“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

7, ఫిబ్రవరి 2011, సోమవారం

నేను మెచ్చే బ్రాహ్మణత్వం

బ్రాహ్మణత్వాన్ని నిర్ణయించేది కులమా? గుణమా? అని ఎవరైనా నన్నడిగితే గుణమే అని నిస్సందేహంగా చెబుతాను.

ఒక వ్యక్తి పుట్టుకతో బ్ర్రాహ్మణుడై ఉండవచ్చు. కాని అతనిలో అహంకారం, దర్పం,విచ్చలవిడిజీవితం, విలాసాలమీద కోరికలు, అబద్దపునడవడి ఉంటే అతన్ని బ్రాహ్మణుడుగా నేను పరిగణించను. అతను బ్రాహ్మణకులంలో పుట్టిన చీడపురుగు అనిమాత్రమే నేను తలుస్తాను. ఇంకొకడు ఇతరకులాలలో పుట్టినప్పటికీ, అతనిలో ఈ లక్షణాలు లేకపోతే అతన్ని బ్రాహ్మణుడుగానే నేను పరిగణిస్తాను. ఇక బ్రాహ్మణకులంలో పుట్టి, పై దుర్గుణాలు లేనివాని మాట చెప్పేదేమున్నది? అతను అత్యుత్తముడు అని నా భావన.


బ్రాహ్మణత్వం అనేది కులాన్ని బట్టి కాకుండా గుణాన్ని బట్టి నిర్ణయించబడాలన్నది నా అభిమతం. కాని బ్రాహ్మణకులంలో పుట్టినవారిలో మంచి లక్షణాలు చాలావరకు సహజంగానే బీజరూపంలో ఉంటాయన్నదీ వాస్తవమే. దానికి కారణం తరతరాలుగా ఆయా లక్షణాలను వారు ఆచరించడం వల్ల జీన్స్ లో వచ్చిన మార్పులు కావచ్చు. కాని ఇంకొకటి కూడా వాస్తవమే. పుట్టుకతో వచ్చిన ఈ లక్షణాలను వారు అభ్యాసంద్వారా చక్కగా వృద్ధిచేసుకోకపోతే అవి దుస్సాంగత్యదోషంవల్లా, సమాజపు ప్రభావంవల్లా క్రమేణా నశించిపోయే ప్రమాదం ఉన్నది. ఇలాటి కులబ్రాహ్మణులను ప్రస్తుతం చాలామందిని మనం చూడవచ్చు.

నాకు తెలిసిన రెండు ఉదాహరణలిస్తాను.

నేను రోజూ చూచే ఒక పురోహితుడున్నాడు. అతని వయసు ఇరవై ఇరవై అయిదూ మధ్యలో ఉంటుంది. తెలిసినవారి ఇళ్లలో పౌరోహిత్యం చేయిస్తూ ఉంటాడు. కాని తీరిక సమయాల్లో వీధి అరుగుమీద కూచుని వచ్చేపోయే ఆడపిల్లలను అసభ్య మాటలతో వేధిస్తూ ఉంటాడు. అతని నిత్యజీవితప్రవర్తన చాలా అసహ్యంగా ఒక రౌడీలాగా ఉంటుంది. పూర్తి తామసిక ప్రవర్తనగా ఉంటుంది.అప్పుడపుడూ దేవుణ్ణికూడా అసభ్యభాషలో మాట్లాడుతుంటాడు. మూర్తీభవించిన అహంకారి.

దీనికి పూర్తి వ్యతిరేకంగా ఇంకొకాయనున్నాడు. ఆయన ఒక దళిత కుటుంబంలో పుట్టాడు. కాని చాలా సాత్వికుడు. మొన్నీ మధ్యన క్రికెట్ ఆడుతుంటే ఆయన మూతికి క్రికెట్ బంతి తగిలి పెదవి పగిలిపోయింది. బంతి వేసినవాణ్ణి ఒక్క మాట అనకపోగా, "కంటికి తగిలి కన్నుపోకుండా మూతికి తగిలింది. దేవుడి దయ అంటే ఇదే" అన్నాడు. హాస్పటల్ లో పడుకోబెట్టి ఇంజక్షన్ చేస్తుంటే మౌనంగా దైవప్రార్ధన చేస్తూ ఉన్నాడు. "ఏ జన్మలో ఏం చేశానో ఇలా జరిగింది. అందుకే మనం తెలిసి ఎవ్వరికీ హాని చెయ్యరాదు. ఎందుకంటే చేసిన పనులకు ఇక్కడే ఫలితాలు అనుభవించవలసి వస్తుంది." అని నాతో అన్నాడు. నా కళ్లలో నీళ్ళు తిరిగాయి.

వీరిద్ధరిలో ఎవరు నిజమైన బ్రాహ్మణుడు? అని నన్ను ఎవరన్నా అడిగితే దళితమిత్రుడికే నా ఓటు వేస్తాను. కులం ప్రధానం కాదు గుణమే ప్రధానం అన్నది నిర్వివాదాంశం. ఒకవేళ కులమూ గుణమూ కూడా కలిస్తే బంగారానికి సువాసన అబ్బినట్లే అని నా అభిప్రాయం.

బుద్ధుడు కూడా ఇదే భావనను ధమ్మపదంలో అనేక చోట్ల వెలిబుచ్చాడు. అంతేకాదు నిజమైన మహనీయులందరూ ఇదే భావనను ఒప్పుకున్నారు. కులానికీ గుణానికీ మధ్యన నిర్ణయం జరుగవలసి వచ్చినపుడు గుణానికే ప్రాధాన్యం ఇవ్వాలి అన్నది నా నిశ్చితాభిప్రాయం.