“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, జనవరి 2012, గురువారం

భరతమాత ముద్దుబిడ్డ వివేకానందస్వామి

నేడు తేదీలపరంగా చూస్తే వివేకానందస్వామి పుట్టినరోజు. నవీనకాలంలో భరతమాత కడుపున పుట్టిన మహనీయులలో వివేకానందస్వామి అగ్రగణ్యుడు. ఆ మహనీయుని వ్యక్తిత్వాన్నీ భావజాలాన్నీ ఈనాడైనా కొంత తెలుసుకుందాం.

మానవశరీరాల వాసనను దేవతలు ఏవగించుకుంటారని వేదం అంటుంది. దీనికి నిదర్శనం మనకు శ్రీ రామకృష్ణుని జీవితంలో కనిపిస్తుంది. కామకాంచనాలలో ఆసక్తులైనవారి స్పర్శను సాన్నిహిత్యాన్నీ శ్రీ రామకృష్ణులు సహించలేకపోయేవారు. అటువంటివారు తాకితే ఆయన ఒంటిమీద తేళ్ళూజెర్రులూ పాకినట్లు ఉండేది. ఎప్పుడూ డబ్బు గురించీ, ఇంద్రియసుఖాల గురించి ఆలోచించేవారి చుట్టూఉన్న ప్రాణవలయాలు చాలా తక్కువస్థాయికి చెందినవిగా ఉంటాయి. జంతువుల aura కూ వీరి aura కూ పెద్ద తేడా ఉండదు. కొండొకచో జంతువుల aura లే నయం అనిపిస్తాయి. వాటిలో ఒకరకమైన అమాయకత్వం ఉంటుంది. వీరిలో అదీ ఉండదు. సంస్కారం నేర్పని చదువువల్ల వచ్చిన cunningness వీరిలో ఉంటుంది. కనుక ఇలాటివారి aura ను అత్యంత ఊర్ధ్వస్థాయిలలో ఉన్న మహనీయులు భరించలేరు.మామూలు మనుషులమైన మనమే కొంతమందిని ఎక్కువసేపు భరించలేము. ఎప్పుడెప్పుడు వారినుంచి దూరంగా పారిపోదామా అనిపిస్తుంది. కనుక, అత్యంత ఉన్నత పవిత్రస్థాయిలో మనస్సు సంచరించే దివ్యాత్ములు నిమ్నస్థాయికి చెందిన స్వార్ధపూరిత ఆలోచనలు ఉన్న మనుషుల సామీప్యాన్ని ఏవగించుకుంటారు.అందుకనే నిజమైన సిద్ధపురుషులు జనసమాజాలకు దూరంగా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.

అలాటి పవిత్రతామూర్తి అయిన శ్రీరామకృష్ణులు, నరేంద్రుడు (అప్పటికి ఆయన 17 ఏళ్ల పిల్లవాడు) కనిపిస్తే ఆనందంతో పరవశించేవారు. ఆయన మనస్సు సమాధి స్థితికి ఎగసిపోయేది. తన సొంత కుమారునిలా దగ్గరకు తీసుకుని ముద్దుచేసేవారు. తన చేతితో స్వీట్లు తినిపించేవారు. మిగిలినవారు ఆయన చర్యలను చూచి ఆశ్చర్యపడేవారు. ఆయన ఎందుకలా చేస్తున్నారో వారికి అర్ధం అయేది కాదు. నరేంద్రుని యొక్క ఉన్నత వ్యక్తిత్వానికీ, నిస్వార్ధ మనస్తత్వానికీ, కామకాంచనస్పర్శకు దూరమైన ఆయనయొక్క వైరాగ్యపూరిత  ఆలోచనాధోరణికీ ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. అటువంటి పవిత్రతామూర్తి నరేంద్రుడు. అప్పటికి నరేంద్రుడు ఏ రకమైన సాధనలూ చెయ్యలేదు. ఆయనకు వేదవేదాంత జ్ఞానమూ అప్పటికి లేదు. కాని ఆయనలోని పవిత్రాత్ముని, సిద్దాత్ముని, శ్రీ రామకృష్ణుల దివ్యచక్షువు గమనించింది. భవిష్యత్తులో వివేకానందునిగా భారతదేశపు వేదవేదాంతజ్ఞానాన్ని లోకానికి వెదజల్లుతాడని శ్రీరామక్రిష్ణునికి అప్పుడే తెలుసు. ఇదే విషయాన్ని ఆయన అనేకసార్లు చెప్పారు. గొంతు కాన్సర్ తో బాధపడుతూ, మాట్లాడలేని స్తితిలో ఉన్న సమయంలో ఆయన ఒక కాగితంమీద ఇలా వ్రాసి చూపించారు. "నరేన్ భవిష్యత్తులో లోకానికి బోధిస్తాడు". దానిని చదివి నరేంద్రుడు "నేనెన్నటికీ అలాటి పనులు చెయ్యను" అన్నాడు. దానికి శ్రీ రామకృష్ణులు " చెయ్యకపోవడానికి నువ్వెవరు? నీ ఎముకలు ఆ పనిని నీచేత చేయిస్తాయి." అన్నారు. జీన్స్ అన్న పదం అప్పట్లో లేదు. కనుక ఎముకలు అన్నపదం ఆయన వాడారు.నరేంద్రుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన చెయ్యవలసిన పని ఏమిటో శ్రీ రామకృష్ణులకు ముందుగానే తెలుసు.

135  సంవత్సరాల క్రితమే ఇంగ్లీష్ సంస్కృతికి పట్టుకొమ్మ అయిన కలకత్తాలోని ఉత్తమకాలేజీలలో ఇంగ్లీషు చదువులు చదివి, భోగవిలాసాల మధ్యన పెరిగిన నరేంద్రుడు అంతటి వివేకవైరాగ్యమూర్తిగా ఎలా ఉన్నాడో ఊహించడానికి అసాధ్యంగా ఉంటుంది. కనుక ఈ లక్షణాలు ఆయనకు ఒకరిచేత నేర్పబడినవి కావనీ అవి పుట్టుకతో జీన్స్ లో వచ్చినవనీ అర్ధం అవుతుంది. స్వామి జాతకంలో శనిచంద్రుల కలయిక కన్యారాశిలో ఉండటం చూస్తే ఈ విషయం ఇంకా క్లియర్ గా అర్ధం అవుతుంది.

స్వామికి గల సాధనాబలం ఎలాటిదో కొంత వివరిస్తాను. ఆయన శ్రీ రామకృష్ణుని వద్దకు వచ్చేసరికి బహుశా 18 వ సంవత్సరం ఆయనకు నడుస్తున్నది. శ్రీ రామకృష్ణుల శిష్యరికంలో నాలుగేళ్ళు గడిచేసరికి తన 23 ఏట ఆయన నిర్వికల్పసమాధిని పొందగలిగాడు. సాధనామార్గంలో ఆ స్తితి అత్యున్నతం అయినది. మహర్షులు ఈ స్తితికోసమే ప్రయత్నిస్తారు. మామూలు మనుషులకు ఈస్తితి ఊహక్కూడా అందదు. ఈ స్తితి పొందాలంటే సాధకులైన వారికే ఎన్నో జన్మలు పడుతుంది. అటువంటి స్తితిని స్వామి నాలుగేళ్ళలో అందుకోగలిగాడు. ఇందులో వింతేమీ లేదు. అంతటి వివేకవైరాగ్యమూర్తికి అలాంటి స్తితి అందటంలో వింత ఏముంది? దానికి తగినట్లే స్వామి జాతకంలో శని చంద్రులు, గురువు, రాహు కుజులూ, బుధ శుక్రులూ, రవీ అందరూ ఇదే కోణాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు.

మహనీయుల జీవితాలలో మనకు ఒక విశేషం గోచరిస్తుంది. మొదటగా వారి వ్యక్తిగతసాధన సమాప్తి చేసుకుంటారు. వారు చేరవలసిన పరమగమ్యాన్ని చేరేవరకూ ఏకాగ్రమనస్సుతో ప్రయత్నిస్తారు. తరువాత లోకానికి మేలు చెయ్యాలని చూస్తారు. ఈ క్రమంలో వారు చెయ్యగలిగినంత చేసిన తర్వాత ఇక నిష్క్రమిస్తారు. కాని నేటి దొంగస్వాములను చూస్తె ఇంకొక విషయం అర్ధం అవుతుంది. వీరి సాధన ఇంకా పూర్తి కాలేదు. ఏవో సాధనలుచేసి కొన్ని శక్తులు సాధిస్తారు. వాటిని అడ్డు పెట్టుకొని ఇక శిష్యగణాన్ని పోగేసుకోవడం, సంస్థలు పెట్టటం,భజనబృందాన్ని చుట్టూ చేర్చుకోవడం చేస్తుంటారు. క్రమేణా తేరగా వచ్చిన డబ్బుతో విలాసజీవితం అలవాటు అవుతుంది. వారి చుట్టూ కోటరీ ఏర్పడుతుంది.రాజకీయనాయకులతో సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయాలు మొదలౌతాయి. ఏతావాతా గురువూ శిష్యులూ మొత్తంగా భ్రష్టుపట్టి చివరికి అందరూ కలిసి మురికిగుంటలో పడతారు. నిజమైన ఆధ్యాత్మికత అంటే తెలీని మనుషులు వీరిని నమ్మి మోసపోతుంటారు. చాలామంది నేటి స్వామీజీల విషయంలో జరిగింది జరుగుతున్నదీ అదే. 

23  ఏళ్ళ వయసులో స్వామి ఈ లోకానికి వచ్చిన పని పూర్తయింది. తానెవరో తనకు తెలిసింది. తన లోకమేమిటో తెలిసింది. తానిక్కడ ఒక యాత్రికుణ్ణి మాత్రమె అనీ, తన స్వస్థానం ఇది కాదనీ ఆయనకు స్పష్టంగా కనిపించింది. ఇక ఆయన జీవించవలసిన పనిలేదు.శరీరాన్ని యోగసమాధిలో విడిచిపెట్టి తన ధామానికి తాను వెళ్లిపోవచ్చు. కాని గురుదేవుల ఆజ్ఞ వేరుగా ఉంది. 

మహర్షులకు పుట్టిల్లు, వేదవేదాంత యోగాది మహత్తర జ్ఞానసంపదకు  నెలవూ  అయిన భరతభూమిలో చీకటి ఆవరించి ఉన్న సమయం అది. సంస్కృతీ సంస్కారాలు అంటే తెలియని తురకల పరాయిపాలనలో వెయ్యేళ్ళు మగ్గింది భరతమాత. దానికి కారణాలు -- పాలకుల అనైక్యత, హ్రస్వ దృష్టి, స్వార్ధం, విలాసాల పైని మోజులు. ఆ కాలంలో మనదేశం తనదైన ఆధ్యాత్మిక ధార్మికసంపదను అంతా పోగొట్టుకుంది. తర్వాతి రెండువందలఏళ్లు భౌతిక సంపదను తెల్లవాళ్ళు కొల్లగొడుతున్నారు. వెరసి అన్ని రకాలుగా భ్రష్టుపట్టి అతిదీనావస్తలో ఉంది భారతదేశం. ఇలాంటి స్తితిలో ఉన్న తమదేశాన్ని చూచి ఏడుస్తున్న ఎందఱో దేశభక్తుల హృదయాక్రందన భగవంతుని చెవికి చేరింది. ఆయన సంకల్పం ప్రాణం పోసుకుంది. భరతమాత తిరిగి తన పూర్వవైభవాన్ని పొందాలి. భౌతికంగా ఆధ్యాత్మికంగా తన పూర్వతేజస్సును తిరిగి పొందాలి. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన ఋషులు మళ్ళీ భరత భూమిలో పుట్టాలి. జ్ఞానజ్యోతుల్ని మానవుల గుండెల్లో వెలిగించాలి. భారతదేశ పునర్వైభవం ఆధ్యాత్మికసౌధం పైనే స్థాపన కావాలి.వేలాది దేశభక్తుల ప్రార్ధనలను భగవంతుడు ఆలకించాడు.సప్తఋషి మండలంలో జ్ఞానజ్యోతులుగా ప్రకాశిస్తున్న మహర్షులలో ఒక మహర్షిని ఈ పనికోసం భూమికి పంపాడు. అంతే కాదు. భారత దేశపు ఆధ్యాత్మిక చీకటిని పారద్రోలడానికి తానూ భూమికి వెళుతున్నాననీ తనతో వచ్చి ఆ పనిలో సాయం చెయ్యమని ఆదేశించాడు. అలావచ్చిన జ్ఞానస్వరూపుడైనమహర్షే వివేకానందస్వామి.

స్వామి శ్రీ రామకృష్ణుని శిష్యరికంలో ఉన్నపుడు ఒకసారి ఈ సంఘటన జరిగింది. శ్రీ రామకృష్ణులు ఇలా ప్రశ్నించారు. "నరేన్ !! నీ అత్యున్నత ఆదర్శం ఏమిటి? ఆధ్యాత్మికంగా నువ్వు ఏ స్థాయిని అందుకోవాలని అనుకుంటున్నావు?" దానికి నరేంద్రుడు ఇలా చెప్పాడు. " గురుదేవా. నిర్వికల్ప సమాధిలో నిరంతరం మునిగి ఉండి, వారానికో పదిరోజులకో ఒకసారి ఆ స్తితినుంచి క్రిందకు వచ్చి కొంచం ఆహారం తీసుకుని మళ్ళీ అగాధ ఆనందమయ ధ్యానసమాధిలో మునగాలని నా కోరిక." దానికి శ్రీ రామకృష్ణులు నరెంద్రునితో ఇలా అన్నారు. " ఇదా నీ కోరిక!! ఇంతకంటే ఉన్నతస్తితులు మరెన్నో ఉన్నాయని గ్రహించు. నీ ఆనందాన్ని నీవు చూచుకోవడం కాదు.ఇతరులకు నీడనిచ్చే ఒక మహావటవృక్షంలా నువ్వు ఉండాలి."హే భగవాన్ !ఈ సర్వం నీవే"అని నీవే కదా పాడతావు". ధ్యానంలో ఉన్నప్పుడేకాకుండా, ధ్యానంలో లేనప్పుడుకూడా సమస్తచరాచరజగత్తునూ సమస్తజీవరాసులనూ భగవన్మయంగా దర్శిస్తూ ఉండే ఉత్తమసమాధిస్తితిని గమ్యంగా పెట్టుకొమ్మని నరెంద్రునికి శ్రీరామకృష్ణులు సూచించారు.జాగ్రదావస్థలో ఉంటూ కూడా సమాధిస్థితిలో నిరంతరమూ  నిలిచిఉండే సహజ సమాధిస్తితిని  పొందమని శ్రీరామకృష్ణులు నరెంద్రునికి సూచించారు. అంతేకాదు ఆయనింకా ఇలా అన్నారు. " మంచిది. ప్రస్తుతానికి ఇదే భావాన్ని నిలుపుకో. నీవు చెయ్యవలసిన పని ఈ లోకంలో మిగిలిఉంది. దానిని పూర్తిచేసిన అనంతరం నీవు కోరుకుంటున్న స్థితికంటే ఉత్తమస్తితిని నీకు ఇస్తాను". వివేకానందస్వామి చివరి రోజులలో అటువంటి అద్భుతమైనస్తితిని అందుకున్నాడని మనం ఆయన జీవితాన్ని చదివితే గమనించవచ్చు.

తాను పూర్తిచెయ్యవలసిన పనికోసం తన సమాధ్యనుభావాన్ని వివేకానందస్వామి ఒకపక్కన ఉంచాడు.తాను జ్ఞానసిద్ధిని పొందాడు.ఇంద్రియాతీత పరబ్రహ్మానుభూతిని అందుకున్నాడు. బాగానే ఉంది. కాని, తాను వచ్చినపని పూర్తి చేయ్యనిదే ముందుకు వెళ్ళడానికి వీలులేదు. ఆపని ఎలా చెయ్యాలో తెలియదు. ఎలా ముందడుగు వెయ్యాలో తెలియదు. చుట్టూ కటికచీకటి అలముకొని ఉంది. తానయితే జ్ఞానాన్ని పొందాడు. మానవ జన్మకు సార్ధకత కలిగించే గమ్యాన్ని చేరాడు. దీనిని ఇతరులకు ఎలా చెప్పాలి? భరతజాతికి తన ప్రాచీనవైభవాన్నీ ఔన్నత్యాన్నీ ఎలా గుర్తు చెయ్యాలి? పరాయి పాలనలో మగ్గుతున్న బానిసజాతికి జవజీవాలను ఎలా అందించాలి? దేశంలో నిజమైన ఆధ్యాత్మికజ్యోతులను ఎలా వెలిగించాలి? అన్న తపనతో ఆయన నిద్రలేని రాత్రులు గడిపాడు. శరణాగత భావంతో గురుదేవులను ప్రార్ధించాడు. అజేయమైన భగవత్సంకల్పం ఆయన్ను ముందుకు నడిపింది. ముందుగా సామాన్య జనజీవితంలో ఉన్న దుర్భరమైన బాధలని స్వయానా ఆయన చూడటం కోసం ఆయన్ను మన దేశం నలుమూలలా తిప్పింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారివరకూ పయనించి దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న పరిస్తితులను ఆయన కళ్ళారా చూచాడు.అప్పట్లో భాషాప్రయుక్త రాష్ట్రాలు లేవు. రాజుల జమీందారుల పాలనలో ఉన్న చిన్నచిన్న ముక్కలు మాత్రమే ఉండేవి. వాటన్నిటిలో స్వామి సంచరించాడు. అనేక చోట్ల మహారాజుల సత్కారాలను అందుకున్నాడు. అనేకచోట్ల ఎదురైన చీదరింపులనూ సమభావంతో స్వీకరించాడు. చివరికి ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని ఉద్దరించడం కష్టం అని ఆయనకు అర్ధం అయింది.  బానిసజాతిని మేల్కొలపాలంటే వారి ప్రభువుల మన్ననను  ముందుగా పొందాలి.

కన్యాకుమారిలో సముద్రమధ్యంలో ఉన్న రాతికొండమీద మూడురోజులు ధ్యానసమాధిలో గడిపిన స్వామికి తాను చెయ్యవలసిన పని అర్ధం అయింది. జగజ్జనని ఆదేశం ఆయనకు గోచరించింది. గురుదేవుల దర్శనమూ అయింది. సముద్రం మీదుగా నడుస్తూ కనిపించిన శ్రీ రామకృష్ణులు, తనను అనుసరించి పాశ్చాత్య భూములకు రమ్మని చెప్పినట్లు కలిగిన దర్శనం ఆయనకు భవిష్య కార్యాచరణను సూచిందింది.అప్పుడే చికాగోలో సర్వమత మహాసభ జరుగబోతున్నది.అక్కడికి వెళ్లి వేదాంతజ్యోతిని వారికి చూపించాలని స్వామి అనుకున్నాడు. కాని దారి లేదు. చేతిలో డబ్బు లేదు. ఎలా అక్కడికి చేరాలో తెలియదు.దేవుడు తప్ప ఎవరూ తనకు దిక్కులేరు. దైవబలం తప్ప ఏఇతర బలమూ లేదు. భగవదనుగ్రహంతో క్రమేణా సర్వం సాధ్యం అయ్యాయి. ఆ విధంగా అమెరికా చేరిన స్వామి అక్కడకూడా ఎన్నో బాధలు పడుతూ, చివరికి చికాగోలోని సర్వమత మహాసభలో ఇచ్చిన అపూర్వప్రసంగంతో ఒక్కసారిగా ప్రపంచదృష్టిని ఆకర్షించాడు. స్వామిని ప్రపంచం ఆరాధించడం ఆ రోజుతో మొదలైంది.

ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్తాను. స్వామి భరతదేశంలో సంచరించిన రోజులలో అనేకబాధలు పడ్డాడు. తినడానికి తిండి లేక అనేకరోజులు పస్తులున్నాడు. ఈ "పుణ్యభూమి"లో ఆయనకు ఒక ముద్ద పెట్టినవాళ్ళు లేరు. అనేకసార్లు వారం రోజులవరకూ తినడానికి తిండి దొరకక నీళ్ళు తాగి ఉండేవాడు. కాని పస్తులుండటం నిజమైన బాధ కాదు. తనకు తిండి లేనందుకు ఆయన బాధపడలేదు.తన దేశపుప్రజల భౌతిక ఆధ్యాత్మిక దుస్తితిని చూచి ఆయన బాధపడేవాడు. తన దేశప్రజల పేదరికాన్నీ, ఆధ్యాత్మిక భావదారిద్యాన్నీ చూచి ఆయన దుఖించేవాడు. ఒకప్పుడు ఉజ్జ్వలజ్ఞానతేజస్సుతో వెలిగిన తనదేశం ఇప్పుడు ఇలా ఉన్నందుకు మౌనంగా విలపించేవాడు. ఆ జ్ఞానజ్యోతులను మళ్ళీ వెలిగించమని భగవంతుని ప్రార్ధించేవాడు. కాని చాలా చోట్ల తన దేశస్తుల అజ్ఞానంవల్ల ఆయన వారినుంచే నిరాదరణనూ తిరస్కారాన్నీ అందుకున్నాడు.

అలా స్వామి భారతదేశంలో సంచరిస్తున్న కాలంలో ఒక సంఘటన జరిగింది. ఆయన పొందిన అవమానాలకు ఈ సంఘటన అద్దం పడుతుంది. స్వామి కేరళలో సంచారం చేస్తున్నాడు. అక్కడ పాలఘాట్ సమీపంలోని కొడుంగల్లూర్ భగవతీఆలయానికి ఆయన వెళ్ళాడు. అక్కడి అమ్మవారిని కొడుంగల్లూర్ మహారాజులు ఎప్పటినుంచో ఆరాధించేవారు. ప్రాచీన కాలపు అమ్మవారి ఆలయం అది. అక్కడి పూజారులు స్వామియొక్క  బికారి అవతారాన్ని, చినిగిన బట్టల్నీ గడ్డాన్నీ చూచి అసలు ఇతను హిందువో కాదో అని అనుమానించి ఆలయంలోనికి రానివ్వలేదు. స్వామి వారితో ఏమీ వాదించకుండా, మౌనంగా ఆమ్మవారి ఆలయం ఎదురుగా ఒక ప్రదేశంలో కూర్చొని మూడుగంటలపాటు నిశ్చలధ్యానసమాధిలో ఉండిపోయాడు. తరువాత లేచి ఆలయం బయటినుంచే అమ్మకు ప్రశాంతంగా ప్రణమిల్లి  తనదారిన తాను మౌనంగా వెళ్లిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత చికాగోలో స్వామి పొందిన విజయాన్ని పేపర్లలో చదివి, ఆయన ఫోటోను చూచి, గుర్తుపట్టిన అదే ఆలయపూజారులు ఆశ్చర్యచకితులై, "ఈ మహనీయుడినా తాము నిరాదరించింది" అని తీవ్ర పశ్చాత్తాపానికి గురైనారు.ఇటువంటి నిరాదరణను ఆయన మనదేశంలో ఎన్నోచోట్ల ఎదుర్కొన్నాడు. ఒక్కసారి విదేశాలలో విజయం సాధించిన స్వామిని ఇదే భారతీయులు నెత్తిన పెట్టుకుని పూజించారు. బానిస మనస్తత్వం అంటే ఇదే మరి.

(మిగతా తర్వాతి భాగంలో)