“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, జనవరి 2012, శనివారం

కుజుని వక్రత్వ ఫలితాలు మొదలు

జనవరి 23న కుజగ్రహం వక్రగతిలో ప్రవేశించింది. అప్పటినుంచి ఏప్రియల్ 13 వరకూ ఈ వక్రత్వం కొనసాగుతుంది. ఫిబ్రవరి 8 నుంచి శని కూడా వక్రస్తితిలో ప్రవేసిస్తున్నాడు.మార్చి 13 న కుజరాహువులు సరిగ్గా కేంద్రదృష్టిలోకి వస్తారు.ఇప్పటినుంచి ఏప్రియల్ వరకూ  మధ్యలో ఉన్నకాలం మంచిదిగా కనిపించడం లేదు.


కుజుడు వక్రించి నాలుగురోజులు కాకముందే యానాంలో కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసకాండ జరగడం ఒక ఎత్తు అయితే ప్రజలే దొంగలలాగా మారి సెరామిక్ ఫేక్టరీని ధ్వంసం చేసి అందినమేరకు వస్తువులు దోచుకెళ్ళడం ప్రజల అనైతికప్రవర్తనకు అద్దం పడుతోంది.ఎదుటిమనిషికి  నీతులు చెప్పడం దానికి పూర్తిగా విరుద్ధంగా తాము  ప్రవర్తించడం నేటి భారతదేశపు జనజీవన విధానంలాగా కనిపిస్తోంది. మన దేశంలోని పరమ అధ్వాన్నపు లా అండ్ ఆర్డర్ పరిస్తితికి కూడా ఇదొక మంచి ఉదాహరణ. ఈ దేశంలో నాయకులూ దొంగలే, ప్రజలూ దొంగలే. అందుకే దొందూదొందే లాగా ఒకరికొకరు బాగా సరిపోయారు. ఎవరికి తోచినట్లూ చేతైనట్లూ వారు ప్రతిదాన్నీ చక్కగా దోచుకుంటున్నారు.


ప్రాచీనకాలంలో రాజులూ ప్రజలూ కూడా నీతిగా జీవించేవారు. రాజు ధర్మాన్ని తప్పేవాడు కాదు. కనుక ప్రజలు కూడా "యధారాజా తధాప్రజా" అన్నట్లు నీతిగా బ్రతికేవారు. తరువాత తరువాత నాయకులు నీతికి తిలోదకాలిచ్చారు. ప్రజలను భయపెట్టటం సాగించారు. కాని కొంతలో కొంత ప్రజలు నీతిగానే ఉండేవారు. కానీ ప్రస్తుతం మాత్రం నాయకులూ ప్రజలూ అందరూ దొంగలయ్యారు. అవకాశం దొరకనంతవరకే ఎవరి నీతులైనా. అవకాశం దొరికితే మాత్రం ఎవ్వరూ దేనినీ వదలటం లేదు. అదీ ప్రస్తుత పరిస్తితి.


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం హింసకూ,విధ్వంసానికీ,యుద్దాలకూ కుజగ్రహంతో  సంబంధం ఉంది. మార్స్ అనే పేరు మీదనే యుద్ధవిద్యలకు మార్షల్ ఆర్ట్స్ అనే పేరు వచ్చింది. వీరుల జాతకాలలో కుజుని పాత్ర ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కుంగ్ఫూ వీరులు బ్రూస్లీ, జాకీ చాన్, జెట్లీల జాతకాలు  చూస్తే ఈ విషయం తేటతెల్లంగా కనిపిస్తుంది. అలాగే ప్రపంచయుద్ధాలు గమనిస్తే కూడా కుజుని పాత్ర కనిపిస్తుంది.


ఆ విషయం అలా ఉంచితే, మొన్న 23 తేదీన కుజుడు వక్ర స్తితిలో ప్రవేశించీ ప్రవేశించక మునుపే మళ్ళీ విధ్వంసకాండలు మొదలయ్యాయి.యానాంలో నిన్న జరిగిన విధ్వంసం చాలా దారుణమైనది.దానికి మనకు కనిపించే కారణాలు ఏమైనప్పటికీ,కుజవక్రత్వం యొక్క ప్రభావం మనుషులమీద ఈ విధంగా ఉండటం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం.ఇటువంటి సంఘటనలు రాబోయే మూడునెలలలో మరిన్ని జరుగవచ్చు అనడానికి ఇదొక సూచన మాత్రమే. ఈ ప్రభావంవల్ల హటాత్తుగా మనుషుల మూడ్స్ రెచ్చగొట్టబడే సంఘటనలు జరుగుతాయి. తద్వారా విధ్వంసం తలెత్తుతుంది.రాబోయే మూడునెలలలో ఏఏ తేదీలు ఎక్కువ ప్రమాదకారులో చూద్దాం.


ఫిబ్రవరి 7 న పౌర్ణమి వస్తున్నది. ఆరోజున వక్రకుజ చంద్ర రాహువులు నవాంశలో ధనుస్సులో ఉన్నారు. మిథునంలో కేతుగురువులున్నారు. కనుక ఆ తేదీకి అటూ ఇటూగా గొడవలు హింసా జరగవచ్చు. అవి మతపరమైనవి కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మర్నాటినుంచీ శని వక్రస్తితి మొదలు కాబోతున్నది. కనుక ఆ సమయంలో భూకంపాలు గానీ, వాయుయాన ప్రమాదాలు గానీ జరుగవచ్చు. ఫిబ్రవరి 21 అమావాస్య అయ్యింది.ఆరోజున నవాంశ చక్రంలో వక్రశని,వక్రకుజుడూ,రాహువూవృశ్చికంలో గుమిగూడారు.ఇది కుట్రలకూ విధ్వంసరచనకూ సూచిక. ఈ తేదీకి అటూఇటూగా కూడా ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ గొడవలు,విధ్వంసాలు జరిగే అవకాశాలున్నాయి. మార్చి 7,8 తేదీలలో వస్తున్న పౌర్ణిమ నాటి గ్రహస్తితులు మరీ ఘోరంగా ఉన్నాయి. ఆరోజున చంద్రుడు వక్రకుజునితో డిగ్రీయుతిలో ఉన్నాడు. బుధుడు నీచస్తితిలో ఉన్నాడు.రాహుకుజులమధ్యన ఖచ్చితదృష్టి ఉన్నది. నవాంశలో శని చంద్రులూ రాహువూ మళ్ళీ వృశ్చికంలో కలిశారు.రవి,కేతుగ్రస్తుడయ్యాడు.ఇదికూడా ప్రమాదసూచక సమయమే. ఈసమయంలో కళాకారులకూ, మేధావులకూ,ఉన్నతవర్గాలవారికీ ప్రమాదం పొంచి ఉన్నది.మార్చి 22  న వచ్చే అమావాస్యనాడు వక్ర బుదుడూ రవీ డిగ్రీ కన్జంక్షన్లో ఉన్నారు.నవాంశలో శని కుజులు వృశ్చికంలో ఉన్నారు. కనుక ఇదీ మంచిది కాదు.


ఈ మూడునెలలలో కుజుడు తాను ప్రస్తుతం ఉన్న ఉత్తరా నక్షత్రం నుంచి వెనక్కు వెళుతూ పూర్వఫల్గుణి, మఖా నక్షత్రాలలో సంచారం చేస్తాడు. ఉత్తరానక్షత్రం అధిపతి రవి కనుకనూ అగ్నితత్వరాశి అయిన సింహంలో ఉండటం వల్లనూ ప్రస్తుత ప్రమాదాలన్నీ అగ్నితత్వ ప్రధానంగా ( ఆస్తులు తగలబెట్టడం, పేలుళ్లు, దాడులు వగైరాలుగా)  ఉంటాయి. ప్రస్తుతం కుజుడు రాశి నవాంశలలో  తూర్పును సూచించే సింహ,ధనూ రాశులలో ఉండటం వల్ల తూర్పున ఉన్న యానాంలో ఈ విధ్వంసం జరిగింది.


కుజుడు పుబ్బానక్షత్రసంచారంలో ఉండే సమయంలో సినిమావారికి,కళాకారులకు,విలాసజీవితాలు గడిపే ఉన్నతవర్గాలవారికి ప్రమాదాలున్నాయి.మఖానక్షత్ర సంచారంలో హటాత్ ప్రమాదాలు, వాహనప్రమాదాలు, పేలుళ్లు, జలప్రమాదాలు వగైరాలు జరుగవచ్చు.ఆయా సమయాలలో కుజుని నక్షత్రపాదాల స్తితిమీదా, రాశి నవాంశలలో ఉన్న స్తితిమీదా,కుజునిపైన ఇతర గ్రహస్తితుల పైనా జరుగబోయే ఫలితాలు ఆధారపడి ఉంటాయి.


మొత్తంమీద ఈమూడునెలలూ కుజప్రభావంవల్ల జనజీవనంలో విధ్వంసం తప్పదు అని జ్యోతిష్యపరమైన సూచన ఉన్నది.కుజుని వక్రస్తితి మొదలైనప్పటినుంచీ అక్కడక్కడా భూకంపాలు(మన ఆంధ్రాలోకూడా)కనిపిస్తూ ఉండటం గమనార్హం.ఈమూడునెలలూ ముఖ్యంగా పైతేదీలలో వాహనాలు స్పీడుగా నడపకుండా ఉండటం,దూకుడు తగ్గించుకోవడం,గొడవలకు దూరంగా ఉండటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం  జనులకు చాలా మంచిది. లేకుంటే చెడుఫలితాలు తప్పవనే చెప్పాలి.