారిని మోసం చెయ్యడమే సర్వోత్కృష్టమైన తెలివి అని లోకులు భ్రమిస్తారు.లోకం కూడా అలాంటివారినే మెచ్చుకుంటుంది. అనుసరిస్తుంది.ఈ లౌకికమైన మోసాలూ కపటమూ అలవాటైన మనుష్యులు దైవభూమి అయిన ఆధ్యాత్మిక మార్గంలో ఎలా ముందుకు పోగలరు?

అక్కడ వారి మోసపూరిత మనస్సే వారికి ప్రతిబంధకంగా మారుతుంది. లోకంలో ఏది గొప్ప అర్హతో అదే అంతరిక ప్రపంచంలో అతిపెద్ద లోపం అవుతుంది.తన తెలివే తనకు అడ్డు అవుతుంది.

3
ఆ||మోసమందు దేలు మోసకారులకెల్ల
మాయగురులె దిక్కు;మహిని జూడ
విటుల మరగు నాతి విఖ్యాతి గనుటెట్లు?
మనసు మంచిగాక మోక్షమెట్లు?

నిత్యం మోసంలో మునిగి తేలుతూ మోసపూరిత జీవితం గడుపుతున్న లోకులకు మాయగురువులే దక్కుతారు.ఎందుకంటే,మనకు వచ్చేవారు కూడా మనలాగే ఉంటారు.పతివ్రతకే మంచిభర్త లభిస్తాడు.పతితకు అటువంటి అదృష్టం దక్కదు.మంచి మనస్సు లేకపోతే మోక్షం ఎలా దక్కుతుంది?లోకాన్ని మోసం చేసినట్లు దైవాన్ని మోసం చెయ్యడం సాధ్యమేనా?

ఒకవేళ కొంత పూర్వకర్మ వలన అటువంటి గురువుల సాంగత్యం లభించినా, ఆ గురువుల పుస్తకాలు చదివి ఆ బోధలను ఇతరులకు చిలుకలలాగా బోధించే పని చేస్తారుగాని వాటిని ముందుగా తాము ఆచరించాలన్న ఆలోచన వారికి కలగదు.అలా కలగనివ్వకుండా వారి కర్మమే వారికి అడ్డు పడుతుంది.

ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి అంతా అర్ధమైందని భ్రమిస్తే అంతకంటే నగుబాటు ఇంకొకటి ఉండదు.

4
ఆ||కపటమందు సాగు కలుషంపు లోకంబు;
నిర్మలముగ సాగు నిత్యసుఖము
వక్రమంత బోక వైరాగ్యఘనమెట్లు?
చక్రధరుని సీమ జేరుటెట్లు?

లోకం అంతా కపటంతోనూ కల్మషంతోనూ నిండి ఉన్నది.నిత్యసుఖమైన మోక్షమో? నిర్మలంగా నిలిచి ఉన్నది.నీ మనస్సులో ఉన్న కల్మషమూ వంకరలూ నిన్ను వదలి పోకుండా ఉంటే, దైవం నీవైపు ఎందుకు చూస్తుంది?నీ ప్రత్యేకత ఏమిటని దైవం నిన్ను కరుణిస్తుంది?

ప్రతివాడూ తానొక ప్రత్యేకవ్యక్తి ననీ ఇంతవరకూ తనవంటి గొప్పవాడు పుట్టలేదనీ అనుకుంటాడు.ఇది పిచ్చి భ్రమ.నిజానికి ఈ ప్రపంచంలో ప్రతివాడూ ఒక అల్పుడే.అహంకారంతో తననొక విశిష్ట వ్యక్తిగా భ్రమిస్తూ విర్రవీగడమే గాని ప్రకృతి నిజంగా పరీక్షిస్తే తట్టుకుని నిబ్బరంగా నిలబడేవారు ఈ లోకంలో ఎవరున్నారు?ఒక్కరూ లేరు.

5
తే||మనము నందున వంకర మాయలుండ
మాయ గురులను జేరుచు మందవలయు
నిర్మలాంతము నందక నిత్యగురుల
చెలిమి సాధ్యమె?చిల్లరచేష్ట గాక?

చాలామంది ఇలా అంటూ ఉంటారు.

'మాకు సరియైన గురువు దొరకడం లేదు.దారిచూపే వారు దొరకడం లేదు.మాకు ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టాలని ఉంది కాని ఆ దారి దొరకడం లేదు'.

మన మనస్సులో వంకరలు ఉన్నంతవరకూ మనకు మాయగురువులే దొరుకుతారు.నిత్యజీవితంలో మనం మోసగాళ్ళమైతే,మనకు మోసగాళ్ళే గురువులుగా దొరుకుతారు.మనం అహంకారులమైతే మనకు ఇంకా దురహంకారులే గురువులుగా లభిస్తారు.మనం కోరికలు తీర్చుకోవడానికి గురువుల వెంట పడితే నిన్నూ తన అవసరాలకు వాడుకునే గురువులే నీకు ఎదురౌతారు.మనం ఆశపోతులమైతే ఆశపోతు గురువులే మనకు లభిస్తారు. ఇది విశ్వనియమం. 

6
కం||కామమె సర్వంబిలలో
కామంబే పట్టి నడపు కలుషపు జగతిన్
కామంబును మీరనిచో
నామాదుల యందుజిక్కి నీల్గగ వలయున్

కామమే ఈ లోకాన్ని నడుపుతున్న శక్తి.ఇక్కడ కామమే సర్వస్వం.ఈ కల్మష ప్రపంచాన్ని నడిపిస్తున్న కామాన్ని దాటలేకపోతే దాని అనుచరులైన నామరూపాదికములలో చిక్కి అల్లాడక తప్పదు.

నామరూపములను గెలిచిన ఘనుడే నిజంగా కామాన్ని జయించిన వాడు.మిగిలిన అందరూ ఉత్త వాగుడుకాయలు మాత్రమే.

7
ఆ||లోన మోసముండ లోగుట్టు గనుటెట్లు?
మనసు శుభ్రపడక మహితమెట్లు?
భయము బోకయున్న బంధరహితమెట్లు?
సూటి మనసు లేక సుఖమదెట్లు?

మనస్సులో మోసం రాజ్యమేలుతుండగా మహితగమ్యం ఎలా దక్కుతుంది?లోపల భయం ఉన్నంతవరకూ బంధం ఎలా వదులుతుంది?మనస్సు స్వచ్చంగా లేనంతవరకూ పరమసుఖం ఎలా లభిస్తుంది?

లౌకిక ప్రపంచమే కాదు.ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అంతా మోసమే రాజ్యం చేస్తున్నది.ఏదో ఆశించి గురువుల వెంట పడతారు శిష్యగణం.వారివద్ద ఇంకేదో ఆశించి దగ్గరౌతారు సోకాల్డ్ గురువులు.ఇది పరస్పర సింబియాటిక్ రిలేషన్.ప్రాచీనకాలంలో ఉన్నట్టి స్వచ్చమైన గురుశిష్య సంబంధాలు కూడా నేడు స్వార్ధపూరితములై కలుషితములైనాయి.

ఇటువంటి గురువులూ శిష్యులూ చేరి 'మోక్షం' 'అద్వైతం' 'యోగసిద్ధి' 'సమాధి' ' నో మైండ్ స్టేట్' వంటి ఊకదంపుడు మాటలను వల్లించడం ఎంత విడ్డూరం?అసలు ఈ పదముల అర్ధములేమిటో ఆచరణహీనులైన వీరికి ఎప్పటికైనా తెలుస్తాయా?ఎందుకీ మోసం?

నిత్యజీవితంలో స్వచ్చమైన మనస్సు లేనివారికి వేదాంతమూ తంత్రమూ ఎలా అర్ధమౌతాయి? ఏదో ఆశిస్తూ దానికోసం లేనిపోని మర్యాద నటిస్తూ ఎదుటి మనిషిని పలకరించే నేటివారికి పరమగమ్యం మాట అటుంచి,ఆధ్యాత్మిక లోకం లోకి ప్రవేశమే లభించదు.ఒకవేళ అలా లభిస్తుందని అనుకుంటే అది భ్రమ మాత్రమే.వారు ఆధ్యాత్మిక లోకపు ప్రవేశద్వారం వద్దనే ఆపివెయ్యబడతారు.

8
కం||కాంచన దాసులు లోకులు
కాంచనమే పరమసత్య కారణమిలలో
కాంచన లోలత బాయక
గాంచగ నెట్లౌను విభుని? కలికాలములో

లోకం అంతా ధనం వెంట పరిగెత్తుతున్నది.ఈ లోకులకు కాంచనమే పరమ సత్యం.మానవసంబంధాలు డబ్బు మీదనే ఆధారపడి ఉన్నాయి.ఎవరెన్ని మాటలు చెప్పినా ఈ లోకంలో అంతిమసత్యం ధనమే.ధనం కోసం అన్ని విలువలనూ వదులుకునే పరిస్థితిలో లోకం ఉన్నది.చివరకు దేవుణ్ణి పూజిస్తున్నది కూడా ధనం కోసమే.'అదితప్ప ఇంకేదైనా కోరుకో ఇస్తాను.ధనం మాత్రం అడుగకు'- అని ఏ దేవుడైనా అనిన మరుక్షణం ఆ దేవుణ్ణి చెత్తకుండీలో పడేస్తారు నేటి మనుష్యులు.

అనుచితమైన ఈ ధనవ్యామోహం పోనంతవరకూ మానవునికి దైవం ఎలా దక్కుతుంది?కలిమాయను మీరడం అతనికి ఎలా సాధ్యమౌతుంది?సాధ్యం కాదు.దైవంతో పచారీషాపు బేరాలు ఆపనంతవరకూ వీరికి దైవానుభూతీ ఎన్నటికీ కలుగదు.దైవమార్గంలోకి ప్రవేశమూ లభించదు.

9
ఆ||కావి బట్ట దొడిగి కల్లోల పడుచుండు
వేషధారి కన్న వేయిరెట్లు
నిర్మలాంతరంగ నిధినందు సంసారి
ఘనత నందు యోగ గరిమగల్గ

కాషాయవస్త్రాలు కట్టుకుని అసత్యపు బోధలు చేస్తూ లోలోపల చెలరేగుతున్న కల్లోలాన్ని శాంతింప చెయ్యలేని సన్యాసవేషధారులైన దొంగగురువుల కంటే, నిర్మలమైన అంతరంగం కలిగి యోగసిద్ధిని పొందిన సంసారి వెయ్యిరెట్లు ఘనుడు.

ఈరోజుల్లో ప్రతివాడూ 'పరమహంస' అనో 'పరివ్రాజకాచార్య' అనో 'బ్రహ్మర్షి' 'రాజర్షి' అనో  'లోకమాత' అనో 'యోగేశ్వరులు' అనో 'యోగిరాజ్' అనో 'సద్గురు' అనో 'మహాగురు' అనో ఇష్టం వచ్చినట్లు పేర్లు పెట్టేసుకుంటున్నారు. ఇలాంటి జోకర్లను చూస్తె నాకు భలే నవ్వు వస్తూ ఉన్నది.

లోకంలో ఎక్కడ చూచినా తామరతంపరగా దొంగగురువులు పుట్టుకొస్తారనీ లోకులు తండోపతండాలుగా వాళ్ళ చేతిలో వంచింప బడతారనీ 'బ్రహ్మంగారు' 'యోగివేమన్న' మొదలైన సద్గురువులు వందల ఏళ్ళనాడే చెప్పినారు. మహాగురువైన వేదవ్యాసమహర్షి కూడా 'భవిష్యపురాణం' లో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినారు.అది నేడు మన కనులముందే నిజం అవుతున్నది.

10
కం||అడ్డంబుల్ దొలగి జనగ
గడ్డంబుల బెంచనేల? గర్వమదేలా?
చెడ్డల్ వదలెడి వేళల
దొడ్డగు ఘన యోగఫలము దరియగు సత్యా

అడ్డుగా ఉన్న జన్మజన్మాంతర సంస్కారములు శాంతించినప్పుడు గడ్డములు పెంచడం ఎందుకు?దానికి రంగు వెయ్యడం ఎందుకు?

ఒకానొక గురువుగారున్నారు.వారు మహా గొప్పవేదాంతం చెబుతారు.కాని వారిగడ్డానికి మొన్నమొన్నటి వరకూ బ్రష్షుతో చక్కగా రంగు వేసుకునే వారు. ఇంకొక అవతారపురుషులు తీరికసమయాలలో వారికి ఏమీ తోచనపుడు 'బ్లోయర్' తో వారి జుట్టును రింగులు తిప్పుకునేవారు.ఇంకొక గురువుగారు ప్రస్తుతం 'పురుషత్వ పరీక్ష'కు నిలబడబోతున్నారు.ఇలాంటి గురువుల 'వేదాంతం' ఏమిటో వారికీ వారిని అనుసరించే భక్తులకే తెలియాలి.

చెడు అనేది నిజంగా నిన్ను వదలి పారిపోతున్నపుడు ఘనమైన యోగసిద్ధి నీకు దానంతట అదే దగ్గరౌతుంది.అదే నిజమైన గుర్తింపు.అంతేకాని లోకంలో గొప్పకోసం వేషం వెయ్యనవసరం లేదు.

దైవం దృష్టిలో ఘనులమైతే చాలు.లోకం దృష్టిలో కానక్కరలేదు.లోకమూ లోకులూ విలువనివ్వదగిన విషయాలు కావు.

వాటికోసం మనం నటించనక్కరలేదు.

11
ఆ||రొక్కమెదురుగాగ సొక్కి సోలెడువారు
నిక్కమైన పదము నందలేరు
ప్రక్కలెగుర వేయ కుక్కకెట్లగు సొమ్ము?
ఒక్కగురుని పంచ జిక్కకున్న?

డబ్బుకోసం నానాపాట్లూ  పడేవారు ఆధ్యాత్మికసిద్ధిని పొందలేరు.లౌకిక ప్రయోజనాలకోసం గురువుల చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు నిత్యమైన మోక్షాన్ని అందుకోలేరు.తిండికోసం శునకం అనేక ఇళ్ళవెంట తిరుగుతూ రొప్పుతూ ఉంటుంది.ఒక్క యజమానిని నమ్మి అతని ఇంటిలో కాపలాగా ఉంటె దానికి ఉన్నచోటునే తిండి దొరుకుతుంది.నిజమైన సాధకుడు కూడా గురువు పట్లా దైవం పట్లా విశ్వాసపాత్రమైన కుక్కలాగా ఉండాలి.

నా పరమగురువులలో ఒకరైన పరమపూజ్య విజ్ఞానానందస్వామి వద్ద ఒక పెంపుడు కుక్క ఉండేది.దానిని చూపిస్తూ ఆయన ఇలా అనేవారు.

'అది నా శునకం.మరి నేనో?ఆయన(శ్రీరామకృష్ణుల చిత్రపటాన్ని చూపిస్తూ) శునకాన్ని.' 

12
కం||కామ హతాశులు గురువుల్
ఆమంబుల జిక్కితిరిల నంతేవాసుల్
ధూమంబున దగుల మహా
ధామంబగు భానురశ్మి దరిగనుటెట్లో?

ఈ లోకంలో చాలామంది గురువులు కామం చేతిలో హతులైనవారే.ఇక శిష్యులో?అనేక దోషములలో చిక్కి వాటిని వదిలించుకోలేక అల్లాడుతున్న వారు.ఇలాంటి శిష్యులను అలాంటి గురువులు ఏ విధంగా రక్షించగలరు? రక్షించలేరు.స్వయంగా కోరికలతో అల్లాడే గురువులు అవే కోరికలలో చిక్కియున్న తమ శిష్యులను ఎలా ఉద్ధరించగలరు? అది సాధ్యం కాదు.

పొగతో కూడిన చీకటిమేఘంలో చిక్కి దారి కనిపించక అల్లాడేవారికి మహాతేజస్సుతో వెలిగే సూర్యబింబం ఎలా దర్శనమిస్తుంది?

13
కం||నిష్కల్మషమౌ హృదియున్
నిష్కాపట్యంబు తోడ నెగడెడు మనమున్
నిష్కారణమౌ కరుణయు
నిష్క్రియ లెంతయు గురులకు నిధులౌ సత్యా

సద్గురువులైన వారికి ఈ క్రింది లక్షణములే నిజమైన సంపదలు.

కల్మషం లేని హృదయం.
కపటం లేని మనస్సు.
కారణం లేని కరుణ.
కర్మను దాటించగల యోగసిద్ధిని కలిగి ఉండటం

అంతేగాని వేషభాషలు,హావభావ ప్రకటనలు,పాండిత్య ప్రదర్శనలు,ఫీజులు తీసుకుని క్లాసులు చెప్పడాలు--ఇవేవీ కూడా సద్గురుత్వానికి గీటురాళ్ళు కావు.అది,లేని బలాన్ని నటించడమే అవుతుంది.ఆధ్యాత్మిక లోకంలో ఇదొక ఘోరమైన అపరాధం.

ప్రపంచం దృష్టిలో నేడు సద్గురువులుగా చెలామణీ అవుతున్న వారు భగవంతుని న్యాయస్థానంలో బోనులో నిలబడినప్పుడు వారి పరిస్థితి ఏమిటో అప్పుడు తెలుస్తుంది.లోకాన్ని మోసంచేస్తూ అది ఇస్తున్న భోగభాగ్యాలను అనుభవిస్తున్న సమయంలో అది అర్ధం కాదు.